Drip irrigation method
-
బంజరు భూమిని బంగరు భూమి చేసింది
‘కలిసి ఉంటేనే కాదు కష్టపడితే కూడా కలదు సుఖం’ అని అనుభవపూర్వకంగా తెలుసుకుంది సంతోష్ దేవి.తన రెక్కల కష్టంతో బంజరు భూమిని బంగరు భూమిగా మార్చింది. ఎంతోమంది రైతులను తన మార్గంలో నడిపిస్తోంది.రాజస్థాన్‌లోని సికార్ జిల్లా బేరి గ్రామంలో... 1.25 ఎకరాల బంజరు భూమితో సంతోష్ దేవి ఖేదార్ ప్రయాణం ప్రారంభమైంది. కుటుంబం వీడిపోవడంతో తన భర్త వాటాగా 1.25 ఎకరం భూమి వచ్చింది. భర్త రామ్ కరణ్ హోంగార్డ్. చాలీచాలని జీతం. దీంతో వ్యవసాయం వైపు మొగ్గు చూపింది సంతోష్‌దేవి.‘పది, ఇరవై ఎకరాలు ఉన్నవారికే దిక్కు లేదు. ఎకరంతో ఏం సాధిస్తావు? అప్పులు తప్ప ఏం మిగలవు!’ అన్నారు చాలామంది. ఈ నేపథ్యంలో ‘వ్యవసాయం లాభసాటి వ్యాపారం’ అని నిరూపించడానికి రంగంలో దిగింది సంతోష్ దేవి.‘నేను చదువుకోవాలని మా నాన్న కోరుకున్నారు. గ్రామీణ వాతావరణాన్ని ఇష్టపడే నాకు చదువుల కంటే వ్యవసాయం అంటేనే ఇష్టం’ అంటుంది సంతోష్‌దేవి. తాతగారి పొలంలో ఎప్పుడూ రసాయనిక ఎరువులు వాడకున్నా మంచి దిగుబడి వచ్చేది. ఇక్కడ మాత్రం భిన్నమైన పరిస్థితి. చాలా ఏళ్లుగా రసాయనాలు వాడడం వల్ల పొలం నిస్సారంగా మారింది. చుట్టు పక్కల నీటి వనరులు లేకపోవడంతో జొన్న, సజ్జలాంటి సంప్రదాయ పంటలే పండించేవారు.కలుపు మొక్కలతో గందరగోళంగా ఉన్న పొలాన్ని ఒక దారికి తేవడంతో మొదటి అడుగు వేసింది. రసాయనిక ఎరువుల స్థానంలో సేంద్రియ ఎరువులు వాడాలని నిర్ణయించుకుంది. దానిమ్మ పండించమని, తక్కువ భూమిలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని సికార్ వ్యవసాయ అధికారి సలహా ఇచ్చాడు. ఆ సలహా వారి జీవితాన్నే మార్చేసింది.220 దానిమ్మ మొక్కలను కొనడానికి గేదెను అమ్మేయాల్సి వచ్చింది. మొక్కలు కొనగా మిగిలిన డబ్బుతో పొలంలో గొట్టపు బావిని వేయించింది. నీటి ఎద్దడి ఉన్న ఆప్రాంతంలో బిందు సేద్య పద్ధతిని నమ్ముకుంది. చుక్క నీరు కూడా వృథా చేయవద్దని నిర్ణయించుకుంది. జనరేటర్‌ను అద్దెకు తీసుకుంది. గ్రామంలోని ఎంతోమంది రైతుల సలహాలు తీసుకొని సేంద్రియ ఎరువు తయారీ మొదలుపెట్టింది. లేయర్ కటింగ్, సేంద్రియ పురుగు మందులకు బెల్లం కలపడంలాంటి రకరకాల టెక్నిక్‌ల గురించి తెలుసుకుంది. మూడేళ్ల కఠోర శ్రమ ద్వారా దానిమ్మ పండ్ల తొలి దిగుబడితో మూడు లక్షల లాభం వచ్చింది. సేంద్రియ ఎరువును ఎక్కువగా వాడడం వల్ల నేల సారవంతంగా మారింది.భర్త పోలీస్‌స్టేషన్ నుంచి వచ్చిన తరువాత, పిల్లలు స్కూలు నుంచి వచ్చిన తరువాత నేరుగా పొలానికే వెళ్లేవాళ్లు. ‘ఫలితం ఎలా ఉండబోతుందో తెలియదు. కాని బాగా కష్టపడాలనుకున్నాం’ అని ఆ రోజులను గుర్తు చేసుకుంది సంతోష్‌దేవి. పండ్లతోటను నిర్వహించే అనుభవం రావడంతో యాపిల్‌లాంటి ఇతర పండ్లను పండించడంపై దృష్టి పెట్టింది.దానిమ్మ మొక్కల మధ్య నిర్దిష్టమైన దూరం ఉండాలి. ఆ ఖాళీ స్థలంలో కలుపు లేకుండా చూడాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ఖాళీల మధ్య మోసంబి మొక్కలు నాటింది. ఇది కూడా మంచి ఫలితాన్ని ఇచ్చింది. ఆ తరువాత నిమ్మ నుంచి బెల్‌లాంటి ఎన్నో మొక్కలను నాటింది. పొలంలో సోలార్ ΄్యానెళ్లను ఏర్పాటు చేసుకోవడంతో ఖర్చు తగ్గింది.‘మన దేశంలో రైతులు పడుతున్న కష్టాలకు కారణం వారు పండిస్తున్న దానికి సరైన ధర లభించకపోవడమే. దళారులు లాభాలన్నీ అనుభవిస్తున్నారు’ అంటున్న సంతోష్‌దేవి ఒక్క పండును కూడా దళారులకు అమ్మదు. అన్ని పండ్లూ నేరుగా పొలంలోనే అమ్ముతారు.సంతోష్ సాధించిన విజయాన్ని చూసి గ్రామంలోని ఇతర రైతులు కూడా దానిమ్మ మొక్కలను పెంచడంప్రారంభించారు. అయితే చాలామంది విఫలమయ్యారు. అలాంటి వారు సంతోష్‌దేవిని సలహా అడిగేవారు. నాణ్యమైన మొక్కల కొరత వల్లే వారు విఫలమవుతున్నారు అని గ్రహించిన సంతోష్ దేవి ఆ లోటును భర్తీ చేయడానికి కొత్త మొక్కల కోసం ‘షెకావది కృషి ఫామ్ అండ్ నర్సరీ’ప్రారంభించింది.కష్టఫలంనేను, నా భర్త, పిల్లలు మాత్రమే పొలంలో పనిచేసేవాళ్లం. కూలీలతో పనిచేయించే స్థోమత మాకు లేదు. అయితే ఎప్పుడూ కష్టం అనుకోలేదు. ఇంట్లో ఎలా సంతోషంగా ఉంటామో, పొలంలో అలాగే ఉండేవాళ్లం. కబుర్లు చెప్పుకుంటూనే కష్టపడేవాళ్లం. మా కష్టం ఫలించినందుకు సంతోషంగా ఉంది.– సంతోష్‌దేవి -
బిందు సేద్యంతో నీటి ఆదా..
వర్ధన్నపేట: రైతులు బిందుసేద్యంతో ఎంతో నీటిని ఆదా చేసుకోవడంతో తక్కువ నీటితో ఎక్కువ సాగు చేసుకుని అధిక దిగుబడులు పొందవచ్చని జిల్లా హార్టీకల్చర్ అధికారి శ్రీనివాసరావు అన్నారు. ప్రభుత్వ రాయితీ ద్వారా రైతులకు అందించిన బిందు సేద్యం పరికరాలను గురువారం వర్ధన్నపేట మండలంలోని ఇల్లంద, బండౌతాపురం, దమ్మన్నపేట తదితర గ్రామాల్లో తోటలకు హార్టీకల్చర్ అధికారి శ్రీనివాసరావు, వర్ధన్నపేట మండల హెచ్ఈఓ యమున, మైక్రో ఇరిగేషన్ కంపెనీ ప్రతినిధులు వెళ్లి రైతులు క్షేత్రస్థాయిలో అమర్చుకున్న పరికరాలను తనిఖీలు చేశారు. తనిఖీలతో పాటు ఇల్లందలోని చొల్లేటి యమునాదేవి మామిడి తోటలో అమర్చుకున్న బిందు సేద్య పరికరాలతో పాటు మామిడి తోటను పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ మామిడి తోటలో సూక్ష్మధాతు లోపాలు ఉన్నాయన్నారు. వీటి భర్తీకి జింక్ సల్ఫేట్ 100 గ్రాములు ప్రతి చెట్టుకు అందించాలని తెలిపారు. దీంతో పాటు బోరాన్ లోపం ఉన్న తోటల్లో సాలిబోర్ 3 గ్రాములు ఒక లీటరు నీటితో కలిపి పిచికారీ చేసుకోవాలన్నారు. ప్రస్తుతం మామిడి తోటలు పూత దశలో ఉన్నాయని తెలిపారు. ఇంకా పూత రాని తోటలో తేలికపాటి నీటి తడులతో పాటు మల్టీకే(13–0–45) 10 గ్రాములు ఒక లీటరు నీటితో కలిపి పిచికారీ చేసుకోవాలని సూచించారు. తెల్లపూత సమయంలో వచ్చే తేనె మంచు పురుగులు, తామర పురుగులు పూత చుట్టూ ఉండి నాశనం చేస్తాయని తెలిపారు.దీని నివారణకు ఇమిడాక్లోరిపైడ్ 0.3 మిలీ, ప్లానోఫిక్స్ 0.25 మిలీ ఒక లీటరు నీటితో కలిపి పిచికారి చేసుకుని నివారించుకోవాలని పేర్కొన్నారు. -
పాలీహౌస్ రైతులకు ప్రోత్సాహం ఏదీ?
చేవెళ్ల, న్యూస్‌లైన్: పాలీహౌస్‌ల (గ్రీన్హౌస్) ద్వారా ఉద్యాన పంటలను సాగుచేస్తున్న రైతులను ప్రోత్సహించడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. ఓ వైపు ఆధునిక వ్యవసాయంపై ఆర్భాటపు ప్రకటనలు చేస్తూ...మరోవైపు ఆసక్తి చూపుతున్న రైతులపట్ల నిర్లక్ష్యం చూపుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్కువ నీరు, తక్కువ స్థలంలో సాగయ్యే ఉద్యానపంటలైన పూలు, కూరగాయల పట్ల జిల్లా రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. 2000 సంవత్సరం క్రితం వరకూ మన రాష్ర్టంలో పాలీహౌస్‌ల ద్వారా పూలు సాగుచేసే రైతులు తక్కువ సంఖ్యలో ఉండేవారు. మన వాతావరణానికి తట్టుకుంటాయో లేదోనన్న అభిప్రాయంతో వీటి జోలికి పోలేదు. దీంతో వివాహాది శుభకార్యాలకు అలంకరణ కోసం ఉపయోగించే పూలను అధిక విస్తీర్ణంలో పండించే మహారాష్ట్రలోని సాంగ్లీ, సతారా జిల్లాల నుంచి దిగుమతి చేసుకునేవారు. వర్షాభావ పరిస్థితులు తలెత్తడం, డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి అధికం కావడం, అలంకరణ పూలకు డిమాండ్ అధికంగా ఉండడంతో క్రమంగా రైతులు పాలీహౌస్‌ల వైపు మొగ్గుచూపడం ప్రారంభించారు. 2010లో కొంతమంది రైతులు మహారాష్ట్రకు వెళ్లి పాలీహౌస్‌ల ద్వారా పూల సాగు విధానాన్ని తెలుసుకున్నారు. నాలుగేళ్ల క్రితం కొంతమంది చేవెళ్ల ప్రాంతంలో ఈ సాగును ప్రారంభించారు. ప్రస్తుతం వందల సంఖ్యలో పాలీహౌస్‌లను ఏర్పాటు చేసుకొని పూలు, కూరగాయలను సాగుచేస్తున్నారు. ప్ర స్తుతం జిల్లాలో సుమారు 200కుపైగా పాలీ హౌస్లున్నాయంటే రైతులు వీటిపై ఎంతగా ఆసక్తి చూపుతున్నారో అర్థమవుతోంది. సబ్సిడీ విధానం ఇదే... పదేళ్ల క్రితం పాలీహౌస్ను ఏర్పాటుచేసుకోవడానికి ఒక రైతుకు 560 స్క్వేర్మీటర్ విస్తీర్ణంలో ఉద్యానశాఖ అనుమతిచ్చేది. ఇతర రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణానికి సబ్సిడీ ఇస్తున్నారన్న రైతుల డిమాండ్ మేరకు 2010లో వెయ్యి, ప్రస్తుతం నాలుగువేల స్క్వేర్మీటర్లకు అనుమతి స్తున్నారు. ఒక పాలీహౌస్ వేసుకోవాలంటే నెట్షెడ్కు రూ.6లక్షల నుంచి 8 లక్షలు, లోపల మట్టిబెడ్కు రూ. 2లక్షల నుంచి 3 లక్షలు, ప్లాంటేషన్‌కు రూ.2 లక్షల నుంచి 2.5 లక్షల వరకు ఖర్చవుతోంది. ఒక పాలీహౌస్‌కు మొత్తం కలిసి సుమారు రూ.15లక్షల వరకూ ఖర్చవుతోంది. ప్రభుత్వం ఒక స్క్వేర్మీటర్కు రూ.467 చొప్పున సబ్సిడీ ఇస్తోంది. అంటే వెయ్యి గజాల్లో వేసుకుంటే రూ.4 లక్షల 67 వేలు సబ్సిడీ ఇస్తోంది. ప్లాంటేషన్‌కు రూ.2లక్షల 50వేలు, మొత్తం రూ.7లక్షల 17 వేల సబ్సిడీ అందజేస్తోంది. సాగుచేస్తున్న పంటలివే... పాలీహౌస్‌లలో అలంకరణ పూలైన జర్భరా, కార్నేషన్, డచ్రోస్ తదితర రకాలను పండిస్తున్నారు. కూరగాయల్లో క్యాప్సికమ్, టమాట తదితరాలను సాగుచేస్తున్నారు. కొన్నిచోట్ల వాణిజ్య పంట అయిన అల్లం పండిస్తున్నారు. సబ్సిడీ కోసం ఎదురుచూపులు.. పాలీహౌస్‌ల ద్వారా పూలు, కూరగాయలను పండించడం లాభసాటిగా మారడంతో ప్రస్తుతం 300 మంది రైతులు పాలీహౌస్‌ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. 2013లో ప్రభుత్వం ఆరు హెక్టార్ల వరకే సబ్సిడీ కోసం బడ్జెట్లో నిధులు కేటాయించారు. కానీ సుమారు 50 హెక్టార్లలో వందలాదిమంది రైతులు పాలీహౌస్‌లను ఏర్పాటు చేసుకొని సబ్సిడీ కోసం నెలల తరబడి ఎదురుచూస్తున్నారు. సబ్సిడీ వస్తుందనే ఆశతో 35 మంది రైతులు లక్షల్లో అప్పు తెచ్చి పాలీహౌస్‌లు వేసుకొని, ప్లాంటేషన్ చేసుకొన్నారు. సబ్సిడీ కోసం నెలలతరబడి ఎదురుచూస్తున్నా బడ్జెట్లేని కారణంగా ఇవ్వడంలేదు. సంఘం ఏర్పాటు... 2010లో తెలంగాణలోని పలు జిల్లాల రైతులు 15 మంది కలిసి ఓ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ సంఘంలో 150 మంది రైతులున్నారు. పాలీహౌస్‌ల రైతులకు ఏ సమాచారం కావాలన్నా, సమస్య ఉన్నా వెంటనే స్పందిస్తూ కార్యవర్గం చురుకైన పాత్రను పోషిస్తోంది. తమవంతు ప్రోత్సాహాన్ని, సహకారాన్ని అందిస్తోంది. పాలీహౌస్‌ల పట్ల అవగాహన కల్పిస్తోంది. కేంద్రమంత్రిని కలిసినా... రెండు నెలల క్రితం సంఘం కోశాధికారి గుండన్నగారి ప్రభాకర్‌రెడ్డి, డీసీసీబీ డెరైక్టర్ సోలిపురం బల్వంత్‌రెడ్డి, చేవెళ్ల మాజీ ఎంపీపీ మల్గారి విజయభాస్కర్‌రెడ్డి తదితరులు ఢిల్లీకి వెళ్లి కేంద్రమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డిని కలిశారు. పాలీహౌస్ రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహం కరువవడం, నిధుల కొరత, సబ్సిడీ విడుదలలో జాప్యం, పెండింగ్ దరఖాస్తులు తదితర విషయాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన కేంద్ర వ్యవసాయశాఖమంత్రి శరద్‌పవార్ ద్వారా ఉద్యాన శాఖ కార్యాలయంలోని ఉన్నతాధికారికి విషయాన్ని చేరవేశారు. దీంతో ఆయన రాష్ట్రంలోని ఉద్యానశాఖ కమిషనర్ నుంచి నిధులకోసం రిక్విజేషన్ లెటర్‌ను పంపాలని సూచించారు. ఆ పని పూర్తయినప్పటికీ ఇంతవరకూ ఒక్కపైసా కూడా విడుదల కాలేదని సంఘం సభ్యులు అంటున్నారు.