ఇనుప కంచెకు చిక్కుకుని వెలుగులోకి..
కాఫీ తోటల పెంపకంతో ఇక్కడ మనుగడ?
శ్రీశైలం మల్లన్న సన్నిధిలో మరొక పునుగు పిల్లి సందడి
బి.కొత్తకోట/శ్రీశైలం: శ్రీవారు కొలువైన తిరుమల కొండల్లో కనిపించే పునుగు పిల్లి అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌పై బుధవారం ప్రత్యక్షమైంది. వివరాల్లోకి వెళితే... కొండపైన పోలీస్, టూరిజం అతిథి గృహల మధ్యలో ఇనుప కంచె ఉంది. ఈ కంచెకు చిక్కుకుని ఓ వన్యప్రాణి విలవిల్లాడుతోందని పోలీస్ అతిథి గృహంలో పనిచేసే సిబ్బంది కొండపై ఉన్న అటవీ సిబ్బంది రవి, రమణలకు సమాచారం ఇచ్చారు.
వారు అక్కడికి చేరుకుని పునుగు పిల్లి శరీరానికి అతుక్కున్న కంచెను కత్తిరించడంతో అది అడవిలోకి వెళ్లిపోయింది. కంచె తీగను కత్తిరించే సమయంలో దాన్ని వీడియో తీసి హార్సిలీహిల్స్ సెక్షన్ ఆఫీసర్ అడపా శివకుమార్‌కు పంపగా ఆ వన్యప్రాణి పునుగు పిల్లిగా నిర్ధారించారు. తిరుపతి శేషాచలం అభయారణ్యానికే పరిమితమని భావిస్తున్న తరుణంలో పునుగు పిల్లి జాడ హార్సిలీహిల్స్‌పై వెలుగులోకి రావడం విశేషం.
పునుగు పిల్లుల్లో 38 రకాల జాతులున్నప్పటికి ఆసియా రకానికి చెందిన పునుగు పిల్లి ఇది. దీని గ్రంధుల నుంచి సుగంధ ద్రవ్యం వెలుపలికి విసర్జిస్తాయి. పునుగు పిల్లి చర్మాన్ని దేనికైనా రుద్దితే వెలువడేదే పునుగు తైలం. పునుగు తైలాన్ని తిరుమల శ్రీవారి సేవల్లో వినియోగిస్తారు. పునుగు పిల్లులు కాఫీ కాయలను తిని గింజలను విసర్జిస్తాయి.
కాఫీ తోటలున్న హార్సిలీహిల్స్‌పై వీటి మనుగడ ఉన్నట్టు భావిస్తున్నారు. కొండపైన అటవీశాఖ ప్రాంగణం, ఘాట్‌రోడ్డులో పైనుంచి కిందకు వచ్చే రెండో మలుపులో అటవీశాఖ ఆధ్వర్యంలో కాఫీ తోటల నిర్వహణ సాగుతోంది. వెలుగులోకి వచ్చిన పునుగు పిల్లుల సంతతిపై అధ్యయనం జరగాల్సి ఉంది.
శ్రీశైలంలో క్యూలైన్లో మరొకటి..
శ్రీశైలం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామి వార్ల ఉచిత దర్శన క్యూలైన్‌లో బుధవారం ఉదయం భక్తులకు ఓ పునుగు పిల్లి కనిపించింది. సాధారణంగా శేషాచలం కొండల్లో కనిపించే ఈ పిల్లి ఇక్కడ ప్రత్యక్షం కావడంతో భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment