‘ఉద్యానం’ పంట పండాలి: సీఎం జగన్‌ | AP CM YS Jagan Review Meeting On Agriculture Development | Sakshi
Sakshi News home page

‘ఉద్యానం’ పంట పండాలి: సీఎం జగన్‌

Published Sat, Aug 14 2021 3:11 AM | Last Updated on Sat, Aug 14 2021 8:28 AM

AP CM YS Jagan Review Meeting On Agriculture Development - Sakshi

సాక్షి, అమరావతి: ఉద్యాన పంటల సాగు రైతుల ఆదాయాన్ని పెంచే వ్యూహాలను అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, విజ్ఞానాన్ని రైతులకు అందించేందుకు జాతీయ, అంతర్జాతీయ నైపుణ్య సంస్థలు, వర్సిటీల సహకారాన్ని తీసుకోవాలన్నారు. నిరంతర పరిశోధనలు, సమాచార మార్పిడి ద్వారా ప్రయోగాలు కొనసాగించాలని స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు వస్తున్న కొత్త వంగడాలు, సాగు సమస్యల పరిష్కారం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌లో కొత్త టెక్నాలజీ, ప్రాసెసింగ్‌కు అనుకూల రకాల సాగే లక్ష్యంగా ఈ పరిశోధనలుండాలని దిశా నిర్దేశం చేశారు. ఉద్యాన, సెరికల్చర్, వ్యవసాయ అనుబంధ రంగాలపై సీఎం జగన్‌ శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలివీ..

మంచి మార్కెటింగ్‌తో పరిష్కారాలు..
కర్నూలు జిల్లాలో మంచి మార్కెటింగ్‌ అవకాశాలున్న ఉల్లి సాగుపై దృష్టి పెట్టి నాణ్యమైన రకం పండించేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌కు అనుకూలమైన ఉల్లి రకాలు సాగు చేసేలా ప్రోత్సహించాలని సూచించారు. టమాటాలను రోడ్డుమీద పారవేయడం, ధరలేక పొలాల్లోనే రైతులు ఉల్లిపంటను వదిలేసే దుస్థితి తలెత్తకూడదన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఇలాంటి ఘటనలు జరిగాయన్నారు. ఇలాంటి పరిస్థితులు ఇక ఎక్కడా కనిపించకుండా మంచి మార్కెటింగ్‌తో సమస్యకు పరిష్కారాలను చూపాలని ఆదేశించారు.

25 చోట్ల వేగంగా ప్రాసెసింగ్‌ యూనిట్ల పనులు 
ఫుడ్‌ ప్రాసెసింగ్‌లో భాగంగా 25 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో వివిధ వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్‌ యూనిట్ల నిర్మాణ పనులను మొదలు పెట్టాలని సీఎం సూచించారు. అక్టోబర్‌ నుంచి గ్రౌండింగ్‌ చేపట్టడం ద్వారా నిర్మాణ పనులు దశల వారీగా ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. ఇవి ఆర్నెల్లలో పూర్తవుతాయని చెప్పారు. ఉద్యాన పంటలను గరిష్టంగా సాగు చేయడం ద్వారా ‘్రçఫూట్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియా’గా ఆంధ్రప్రదేశ్‌ ఖ్యాతి సాధించిందని అధికారులు చెప్పారు. కొబ్బరి, అరటి, బొప్పాయి, మిరప, టమాటా, ఉల్లి, బత్తాయి పంటల సాగు వివరాలను అధికారులు సీఎంకు అందచేశారు. వీటి సాగుపై ప్రత్యేక దృష్టి సారించాల్సిందిగా సీఎం ఆదేశించారు. కొబ్బరి, బొప్పాయి, టమాట సాగులోనూ, ఉత్పాదకతలోనూ దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో నిలిచిందని, టిష్యూ కల్చర్‌ విధానంలో అరటిసాగు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

మిరప సాగు విస్తీర్ణం పెరగాలి..
రాష్ట్రంలో మిరప సాగు విస్తీర్ణాన్ని పెంచడంతో పాటు ప్రాసెసింగ్‌పై మరింత శ్రద్ధ తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. దీనికోసం అంతర్జాతీయ సంస్థల సహకారం తీసుకోవాలన్నారు.

కొబ్బరికి మంచి ధర.. నిరంతర పరిశోధనలు
కొబ్బరి రైతులకు మంచి ధర లభించేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కొబ్బరిపై నిరంతరం పరిశోధనలు జరగాలని హార్టికల్చర్‌ విశ్వవిద్యాలయం వీసీకి ముఖ్యమంత్రి సూచించారు. కొబ్బరి సాగులో సమస్యలపై పరిశోధనలు కొనసాగిస్తూ అవసరమైతే అత్యుత్తమ సంస్థల సహకారం తీసుకోవాలన్నారు. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో కొబ్బరికి ‘వైట్‌ ఫ్లై’ లాంటి తెగుళ్లు సోకటాన్ని దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉంటూ విదేశాల్లో జరుగుతున్న అధ్యయనాలపై కన్నేసి ఉంచాలన్నారు. జాతీయ, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల సహకారం, పరస్పర సమాచార మార్పిడి వల్ల చక్కటి పరిశోధనలకు ఆస్కారం ఉంటుందన్నారు. పరిశోధన ఫలితాలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. దీనివల్ల మంచి వంగడాలతో పాటు సాగులో ఉత్పన్నమయ్యే సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయన్నారు. ప్రాసెసింగ్‌ రంగంలో వస్తున్న మార్పులు, సాంకేతిక పరిజ్ఞానానికి తగినట్లుగా చర్యలు చేపట్టాలన్నారు.

అధిక ఆదాయాన్నిచ్చే పంటల సాగు..
అధిక ఆదాయాన్నిచ్చే పంటల సాగువైపు రైతులను ప్రోత్సహించాలని అధికారులకు సీఎం సూచించారు. బోర్ల కింద వరి, సుబాబుల్, పొగాకు, చెరకు, మొక్కజొన్న లాంటి పంటల సాగుని క్రమంగా తగ్గించి ఉద్యాన పంటల సాగు వైపు మొగ్గుచూపేలా రైతులను ప్రోత్సహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 2020 – 21లో ఇలా1,42,565 ఎకరాల్లో అదనంగా ఉద్యాన పంటల సాగు చేపట్టినట్లు అధికారులు వివరాలను ముఖ్యమంత్రికి అందించారు. ఈ ఏడాది 1,51,742 ఎకరాల్లో ఉద్యాన పంటల సాగును లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు.

సలహాలు, పరిష్కారాలు డిజిటల్‌లో..
రైతుల సందేహాలపై ఇస్తున్న సలహాలు, పరిష్కారాలను వీడియో రికార్డ్‌ చేసి డిజిటల్‌ ప్లాట్‌ఫాం మీదకు తేవాలని సీఎం ఆదేశించారు. వీటిని అప్‌లోడ్‌ చేయడం ద్వారా మిగిలిన రైతులు సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుందని, దీనికోసం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను వినియోగించుకోవాలన్నారు.

మార్కెటింగ్‌ అవకాశాలున్న వంగడాలన్నీ..
మార్కెటింగ్‌ చేయగలిగే అవకాశం ఉన్న ప్రతి వంగడాన్ని రైతుల్లోకి విరివిగా తీసుకెళ్లాలని సీఎం జగన్‌ సూచించారు. రైతులు కష్టపడి సాగుచేసిన తర్వాత వాటిని మార్కెటింగ్‌ చేసేందుకు ఇక్కట్లు ఎదుర్కొనే దుస్థితి రాకూడదన్నారు. పువ్వుల సాగు (ఫ్లోరీ కల్చర్‌) రైతుల విషయంలో సరైన మార్కెటింగ్‌ అవకాశాలు, ప్రాసెసింగ్‌పై దృష్టి పెట్టాలన్నారు. 

ఆర్బీకేల ద్వారా తుంపర, బిందు సేద్యం లబ్ధిదారుల ఎంపిక
తుంపర సేద్యం, బిందుసేద్యం పరికరాల మంజూరులో పారదర్శకతకు పెద్దపీట వేయాలని, ఆర్బీకేల ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరగాలని సీఎం జగన్‌ ఆదేశించారు. రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లడం ద్వారా రేట్లు గణనీయంగా తగ్గి నాణ్యమైన పరికరాలు రైతులకు అందుబాటులోకి వస్తాయన్నారు. అవినీతికి తావులేని విధానంలో రైతులకు పరికరాలు అందుబాటులోకి తీసుకురావాలన్నారు.

సెరికల్చర్‌కు ప్రోత్సాహం
సెరికల్చర్‌ సాగు విధానం, ఉత్పాదకతపై సీఎంకు అధికారులు వివరాలు అందచేశారు. పట్టు గూళ్ల విక్రయాల్లో ఇ–ఆక్షన్‌ విధానం తేవడం ద్వారా దేశవ్యాప్తంగా వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారని, రైతులకు మంచి ధరలు వస్తున్నాయని తెలిపారు. 1,250కి పైగా ఆర్బీకేల పరిధిలో పట్టు పురుగులు పెంచుతున్న రైతులు ఉన్నట్లు చెప్పారు. వీటిపై ప్రత్యేక దృష్టి సారించి సెరి కల్చర్‌ను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. షెడ్ల నిర్మాణంపై దృష్టి పెట్టడం వల్ల చిన్న రైతులకు సెరికల్చర్‌ సాగుకు ప్రోత్సాహం లభిస్తుందని చెప్పారు. మంత్రి కన్నబాబు, వ్యవసాయ, సహకార, పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, హార్టి కల్చర్‌ కమిషనర్‌ ఎస్‌.ఎస్‌.శ్రీధర్, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ వీసీ అండ్‌ ఎండీ డాక్టర్‌ జి.శేఖర్‌బాబు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ సీఈవో ఎల్‌.శ్రీధర్‌రెడ్డి, మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్టు పీవో డాక్టర్‌ హరినాథ్‌రెడ్డి, వైఎస్సార్‌ హార్టికల్చర్‌ యూనివర్సిటీ వీసీ డాక్టర్‌ టి.జానకిరామ్‌ తదితరులు పాల్గొన్నారు.

అగ్రికల్చర్‌ విద్యార్థులకు ఆర్బీకేల్లో శిక్షణ..
రైతు భరోసా కేంద్రాలకు వచ్చినప్పుడు రైతులు వ్యక్తం చేసే సందేహాలను నివృత్తి చేసేలా తగిన వ్యవస్థ ఉండాలని సీఎం స్పష్టం చేశారు. ఆర్బీకేల్లో ఉండే అగ్రికల్చర్‌ అసిస్టెంట్లు ఆ సందేహాలను తీర్చేలా ఉండాలన్నారు. దీనివల్ల రైతులు, అగ్రికల్చర్‌ అసిస్టెంట్ల మధ్య అనుబంధం బలపడి మంచి వాతావరణం ఉంటుందని, తద్వారా అనుకున్న ఫలితాలను సాధించగలుగుతామన్నారు. రైతుల సందేహాలు, సమస్యలను పరిష్కరించేలా అగ్రికల్చర్‌ అసిస్టెంట్లు ప్రయత్నించాలన్నారు. రైతులు వెల్లడించిన సమస్యలు, సందేహాలు ఏమిటి? వాటికి ఎలాంటి పరిష్కారం చూపారన్న అంశాన్ని ఆర్బీకేల్లో తనిఖీల సందర్భంగా కచ్చితంగా పరిశీలించాలని సీఎం ఆదేశించారు. రైతుల సమస్యలకు వేగంగా పరిష్కారాలు చూపే విధంగా నిర్దిష్ట నిర్వహణ ప్రణాళిక (ఎస్‌వోపీ) ఉండాలని, ఈ విషయంలో జవాబుదారీతనం ఉండాలని స్పష్టం చేశారు. అగ్రికల్చర్‌ విద్యార్థులు ఆర్బీకేల్లో కనీసం నెలరోజులు తప్పనిసరిగా పనిచేసేలా ఇంటర్న్‌షిప్‌ నిబంధన విధించడం ద్వారా వాటి పనితీరు, కార్యక్రమాలపై వారికి అవగాహన, పరిజ్ఞానం పెరుగుతుందన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement