AP Cinema : మినీ స్టూడియోతో హార్సిలీహిల్స్‌కు మహర్దశ  | Sakshi
Sakshi News home page

AP Cinema : మినీ స్టూడియోతో హార్సిలీహిల్స్‌కు మహర్దశ 

Published Thu, Feb 15 2024 5:39 AM

Good times to Horsleyhills with mini studio - Sakshi

బి.కొత్తకోట: అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలంలోని ప్రముఖ వేసవి విడిది కేంద్రం.. హార్సిలీహిల్స్‌పై మినీ స్టూడియోను నిర్మిస్తే ఈ ప్రాంతానికి మహర్దశ పట్టనుంది. దీని ఏర్పాటు దిశగా జరుగుతున్న ప్రయత్నాలతో హార్సిలీహిల్స్‌ భవిష్యత్‌లో సినిమా చిత్రీకరణలకు ప్రముఖ కేంద్రంగా మారనుంది.

తద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధితోపాటు ఆర్థికంగానూ ప్రయోజనాలు లభిస్తాయని చెబుతున్నారు. ఎత్తయిన కొండల సొగసులు, ప్రకృతి అందాలు, దట్టమైన అటవీప్రాంతం, చుట్టూ కొండలతో హార్సిలీíహిల్స్‌ ఇప్పటికే ప్రముఖ పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వందకుపైగా చిత్రాలు ఇక్కడ చిత్రీకరణ జరుపుకున్నాయి. 1966లో సూపర్‌స్టార్‌ కృష్ణ నటించిన కన్నెమనసులు సినిమాతో మొదలై ఎన్నో కన్నడ, తెలుగు, తమిళ సినిమాల షూటింగ్‌ ఇక్కడ జరిగింది.

అయితే ఏ ప్రభుత్వం ఇక్కడ షూటింగ్‌ కోసం చర్యలు చేపట్టలేదు. దీంతో 1996లో కృష్ణ నటించిన ఎన్‌కౌంటర్‌ సినిమా తర్వాత పెద్ద నటులెవరూ హార్సిలీహిల్స్‌ వైపు కన్నెత్తి చూడలేదు. ఈ పరిస్థితుల్లో ప్రముఖ దర్శకనిర్మాత మహీ వీ రాఘవ కొండపై మినీ స్టూడియో, అమ్యూజ్‌మెంట్‌ కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడంతో హార్సిలీహిల్స్‌కు మంచి రోజులు రానున్నాయని అంటున్నారు. 

మళ్లీ ఈ మధ్యే సందడి.. 
ఈ మధ్యకాలంలో హార్సిలీహిల్స్‌ పరిసర ప్రాంతాల్లో సినిమాలు, వెబ్‌ సిరీస్‌ చిత్రీకరణల సందడి నెలకొంది. మహీ వీ రాఘవ ఈ ప్రాంతంలో సినిమా షూటింగ్‌ చేస్తే నిర్మాణ వ్యయం భారీగా తగ్గించుకునే అవకాశం ఉందని గుర్తించి ఇటువైపు అడుగులు వేశారు.

ఆయన దర్శకత్వం వహించిన పాఠశాల, యాత్ర–2 చిత్రీకరణలు  ఈ ప్రాంతంలోనే జరిగాయి. సైతాన్‌ వెబ్‌ సిరీస్‌ను సైతం ఇక్కడే చేశారు. ఇంకా విడుదలకాని ‘సిద్ధా లోకం ఎలా ఉంది’ కూడా ఇక్కడే నిర్మాణం జరుపుకుంది. మహీ వీ రాఘవే కాకుండా ఇంకా పలువురు సినిమాలు, వెబ్‌ సిరీస్‌లను చిత్రీకరిస్తున్నారు.

మినీ స్టూడియోతో ఎన్నో సౌకర్యాలు
కొండపై మినీ స్టుడియో నిర్మాణం కోసం రెండెకరాల భూమిని కేటాయించాలని మహీ వీ రాఘన ప్రభుత్వానికి ప్రతిపాదించారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మినీ స్టూడియోతో ఎన్నో రకాలుగా స్థానికులు లబ్ధి పొందడమే కాకుండా, ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. వ్యాపారపరంగా ఆర్థికంగానూ ప్రయోజనాలు ఉంటాయి. స్టూడియో ద్వారా సినిమాలు, వెబ్‌ సిరీస్‌కోసం సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుంది.

లైట్స్, చిన్న కెమెరాలు, జనరేటర్లు, వాహనాలు, వెబ్‌ సిరీస్‌ కోసం అవసరమైనవి షూటింగ్‌ కోసం వెంట తీసుకురావాల్సిన పరిస్థితి ఉండదు. షూటింగ్‌కు వచ్చేవారికి విడిది సౌకర్యాలు, భోజనం, షూటింగ్‌లో పనులు.. ఇలా ప్రతి విషయంలోనూ స్థానికులకు ఆర్థికంగా ప్రయోజనం లభిస్తుంది. పెద్ద సినిమాలు లేకున్నా ఏడాదికి రెండు వెబ్‌ సిరీస్‌ల చిత్రీకరణ జరిగినా రూ.5 నుంచి రూ.10 కోట్లు ఖర్చవుతుంది. కాబట్టి స్థానికులకు వివిధ రకాలుగా ఆదాయం లభిస్తుంది. 

స్థానికులకు ఆదాయం, తక్కువ ఖర్చుతో చిత్రీకరణే లక్ష్యం..
హార్సిలీహిల్స్‌పై మినీ స్టూడియో ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాంతాన్ని షూటింగ్‌లకు కేంద్రంగా చేయాలన్నదే లక్ష్యం. ఇక్కడి ప్రదేశాలను వెబ్‌సైట్‌లో పెట్టి సినిమా చిత్రీకరణలకు అనువనే విషయాన్ని తెలియజేస్తాం.

మదనపల్లె, ఆరోగ్యవరం, పరిసర ప్రాంతాల చారిత్రక నేపథ్యాన్ని వివరిస్తూ ప్రచారం చేస్తాం. పురాతన కట్టడాలు, భవనాలు, పల్లెలు హార్సిలీహిల్స్‌ పరిసరాల్లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు తక్కువ ఖర్చుతో చిత్రీకరణ చేసుకునేలా ప్రణాళిక రూపొందిస్తాం. అనుభవజ్ఞులైన వారిని నియమించి సహకారం అందిస్తాం. స్థానికులకు ఆదాయ మార్గాలు పెంచేలా చూస్తాం. 
–మహీ వీ రాఘవ, ప్రముఖ దర్శకనిర్మాత 

Advertisement
Advertisement