Horticultural crop
-
ఉద్యాన పంటల సాగులో అనంతపురం టాప్.. తక్కువ ధరకే పండ్లు, కూరగాయలు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతంగా పేరుగాంచిన అనంతపురంలో ‘ఫల రాజసం’ అబ్బురపరుస్తోంది. అరుదైన పండ్లు, రుచికరమైన కూరగాయల ఉత్పత్తులకు కేరాఫ్‌గా నిలిచి రికార్డు సృష్టిస్తోంది. ఇక్కడ పండే బత్తాయి పండ్లు నిగనిగలాడుతాయి. ఎర్రగా మెరిసే డ్రాగన్ పండ్లు ఆకర్షిస్తాయి. అంజూర్ పండ్ల రాశులు మురిపిస్తాయి. ఎరుపు – పసుపు వర్ణం కలగలసిన దానిమ్మ పండ్లు నోరూరిస్తాయి. అన్నిటికీ మించి అరబ్ షేక్‌లను సైతం ఆకట్టుకున్న గ్రాండ్ 9 అరటి గెలలు మైమరిపిస్తాయి. ఖర్జూర ఫలాలను తెంపుతున్న మహిళా రైతు 32 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి.. రాష్ట్రంలో హార్టికల్చర్ హబ్ (ఉద్యాన పంటలకు కేంద్రం)గా అనంతపురం జిల్లా పేరుగాంచింది. చీనీ, అరటి తోటలు భూమికి ఆకుపచ్చటి రంగేసినట్టు కనిపిస్తుంటాయి. తక్కువ నీటితో ఎక్కువ దిగుబడినిచ్చే ఈ తరహా పంటలు ఇప్పుడు రైతుకు మంచి ఆదాయ వనరుగా మారాయి. 2022–23 ఆర్థిక సంవత్సరంలో 32 లక్షల మెట్రిక్ టన్నుల పండ్లు, కూరగాయలు ఈ జిల్లా నుంచే ఉత్పత్తి అయ్యాయి. అందులో సింహభాగం ఒక్క కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచే 10.85 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తవుతున్నాయి. మన కూరగాయలు భలే రుచి గురూ.. జిల్లాలో పండించే కూరగాయలు రుచికి, నాణ్యతకు పేరెన్నికగన్నవి. టమాట, పచ్చిమిరప, బెండకాయలు, ఎండు మిర్చి, గోరు చిక్కుడు, అనప, వంకాయలు అద్భుతమైన రుచికి ఆలవాలం. పైగా స్థానికంగా పండించే ఈ కూరగాయలు ధరలోనూ అసాధారణమేమీ కాదు. సరసమైన ధరలకు లభిస్తుండటంతో కొనుగోలుదారులకు, రైతులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఉన్నాయి. ఇక్కడ ఉద్యాన పంటలన్నీ బోర్లకిందే ఉన్నాయి. గడిచిన నాలుగేళ్లుగా కరెంటు కోతలు లేకపోవడం, వర్షాలు సమృద్ధిగా పడటంతో మంచి ఫలసాయం రావడానికి కారణమైంది. విదేశాలకు ఎగుమతి.. జిల్లాలో 1,27,599 హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. ఇక్కడ పండిన అరటి, బత్తాయి, నిమ్మ, దానిమ్మ, మామిడి, సపోట, రేగు, జామ, నేరేడు, ద్రాక్ష, పుచ్చకాయ, మస్క్మొలన్ (ఢిల్లీ దోస), బొప్పాయి, టమాట, పచ్చిమిర్చి, బెండ, ఉల్లి పంట ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. విదేశాలకూ ఎగుమతి అనుకూలమైన వాతావరణమే అనంతపురం జిల్లాలో పండ్ల తోటలకు అనుకూలమైన వాతావరణం ఉంది. ఇక్కడ రైతులు కష్టపడే తత్వం ఎక్కువ. రాష్ట్రంలో అన్ని రకాల పండ్లను పండించే జిల్లాల్లో మొదటి స్థానం అనంతపురానిదే. ఈ తరహా పంటలు రైతులకు లాభదాయకంగా కూడా ఉంటాయి. – రఘునాథరెడ్డి, డిప్యూటీ డైరెక్టర్, హార్టికల్చర్ ఎకరాకు రూ.20 లక్షలు మూడు ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్స్ పంట పెట్టాను. తొలి ఏడాది ఎకరాకు రూ.3 లక్షల దాకా పెట్టుబడి వస్తుంది. ఆ తర్వాత తగ్గుతుంది. కాపుకొచ్చాక ఎకరాకు 20 టన్నుల దిగుబడి వచ్చింది. టన్ను ప్రస్తుతం రూ.లక్ష పలుకుతోంది. మరో ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఖర్జూర పెట్టాను. ఆ పంట ఇంకా కాపునకు రాలేదు. మన నేలలు ఏ ఫలాలకై నా అనుకూలంగానే ఉంటాయి. – కె.వి.రమణారెడ్డి, రైతు, మర్తాడు, గార్లదిన్నె మండలం -
‘స్వరాజ్ కోడ్’.. ముందుగా తెలుగు రాష్ట్రాలకే
న్యూఢిల్లీ: హార్టికల్చర్ రైతులకు సాగులో శ్రమను తగ్గించేందుకు తోడ్పడేలా స్వరాజ్ ట్రాక్టర్స్ ‘కోడ్’ పేరిట కొత్త మెషీన్‌ను ఆవిష్కరించింది. పంట కోత తదితర అవసరాలకు కూడా ఉపయోగపడేలా ఇది చిన్న కమతాల్లో సైతం సులువుగా తిరగగలదని సంస్థ తెలిపింది. కూరగాయలు, పండ్లు మొదలైనవి పండించే రైతులకు ఇది ఉపయోగకరంగా ఉండగలదని కంపెనీ పేర్కొంది. ముందుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో దీన్ని ప్రవేశపెడతామని, ఆ తర్వాత మిగతా రాష్ట్రాల్లోనూ దశలవారీగా అందుబాటులోకి తెస్తామని వివరించింది. ధర త్వరలో వెల్లడిస్తామని పేర్కొంది. -
‘ఉద్యానం’ పంట పండాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఉద్యాన పంటల సాగు రైతుల ఆదాయాన్ని పెంచే వ్యూహాలను అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, విజ్ఞానాన్ని రైతులకు అందించేందుకు జాతీయ, అంతర్జాతీయ నైపుణ్య సంస్థలు, వర్సిటీల సహకారాన్ని తీసుకోవాలన్నారు. నిరంతర పరిశోధనలు, సమాచార మార్పిడి ద్వారా ప్రయోగాలు కొనసాగించాలని స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు వస్తున్న కొత్త వంగడాలు, సాగు సమస్యల పరిష్కారం, ఫుడ్ ప్రాసెసింగ్‌లో కొత్త టెక్నాలజీ, ప్రాసెసింగ్‌కు అనుకూల రకాల సాగే లక్ష్యంగా ఈ పరిశోధనలుండాలని దిశా నిర్దేశం చేశారు. ఉద్యాన, సెరికల్చర్, వ్యవసాయ అనుబంధ రంగాలపై సీఎం జగన్ శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలివీ.. మంచి మార్కెటింగ్‌తో పరిష్కారాలు.. కర్నూలు జిల్లాలో మంచి మార్కెటింగ్ అవకాశాలున్న ఉల్లి సాగుపై దృష్టి పెట్టి నాణ్యమైన రకం పండించేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఫుడ్ ప్రాసెసింగ్‌కు అనుకూలమైన ఉల్లి రకాలు సాగు చేసేలా ప్రోత్సహించాలని సూచించారు. టమాటాలను రోడ్డుమీద పారవేయడం, ధరలేక పొలాల్లోనే రైతులు ఉల్లిపంటను వదిలేసే దుస్థితి తలెత్తకూడదన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఇలాంటి ఘటనలు జరిగాయన్నారు. ఇలాంటి పరిస్థితులు ఇక ఎక్కడా కనిపించకుండా మంచి మార్కెటింగ్‌తో సమస్యకు పరిష్కారాలను చూపాలని ఆదేశించారు. 25 చోట్ల వేగంగా ప్రాసెసింగ్ యూనిట్ల పనులు ఫుడ్ ప్రాసెసింగ్‌లో భాగంగా 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో వివిధ వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్ల నిర్మాణ పనులను మొదలు పెట్టాలని సీఎం సూచించారు. అక్టోబర్ నుంచి గ్రౌండింగ్ చేపట్టడం ద్వారా నిర్మాణ పనులు దశల వారీగా ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. ఇవి ఆర్నెల్లలో పూర్తవుతాయని చెప్పారు. ఉద్యాన పంటలను గరిష్టంగా సాగు చేయడం ద్వారా ‘్రçఫూట్ బౌల్ ఆఫ్ ఇండియా’గా ఆంధ్రప్రదేశ్ ఖ్యాతి సాధించిందని అధికారులు చెప్పారు. కొబ్బరి, అరటి, బొప్పాయి, మిరప, టమాటా, ఉల్లి, బత్తాయి పంటల సాగు వివరాలను అధికారులు సీఎంకు అందచేశారు. వీటి సాగుపై ప్రత్యేక దృష్టి సారించాల్సిందిగా సీఎం ఆదేశించారు. కొబ్బరి, బొప్పాయి, టమాట సాగులోనూ, ఉత్పాదకతలోనూ దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో నిలిచిందని, టిష్యూ కల్చర్ విధానంలో అరటిసాగు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. మిరప సాగు విస్తీర్ణం పెరగాలి.. రాష్ట్రంలో మిరప సాగు విస్తీర్ణాన్ని పెంచడంతో పాటు ప్రాసెసింగ్‌పై మరింత శ్రద్ధ తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. దీనికోసం అంతర్జాతీయ సంస్థల సహకారం తీసుకోవాలన్నారు. కొబ్బరికి మంచి ధర.. నిరంతర పరిశోధనలు కొబ్బరి రైతులకు మంచి ధర లభించేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కొబ్బరిపై నిరంతరం పరిశోధనలు జరగాలని హార్టికల్చర్ విశ్వవిద్యాలయం వీసీకి ముఖ్యమంత్రి సూచించారు. కొబ్బరి సాగులో సమస్యలపై పరిశోధనలు కొనసాగిస్తూ అవసరమైతే అత్యుత్తమ సంస్థల సహకారం తీసుకోవాలన్నారు. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో కొబ్బరికి ‘వైట్ ఫ్లై’ లాంటి తెగుళ్లు సోకటాన్ని దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉంటూ విదేశాల్లో జరుగుతున్న అధ్యయనాలపై కన్నేసి ఉంచాలన్నారు. జాతీయ, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల సహకారం, పరస్పర సమాచార మార్పిడి వల్ల చక్కటి పరిశోధనలకు ఆస్కారం ఉంటుందన్నారు. పరిశోధన ఫలితాలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. దీనివల్ల మంచి వంగడాలతో పాటు సాగులో ఉత్పన్నమయ్యే సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయన్నారు. ప్రాసెసింగ్ రంగంలో వస్తున్న మార్పులు, సాంకేతిక పరిజ్ఞానానికి తగినట్లుగా చర్యలు చేపట్టాలన్నారు. అధిక ఆదాయాన్నిచ్చే పంటల సాగు.. అధిక ఆదాయాన్నిచ్చే పంటల సాగువైపు రైతులను ప్రోత్సహించాలని అధికారులకు సీఎం సూచించారు. బోర్ల కింద వరి, సుబాబుల్, పొగాకు, చెరకు, మొక్కజొన్న లాంటి పంటల సాగుని క్రమంగా తగ్గించి ఉద్యాన పంటల సాగు వైపు మొగ్గుచూపేలా రైతులను ప్రోత్సహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 2020 – 21లో ఇలా1,42,565 ఎకరాల్లో అదనంగా ఉద్యాన పంటల సాగు చేపట్టినట్లు అధికారులు వివరాలను ముఖ్యమంత్రికి అందించారు. ఈ ఏడాది 1,51,742 ఎకరాల్లో ఉద్యాన పంటల సాగును లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. సలహాలు, పరిష్కారాలు డిజిటల్లో.. రైతుల సందేహాలపై ఇస్తున్న సలహాలు, పరిష్కారాలను వీడియో రికార్డ్ చేసి డిజిటల్ ప్లాట్‌ఫాం మీదకు తేవాలని సీఎం ఆదేశించారు. వీటిని అప్లోడ్ చేయడం ద్వారా మిగిలిన రైతులు సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుందని, దీనికోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను వినియోగించుకోవాలన్నారు. మార్కెటింగ్ అవకాశాలున్న వంగడాలన్నీ.. మార్కెటింగ్ చేయగలిగే అవకాశం ఉన్న ప్రతి వంగడాన్ని రైతుల్లోకి విరివిగా తీసుకెళ్లాలని సీఎం జగన్ సూచించారు. రైతులు కష్టపడి సాగుచేసిన తర్వాత వాటిని మార్కెటింగ్ చేసేందుకు ఇక్కట్లు ఎదుర్కొనే దుస్థితి రాకూడదన్నారు. పువ్వుల సాగు (ఫ్లోరీ కల్చర్) రైతుల విషయంలో సరైన మార్కెటింగ్ అవకాశాలు, ప్రాసెసింగ్‌పై దృష్టి పెట్టాలన్నారు. ఆర్బీకేల ద్వారా తుంపర, బిందు సేద్యం లబ్ధిదారుల ఎంపిక తుంపర సేద్యం, బిందుసేద్యం పరికరాల మంజూరులో పారదర్శకతకు పెద్దపీట వేయాలని, ఆర్బీకేల ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరగాలని సీఎం జగన్ ఆదేశించారు. రివర్స్ టెండరింగ్‌కు వెళ్లడం ద్వారా రేట్లు గణనీయంగా తగ్గి నాణ్యమైన పరికరాలు రైతులకు అందుబాటులోకి వస్తాయన్నారు. అవినీతికి తావులేని విధానంలో రైతులకు పరికరాలు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. సెరికల్చర్‌కు ప్రోత్సాహం సెరికల్చర్ సాగు విధానం, ఉత్పాదకతపై సీఎంకు అధికారులు వివరాలు అందచేశారు. పట్టు గూళ్ల విక్రయాల్లో ఇ–ఆక్షన్ విధానం తేవడం ద్వారా దేశవ్యాప్తంగా వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారని, రైతులకు మంచి ధరలు వస్తున్నాయని తెలిపారు. 1,250కి పైగా ఆర్బీకేల పరిధిలో పట్టు పురుగులు పెంచుతున్న రైతులు ఉన్నట్లు చెప్పారు. వీటిపై ప్రత్యేక దృష్టి సారించి సెరి కల్చర్‌ను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. షెడ్ల నిర్మాణంపై దృష్టి పెట్టడం వల్ల చిన్న రైతులకు సెరికల్చర్ సాగుకు ప్రోత్సాహం లభిస్తుందని చెప్పారు. మంత్రి కన్నబాబు, వ్యవసాయ, సహకార, పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, హార్టి కల్చర్ కమిషనర్ ఎస్.ఎస్.శ్రీధర్, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ వీసీ అండ్ ఎండీ డాక్టర్ జి.శేఖర్‌బాబు, ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సీఈవో ఎల్.శ్రీధర్‌రెడ్డి, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు పీవో డాక్టర్ హరినాథ్‌రెడ్డి, వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ టి.జానకిరామ్ తదితరులు పాల్గొన్నారు. అగ్రికల్చర్ విద్యార్థులకు ఆర్బీకేల్లో శిక్షణ.. రైతు భరోసా కేంద్రాలకు వచ్చినప్పుడు రైతులు వ్యక్తం చేసే సందేహాలను నివృత్తి చేసేలా తగిన వ్యవస్థ ఉండాలని సీఎం స్పష్టం చేశారు. ఆర్బీకేల్లో ఉండే అగ్రికల్చర్ అసిస్టెంట్లు ఆ సందేహాలను తీర్చేలా ఉండాలన్నారు. దీనివల్ల రైతులు, అగ్రికల్చర్ అసిస్టెంట్ల మధ్య అనుబంధం బలపడి మంచి వాతావరణం ఉంటుందని, తద్వారా అనుకున్న ఫలితాలను సాధించగలుగుతామన్నారు. రైతుల సందేహాలు, సమస్యలను పరిష్కరించేలా అగ్రికల్చర్ అసిస్టెంట్లు ప్రయత్నించాలన్నారు. రైతులు వెల్లడించిన సమస్యలు, సందేహాలు ఏమిటి? వాటికి ఎలాంటి పరిష్కారం చూపారన్న అంశాన్ని ఆర్బీకేల్లో తనిఖీల సందర్భంగా కచ్చితంగా పరిశీలించాలని సీఎం ఆదేశించారు. రైతుల సమస్యలకు వేగంగా పరిష్కారాలు చూపే విధంగా నిర్దిష్ట నిర్వహణ ప్రణాళిక (ఎస్వోపీ) ఉండాలని, ఈ విషయంలో జవాబుదారీతనం ఉండాలని స్పష్టం చేశారు. అగ్రికల్చర్ విద్యార్థులు ఆర్బీకేల్లో కనీసం నెలరోజులు తప్పనిసరిగా పనిచేసేలా ఇంటర్న్‌షిప్ నిబంధన విధించడం ద్వారా వాటి పనితీరు, కార్యక్రమాలపై వారికి అవగాహన, పరిజ్ఞానం పెరుగుతుందన్నారు. -
రైతు భరోసా కేంద్రాల్లో ఉద్యానవనపంటలపై అవగాహన
-
15 రోజులకోసారి జీవామృతం
అధిక సాంద్రత గల జీవవైవిధ్య ఉద్యాన ప్రకృతి వ్యవసాయ క్షేత్రానికి రూపుకల్పన చేశారు విలక్షణ రైతు సుఖవాసి హరిబాబు(62). హైదరాబాద్ సమీపంలో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్‌పేట గ్రామపరిధిలోని ఆయన క్షేత్రం ఉంది. పదెకరాల్లో ఎన్నో అరుదైన పండ్ల, ఔషధ, కలప జాతి చెట్లను నాటారు. దేశీ జాతుల ఆవులు, గొర్రెలు, కోళ్లు, బాతులను కలగలిపి సమీకృత ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని హరిబాబు నెలకొల్పారు. డ్రిప్ ద్వారా ప్రతి 15 రోజులకోసారి ద్రవజీవామృతం, ఏడాదికోసారి ఘనజీవామృతం, వర్షాకాలంలో ఒకసారి చెట్ల మధ్యలో వేసి.. రోటవేటర్ వేస్తూ మంచి ఫలసాయం పొందుతున్నారు. తనదైన శైలిలో అనేక ఇతర పదార్థాలను కలిపి జీవామృతం, ఘనజీవామృతంలను ఆయన తయారు చేసుకుంటున్నారు. జీవామృతం + వేపగింజల పొడి.. 6 వేల లీటర్ల సంప్‌లు రెండు నిర్మించుకొని జీవామృతం తయారు చేసుకుంటూ ప్రతి 15 రోజులకోసారి చెట్లకు అందిస్తున్నారు. ప్రతి సంప్‌లో 500–550 కిలోల ఆవు పేడ, 300–400 లీటర్ల ఆవు మూత్రం, 20 కిలోల నల్లబెల్లం, 10–15 కిలోల శనగపిండి వేసి జీవామృతం కలుపుతారు. 5 రోజుల తర్వాత.. ఒక్కో సంప్‌లో.. 400 లీటర్ల ఎర్రమట్టి నీళ్లు, 40 కిలోల స్టోన్ క్రషర్ డస్ట్ నీళ్లు 400 లీటర్లు, కిలో వేపగింజల పొడి, ఒక్కో లీటరు చొప్పున 12 రకాల నూనెలు, 1.25 లీటర్ల ఎమల్సిఫయర్ లేదా 2 లీ. కుంకుడు రసం కలిపి డ్రిప్ ద్వారా చెట్లకు అందిస్తున్నారు. పేడ + కట్టెల బొగ్గు+జీవామృతం.. హరిబాబు ఏడాదికోసారి ఘనజీవామృతం తయారు చేసుకుంటారు. జూలై నెలలో తన తోటలోని చెట్లకు వేస్తున్నారు. రెండు లాట్లుగా ఘనజీవామృతం తయారు చేస్తారు. ఒక్కో లాటుకు 60 టన్నుల పేడ(5 టిప్పర్లు), 7–8 టన్నుల కట్టెల బొగ్గు పొడితోపాటు తోటలో ప్రూనింగ్ చేసిన ఆకులు, అలములు, కొమ్మలు, రెమ్మలు 10 టన్నులను జెసిబితో ముక్కలు చేసి ముప్పావు గంటలో కలిపి పోగు చేస్తారు. దీన్ని కలిపేటప్పుడే 6 వేల లీటర్ల జీవామృతం పోస్తారు. ఈ జీవామృతంలో ముందురోజు 7–8 రకాల జీవన ఎరువులు 150 కిలోలను కలుపుతారు. ఇలా కలిపిన ఎరువుల మిశ్రమం పోగుపైన ఎండ పడకుండా చెరకు పిప్పి, అరటి, కొబ్బరి ఆకులను కప్పుతారు. 3 రోజులకోసారి పైన నీరు పోస్తూ తడుపుతుంటారు. మధ్యలో తిరగేసే పని లేదు. 4–5 నెలల్లో ఘనజీవామృతం సిద్ధమవుతుంది. జీవవైవిధ్యం ఉట్టిపడే ఉద్యాన వనాన్ని నిర్మించిన హరిబాబు (94412 80042) తక్కువ ఖర్చుతో, తక్కువ శ్రమతో నిర్వహిస్తుండడం విశేషం. జీవామృతాన్ని కలుపుతున్న హరిబాబు -
ఫలసాయం పుష్కలం
కర్నూలు అగ్రికల్చర్: కరువు సీమలో పండ్ల తోటల పెంపకం గణనీయంగా పెరిగింది. ఉత్పత్తులూ అంచనాలను మించుతున్నాయి. అయితే రాయలసీమలో ఉద్యాన పంటల ఆధారిత పరిశ్రమలు, ప్రాసెసింగ్ యూనిట్లు, మార్కెటింగ్ సౌకర్యాలు మృగ్యం. ఇవి అందుబాటులోకి వస్తే రైతన్నలకు కనక వర్షమే. చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఉన్న మామిడి పల్ప్ ఫ్యాక్టరీ ఒక్కటీ ఎప్పుడో మూతడింది. సీమలో సంప్రదాయ పంటల సాగు తగ్గి రైతులు ఉద్యాన పంటల వైపు దృష్టి సారించడం మంచి మార్పునకు సంకేతమని సంబంధిత అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు లక్షల హెక్టార్లలో పండ్ల తోటలు సీమ జిల్లాల్లో 4,02,567 హెక్టార్లలో మామిడి, చీని, సపోట, దానిమ్మ, అరటి, నిమ్మ, బొప్పాయి, ద్రాక్ష, పనస, ఉసిరి తదితర పండ్ల తోటలు సాగుచేస్తున్నారు. ఏటా 99,79,122 టన్నుల దిగుబడి లభిస్తోంది. ఈ ఏడాది అదనంగా 15వేల హెక్టార్లలో తోటలు పెంచుతున్నారు. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అరుదుగా పండే ఆపిల్‌బేర్, కర్జూరాలు, డ్రాగన్ ఫ్రూట్స్ కూడా సాగు చేస్తున్నారు. వివిధ ప్రాంతాలకు ఎగుమతులు ఈ ప్రాంతం నుంచి అరటి, బొప్పాయి, సపోటా ఉత్తరాది రాష్ట్రాలకు తరలిస్తున్నారు. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌కు చీని, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు దానిమ్మ, నిమ్మ వెళుతోంది. మామిడి దేశం నలుమూలలకు పంపుతున్నారు. అరటి, దానిమ్మ, బొప్పాయి, మామిడి గల్ఫ్ దేశాలకు కూడా ఎగుమతి అవుతుండడం విశేషం. ఏటా రూ. 20 వేల కోట్ల విలువైన పండ్లను ఉత్పత్తి చేస్తుండగా, దానిలో రూ. 5 వేల కోట్ల ఉత్పత్తులు ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. మార్కెటింగ్ సౌకర్యం లేక నష్టపోతున్న వైనం సీమ జిల్లాల్లో పండ్ల ఆధారిత పరిశ్రమలు, మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడంతో రైతులు బాగా నష్టపోతున్నారు. పెట్టుబడి, కష్టం రైతులది కాగా... లాభాలు మాత్రం దళారులు ఎగరేసుకు పోతున్నారు. రాయలసీమ జిల్లాల నుంచి దాదాపు 2,000 టన్నుల పండ్లు హైదరాబాద్‌కే తరలిస్తున్నారు. మామిడి సీజన్లో రోజువారీ ఎగుమతి విలువ రూ.5 కోట్లు పైమాటే. దీనిపై ఒక శాతం మార్కెట్ సెస్...రూ.50 లక్షల దాకా తెలంగాణ ప్రభుత్వానికి వెళుతోంది. అదే సీమ జిల్లాల్లో ఫ్రూట్ మార్కెట్ ఉంటే ఆ ఆదాయం ఏపీ ప్రభుత్వానికి లభించేది. అలాగే పండ్ల తోటల రైతులకు లాభదాయకంగా ఉంటుంది. ఉద్యాన తోటల అభివృద్ధికి కృషి కర్నూలు జిల్లాలో ఉద్యాన తోటల అభివృద్ధికి పలు చర్యలు తీసుకుంటున్నాం. మార్కెంటింగ్ సదుపాయాలు పెంచేలా ప్రయత్నాలు మొదలు పెట్టాం. అలాగే ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను రైతుల్లోకి తీసుకెళ్లి ఉద్యాన తోటలు విరివిగా సాగుచేసేలా చూస్తున్నాం. ఉద్యాన ఆధారిత పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే వారికి హార్టికల్చర్ మిషన్ కింద సబ్సిడీలు అందజేస్తాం. సీహెచ్ పుల్లారెడ్డి, జాయింట్ డైరెక్టర్, ఉద్యాన శాఖ, కర్నూలు ప్రధాన పండ్లతోటల సాగు (హెక్టార్లలో) మామిడి=2,14,060,అరటి=60,065 ,నిమ్మ=3,070 ,బొప్పాయి=13,273 ,సపోట=5,173,కరబూజ=10,267 ,చీని=68,818 ,కళింగర=1,02,231 ,ఉసిరి=362,జామ=2,849,సీతాఫలం=9,643, రేగు=1,210 డ్రాగన్ ఫ్రూట్స్‌కు మంచి డిమాండ్ ఉంది. ఒక్కసారి ఈ మొక్కలు నాటితే 20 ఏళ్లకు పైగా దిగుబడులు ఇస్తాయి. అరుదైన ఉద్యాన పంటలు పండిస్తున్నా, వాటి ఆధారిత పరిశ్రమలు లేకపోవడంతో నష్టపోతున్నాం. ఈ పంటను సీమలోని జిల్లాల్లో పండిస్తున్నందున వీటి ఆధారిత పరిశ్రమలతో పాటు మార్కెటింగ్ సదుపాయం కల్పించాల్సిన అవసరం ఎంతో ఉంది. – విష్ణువర్ధన్‌రెడ్డి, కరివేముల,దేవనకొండ మండలం, కర్నూలు జిల్లా -
వైఎస్సార్ హయాంలో ఉద్యాన విప్లవం
సాక్షి, అనంతపురం అగ్రికల్చర్: అనంతపురం జిల్లాకు ‘ప్రూట్ బౌల్ ఆఫ్ ఏపీ’గా పేరు వచ్చిందంటే అదంతా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన ప్రోత్సాహమే.. అని జిల్లాలో ఏ రైతును అడిగినా చెబుతారు. కరువు కాటకాలకు నిలయమైన ‘అనంత’లో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో పండ్లతోటల విప్లవమే కొనసాగింది. ఆయన ఐదేళ్ల హయాంలో పండ్లతోటల రైతులకు వివిధ రూపాల్లో రూ.80 కోట్ల వరకు రాయితీలు కల్పించారు. కొత్తగా 45 వేల హెక్టార్లలో ఉద్యాన తోటలు విస్తరించాయి. వైఎస్సార్ రాయితీలతో పండ్లతోటల విస్తరణ.. ఉద్యాన పంటలంటే పెద్దగా తెలియని రైతులు కూడా వైఎస్ కల్పించిన రాయితీలను ఉపయోగించుకోవడంతో మారుమూల ప్రాంతాల్లో సైతం పండ్లతోటలు విస్తరించాయి. ఫలితంగా వేరుశనగ పంట నష్టాలతో వ్యవసాయ జూదంలో దారుణంగా దెబ్బతింటున్న రైతులు కోలుకున్నారు. వ్యవసాయ పంటల స్థానంలో పండ్లతోటల సాగుపై దృష్టి సారించారు. ఓ వైపు పండ్ల తోటలకు రాయితీలు ఇచ్చిన వైఎస్సార్ అదే సమయంలో సూక్ష్మసాగు కింద డ్రిప్, స్ప్రింక్లర్ల పంపిణీకి పెద్దపీట వేశారు. ఎస్సీ ఎస్టీలకు 100 శాతం, మిగతా రైతులకు 90 శాతం రాయితీతో అడిగిన ప్రతి రైతుకూ డ్రిప్, స్ప్రింక్లర్లు ఇవ్వడంతో ఉద్యానతోటలు మూడు పవ్వులు, ఆరు కాయలు మాదిరిగా విరాజిల్లాయి. 2004కు ముందు కొన్ని ప్రాంతాలకే పరిమితం.. వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన 2004కు ముందు వరకు జిల్లాలో కేవలం కొన్ని ప్రాంతాలకే పండ్లతోటలు పరిమితమయ్యాయి. 1995 నుంచి 2003 వరకు తొమ్మిదేళ్లు చంద్రబాబునాయుడు పాలించారు. అయినా ఉద్యానతోటల జాడ కనిపించలేదు. కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చీనీ, అరటి లాంటి రెండు మూడు రకాల పండ్లు,కూరగాయలు, పూలతోటలు 15 నుంచి 20 వేల హెక్టార్ల వరకు సాగులో ఉన్నాయి. పండ్ల తోటలంటే ఏమిటి, వాటి వల్ల ప్రయోజనాలేమిటి? ఎలా సాగు చేయాలి..పథకాలేంటి..? అమ్ముకోవడం ఎలా అనే విషయాలు జిల్లా రైతులకు ఏ మాత్రం తెలియని పరిస్థితి ఉండేది. వ్యవసాయం దండగగా మారిందంటూ ఆసమయంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం కూడా వ్యవసాయాన్ని చిన్నచూపు చూసింది. దీంతో రైతులు అనేక కష్టాలు పడ్డారు. వైఎస్సార్ రాకతో పండ్ల తోటల విప్లవం 2004లో ముఖ్యమంత్రిగా పాలనా పగ్గాలు చేపట్టిన వైఎస్ రాజశేఖరరెడ్డి ఆ వెంటనే రైతు సంక్షేమంపై దృష్టి సారించారు. విద్యుత్ బిల్లుల మాఫీతో పాటు ఉచిత కరెంటుకు శ్రీకారం చుట్టారు. వేరుశనగ వల్ల నష్టపోతున్న రైతుల దృష్టి పండ్లతోటల వైపు మళ్లించారు. పెద్ద ఎత్తున రాయితీలు, సబ్సిడీలు ప్రకటించారు. సూక్ష్మసాగుకు పెద్దపీట వేశారు. ఫలితంగా కరువు కోరల్లో చిక్కుకున్న అనంత రైతులు మెల్ల మెల్లగా పండ్లతోటల సాగుకు అడుగులు వేశారు. ఏడాది తిరగకముందే జిల్లాలో పండ్లతోటల విప్లవం కొనసాగింది. సమస్యల సుడిగుండం నుంచి బయటపడే మార్గం చూపించడంతో పండ్లతోటలు జిల్లా నలుమూలలా విస్తరించాయి. వైఎస్సార్ మరణం తర్వాత.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అకాల మరణంతో జిల్లాలో పండ్లతోటల రైతుల పరిస్థితి 2004కు ముందు పరిస్థితులు గుర్తుకు తెస్తున్నాయి. రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాలు పండ్లతోటల రైతులకు ఇస్తున్న రాయితీలకు కోతలు పెట్టారు. బడ్జెట్ బాగా తగ్గించేశారు. ఆ తర్వాత 2014లో మరోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చినా ఉద్యానంపై చిన్నచూపు చూశారు. బడ్జెట్, పథకాలు, రాయితీలు బాగా తగ్గించేశారు. ఫలితంగా రాయితీలు, మార్కెటింగ్ సదుపాయం లేక పండ్లతోటల రైతులు బాగా నష్టపోతున్నారు. జీవనాధారం దొరికింది వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉపాధిహామి పధకంలో భాగంగా మాకున్న 3.50 ఎకరాల్లో గుంతలు తవ్వించి మామిడి మొక్కలు, డ్రిప్ ఉచితంగా అందజేశారు. దీంతో పాటు మూడేళ్ల పాటు ఎరువులు, కంచె వేయడానికి, ఎండి మొక్కల స్థానంలో కొత్తవి నాటుకునేందుకు డబ్బ సాయం చేశారు. ఇప్పుడు ఆ మామిడి తోట నుంచి ఏటా రూ.2లక్షలు ఆదాయం వస్తోంది. మా కుటుంబానికి జీవనాధారం ఆ తోటే. వైఎస్ రాజశేఖరరెడ్డి చలువ వల్లే మా కుటుంబం సంతోషంగా ఉంది. – నరసింహారెడ్డి, బొడినేపల్లి, నల్లచెరువు -
పుచ్చకాయతో నష్టాలు
పుచ్చకాయ తింటే లాభాలనేకం అందుకే వేసవిలో పుచ్చకాయను తినని వారుండరు. కాని పుచ్చ పంటకు తెగులు సొకడంతో దిగుబడి తగ్గి కష్టాల్లో ఉన్న రైతన్నను మార్కెట్లొ ధర వెక్కిరించింది. చివరికి పెట్టుబడి సొమ్ము కూడా చేతికి రాక రైతుకు కన్నీరే మిగిల్చింది. సాక్షి, చిట్టమూరు: వర్షాభావ పరిస్థితులు మెట్టపంటల సాగు రైతును కుదేలు చేసింది. ఈ ఏడాది పుచ్చ పంట వేసిన రైతులకు నష్టాల ఊబిలో కూరుకుపోయారు. గతేడాది వివిధ ప్రాంతాల్లో వేసిన పంటకు అంతు పట్టని తెగులు సోకడంతో దిగుబడులు తగ్గి రైతులు నష్టపోయారు. ఈ సంవత్సరం అయినా పంట ఆశాజనకంగా ఉంటుందని ఆశించిన రైతులు గతేడాది కంటే ఎక్కువగా నష్టాలను చవిచూశారు. పుచ్చ పంట సాగు చేసిన రైతులకు ఉద్యానవన శాఖ అధికారుల నుంచి ఎటువంటి సలహాలు, సూచనలు అందలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సరైన సేద్యం పద్ధతులు అవలంబించలేకపోవడంతో పంటలను తెగుళ్లు ఆశించాయి. రైతులు పురుగు మందు దుకాణదారులు చెప్పిన మందులు వాడినా దిగుబడులు అంతంత మాత్రమే వస్తున్నాయన్నారు. గూడూరు నియోజకవర్గంలో చిట్టమూరు, కోట, వాకాడు, గూడూరు చిల్లకూరు మండలాల్లో సుమారు 2 వేల ఎకరాల్లో మెట్ట ప్రాంతాల్లో రైతులు పుచ్చ పంట సాగుచేశారు. ప్రస్తుతం కోత దశలో ఉండటంతో రైతులు కాయలు కోసి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. కాయ సైజును బట్టి వ్యాపారులు రైతుల వద్ద నుంచి కొనుగోలు చేస్తున్నారు. చిన్న సైజు కాయలను వ్యాపారులు కొనుగోలు చేయకపోవడంతో రోడ్ల పక్కన రైతులే అమ్మకాలు చేస్తున్నారు. వేలు పెట్టుబడి పెట్టి చివరకు కాయ సైజు రాకపోవడంతో అప్పుల పాలయ్యామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిట్టమూరు మండలంలో ప్రధానంగా చిల్లమూరు, మొలకలపూడి, రామాపురం గ్రామాల్లో మెట్టు ప్రాంతాల్లో రైతులు పుచ్చసాగు చేశారు. చిట్టమూరు మండలం నుంచి గతంలో దేశ రాజధాని ఢిల్లీకు కూడా ఎగుమతి అయ్యేవి. అయితే ఈ సంవత్సరం కాయ సైజు పెద్దగా రాకపోవడం, నాణ్యత లేకపోవడంతో ఎగుమతులు నిలిచిపోయాయని రైతులు చెబుతున్నారు. ధరలు భారీగా పతనం ఈ ఏడాది పుచ్చకాయల ధరలు భారీగా పనమయ్యాయి. గతేడాది టన్ను రూ.10 వేలు ఉంటే.. ఈ ఏడాది రూ.6 వేల నుంచి రూ.6,500 వరకు ఉన్నాయి. కాయలు చిన్నవి అయితే రూ.4,500 లోపే కొనుగోలు చేస్తున్నారు. కానీ మార్కెట్లో వ్యాపారులు మాత్రం కాయల సైజ్‌ను బట్టి విక్రయిస్తుండడంతో టన్ను రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు వస్తుంది. ఆరుగాలం కష్టపడి పండించిన రైతులకంటే.. వ్యాపారులు రెండింతల లాభాలను పొందుతున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో పుచ్చసాగు నియోజకవర్గంలో ఈ ఏడాది వర్షాలు పూర్తిస్థాయిలో కురవకపోవడంతో రైతులు వరి పంటకు సాగు నీరు లేక ఆరుతడి పంట పుచ్చను సాగు చేశారు. బావులు, గుంతల్లోని నీటి ఆధారంగా పుచ్చసాగు చేశారు. డీజిల్ ఇంజన్ల ద్వారా పుచ్చ పంటకు సాగునీరు అందించి వ్యయప్రయాసలు పడి పండించినా చివరకు కష్టమే మిగిలిందని రైతులు వాపోతున్నారు. ఎకరా పుచ్చసాగుకు దుక్కి మొదలు, కోత దశ వరకు సుమారు రూ.30 వేలు ఖర్చు అవుతుంది. అయితే తొలి కోతలో రెండు టన్నులు, రెండో కోతలో రెండు టన్నులు మొత్తం ఎకరాకు 4 నుంచి 5 టన్నుల దిగుబడి మాత్రమే వస్తుందని రైతులు తెలిపారు. అయితే అన్ని బాగుండి గతంలో ఎకరాకు సుమారు 15 టన్నుల వరకు దిగుబడి వచ్చేదని రైతులు పేర్కొన్నారు. ఈ సంవత్సరం ఎకరాకు రూ.10 వేలు నష్టం వస్తుందని రైతులు తెలిపారు. ఎకరాకు రూ.10 వేలు నష్టం నాలుగు ఎకరాల్లో పుచ్చ పంట సాగు చేశాను. దిగుబడి తక్కువగా రావడంతో ఎకరాకు రూ. 10 వేలు నష్టం వచ్చింది. అధికారుల నుంచి పంట సస్యరక్షణపై ఎటువంటి సలహాలు, సూచనలు లేకపోవడంతో తెగుళ్లను తగ్గించేందుకు పెట్టుబడులు పెరిగాయి. – సంక్రాంతి కస్తూరయ్య, రైతు, మొలకలపూడి, చిట్టమూరు మండలం డిసెంబర్ నెలలో నాటుకోవాలి రైతులు డిసెంబర్ నెలలో విత్తనాలు నాటుకుంటే పంటకు తెగుళ్లు తగ్గి దిగుబడి పెరుగుతోంది. తామర పురుగు, డైబ్యాక్ తెగులు ఎక్కువగా వస్తున్నాయి. వైరస్ ఎక్కువగా సోకడంతో తెగుళ్లు వ్యాప్తి చెందుతున్నాయి. రైతులు మేలు రకమైన విత్తనాలను విత్తుకోవాలి. పాతరకం విత్తనాలు వేసుకోవడం వల్ల తెగుళ్లు వస్తున్నాయి. – ఆనంద్, ఉద్యానశాఖ అధికారి, గూడూరు -
పాలీహౌస్ రైతులకు ప్రోత్సాహం ఏదీ?
చేవెళ్ల, న్యూస్‌లైన్: పాలీహౌస్‌ల (గ్రీన్హౌస్) ద్వారా ఉద్యాన పంటలను సాగుచేస్తున్న రైతులను ప్రోత్సహించడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. ఓ వైపు ఆధునిక వ్యవసాయంపై ఆర్భాటపు ప్రకటనలు చేస్తూ...మరోవైపు ఆసక్తి చూపుతున్న రైతులపట్ల నిర్లక్ష్యం చూపుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్కువ నీరు, తక్కువ స్థలంలో సాగయ్యే ఉద్యానపంటలైన పూలు, కూరగాయల పట్ల జిల్లా రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. 2000 సంవత్సరం క్రితం వరకూ మన రాష్ర్టంలో పాలీహౌస్‌ల ద్వారా పూలు సాగుచేసే రైతులు తక్కువ సంఖ్యలో ఉండేవారు. మన వాతావరణానికి తట్టుకుంటాయో లేదోనన్న అభిప్రాయంతో వీటి జోలికి పోలేదు. దీంతో వివాహాది శుభకార్యాలకు అలంకరణ కోసం ఉపయోగించే పూలను అధిక విస్తీర్ణంలో పండించే మహారాష్ట్రలోని సాంగ్లీ, సతారా జిల్లాల నుంచి దిగుమతి చేసుకునేవారు. వర్షాభావ పరిస్థితులు తలెత్తడం, డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి అధికం కావడం, అలంకరణ పూలకు డిమాండ్ అధికంగా ఉండడంతో క్రమంగా రైతులు పాలీహౌస్‌ల వైపు మొగ్గుచూపడం ప్రారంభించారు. 2010లో కొంతమంది రైతులు మహారాష్ట్రకు వెళ్లి పాలీహౌస్‌ల ద్వారా పూల సాగు విధానాన్ని తెలుసుకున్నారు. నాలుగేళ్ల క్రితం కొంతమంది చేవెళ్ల ప్రాంతంలో ఈ సాగును ప్రారంభించారు. ప్రస్తుతం వందల సంఖ్యలో పాలీహౌస్‌లను ఏర్పాటు చేసుకొని పూలు, కూరగాయలను సాగుచేస్తున్నారు. ప్ర స్తుతం జిల్లాలో సుమారు 200కుపైగా పాలీ హౌస్లున్నాయంటే రైతులు వీటిపై ఎంతగా ఆసక్తి చూపుతున్నారో అర్థమవుతోంది. సబ్సిడీ విధానం ఇదే... పదేళ్ల క్రితం పాలీహౌస్ను ఏర్పాటుచేసుకోవడానికి ఒక రైతుకు 560 స్క్వేర్మీటర్ విస్తీర్ణంలో ఉద్యానశాఖ అనుమతిచ్చేది. ఇతర రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణానికి సబ్సిడీ ఇస్తున్నారన్న రైతుల డిమాండ్ మేరకు 2010లో వెయ్యి, ప్రస్తుతం నాలుగువేల స్క్వేర్మీటర్లకు అనుమతి స్తున్నారు. ఒక పాలీహౌస్ వేసుకోవాలంటే నెట్షెడ్కు రూ.6లక్షల నుంచి 8 లక్షలు, లోపల మట్టిబెడ్కు రూ. 2లక్షల నుంచి 3 లక్షలు, ప్లాంటేషన్‌కు రూ.2 లక్షల నుంచి 2.5 లక్షల వరకు ఖర్చవుతోంది. ఒక పాలీహౌస్‌కు మొత్తం కలిసి సుమారు రూ.15లక్షల వరకూ ఖర్చవుతోంది. ప్రభుత్వం ఒక స్క్వేర్మీటర్కు రూ.467 చొప్పున సబ్సిడీ ఇస్తోంది. అంటే వెయ్యి గజాల్లో వేసుకుంటే రూ.4 లక్షల 67 వేలు సబ్సిడీ ఇస్తోంది. ప్లాంటేషన్‌కు రూ.2లక్షల 50వేలు, మొత్తం రూ.7లక్షల 17 వేల సబ్సిడీ అందజేస్తోంది. సాగుచేస్తున్న పంటలివే... పాలీహౌస్‌లలో అలంకరణ పూలైన జర్భరా, కార్నేషన్, డచ్రోస్ తదితర రకాలను పండిస్తున్నారు. కూరగాయల్లో క్యాప్సికమ్, టమాట తదితరాలను సాగుచేస్తున్నారు. కొన్నిచోట్ల వాణిజ్య పంట అయిన అల్లం పండిస్తున్నారు. సబ్సిడీ కోసం ఎదురుచూపులు.. పాలీహౌస్‌ల ద్వారా పూలు, కూరగాయలను పండించడం లాభసాటిగా మారడంతో ప్రస్తుతం 300 మంది రైతులు పాలీహౌస్‌ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. 2013లో ప్రభుత్వం ఆరు హెక్టార్ల వరకే సబ్సిడీ కోసం బడ్జెట్లో నిధులు కేటాయించారు. కానీ సుమారు 50 హెక్టార్లలో వందలాదిమంది రైతులు పాలీహౌస్‌లను ఏర్పాటు చేసుకొని సబ్సిడీ కోసం నెలల తరబడి ఎదురుచూస్తున్నారు. సబ్సిడీ వస్తుందనే ఆశతో 35 మంది రైతులు లక్షల్లో అప్పు తెచ్చి పాలీహౌస్‌లు వేసుకొని, ప్లాంటేషన్ చేసుకొన్నారు. సబ్సిడీ కోసం నెలలతరబడి ఎదురుచూస్తున్నా బడ్జెట్లేని కారణంగా ఇవ్వడంలేదు. సంఘం ఏర్పాటు... 2010లో తెలంగాణలోని పలు జిల్లాల రైతులు 15 మంది కలిసి ఓ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ సంఘంలో 150 మంది రైతులున్నారు. పాలీహౌస్‌ల రైతులకు ఏ సమాచారం కావాలన్నా, సమస్య ఉన్నా వెంటనే స్పందిస్తూ కార్యవర్గం చురుకైన పాత్రను పోషిస్తోంది. తమవంతు ప్రోత్సాహాన్ని, సహకారాన్ని అందిస్తోంది. పాలీహౌస్‌ల పట్ల అవగాహన కల్పిస్తోంది. కేంద్రమంత్రిని కలిసినా... రెండు నెలల క్రితం సంఘం కోశాధికారి గుండన్నగారి ప్రభాకర్‌రెడ్డి, డీసీసీబీ డెరైక్టర్ సోలిపురం బల్వంత్‌రెడ్డి, చేవెళ్ల మాజీ ఎంపీపీ మల్గారి విజయభాస్కర్‌రెడ్డి తదితరులు ఢిల్లీకి వెళ్లి కేంద్రమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డిని కలిశారు. పాలీహౌస్ రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహం కరువవడం, నిధుల కొరత, సబ్సిడీ విడుదలలో జాప్యం, పెండింగ్ దరఖాస్తులు తదితర విషయాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన కేంద్ర వ్యవసాయశాఖమంత్రి శరద్‌పవార్ ద్వారా ఉద్యాన శాఖ కార్యాలయంలోని ఉన్నతాధికారికి విషయాన్ని చేరవేశారు. దీంతో ఆయన రాష్ట్రంలోని ఉద్యానశాఖ కమిషనర్ నుంచి నిధులకోసం రిక్విజేషన్ లెటర్‌ను పంపాలని సూచించారు. ఆ పని పూర్తయినప్పటికీ ఇంతవరకూ ఒక్కపైసా కూడా విడుదల కాలేదని సంఘం సభ్యులు అంటున్నారు.