హోండా 4 లక్షల లోపు కారు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా చిన్న కార్ల మార్కెట్‌పై ఆసక్తి కనబరుస్తోంది. మాస్ మార్కెట్ లక్ష్యంగా రూ.4 లక్షల లోపు ఖరీదు చేసే కారును తీసుకొచ్చే పనిలో ఉంది. ప్రస్తుతమీ కారు అభివృద్ధి దశలో ఉంది. దేశంలో అమ్ముడవుతున్న మొత్తం ప్యాసింజర్ వాహనాల్లో రూ.4 లక్షల లోపు ఖరీదు చేసే కార్ల వాటా 35-40 శాతముంటుంది.
చిన్న కారు రావడానికి కొంత సమయం పడుతుందని హోండా కార్స్ ఇండియా సేల్స్, మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ షిగేరు యమజకి తెలిపారు. మల్టీపర్పస్ వెహికల్ ‘మొబీలియో’ను విడుదల చేసేందుకు సోమవారం హైదరాబాద్ వచ్చిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. కాగా, హోండా ఇప్పటికే ‘బ్రియో’ హ్యాచ్‌బ్యాక్‌ను విక్రయిస్తోంది. దీని ధర హైదరాబాద్ ఎక్స్ షోరూంలో రూ.4.10 లక్షల నుంచి ప్రారంభం.
ఆందోళన కలిగిస్తున్నా..: మందగమనం నుంచి ఇప్పుడిప్పుడే భారత కార్ల మార్కెట్ పుంజుకుంటోందని యమజకి అన్నారు. ఈ ఏడాది మంచి వృద్ధి ఉంటుందనడానికి సంకేతాలు కనిపిస్తున్నాయని, దీర్ఘకాలంలో మార్కెట్ అద్భుతంగా ఉంటుందని చెప్పారు. ఇంధన ధరలు పెరుగుతున్నాయి. వడ్డీ రేట్లు అధికంగానే ఉన్నాయి. ఈ అంశాలు ఆందోళన కలిగి స్తున్నాయన్నారు.
కాగా, ఎంపీవీ మార్కెట్లో మొబీ లియో కొత్త విభాగాన్ని సృష్టిస్తుందని కంపెనీ జనరల్ అఫైర్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రమణ్‌కుమార్ శర్మ తెలిపారు. ఇప్పటికే 10 వేలకుపైగా బుకింగ్స్ నమోదయ్యాయని చెప్పారు. మొబీలియో స్పందననుబట్టి రాజస్థాన్ ప్లాంటులో రెండో షిఫ్ట్ ప్రారంభిస్తామని వివరించారు. మొబీలియో ధర హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో పెట్రోలు వర్షన్ రూ.6.8 లక్షలు, డీజిల్ వర్షన్ రూ.8.2 లక్షల నుంచి ప్రారంభం.
మొత్తం 60 లక్షల కార్లు..
ప్రపంచవ్యాప్తంగా 2017 నాటికి 60 లక్షల కార్లను విక్రయించాలని హోండా కార్స్ లక్ష్యంగా చేసుకుంది. 12 లక్షల యూనిట్లు ఆసియా దేశాల నుంచి కాగా, ఇందులో 3 లక్షలు భారత్‌లో అమ్మాలని లక్ష్యం విధిం చుకుంది. లక్ష్యానికి చేరువయ్యేందుకు విదేశాల్లో అందుబాటులో ఉన్న మోడళ్లను దశలవారీగా ఇక్కడ పరిచయం చేయనుంది. కాంపాక్ట్ సెడాన్, మిడ్ సైజ్ సెడాన్, ఎంపీవీ విభాగాల్లో కంపెనీ ప్రత్యేక దృష్టి సారించనుంది. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ జాజ్ వచ్చే ఏడాది ప్రారంభంలో భారత్‌లో విడుదల కానుంది.