మాతృత్వంతోనే ఆడ జన్మ సార్థకం...
బెంగళూరు : మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో వివిధ సంస్థలు వినూత్న కార్యక్రమాలను నిర్వహించాయి. అందులో భాగంగా బన్నేరుఘట్ట రోడ్డులోని ఫోర్టిస్ ఆస్పత్రిలో గల ‘ది నెస్ట్’ ప్రసూతి కేంద్రంలో మాతృత్వ సంబరాలను జరిపారు. ‘బెస్ట్ ఆఫ్ ది నెస్ట్’ పేరిట భావి తల్లులకు పోటీలను నిర్వహించారు.
తమలోని ప్రత్యేక ప్రతిభను ప్రదర్శించడం, ర్యాంప్ వాక్, ప్రశ్నలకు సమాధానాలు చెప్పడంతో పాటు హాస్యభరిత కార్యక్రమాలను నిర్వహించారు. ‘గర్భధారణ సమయంలో మహిళలు అనేక మానసిక, శారీరక, హార్మోన్ల మార్పులకు గురవుతుంటారు. బిడ్డ ఉత్తమ భవిష్యత్తు కోసం భావి తల్లి ఆరోగ్య, మానసిక స్థితి ఉత్తమంగా ఉండాలని అనేక పరిశోధనలు తేల్చాయి. ఇలాంటి కార్యక్రమాల వల్ల వారిలోని మానసిక ఒత్తిడిని బాగా తగ్గించవచ్చు. వారు సంతోషంగా ఉండేలా కార్యక్రమాలను రూపొందించాం’ అని ఆస్పత్రి డెరైక్టర్ కార్తిక్ రాజగోపాల్ తెలిపారు. ఫ్యాషన్ షో, ప్రశ్నోత్తరాలతో పాటు ‘తమాషాగా ఉండే భావి తల్లి’, ‘తెలివైన భావి తల్లి’ లాంటి పోటీలను నిర్వహించారు.
రుచికరమైన ఆహార పదార్థాలను ఆరగించి అందులో ఉపయోగించిన పదార్థాల పేర్లు, వాటి స్పెల్లింగ్ పోటీలను సైతం నిర్వహించారు. మొత్తానికి మహిళా దినోత్సవ సాయంత్రాన్ని కాబోయే తల్లులు ఆహ్లాదంగా గడిపారు.