చేవెళ్ల, న్యూస్‌లైన్: పాలీహౌస్‌ల (గ్రీన్‌హౌస్) ద్వారా ఉద్యాన పంటలను సాగుచేస్తున్న రైతులను ప్రోత్సహించడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. ఓ వైపు ఆధునిక వ్యవసాయంపై ఆర్భాటపు ప్రకటనలు చేస్తూ...మరోవైపు ఆసక్తి చూపుతున్న రైతులపట్ల నిర్లక్ష్యం చూపుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్కువ నీరు, తక్కువ స్థలంలో సాగయ్యే ఉద్యానపంటలైన పూలు, కూరగాయల పట్ల జిల్లా రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. 2000 సంవత్సరం క్రితం వరకూ మన రాష్ర్టంలో పాలీహౌస్‌ల ద్వారా పూలు సాగుచేసే రైతులు తక్కువ సంఖ్యలో ఉండేవారు.
మన వాతావరణానికి తట్టుకుంటాయో లేదోనన్న అభిప్రాయంతో వీటి జోలికి పోలేదు. దీంతో వివాహాది శుభకార్యాలకు అలంకరణ కోసం ఉపయోగించే పూలను అధిక విస్తీర్ణంలో పండించే మహారాష్ట్రలోని సాంగ్లీ, సతారా జిల్లాల నుంచి దిగుమతి చేసుకునేవారు. వర్షాభావ పరిస్థితులు తలెత్తడం, డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి అధికం కావడం, అలంకరణ పూలకు డిమాండ్ అధికంగా ఉండడంతో క్రమంగా రైతులు పాలీహౌస్‌ల వైపు మొగ్గుచూపడం ప్రారంభించారు.
2010లో కొంతమంది రైతులు మహారాష్ట్రకు వెళ్లి పాలీహౌస్‌ల ద్వారా పూల సాగు విధానాన్ని తెలుసుకున్నారు. నాలుగేళ్ల క్రితం కొంతమంది చేవెళ్ల ప్రాంతంలో ఈ సాగును ప్రారంభించారు. ప్రస్తుతం వందల సంఖ్యలో పాలీహౌస్‌లను ఏర్పాటు చేసుకొని పూలు, కూరగాయలను సాగుచేస్తున్నారు. ప్ర స్తుతం జిల్లాలో సుమారు 200కుపైగా పాలీ హౌస్‌లున్నాయంటే రైతులు వీటిపై ఎంతగా ఆసక్తి చూపుతున్నారో అర్థమవుతోంది.
సబ్సిడీ విధానం ఇదే...
పదేళ్ల క్రితం పాలీహౌస్‌ను ఏర్పాటుచేసుకోవడానికి ఒక రైతుకు 560 స్క్వేర్‌మీటర్ విస్తీర్ణంలో ఉద్యానశాఖ అనుమతిచ్చేది. ఇతర రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణానికి సబ్సిడీ ఇస్తున్నారన్న రైతుల డిమాండ్ మేరకు 2010లో వెయ్యి, ప్రస్తుతం నాలుగువేల స్క్వేర్‌మీటర్లకు అనుమతి స్తున్నారు. ఒక పాలీహౌస్ వేసుకోవాలంటే నెట్‌షెడ్‌కు రూ.6లక్షల నుంచి 8 లక్షలు, లోపల మట్టిబెడ్‌కు రూ. 2లక్షల నుంచి 3 లక్షలు, ప్లాంటేషన్‌కు రూ.2 లక్షల నుంచి 2.5 లక్షల వరకు ఖర్చవుతోంది. ఒక పాలీహౌస్‌కు మొత్తం కలిసి సుమారు రూ.15లక్షల వరకూ ఖర్చవుతోంది. ప్రభుత్వం ఒక స్క్వేర్‌మీటర్‌కు రూ.467 చొప్పున సబ్సిడీ ఇస్తోంది. అంటే వెయ్యి గజాల్లో వేసుకుంటే రూ.4 లక్షల 67 వేలు సబ్సిడీ ఇస్తోంది. ప్లాంటేషన్‌కు రూ.2లక్షల 50వేలు, మొత్తం రూ.7లక్షల 17 వేల సబ్సిడీ అందజేస్తోంది.
సాగుచేస్తున్న పంటలివే...
పాలీహౌస్‌లలో అలంకరణ పూలైన జర్భరా, కార్నేషన్, డచ్‌రోస్ తదితర రకాలను పండిస్తున్నారు. కూరగాయల్లో క్యాప్సికమ్, టమాట తదితరాలను సాగుచేస్తున్నారు. కొన్నిచోట్ల వాణిజ్య పంట అయిన అల్లం పండిస్తున్నారు.
సబ్సిడీ కోసం ఎదురుచూపులు..
పాలీహౌస్‌ల ద్వారా పూలు, కూరగాయలను పండించడం లాభసాటిగా మారడంతో ప్రస్తుతం 300 మంది రైతులు పాలీహౌస్‌ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. 2013లో ప్రభుత్వం ఆరు హెక్టార్ల వరకే సబ్సిడీ కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. కానీ సుమారు 50 హెక్టార్లలో వందలాదిమంది రైతులు పాలీహౌస్‌లను ఏర్పాటు చేసుకొని సబ్సిడీ కోసం నెలల తరబడి ఎదురుచూస్తున్నారు. సబ్సిడీ వస్తుందనే ఆశతో 35 మంది రైతులు లక్షల్లో అప్పు తెచ్చి పాలీహౌస్‌లు వేసుకొని, ప్లాంటేషన్ చేసుకొన్నారు. సబ్సిడీ కోసం నెలలతరబడి ఎదురుచూస్తున్నా బడ్జెట్‌లేని కారణంగా ఇవ్వడంలేదు.
సంఘం ఏర్పాటు...
2010లో తెలంగాణలోని పలు జిల్లాల రైతులు 15 మంది కలిసి ఓ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ సంఘంలో 150 మంది రైతులున్నారు. పాలీహౌస్‌ల రైతులకు ఏ సమాచారం కావాలన్నా, సమస్య ఉన్నా వెంటనే స్పందిస్తూ కార్యవర్గం చురుకైన పాత్రను పోషిస్తోంది. తమవంతు ప్రోత్సాహాన్ని, సహకారాన్ని అందిస్తోంది. పాలీహౌస్‌ల పట్ల అవగాహన కల్పిస్తోంది.
కేంద్రమంత్రిని కలిసినా...
రెండు నెలల క్రితం సంఘం కోశాధికారి గుండన్నగారి ప్రభాకర్‌రెడ్డి, డీసీసీబీ డెరైక్టర్ సోలిపురం బల్వంత్‌రెడ్డి, చేవెళ్ల మాజీ ఎంపీపీ మల్గారి విజయభాస్కర్‌రెడ్డి తదితరులు ఢిల్లీకి వెళ్లి కేంద్రమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డిని కలిశారు. పాలీహౌస్ రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహం కరువవడం, నిధుల కొరత, సబ్సిడీ విడుదలలో జాప్యం, పెండింగ్ దరఖాస్తులు తదితర విషయాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన కేంద్ర వ్యవసాయశాఖమంత్రి శరద్‌పవార్ ద్వారా ఉద్యాన శాఖ కార్యాలయంలోని ఉన్నతాధికారికి విషయాన్ని చేరవేశారు. దీంతో ఆయన రాష్ట్రంలోని ఉద్యానశాఖ కమిషనర్ నుంచి నిధులకోసం రిక్విజేషన్ లెటర్‌ను పంపాలని సూచించారు. ఆ పని పూర్తయినప్పటికీ ఇంతవరకూ ఒక్కపైసా కూడా విడుదల కాలేదని సంఘం సభ్యులు అంటున్నారు.
పాలీహౌస్ రైతులకు ప్రోత్సాహం ఏదీ?
Published Tue, Jan 14 2014 2:08 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement
Advertisement