సాక్షి, హైదరాబాద్: సినీ దర్శకుడు మహి వి.రాఘవకు ఏపీ ప్రభుత్వం రెండు ఎకరాల స్థలాన్ని సంతర్పణ చేయనుందంటూ ఎల్లోమీడియాలో వచ్చిన కథనంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెనుకబడిన తన ప్రాంత అభివృద్ధి కోసమే మదనపల్లి సమీపంలోని హార్సిలీ హిల్స్‌లో మినీ స్టూడియో నిర్మాణానికి స్థలం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దరఖాస్తు చేశానని.. తన ప్రాంతానికి మంచి చేయాలనే సంకల్పం లేకపోతే హార్సిలీ హిల్స్‌లో ఎందుకు స్టూడియో నిర్మించాలనుకుంటాను? అని రాఘవ ఇప్పటికే స్పష్టం చేయగా.. ఆంధ్రజ్యోతి మాత్రం యాత్ర–2 సినిమా చేసినందుకు రెండెకరాలు కట్టబెడుతున్నారంటూ తన అక్కసునంతా వెళ్ల్లగక్కింది.
ఈ కథనాన్ని పలువురు సినీ ప్రముఖులు తప్పుపడుతున్నారు. చంద్రబాబు హయాంలో ఆయన సినీ దోస్తులకు హైదరాబాద్‌లో వందల ఎకరాలకు ఎకరాలు కట్టబెట్టారని.. ఇప్పుడు రాయలసీమ ప్రాంత వాసులకు ఉపయోగపడేలా మినీ స్టూడియో కోసం రెండెకరాలు అడిగితే బాబుకు బాకా ఊదే ఆంధ్రజ్యోతి, ఎల్లోమీడియా రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడుతున్నారు. చంద్రబాబు ధారాదత్తం చేసిన భూముల గురించి ఆంధ్రజ్యోతి, ఎల్లోమీడియాకు ప్రశ్నించే దమ్ముందా? అని ప్రశ్నిస్తున్నారు.
హైదరాబాద్‌లో చంద్రబాబు ఇచ్చినవన్నీ ఒప్పేనా?: కల్యాణ్
ఈ మేరకు నటుడు, నిర్మాత, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు ఓ.కల్యాణ్ నిలదీశారు. ఈ మేరకు మంగళవారం ఒక వీడియో విడుదల చేస్తూ.. రాయలసీమలోని హార్సిలీ హిల్స్‌లో మినీ స్టూడియో కోసం డైరెక్టర్ మహి వి.రాఘవ్ రెండు ఎకరాల స్థలాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరడం తప్పయితే.. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సినిమా రంగానికి చెందిన పలువురికి హైదరాబాద్‌లో స్థలాలు ఇవ్వడం తప్పు అనిపించలేదా? అని ప్రశ్నించారు.
హార్సిలీ హిల్స్‌లో రెండు ఎకరాలు సంతర్పణ అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని.. అసలు ఇంతవరకూ దానిపై ఎలాంటి జీవో రాలేదని.. ఎంత ధరకు ఇస్తున్నారు? దేనికోసం ఇస్తున్నారు? ఇల్లు కట్టుకోవడానికి ఇస్తున్నారా? లేదా స్టూడియో నిర్మాణానికా అన్నది ఆలోచించకుండా ఇష్టానుసారం రాయడం సరికాదన్నారు.
హైదరాబాద్‌లో సినిమా వాళ్లకు చంద్రబాబు ఇచ్చినవన్నీ ఒప్పు అనుకున్నప్పుడు రాఘవకు ఇస్తే కూడా ఒప్పు అనుకోవాలి కదా? ఇక్కడ తప్పు అనుకున్నప్పుడు హైదరాబాద్‌లో స్థలాలు కట్టబెట్టడం కూడా తప్పే కదా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఇచ్చిన స్థలాలన్నీ తప్పు అంటారా? ఒప్పు అంటారా? అన్న విషయం తెలుగు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణను ప్రశ్నించారు.
గతంలో ఎందరికో సబ్సిడీపై భూములు
సినీ రంగం అభివృద్ధికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అక్కినేని నాగేశ్వరరావుకు ప్రభుత్వం 14 ఎకరాల స్థలాన్ని తక్కువ ధరకు స్టూడియో నిర్మాణానికి ఇచ్చిందని, ఎన్టీఆర్ కూడా ప్రభుత్వం ఇచ్చిన భూమిలో స్టూడియోలు కట్టుకున్నారని కల్యాణ్ చెప్పారు. పద్మాలయ స్టూడియో, రామానాయుడు స్టూడియో, ఆనంద్ సినీ సర్వీసెస్(5 ఎకరాలు), ప్రసాద్ ల్యాబ్‌కు కూడా అప్పట్లో సబ్సిడీ ధరకు ప్రభుత్వం స్థలం ఇచ్చిందన్నారు.
ప్రసాద్ ల్యాబ్‌కు ఎదురుగా కె.రాఘవేంద్రరావు, ఆయన సోదరుడు కృష్ణమోహన్‌కు కూడా స్థలం ఇచ్చారని, రాఘవేంద్రరావు స్థలం వెనుక సంగీత దర్శకుడు చక్రవర్తికి కూడా స్థలం ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం ప్రసాద్ ఐ మ్యాక్స్‌కు నెక్లెస్ రోడ్డులో స్థలం ఇచ్చిన విషయం గుర్తులేదా? అని ప్రశ్నించారు.
సినీ కార్మికుల కోసం ఫిల్మ్‌నగర్ సమీపంలోని చిత్రపురి కాలనీకి 67 ఎకరాల స్థలం ఇచ్చారని, తెలంగాణ ఏర్పడ్డాక డైరెక్టర్ ఎ¯Œ.. శంకర్‌కు స్టూడియో నిర్మాణానికి ఐదు ఎకరాల స్థలాన్ని ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. నిర్మాత రామానాయుడుకు వైజాగ్ రుషికొండలో దాదాపు 20 ఎకరాల స్థలం ఇచ్చిన విషయం తెలియదా? అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment