రుణమాఫీ పేరిట దగా
అర్హులకు చేకూరని లబ్ధి
ఉద్యానవన రైతులకు దక్కని ‘మాఫీ’
నూజివీడు రూరల్ :
ఉద్యానవన రైతులకు రుణామాఫీ వర్తించకుండా ప్రభుత్వం నిబంధనల పేరిట మోసం చేస్తోందని పలువురు ఉద్యానవన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మామిడి, జామ, అరటి, బొప్పాయి, సపోట, దానిమ్మ, కూరగాయలు సాగు చేసిన రైతులకు ఒకే దఫాలో రుణమాఫీ చేసినట్లు పాలకులు పదేపదే చెబుతున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో తమకు న్యాయం జరగలేదని రైతులు అంటున్నారు. జిల్లాలో 6,897 మంది రైతులకు 15.05 కోట్ల మేర రుణమాఫీ జరిగినట్లు ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల్లో చిత్తశుద్ధి లేకపోవడంతో ఉద్యాన రైతులకు ఆర్థిక ఇబ్బందులతో సావాసం తప్పడం లేదు.
కొందరికే లబ్ధి
2013 ఏడాది లోపు ఉద్యానవన పంటలకు పంటరుణాలు తీసుకున్న వారందరూ రుణమాఫీకి అర్హులేనని ప్రభుత్వం స్పష్టం చేసిన ప్పటికీ లబ్ధిదారులకు న్యాయం జరగలేదు. జిల్లాలో కేవలం 15 వేల ఎకరాలకు మాత్రమే రుణమాఫీ వర్తింపజేసింది. లక్ష ఎకరాల్లో ఉద్యానవన పంటలు సాగు చేస్తున్నారు.
స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌తో ఇబ్బందులు
వ్యవసాయశాఖ, ఉద్యానవన శాఖ రెండూ వేరు వేరు శాఖలు అయినప్పటికీ కుటుంబానికి లక్షన్నర లోపు రుణమాఫీ చేయడంతో చాలమంది రైతులు రుణమాఫీకి అనుర్హులయ్యారు. రుణమాఫీ లబ్ధిదారుల జాబితాను మాత్రమే ఉన్నతాధికారులు తమకు పంపారని, అర్హుల సమాచార సేకరణ పని తమకు అప్పగించలేదని ఉద్యానవన అధికారులు చెబుతున్నారు.