అవి ‘ఉత్త’రాలే!
అమలాపురం టౌన్ :అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని కుదిపేసిన అజ్ఞాత ఉత్తరాల కలకలం కొత్త మలుపు తిరిగింది. ఆస్పత్రికి వచ్చిన తన కుమార్తెపై అక్కడి సిబ్బందిలో ఒకరు లైంగిక దాడికి యత్నించారన్న సారాంశంతో ఓ అజ్ఞాత తండ్రి రాసినట్టుగా వచ్చిన ఉత్తరాల్లో నిజం లేదని పోలీసులు తేల్చారు.
లేఖల కలకలం
ఏరియా ఆస్పత్రి ఎక్స్‌రే ల్యాబ్‌లో పనిచేసే నారాయణమూర్తి ల్యాబ్‌కు వచ్చిన ఓ పేదింటి యువతిపై లైంగిక దాడి చేశాడని లేఖలు కలకలం సృష్టించడంతో జిల్లా అధికార యంత్రాంగం , ప్రజాప్రతినిధులూ హైరానా పడ్డారు. స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఈ సంఘటనపై తీవ్రంగా స్పందించి ఆర్డీఓను విచారణ చేయమని సూచించారు. వివిధ ప్రజా సంఘాలు లైంగిక దాడికి కారణమైన ఉద్యోగిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ నిరసనలు తెలిపాయి. దీంతో ఆరోపణలు ఎదుర్కొన్న నారాయణమూర్తిని విధుల నుంచి తొలగించారు. ఆస్పత్రి అభాసుపాలైందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో సంచలనమైనఈ ఉత్తరాలపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. పట్టణ సీఐ శ్రీనివాసబాబు లోతుగా దర్యాప్తు చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆస్పత్రి ల్యాబ్ ఉద్యోగి నారాయణమూర్తిని విచారించి, అతడికి శత్రువులు ఎవరున్నారనే దిశగా దృష్టిసారించారు.
పోలీసుల దర్యాప్తుతో...
ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి ఎక్స్‌రే ల్యాబ్ ఉద్యోగి నారాయణమూర్తి రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తాడనే ఆరోపణలు ఉన్నాయి. ఆస్పత్రిలో కొందరు సిబ్బంది ఈ విషయాన్ని బాహాటంగానే చెబుతున్నారు. అయితే ల్యాబ్‌లో యువతిపై లైంగిక దాడి చేసేంత పరిస్థితులు అక్కడ లేవని స్పష్టం చేస్తున్నారు. దీంతో పోలీసులు నారాయణమూర్తి విచారించగా అతడు వారికి ఓ క్లూ ఇచ్చాడు. తనకు తన సమీప బంధువు శ్రీనివాసరావుపై అనుమానం ఉన్నట్టు తెలిపాడు. దీంతో వారు రంగంలోకి దిగి తమదైన శైలిలో శ్రీనివాసరావును విచారించగా... అసలు విషయం బయటపడింది. ఉత్తరాలు రాసింది తానేనని, ఫలానా డీటీపీ సెంటర్లో ఆ ఉత్తరాలు అచ్చువేయించినట్టు ఒప్పుకోవడంతో కథ క్లైమాక్స్ వచ్చింది.
బంధువుల మధ్య గొడవలే...
బంధువులైన నారాయణమూర్తి, శ్రీనివాసరావు కుటుంబాల మధ్య గొడవలు కొనసాగుతున్నాయి. నారాయణమూర్తిని ఎలాగైనా ఆస్పత్రి నుంచి బయటకు పంపించాలన్న అక్కసుతో శ్రీనివాసరావు ఆస్పత్రిలో యువతిపై లైంగిక దాడి అంటూ ఓ అజ్ఞాత తండ్రి రాసినట్టు ఉత్తరాల డ్రామాకు తెరతీశాడని పోలీసులు దర్యాప్తులో తేల్చారు. యువతిపై లైంగిక దాడి జరిగిందన్న కోణంలో తమ దర్యాప్తులో ఎలాంటి ఆధారాలు దొరకలేదని, కేవలం వారి కుటుంబాల మధ్య ఉన్న గొడవల నేపథ్యంలో నారాయణమూర్తిపై కక్ష తీర్చుకునేందుకే శ్రీనివాసరావు ఉత్తరాలు కలకలం సృష్టించాడని సీఐ శ్రీనివాసబాబు తెలిపారు. శ్రీనివాసరావుపై కేసు నమోదు చేశామన్నారు. ఈ సంఘటనతో ఆస్పత్రి పరువుపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్న సిబ్బంది లైంగిక దాడి జరగలేదన్న సమాచారంతో ఊపిరి పీల్చుకున్నారు.