నోటికందని మెనూ | Nutrition hostels for students to become job | Sakshi
Sakshi News home page

నోటికందని మెనూ

Published Thu, Dec 19 2013 3:30 AM | Last Updated on Sat, Sep 2 2017 1:45 AM

Nutrition hostels for students to become job

సాక్షి, కరీంనగర్ : వసతిగృహాల్లో విద్యార్థులకు పౌష్టికాహారం కలగా మారింది. జిల్లాలో ఎక్కడా మెనూ అమలు కావడంలేదు. హాస్టళ్ల నిర్వహణపై ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా సంక్షేమాధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు వారానికి ఒకసారి రాత్రిపూట హాస్టల్లో బస చేయాలన్న నిబంధన అమలయినంత కాలం పరిస్థితి కొంత మెరుగుపడింది. ప్రస్తుతం ఉన్నతాధికారులెవరూ పట్టించుకోకపోవడంతో చాలాచోట్ల హాస్టల్ భోజనం అధ్వానంగా మారింది. ప్రస్తుతం అమలులో ఉన్న మెనూ ప్రకారం మంగళవారం ఉదయం పాలు, రాగిజావ, పులిహోర, సాయంత్రం 5గంటలకు స్నాక్స్‌గా శనెగలు, అరటిపండు, రాత్రి భోజనంలో రెండు కూరలు, సాంబారు, కోడిగుడ్డు, పెరుగు లేదా మజ్జిగ ఇవ్వాల్సి ఉంది. మంగళవారం ‘సాక్షి’ కొన్ని హాస్టళ్లలో మెనూ అమలు తీరును పరిశీలించింది.
 
 రెండు మూడు హాస్టళ్లలో భోజనం కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ మెనూ మాత్రం ఎక్కడా అమలు కాలేదు. చాలా చోట్ల రుచీపచీ లేని భోజనంతో విద్యార్థులు ఇబ్బందిపడ్డారు. సాయంత్రం ఒక్క హాస్టళ్లో కూడా శనెగలుగానీ, ఇతర స్నాక్స్ గానీ ఇవ్వలేదు. మంథని ఎస్సీ బాలుర హాస్టల్‌లో పొద్దున పాలు ఇవ్వలేదు. రాత్రి ఒక కూర, పప్పుతోపాటు గుడ్డు ఇచ్చారు. వేములవాడలో 32 మంది విద్యార్థులకు కేవలం లీటరున్నర పాలు మాత్రమే  ఇచ్చారు. దీంతో నీళ్లు కలిపి పలచని పాలు పోశారు. గోదావరిఖని బాలుర హాస్టల్‌లో మిగిలిన అన్నాన్ని తాలింపుపెట్టి టిఫిన్‌గా ఇస్తున్నారు. ప్రతిరోజు రాత్రి పప్పు భోజనం మాత్రమే పెడ్తున్నారు. కొన్ని హాస్టళ్లో రోజూ ఉదయం ఉప్మా మాత్రమే పెడుతున్నారు. పౌష్టికాహారం అందక తరచూ ఇక్కడ విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. తిమ్మాపూర్‌లో అరటిపండుకు బదులు సంత్రాలు ఇస్తున్నారు. వారానికి రెండుసార్లు గుడ్డు ఇవ్వాల్సిఉండగా ఒకసారి మాత్రమే ఇస్తున్నారు. కొందరు సిబ్బంది సరిపడా భోజనం పెట్టకపోవడం వల్ల విద్యార్థులు అర్ధాకలితో గడపాల్సి వస్తోంది. హాస్టళ్లకు సరఫరా చేస్తున్న బియ్యం నాసిరకంగా ఉండడం వల్ల భోజనం బాగుండడం లేదని పలుచోట్ల విద్యార్థులు వాపోతున్నారు. వసతిగృహాల విద్యార్థులకు మంచి భోజనం ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇస్తున్న సరుకులను పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
 
 సౌకర్యాలు కరువు
 గ్రామసందర్శనలో భాగంగా ప్రతివారం అధికారులు వసతిగృహాలను సందర్శించి ఎప్పటికప్పుడు మౌలిక వసతులు కల్పిస్తున్నారని ఉన్నతాధికారులు చెప్తున్నా.. వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రతి చోట విద్యార్థులు సమస్యలతో సహవాసం చేస్తున్నారు. మంథని హాస్టల్‌లో పందులు తిరుగుతున్నా నిరోధించేవారే కరువయ్యారు. మెట్‌పల్లి  ఎస్సీ బాలుర హాస్టల్‌లో తీవ్ర నీటి కొరత నెలకొంది. రెండు చేతి బోర్లు పనిచేయడం లేదు. ఒక కరెంట్ మోటర్‌బోర్ ఉన్నా నీరు సరిపోవడం లేదు. ఆవరణ అంతా పిచ్చిమొక్కలతో నిండిపోయింది. బాత్‌రూంల నిర్వహణ అధ్వాన్నంగా ఉంది. బాత్‌రూంలకు మురికినీటి పైప్‌లైన్ కోసం, మంచినీటిని స్టోరేజ్ చేసేందుకు నిర్మిస్తున్న సంపు పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి.
 
 సిరిసిల్ల సుందరయ్యనగర్ వసతిగృహంలో విద్యార్థులు తినడానికి ప్టేట్లు లేవు. కప్పుకోవడానికి బెడ్ షీట్లు లేవు. పరుచుకునేందుకు కార్పెట్లు మత్రమే ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఇళ్ల వద్ద నుంచి తెచ్చుకున్న దుప్పట్లే కప్పుకుంటున్నారు. తిమ్మాపూర్ హాస్టల్‌లో కిటికీల అద్దాలు పగిలిపోవడంతో గన్నీ సంచులు, కాటన్ అట్టలు అడ్డం పెడ్తున్నారు. కమాలాపూర్ మండలంలోని ఉప్పల్ బాలికల వసతిగృహం చుట్టూ ప్రహరీ లేక విద్యార్థినులు భయపడిపోతున్నారు. హాస్టల్ చుట్టూ ముళ్లచెట్ల పొదలు పెరిగిపోయి పాములు, తేళ్లు సంచరిస్తున్నాయి. ఇటీవలే వసతిగృహ మరమ్మతులు, ప్రహరీగోడ నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి.  
 
 చుట్టపు చూపుగా వస్తున్న అధికారులు
 వసతిగృహాల సంక్షేమాధికారులు విధులకు సరిగా హాజరుకావడంలేదు. ఉదయం 6గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అధికారులు హాస్టల్‌లోనే ఉండాలి. ఒక్కరు కూడా ఇది పాటించడంలేదు. నిర్వహణ అంతా సిబ్బందికి వదిలేసి అడపాదడపా మాత్రమే వస్తున్నారు. ఉన్నతాధికారులకు ఈ వ్యవహారం తెలిసినా పట్టించుకోవడంలేదు. హాస్టళ్ల నిర్వహణ, సమస్యలపై విద్యార్థులు ఫిర్యాదులు చేయకుండా కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నారు. దీంతో సమస్యలపై నోరు విప్పేందుకే విద్యార్థులు జంకుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement