వీవీ పోస్టులకు 59,487 దరఖాస్తులు
హైదరాబాద్: ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్న పాఠశాలల్లో పనిచేసేందుకు నియమిస్తున్న విద్యా వలంటీర్ (వీవీ) పోస్టుల కోసం 59,487 మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 7,974 పోస్టుల్లో ఐదు నెలల కాలం కోసం వీవీలను నియమించేందుకు ఇటీవల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. నెలకు రూ. 8 వేల చొప్పున గౌరవ వేతనం చెల్లించేలా ఈ నియామకాల ప్రక్రియ చేపట్టడంతో భారీగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో అత్యధికంగా మహబూబ్నగర్ జిల్లాలో వీవీ పోస్టుల కోసం అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా హైదరాబాద్లో తక్కువ మంది (1,865) దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
వీవీ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునున్న అభ్యర్థులు ఆన్లైన్ చేసిన దరఖాస్తు ప్రింటెడ్ కాపీ, ఇతర అర్హత పత్రాలను ఈనెల 12, 13వ తేదీల్లో ఎంఈవో కార్యాలయాల్లో అందజేయాలి. ఆయా కార్యాలయాల్లో వాటిని పరిశీలించి హార్డ్ కాపీలను ఎంఈవో ఈనెల 14న డీఈవో కార్యాలయాల్లో అందజేస్తారు. రోస్టర్, రిజర్వేషన్ నిబంధనల ప్రకారం ఈనెల 15న డీఈవోలు రూపొందించిన మెరిట్ జాబితాలను జిల్లా ఎంపిక కమిటీలు ఆమోదిస్తాయి. 21వ తేదీన నియామకాలు చేపడతారు. 22వ తేదీన విధుల్లో చేరేలా చర్యలు చేపడుతున్నట్లు విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి.