hostel meal
-
కొండంత అండ
ఎంపీ: తమ్ముడూ నీ పేరేంటి? హాస్టల్లో భోజనం ఎలా ఉంటుంది? విద్యార్థి: నాపేరు వెంకటేశ్ సార్. తొమ్మిదో తరగతి చదువుతున్నా. మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదు. ఈ హాస్టల్లో అన్నీ సమస్యలే సార్. ఎంపీ: బాబూ.. నువ్వేం చదువుతున్నావ్..? విద్యార్థి: నా పేరు సందీప్ సార్, 8వ తరగతి చదువున్నా. ఎంపీ: ఈ హాస్టల్లో బాత్రూంలు, మరుగుదొడ్లు ఉన్నాయా? సందీప్ : పేరుకు చాలానే ఉన్నాయ్ సార్.. కానీ ఏ ఒక్కటీ పనిచేయడం లేదు. ఎంపీ: అందేంటీ? ఉన్నాయంటున్నావ్.. ఎందుకు పనిచేయడం లేదు? సందీప్ : అప్పుడెప్పుడో నిర్మించిన ఈ మరుగుదొడ్లకు నీటి సౌకర్యం లేదు సార్.. ఉపయోగించక పూర్తిగా పాడైనయ్. చెత్తా చెదారంతో నిండిపోయినయ్. ఎంపీ: మీరంతా ఎక్కడ స్నానాలు చేస్తున్నారు? కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఎక్కడికి వెళ్తున్నారు? సందీప్: స్నానాలు ఆరుబయట ఉన్న నల్లా కింద చేస్తున్నం. మరుగుదొడ్లు లేకపోవడంతో బయటకి వెళ్తున్నాం. రాత్రివేళలో చాలా ఇబ్బందిగా ఉంది సార్.. ఎంపీ: మీరంతా ఆటలు ఆడుకునేందుకు స్థలం ఉందా? మహిపాల్: వసతి గృహంలో ఎలాంటి ఆటవస్తువులు లేవండి. ఆడుకోవడానికి గ్రౌండ్ కూడా లేదు. ఎంపీ: మరి మీరంతా ఖాళీ సమయంలో ఏం చేస్తున్నారు? మహిపాల్: స్కూల్ నుంచి వచ్చినంక చదువుకునేటోళ్లు చదువుకుం టరు. మిగతా వాళ్లు ఖాళీగానే ఉంటరు. ఎంపీ: వసతి గృహానికి ట్యూటర్ (టీచర్) వస్తున్నాడా? అన్ని సబ్జెక్టులకు ఉన్నారా? బాలునాయక్: ప్రస్తుతం ట్యూటర్ రావడంలేదు సార్.. మొదట్లో కొన్ని రోజులు వచ్చారు.. మళ్లీ రావడంలేదు. ఎంపీ: హాస్టల్లో రాత్రి వేళ కరెంట్ ఉంటుందా? ఏమైనా ఇబ్బందులున్నాయి? శ్రీకాంత్ : రాత్రివేళలో కరెంట్ ఉంటుంది. కానీ హాస్టల్లో వైరింగ్, లైట్లు, ప్యాన్లు సరిపడా లేవు. రాత్రిపూట కరెంట్ పోతే మాకు భయం వేస్తోంది. ఎంపీ : ఎందుకు భయం వేస్తుంది. అందరూ కలిసే ఉంటారు కదా? శ్రీకాంత్: మా హాస్టల్ గ్రామానికి దూరంగా గట్టుపై ఉండడంతో చుట్టూ ఎవరూ ఉండరు. దీనికి తోడు రాత్రి వేళ బాత్రూంకు పోవాలంటే బయటకు వెళ్లాలి.. అందుకే భయం. ఎంపీ: ఇంకా ఏమైనా సమస్యలున్నాయా? విష్ణు: హాస్టల్‌కు ప్రహరీ లేకపోవడంతో పాములు వస్తున్నాయ్ సార్.. ఎంపీ : పాములు వస్తున్నాయా..? ఎప్పుడైనా లోపలికొచ్చాయా? విష్ణు: ఓ సారి గదిలోకి వచ్చింది. అందరం బయపడిపోయి బయటకు పరుగు తీశాం. వాచ్‌మన్ వచ్చి చూసి పాము పోయిందని చెప్పిన తర్వాత లోపలికొచ్చాం. ఎంపీ: హాస్టల్ గదులను శుభ్రం చేసేవాళ్లు వస్తున్నారా? రోజూ శుభ్రం చేస్తారా? మహేందర్: మా గదులను మేమే శుభ్రం చేసుకుంటాం సార్.. ఎవరూ రారు. ఎంపీ: హాస్టల్లో ఏమైనా సమస్యలుంటే ఎవరికి చెబుతారు? శ్రీనివాస్: వార్డెన్‌కు చెబుతాం. ఎంపీ: వర్షం వస్తే గదులు కురుస్తాయా? గోవింద్: అవును సార్.. గదుల పరిస్థితి బాగాలేదు. వర్షం వస్తే కురుస్తాయి. డోర్స్ కూడా బాగాలేవు. చలి కాలం.. ఇబ్బంది పడుతున్నాం. ఎంపీ: నీటి సమస్య ఉందా? నీళ్లు ఎక్కడి నుంచి సరఫరా అవుతున్నాయి? రజినీకాంత్: హాస్టల్‌కు ప్రత్యేకంగా బోరు లేదు సార్.. గ్రామ పంచాయతీకి సరఫరాచేసే పైపు నుంచే నీళ్లు వస్తాయి. ఎంపీ: నీటి నిల్వకు ట్యాంకులున్నాయా? రజనీకాంత్: లోపల ట్యాంకులు ఉన్నా.. అవి నిరుపయోగంగా ఉన్నాయి. ఆరు బయట వస్తున్న నల్లా నీటితోనే స్నానం చేస్తాం. ఎంపీ: ఇంకా ఇతర సమస్యలు చెప్పండి? సునీల్ : హాస్టల్ లోపల ఫ్లోరింగ్ లేదు సార్.. దుమ్ములోనే కూర్చుని భోజనం చేస్తున్నాం.. వెంకటేశ్: మా హాస్టల్లో అనేక సమస్యలున్నాయ్ సార్.. మీరే వాటిని పరిష్కరించాలి. ఎంపీ: తప్పకుండా పరిష్కరిస్తా.. మీరంతా ఒకే పాఠశాలలో చదువుకుంటున్నారా? వినయ్‌చారి: కొందరం ప్రభుత్వ పాఠశాలలో, మరి కొందరు మోడల్ స్కూల్లో చదువుకుంటున్నం. ఎంపీ: హాస్టల్ వార్డెన్ అందుబాటులో ఉంటున్నారా? లేరా? కార్తిక్:మా వార్డెన్ మ్యాట్రిన్ లావణ్యగారు.. రోజూ వస్తారు. ఎంపీ : బాగా చదువుతున్నారా? గత ఏడాది మార్కులెలా వచ్చాయ్? సరేందర్: అందరికీ గత ఏడాది మంచి మార్కులే వచ్చాయ్సార్.. ఎంపీ: ఈ ఏడాది టెన్త్‌లో అందరూ పాసవుతారా? అర్జున్: అందరం తప్పకుండా పాసవుతాం సార్. ఎంపీ: వెరీ గుడ్. బాగా చదువుకొని హాస్టల్లో ఉన్న వారంతా ఫస్టు గ్రేడ్‌లో పాసవ్వాలి. -
నోటికందని మెనూ
సాక్షి, కరీంనగర్ : వసతిగృహాల్లో విద్యార్థులకు పౌష్టికాహారం కలగా మారింది. జిల్లాలో ఎక్కడా మెనూ అమలు కావడంలేదు. హాస్టళ్ల నిర్వహణపై ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా సంక్షేమాధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు వారానికి ఒకసారి రాత్రిపూట హాస్టల్లో బస చేయాలన్న నిబంధన అమలయినంత కాలం పరిస్థితి కొంత మెరుగుపడింది. ప్రస్తుతం ఉన్నతాధికారులెవరూ పట్టించుకోకపోవడంతో చాలాచోట్ల హాస్టల్ భోజనం అధ్వానంగా మారింది. ప్రస్తుతం అమలులో ఉన్న మెనూ ప్రకారం మంగళవారం ఉదయం పాలు, రాగిజావ, పులిహోర, సాయంత్రం 5గంటలకు స్నాక్స్‌గా శనెగలు, అరటిపండు, రాత్రి భోజనంలో రెండు కూరలు, సాంబారు, కోడిగుడ్డు, పెరుగు లేదా మజ్జిగ ఇవ్వాల్సి ఉంది. మంగళవారం ‘సాక్షి’ కొన్ని హాస్టళ్లలో మెనూ అమలు తీరును పరిశీలించింది. రెండు మూడు హాస్టళ్లలో భోజనం కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ మెనూ మాత్రం ఎక్కడా అమలు కాలేదు. చాలా చోట్ల రుచీపచీ లేని భోజనంతో విద్యార్థులు ఇబ్బందిపడ్డారు. సాయంత్రం ఒక్క హాస్టళ్లో కూడా శనెగలుగానీ, ఇతర స్నాక్స్ గానీ ఇవ్వలేదు. మంథని ఎస్సీ బాలుర హాస్టల్లో పొద్దున పాలు ఇవ్వలేదు. రాత్రి ఒక కూర, పప్పుతోపాటు గుడ్డు ఇచ్చారు. వేములవాడలో 32 మంది విద్యార్థులకు కేవలం లీటరున్నర పాలు మాత్రమే ఇచ్చారు. దీంతో నీళ్లు కలిపి పలచని పాలు పోశారు. గోదావరిఖని బాలుర హాస్టల్లో మిగిలిన అన్నాన్ని తాలింపుపెట్టి టిఫిన్‌గా ఇస్తున్నారు. ప్రతిరోజు రాత్రి పప్పు భోజనం మాత్రమే పెడ్తున్నారు. కొన్ని హాస్టళ్లో రోజూ ఉదయం ఉప్మా మాత్రమే పెడుతున్నారు. పౌష్టికాహారం అందక తరచూ ఇక్కడ విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. తిమ్మాపూర్‌లో అరటిపండుకు బదులు సంత్రాలు ఇస్తున్నారు. వారానికి రెండుసార్లు గుడ్డు ఇవ్వాల్సిఉండగా ఒకసారి మాత్రమే ఇస్తున్నారు. కొందరు సిబ్బంది సరిపడా భోజనం పెట్టకపోవడం వల్ల విద్యార్థులు అర్ధాకలితో గడపాల్సి వస్తోంది. హాస్టళ్లకు సరఫరా చేస్తున్న బియ్యం నాసిరకంగా ఉండడం వల్ల భోజనం బాగుండడం లేదని పలుచోట్ల విద్యార్థులు వాపోతున్నారు. వసతిగృహాల విద్యార్థులకు మంచి భోజనం ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇస్తున్న సరుకులను పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. సౌకర్యాలు కరువు గ్రామసందర్శనలో భాగంగా ప్రతివారం అధికారులు వసతిగృహాలను సందర్శించి ఎప్పటికప్పుడు మౌలిక వసతులు కల్పిస్తున్నారని ఉన్నతాధికారులు చెప్తున్నా.. వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రతి చోట విద్యార్థులు సమస్యలతో సహవాసం చేస్తున్నారు. మంథని హాస్టల్లో పందులు తిరుగుతున్నా నిరోధించేవారే కరువయ్యారు. మెట్పల్లి ఎస్సీ బాలుర హాస్టల్లో తీవ్ర నీటి కొరత నెలకొంది. రెండు చేతి బోర్లు పనిచేయడం లేదు. ఒక కరెంట్ మోటర్బోర్ ఉన్నా నీరు సరిపోవడం లేదు. ఆవరణ అంతా పిచ్చిమొక్కలతో నిండిపోయింది. బాత్రూంల నిర్వహణ అధ్వాన్నంగా ఉంది. బాత్రూంలకు మురికినీటి పైప్‌లైన్ కోసం, మంచినీటిని స్టోరేజ్ చేసేందుకు నిర్మిస్తున్న సంపు పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. సిరిసిల్ల సుందరయ్యనగర్ వసతిగృహంలో విద్యార్థులు తినడానికి ప్టేట్లు లేవు. కప్పుకోవడానికి బెడ్ షీట్లు లేవు. పరుచుకునేందుకు కార్పెట్లు మత్రమే ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఇళ్ల వద్ద నుంచి తెచ్చుకున్న దుప్పట్లే కప్పుకుంటున్నారు. తిమ్మాపూర్ హాస్టల్లో కిటికీల అద్దాలు పగిలిపోవడంతో గన్నీ సంచులు, కాటన్ అట్టలు అడ్డం పెడ్తున్నారు. కమాలాపూర్ మండలంలోని ఉప్పల్ బాలికల వసతిగృహం చుట్టూ ప్రహరీ లేక విద్యార్థినులు భయపడిపోతున్నారు. హాస్టల్ చుట్టూ ముళ్లచెట్ల పొదలు పెరిగిపోయి పాములు, తేళ్లు సంచరిస్తున్నాయి. ఇటీవలే వసతిగృహ మరమ్మతులు, ప్రహరీగోడ నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. చుట్టపు చూపుగా వస్తున్న అధికారులు వసతిగృహాల సంక్షేమాధికారులు విధులకు సరిగా హాజరుకావడంలేదు. ఉదయం 6గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అధికారులు హాస్టల్లోనే ఉండాలి. ఒక్కరు కూడా ఇది పాటించడంలేదు. నిర్వహణ అంతా సిబ్బందికి వదిలేసి అడపాదడపా మాత్రమే వస్తున్నారు. ఉన్నతాధికారులకు ఈ వ్యవహారం తెలిసినా పట్టించుకోవడంలేదు. హాస్టళ్ల నిర్వహణ, సమస్యలపై విద్యార్థులు ఫిర్యాదులు చేయకుండా కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నారు. దీంతో సమస్యలపై నోరు విప్పేందుకే విద్యార్థులు జంకుతున్నారు.