horseleyhills
-
హార్సిలీహిల్స్‌పై పునుగు పిల్లి ప్రత్యక్షం
బి.కొత్తకోట/శ్రీశైలం: శ్రీవారు కొలువైన తిరుమల కొండల్లో కనిపించే పునుగు పిల్లి అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌పై బుధవారం ప్రత్యక్షమైంది. వివరాల్లోకి వెళితే... కొండపైన పోలీస్, టూరిజం అతిథి గృహల మధ్యలో ఇనుప కంచె ఉంది. ఈ కంచెకు చిక్కుకుని ఓ వన్యప్రాణి విలవిల్లాడుతోందని పోలీస్ అతిథి గృహంలో పనిచేసే సిబ్బంది కొండపై ఉన్న అటవీ సిబ్బంది రవి, రమణలకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకుని పునుగు పిల్లి శరీరానికి అతుక్కున్న కంచెను కత్తిరించడంతో అది అడవిలోకి వెళ్లిపోయింది. కంచె తీగను కత్తిరించే సమయంలో దాన్ని వీడియో తీసి హార్సిలీహిల్స్ సెక్షన్ ఆఫీసర్ అడపా శివకుమార్‌కు పంపగా ఆ వన్యప్రాణి పునుగు పిల్లిగా నిర్ధారించారు. తిరుపతి శేషాచలం అభయారణ్యానికే పరిమితమని భావిస్తున్న తరుణంలో పునుగు పిల్లి జాడ హార్సిలీహిల్స్‌పై వెలుగులోకి రావడం విశేషం. పునుగు పిల్లుల్లో 38 రకాల జాతులున్నప్పటికి ఆసియా రకానికి చెందిన పునుగు పిల్లి ఇది. దీని గ్రంధుల నుంచి సుగంధ ద్రవ్యం వెలుపలికి విసర్జిస్తాయి. పునుగు పిల్లి చర్మాన్ని దేనికైనా రుద్దితే వెలువడేదే పునుగు తైలం. పునుగు తైలాన్ని తిరుమల శ్రీవారి సేవల్లో వినియోగిస్తారు. పునుగు పిల్లులు కాఫీ కాయలను తిని గింజలను విసర్జిస్తాయి. కాఫీ తోటలున్న హార్సిలీహిల్స్‌పై వీటి మనుగడ ఉన్నట్టు భావిస్తున్నారు. కొండపైన అటవీశాఖ ప్రాంగణం, ఘాట్‌రోడ్డులో పైనుంచి కిందకు వచ్చే రెండో మలుపులో అటవీశాఖ ఆధ్వర్యంలో కాఫీ తోటల నిర్వహణ సాగుతోంది. వెలుగులోకి వచ్చిన పునుగు పిల్లుల సంతతిపై అధ్యయనం జరగాల్సి ఉంది. శ్రీశైలంలో క్యూలైన్లో మరొకటి..శ్రీశైలం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామి వార్ల ఉచిత దర్శన క్యూలైన్లో బుధవారం ఉదయం భక్తులకు ఓ పునుగు పిల్లి కనిపించింది. సాధారణంగా శేషాచలం కొండల్లో కనిపించే ఈ పిల్లి ఇక్కడ ప్రత్యక్షం కావడంతో భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. -
AP Cinema : మినీ స్టూడియోతో హార్సిలీహిల్స్‌కు మహర్దశ
బి.కొత్తకోట: అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలంలోని ప్రముఖ వేసవి విడిది కేంద్రం.. హార్సిలీహిల్స్‌పై మినీ స్టూడియోను నిర్మిస్తే ఈ ప్రాంతానికి మహర్దశ పట్టనుంది. దీని ఏర్పాటు దిశగా జరుగుతున్న ప్రయత్నాలతో హార్సిలీహిల్స్ భవిష్యత్‌లో సినిమా చిత్రీకరణలకు ప్రముఖ కేంద్రంగా మారనుంది. తద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధితోపాటు ఆర్థికంగానూ ప్రయోజనాలు లభిస్తాయని చెబుతున్నారు. ఎత్తయిన కొండల సొగసులు, ప్రకృతి అందాలు, దట్టమైన అటవీప్రాంతం, చుట్టూ కొండలతో హార్సిలీíహిల్స్ ఇప్పటికే ప్రముఖ పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వందకుపైగా చిత్రాలు ఇక్కడ చిత్రీకరణ జరుపుకున్నాయి. 1966లో సూపర్‌స్టార్ కృష్ణ నటించిన కన్నెమనసులు సినిమాతో మొదలై ఎన్నో కన్నడ, తెలుగు, తమిళ సినిమాల షూటింగ్ ఇక్కడ జరిగింది. అయితే ఏ ప్రభుత్వం ఇక్కడ షూటింగ్ కోసం చర్యలు చేపట్టలేదు. దీంతో 1996లో కృష్ణ నటించిన ఎన్కౌంటర్ సినిమా తర్వాత పెద్ద నటులెవరూ హార్సిలీహిల్స్ వైపు కన్నెత్తి చూడలేదు. ఈ పరిస్థితుల్లో ప్రముఖ దర్శకనిర్మాత మహీ వీ రాఘవ కొండపై మినీ స్టూడియో, అమ్యూజ్మెంట్ కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడంతో హార్సిలీహిల్స్‌కు మంచి రోజులు రానున్నాయని అంటున్నారు. మళ్లీ ఈ మధ్యే సందడి.. ఈ మధ్యకాలంలో హార్సిలీహిల్స్ పరిసర ప్రాంతాల్లో సినిమాలు, వెబ్ సిరీస్ చిత్రీకరణల సందడి నెలకొంది. మహీ వీ రాఘవ ఈ ప్రాంతంలో సినిమా షూటింగ్ చేస్తే నిర్మాణ వ్యయం భారీగా తగ్గించుకునే అవకాశం ఉందని గుర్తించి ఇటువైపు అడుగులు వేశారు. ఆయన దర్శకత్వం వహించిన పాఠశాల, యాత్ర–2 చిత్రీకరణలు ఈ ప్రాంతంలోనే జరిగాయి. సైతాన్ వెబ్ సిరీస్‌ను సైతం ఇక్కడే చేశారు. ఇంకా విడుదలకాని ‘సిద్ధా లోకం ఎలా ఉంది’ కూడా ఇక్కడే నిర్మాణం జరుపుకుంది. మహీ వీ రాఘవే కాకుండా ఇంకా పలువురు సినిమాలు, వెబ్ సిరీస్‌లను చిత్రీకరిస్తున్నారు. మినీ స్టూడియోతో ఎన్నో సౌకర్యాలు కొండపై మినీ స్టుడియో నిర్మాణం కోసం రెండెకరాల భూమిని కేటాయించాలని మహీ వీ రాఘన ప్రభుత్వానికి ప్రతిపాదించారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మినీ స్టూడియోతో ఎన్నో రకాలుగా స్థానికులు లబ్ధి పొందడమే కాకుండా, ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. వ్యాపారపరంగా ఆర్థికంగానూ ప్రయోజనాలు ఉంటాయి. స్టూడియో ద్వారా సినిమాలు, వెబ్ సిరీస్కోసం సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుంది. లైట్స్, చిన్న కెమెరాలు, జనరేటర్లు, వాహనాలు, వెబ్ సిరీస్ కోసం అవసరమైనవి షూటింగ్ కోసం వెంట తీసుకురావాల్సిన పరిస్థితి ఉండదు. షూటింగ్‌కు వచ్చేవారికి విడిది సౌకర్యాలు, భోజనం, షూటింగ్లో పనులు.. ఇలా ప్రతి విషయంలోనూ స్థానికులకు ఆర్థికంగా ప్రయోజనం లభిస్తుంది. పెద్ద సినిమాలు లేకున్నా ఏడాదికి రెండు వెబ్ సిరీస్‌ల చిత్రీకరణ జరిగినా రూ.5 నుంచి రూ.10 కోట్లు ఖర్చవుతుంది. కాబట్టి స్థానికులకు వివిధ రకాలుగా ఆదాయం లభిస్తుంది. స్థానికులకు ఆదాయం, తక్కువ ఖర్చుతో చిత్రీకరణే లక్ష్యం.. హార్సిలీహిల్స్‌పై మినీ స్టూడియో ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాంతాన్ని షూటింగ్‌లకు కేంద్రంగా చేయాలన్నదే లక్ష్యం. ఇక్కడి ప్రదేశాలను వెబ్సైట్లో పెట్టి సినిమా చిత్రీకరణలకు అనువనే విషయాన్ని తెలియజేస్తాం. మదనపల్లె, ఆరోగ్యవరం, పరిసర ప్రాంతాల చారిత్రక నేపథ్యాన్ని వివరిస్తూ ప్రచారం చేస్తాం. పురాతన కట్టడాలు, భవనాలు, పల్లెలు హార్సిలీహిల్స్ పరిసరాల్లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ సినిమాలు, వెబ్ సిరీస్‌లు తక్కువ ఖర్చుతో చిత్రీకరణ చేసుకునేలా ప్రణాళిక రూపొందిస్తాం. అనుభవజ్ఞులైన వారిని నియమించి సహకారం అందిస్తాం. స్థానికులకు ఆదాయ మార్గాలు పెంచేలా చూస్తాం. –మహీ వీ రాఘవ, ప్రముఖ దర్శకనిర్మాత -
హైదరాబాద్‌లో స్టూడియోల మాటేమిటి?
సాక్షి, హైదరాబాద్: సినీ దర్శకుడు మహి వి.రాఘవకు ఏపీ ప్రభుత్వం రెండు ఎకరాల స్థలాన్ని సంతర్పణ చేయనుందంటూ ఎల్లోమీడియాలో వచ్చిన కథనంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెనుకబడిన తన ప్రాంత అభివృద్ధి కోసమే మదనపల్లి సమీపంలోని హార్సిలీ హిల్స్‌లో మినీ స్టూడియో నిర్మాణానికి స్థలం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దరఖాస్తు చేశానని.. తన ప్రాంతానికి మంచి చేయాలనే సంకల్పం లేకపోతే హార్సిలీ హిల్స్‌లో ఎందుకు స్టూడియో నిర్మించాలనుకుంటాను? అని రాఘవ ఇప్పటికే స్పష్టం చేయగా.. ఆంధ్రజ్యోతి మాత్రం యాత్ర–2 సినిమా చేసినందుకు రెండెకరాలు కట్టబెడుతున్నారంటూ తన అక్కసునంతా వెళ్ల్లగక్కింది. ఈ కథనాన్ని పలువురు సినీ ప్రముఖులు తప్పుపడుతున్నారు. చంద్రబాబు హయాంలో ఆయన సినీ దోస్తులకు హైదరాబాద్‌లో వందల ఎకరాలకు ఎకరాలు కట్టబెట్టారని.. ఇప్పుడు రాయలసీమ ప్రాంత వాసులకు ఉపయోగపడేలా మినీ స్టూడియో కోసం రెండెకరాలు అడిగితే బాబుకు బాకా ఊదే ఆంధ్రజ్యోతి, ఎల్లోమీడియా రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడుతున్నారు. చంద్రబాబు ధారాదత్తం చేసిన భూముల గురించి ఆంధ్రజ్యోతి, ఎల్లోమీడియాకు ప్రశ్నించే దమ్ముందా? అని ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్‌లో చంద్రబాబు ఇచ్చినవన్నీ ఒప్పేనా?: కల్యాణ్ ఈ మేరకు నటుడు, నిర్మాత, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు ఓ.కల్యాణ్ నిలదీశారు. ఈ మేరకు మంగళవారం ఒక వీడియో విడుదల చేస్తూ.. రాయలసీమలోని హార్సిలీ హిల్స్‌లో మినీ స్టూడియో కోసం డైరెక్టర్ మహి వి.రాఘవ్ రెండు ఎకరాల స్థలాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరడం తప్పయితే.. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సినిమా రంగానికి చెందిన పలువురికి హైదరాబాద్‌లో స్థలాలు ఇవ్వడం తప్పు అనిపించలేదా? అని ప్రశ్నించారు. హార్సిలీ హిల్స్‌లో రెండు ఎకరాలు సంతర్పణ అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని.. అసలు ఇంతవరకూ దానిపై ఎలాంటి జీవో రాలేదని.. ఎంత ధరకు ఇస్తున్నారు? దేనికోసం ఇస్తున్నారు? ఇల్లు కట్టుకోవడానికి ఇస్తున్నారా? లేదా స్టూడియో నిర్మాణానికా అన్నది ఆలోచించకుండా ఇష్టానుసారం రాయడం సరికాదన్నారు. హైదరాబాద్‌లో సినిమా వాళ్లకు చంద్రబాబు ఇచ్చినవన్నీ ఒప్పు అనుకున్నప్పుడు రాఘవకు ఇస్తే కూడా ఒప్పు అనుకోవాలి కదా? ఇక్కడ తప్పు అనుకున్నప్పుడు హైదరాబాద్‌లో స్థలాలు కట్టబెట్టడం కూడా తప్పే కదా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఇచ్చిన స్థలాలన్నీ తప్పు అంటారా? ఒప్పు అంటారా? అన్న విషయం తెలుగు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణను ప్రశ్నించారు. గతంలో ఎందరికో సబ్సిడీపై భూములు సినీ రంగం అభివృద్ధికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అక్కినేని నాగేశ్వరరావుకు ప్రభుత్వం 14 ఎకరాల స్థలాన్ని తక్కువ ధరకు స్టూడియో నిర్మాణానికి ఇచ్చిందని, ఎన్టీఆర్ కూడా ప్రభుత్వం ఇచ్చిన భూమిలో స్టూడియోలు కట్టుకున్నారని కల్యాణ్ చెప్పారు. పద్మాలయ స్టూడియో, రామానాయుడు స్టూడియో, ఆనంద్ సినీ సర్వీసెస్(5 ఎకరాలు), ప్రసాద్ ల్యాబ్‌కు కూడా అప్పట్లో సబ్సిడీ ధరకు ప్రభుత్వం స్థలం ఇచ్చిందన్నారు. ప్రసాద్ ల్యాబ్‌కు ఎదురుగా కె.రాఘవేంద్రరావు, ఆయన సోదరుడు కృష్ణమోహన్‌కు కూడా స్థలం ఇచ్చారని, రాఘవేంద్రరావు స్థలం వెనుక సంగీత దర్శకుడు చక్రవర్తికి కూడా స్థలం ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం ప్రసాద్ ఐ మ్యాక్స్‌కు నెక్లెస్ రోడ్డులో స్థలం ఇచ్చిన విషయం గుర్తులేదా? అని ప్రశ్నించారు. సినీ కార్మికుల కోసం ఫిల్మ్‌నగర్ సమీపంలోని చిత్రపురి కాలనీకి 67 ఎకరాల స్థలం ఇచ్చారని, తెలంగాణ ఏర్పడ్డాక డైరెక్టర్ ఎ¯Œ.. శంకర్‌కు స్టూడియో నిర్మాణానికి ఐదు ఎకరాల స్థలాన్ని ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. నిర్మాత రామానాయుడుకు వైజాగ్ రుషికొండలో దాదాపు 20 ఎకరాల స్థలం ఇచ్చిన విషయం తెలియదా? అని ప్రశ్నించారు. -
హార్సిలీహిల్స్ అసలు పేరేంటో తెలుసా....!
చిత్తూరు: హార్సిలీహిల్స్..ఈపేరు వింటే మండువేసవిలోనూ హాయిగొలిపే ఆంధ్రాఊటీగా గుర్తొస్తుంది. సముద్రమట్టానికి 4,141 అడుగుల ఎత్తులో ఉండి ఆకాశాన్ని తాకుతున్న అనుభూతిని కలిగించే కొండకు ఎక్కెక్కడి నుంచో సందర్శకులు ఇక్కడికి వస్తుంటారు. ఏ రుతువుతోనూ సంబంధం లేకుండా విడిది చేసేందుకు సందర్శకులు ఇష్టపడ్తారు. చిత్తూరుజిల్లా బి.కొత్తకోట మండలంలోని ఈ హార్సిలీహిల్స్ కథేంటి, అసలా పేరెలా వచ్చింది, కొండను ఎలా గుర్తించారన్నదాని వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. అసలు పేరు ఏనుగుమల్లమ్మ కొండ హార్సిలీహిల్స్ బి.కొత్తకోట మండలం కోటావూరు రెవెన్యూ గ్రామ పరిధిలో ఉన్నప్పటికి కొండలు, ఆడవి బయ్యప్పగారిపల్లె గ్రామంతోపాటు కురబలకోట మండలం తెట్టు అటవీప్రాంతంతో కలిసి ఉంటుంది. దీని అసలు పేరు ఏనుగుమల్లమ్మ కొండ. కొండపై మల్లమ్మ పశువులను కాస్తూ, ఏనుగులతో స్నేహంగా ఉండేది. దాంతో ఏనుగుమల్లమ్మ కొండగా పేరు. ్రçపస్తుతం కొండపైన గట్టు గ్రామం, ములకలచెరువు మండలం బురకాయలకోటల్లో ఏనుగుమల్లమ్మ ఆలయాలు ఉన్నాయి. వీటికి మాన్యం భూములు ఉన్నాయి. చల్లదనం కొండెక్కించింది 1850లలో బ్రిటన్‌కు చెందిన డబ్ల్యూ.డీ.హార్సిలీ మదనపల్లె సబ్‌కలెక్టర్‌గా, తర్వాత చిత్తూరు, కడప ఉమ్మడిజిల్లాలకు కలెక్టర్‌కు పనిచేశారు. సబ్‌కలెక్టర్‌గా ఉన్న సమయంలో హార్సిలీ గుర్రంపై కోటావూరు గ్రామం పరిధిలో పర్యటిస్తుండగా వాతావర ణం చల్లగా ఉండటం గుర్తించారు. గుర్రంపైనే కొండెక్కేశారు. దట్టమైన అడవి, అత్యంతచల్లదనానికి ముగ్దుడైపోయాడు. తర్వాత ఆయన కడప కలెక్టర్ కావడంతో కొండను వేసవి విడది కేంద్రం చేసుకోవాలని నిర్ణయించాడు. 1869లో ఏనుగుమల్లమ్మ కొండను వేసవి విడది కేంద్రంగా చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని అప్పటి మద్రాసు ప్రభుత్వాన్ని కోరుతూ లేఖ రాశారు. దీనికి సమ్మతిస్తూ ప్రభుత్వం 1869 మే 4న జీవోఎంఎస్ నంబర్ 11579 జారీ చేసింది. అప్పటినుంచి కొండ వేసవి విడది కేంద్రంగా మారిపోయింది. అలా పేరు మారిపోయింది కొండను వేసవి విడిదిగా చేస్తున్న కలెక్టర్ హార్సిలీ అంతటితో ఆగలేదు. ఏనుగుమల్లమ్మ కొండ పేరును తనపేరు వచ్చేలా హార్సిలీహిల్స్‌గా మారేందుకు ప్రయత్నాలు చేశారు. పశువులు మేపుకునేందుకు వచ్చే కాపరులకు పానీయాలు, తినుబండరాలు ఇస్తూ వారిచేత హార్సిలీహిల్స్ అని పలికించడం ప్రారంభించి కొండకు ఆపేరు చిరస్థాయిగా ఉండిపోయేలా చేశారు. దాంతో ఏనుగుమల్లమ్మ కొండ హార్సిలీíß ల్స్‌గా మారిపోయింది. ఇప్పడు రాష్ట్రంలో ఏకైక వేసవి విడది కేంద్రంగా ప్రఖ్యాతిగాంచింది. అయితే ఏనుగుమల్లమ్మ ఇక్కడి ప్రజలకు దేవతగా కొలువబడుతోంది. కొండపైనున్న ఆలయంలో నిత్యం పూజలందుకుంటోంది. -
హార్స్‌లీహిల్స్‌లో తప్పిన ముప్పు
బి.కొత్తకోట : చిత్తూరు జిల్లా హార్స్లీ హిల్స్ ఘాట్‌లో శనివారం ఓ పెను ప్రమాదం తప్పింది. రైలింగ్‌ను ఢీకొని బస్సు ఆగిపోవడంతో అందులోని 50మంది ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. నెల్లూరు రొట్టెల పండుగ కోసం కదిరి పట్టణం నిజాంవలీ వీధి, అడపాలవీధికి చెందిన 50 మంది ఎస్ఎల్వీ టూర్ అండ్ ట్రావెల్స్ బస్సులో శనివారం బయలుదేరారు. ఆదివారం రాత్రి తిరుగుపయణమయ్యారు. సోమవారం ఉదయం 10:30 గంటలకు బస్సు హార్స్‌లీహిల్స్‌కు చేరుకుంది. యాత్రికులు మధ్యాహ్నం కొండపైనే భోజనం వండుకుని తిన్నారు. 2 గంటలకు బస్సు కదిరి బయలుదేరింది. కొండపై నుంచి అత్యంత ప్రమాదకరమైన మలుపు దాటింది. కింద నుంచి మూడో మలుపు వద్ద మలుపు తిరుగుతూ ఘాట్ రోడ్డుపై ఇనుప రెయిలింగ్‌ను ఢీకొంది. దీంతో ఒక్కసారిగా బస్సులోని వారంతా హాహాకారాలు చేశారు. అయితే బస్సు రెయిలింగ్‌ను ఢీకొని ఆగిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. రెండు అడుగులు ముందుకెళ్లినా హోర ప్రమాదం జరిగిపోయి ఉండేది. సాయంత్రం 5 గంటల వరకు బస్సు ఘాట్ రోడ్డుకు అడ్డంగానే నిలిచిపోయింది. దీంతో కొండపైకి వాహన రాకపోకలు నిలిచిపోయాయి. డీజిల్, ఆయిల్ అయిపోవడమే ఇందుకు కారణమని బస్సు డ్రైవర్, రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌రెడ్డి చెప్పారు.ఆయిల్ అయిపోతే పవర్‌స్టీరింగ్ పనిచేయదన్నారు.