HOSTELS CLOSED
-
కేటీఆర్‌కు ఏపీ మంత్రి బొత్స ఫోన్
సాక్షి, అమరావతి: హైదరాబాద్‌లో హాస్టళ్లు, మెస్‌ల మూసివేత, ఏపీ విద్యార్థుల అగచాట్ల అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం దృష్టికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకెళ్లింది. ఈ సందర్భంగా తెలంగాణ ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌తో ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫోన్లో మాట్లాడారు. హాస్టళ్ల నుంచి ఖాళీ చేయించడంతో వారికి రవాణా పరమైన ఇబ్బందులు వస్తాయని, అంతేకాకుండా కరోనా విజృంభిస్తున్న వేళ ఒక చోట నుంచి ఇంకో చోటకు కదలడం శ్రేయస్కరం కాదని కేటీఆర్ దృష్టికి మంత్రి బొత్స తీసుకెళ్లారు. ఇక ఇదే విషయంపై తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్‌తో ఏపీ సీఎస్ నీలం సాహ్ని మాట్లాడారు. ప్రత్యేకంగా పోలీసులు పాసులు ఇస్తున్న ఘటనలను కూడా తమ దృష్టికి వచ్చిందని సోమేష్ కుమార్ వద్ద నీలం సాహ్ని ప్రస్తావించారు. సమస్యలు ఉంటే 1902కు కాల్ చేయ్యండి హైదరాబాద్‌లో ఉంటున్న ఏపీ విద్యార్థులు, ప్రయివేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారు ఎక్కడి వారు అక్కడే ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న సమయంలో బయటకు రావొద్దని హాస్టలర్స్‌ను కోరింది. ఏపీలోని తమ కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎక్కడి వారు ఆక్కడే ఉండాలని పేర్కొంది. అదేవిధంగా హైదరాబాద్‌లో ఏమైనా సమస్యలు ఉంటే 1902కు కాల్ చేయమని ప్రభుత్వం తెలిపింది. కాగా, లాక్డౌన్ సందర్భంగా హైదరాబాద్‌లోని హాస్టళ్లు మూసివేస్తున్నారని ఉదయం నుంచి ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో అయోమయానికి గురైన హాస్టలర్స్ తమను సొంత ఊళ్లకు పంపించాలని పోలీస్ స్టేషన్స్‌కు క్యూ కట్టారు. అయితే హాస్టళ్ల మూసివేత అసత్య ప్రచారమని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేయడంతో విద్యార్థులకు ఊరట లభించింది. చదవండి: చైనీస్ ఫుడ్ కావాలంటూ ఒక్కటే ఏడుపు! ప్రిన్స్ చార్లెస్‌కు కరోనా పాజిటివ్ -
మూతపడుతున్న ప్రీమెట్రిక్ హాస్టళ్లు
నల్లగొండ : జిల్లాలో బీసీ ప్రీమెట్రిక్ హాస్టళ్లు మూతపడుతున్నాయి. విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడంతో 5 హాస్టళ్లను మూసి వేస్తూ గత ఏప్రిల్‌లోనే బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థుల సంఖ్య ఒక్కో హాస్టల్లో 100 ఉండగా గత సంవత్సరం కేవలం 60నుంచి 70మంది చేరారు. దాంతో ఐదు హాస్టళ్లను మూసివేసి అక్కడ ఉన్న విద్యార్థులను పక్క హాస్టళ్లకు మార్చాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దాంతో జిల్లాలో 5 ప్రీమెట్రిక్ హాస్టళ్లను మూసివేస్తూనే జిల్లా అధికారులు కాలేజీ హాస్టళ్లకు డిమాండ్ ఉండడంతో వాటినే కాలేజీ హాస్టళ్లుగా మార్చి షిఫ్ట్ చేయాలని కమిషనర్‌ను కోరారు. ఇందుకు కమిషనర్ అంగీకరించారు. జిల్లాలో ఇలా.. జిల్లాలో మొత్తం 14 కళాశాల హాస్టళ్లు, 32 ప్రీమెట్రిక్ హాస్టళ్లు ఉన్నాయి. ఒక్కో కాలేజీ హాస్టల్లో గత సంవత్సరం 210 మంది విద్యార్థుల వరకు ఉన్నారు. మొత్తం 3,090 మంది ఉండగా, 32 ప్రీమెట్రిక్ హాస్టళ్లలో ఒక్కో హాస్టల్లో వంద మంది విద్యార్థులకు తగ్గకుండా ఉండాలి. కానీ, కొన్ని హాస్టళ్లలో 50నుంచి 60 మాత్రమే విద్యార్థులు ఉండడంతో ఆ హాస్టళ్లను మూసివేయాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. మూసివేసిన హాస్టళ్లు ఇవే.. జిల్లాలోని శాలిగౌరారం మండలంలో ఉన్న బీసీ హాస్టల్, కట్టంగూర్ మండలం ఈదులూరు హాస్టల్, నాంపల్లి మండలంలోని బాలుర, మునుగోడులోని బాలుర, చండూరులోని బాలికల హాస్టల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడంతో ఆ హాస్టళ్లను మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గురుకుల పాఠశాలల ఏర్పాటుతో తగ్గిన విద్యార్థులు జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బీసీ గురుకులాల్లో బీసీ విద్యార్థినీ విద్యార్థులు చేరారు. మిగిలిన హాస్టళ్లలో కూడా కొంత భాగాన్ని బీసీలకు కేటాయించారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని వారంతా తమ పిల్లలను గురుకుల పాఠశాలల్లోనే చేర్చించారు. దీంతో మండల స్థాయిలో ఉన్నటువంటి ప్రీ మెట్రిక్ పాఠశాలలతో పాటు హాస్టళ్లలో కూ డా విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. దీంతో హాస్టళ్లు మూతపడే స్థాయికి చేరుకున్నాయి. మరికొన్ని కళాశాల హాస్టళ్లు అవసరం నల్లగొండ జిల్లా కేంద్రంలో అన్ని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, బీఈడీ, డైట్, పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలలు ఉండడంతో కళాశాల హాస్టళ్లకు డిమాండ్ పెరుగుతుంది. ప్రస్తుతం ఉన్న హాస్టళ్లలోనే సామర్థ్యాన్ని మించి విద్యార్థినీ విద్యార్థులు ఉంటున్నారు. గత సంవత్సరం ఒక్కో కళాశాల హాస్టళ్లలో 210 మంది విద్యార్థులు ఉండగా ఈ సంవత్సరం వాటిని 180కి కుదించారు. అయినా కూడా బీసీ బాలుర, బాలికల కళాశాల హాస్టళ్లకు డిమాండ్ ఉంది. డిమాండ్‌కు అనుగుణంగా కళాశాలల హాస్టళ్లు పెంచాలని అధికారులు కోరుతున్నారు. కళాశాల హాస్టళ్లుగా మార్పు.. విద్యార్థులు తక్కువగా ఉన్నటువంటి జిల్లాలోని 5 హాస్టళ్లను మూసివేస్తూ ఉత్తర్వులు చేసిన బీసీ సంక్షేమ శాఖ అధికారులు.. వాటిని కళాశాల హాస్టళ్లుగా మార్చుతూ అక్కడి నుండి షిఫ్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లా అధికారులు వాటిని షిఫ్ట్ చేసి కళాశాల హాస్టళ్లుగా మార్చి ప్రారంభించారు. ఇప్పటికే కళాశాల హాస్టళ్లలో విద్యార్థులను కూడా తీసుకుంటున్నారు. అయినప్పటికీ డిమాండ్ బాగా ఉంది. అయితే శాలిగౌరారం మండలంలోని బాలుర బీసీ హాస్టల్‌ను కళాశాల హాస్టల్‌గా మార్చి మిర్యాలగూడకు షిఫ్ట్ చేయగా, కట్టంగూర్ మండలం ఈదులూరులో బీసీ బాలుర హాస్టల్‌ను కళాశాల హాస్టల్‌గా మార్చి నకిరేకల్‌కు మార్చాలని కమిషనర్‌కు జిల్లా అధికారులు ప్రతిపాదనలు పంపారు. కాగా నాంపల్లి బీసీ బాలుర హాస్టల్‌ను, చండూరులోని బీసీ బాలికల హాస్టల్‌ను కళాశాల హాస్టల్‌గా మారుస్తూ నల్లగొండ జిల్లా కేంద్రంలోకి మార్చారు. మునుగోడులోని బీసీ బాలుర హాస్టల్‌ను కూడా నల్లగొండ కళాశాల హాస్టల్‌గా మార్చారు. అయితే మునుగోడులోనే ఉంచాలని, అక్కడ ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిడి రావడంతో తిరిగి అక్కడే కొనసాగించేందుకు తిరిగి ప్రతిపాదనలు కమిషనర్‌కు పంపారు. మొత్తానికి కేజీటూపీజీతో గ్రామాల్లో విద్యార్థులంతా గురుకుల పాఠశాలలో చేరగా జనరల్హాస్టళ్లు మూతపడిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో కళాశాలల హాస్టళ్లకు డిమాండ్ పెరగడంతో వాటిని కళాశాలల హాస్టల్‌గా మారుస్తూ అక్కడి నుండి జిల్లా కేంద్రానికి, డివిజన్ కేంద్రానికి డిమాండ్‌ను బట్టి మార్చారు. దీంతో కళాశాల హాస్టళ్లకు ఉన్న డిమాండ్ కాస్త తగ్గింది. -
సం‘క్షేమ’మెక్కడ
జిల్లాలో గత ఏడాది 24, ఈ ఏడాది 11 సాంఘిక సంక్షేమ, 15 బీసీ సంక్షేమ వసతి గృహాల ఎత్తివేత వచ్చే ఏడాది మరెన్నో? ఇచ్చిన హామీని విస్మరించిన పాలకులు విద్యార్థులపై దూరా‘భారం’ రెక్కాడితే గానీ డొక్కనిండని కుటుంబాలు ఇంటిల్లిపాదీ పని చేస్తే గానీ పొయ్యిలో కట్టె వెలగని దుస్థితి తమ బతుకు బండబారింది.. పిల్లల చెంతకు అక్షరాన్ని చేర్చాలని...సర్కారు బడి చెంతకు చేరిస్తే వసతి గృహం ఒడిలోకి పంపిస్తేపొమ్మన లేక పొగపెట్టిన చందంగా గూడును తీసేసి...చదువులమ్మ గుడికి దూరం చేస్తారా... మీ కొడుకుని, కోడల్ని బాగా చదివించాననిచెబుతున్న బాబూ... వారినే ఆదర్శంగా తీసుకోండని గొప్పలకు పోతున్న చంద్రన్నా... చదువుకుంటామని మేమంటుంటే అందని చందమామలుగా ఎందుకు చేస్తున్నావ్... కొత్తపేట : సంక్షేమ వసతి గృహాలకు రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్ల నుంచి ఏడాదికి కొన్నిచొప్పున వరుసగా మంగళం పాడుతూ వస్తోంది. ముఖ్యంగా దళిత, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు అందుబాటులో రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తాం...దళిత విద్యార్థుల ఉద్ధరణే ప్రభుత్వ లక్ష్యమంటూ ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా జీఓలు జారీ చేసి అందుబాటులో ఉన్నవసతి గృహాలను ఎత్తివేస్తోంది. రేషనలైజేషన్ విధానంలో అనేక పాఠశాలలను సమీప పాఠశాలల్లో విలీనం చేస్తున్న మాదిరిగా గ్రామీణ ప్రాంతాల్లోని వసతి గృహాలను ఎత్తివేసి ఈ చర్యలకు పాల్పడుతుండడంతో పేద విద్యార్థులకు శాపంగా మారుతోంది. 50 మందిలోపు విద్యార్థులు మాత్రమే ఉన్నారనే సాకుతో ఈ పనికి ఉపక్రమిస్తోంది. జిల్లాలో 116 సాంఘిక సంక్షేమ వసతి గృహాలుండగా గత ఏడాది 24, ఈ ఏడాది 11 వసతి గృహాలు మూతపడ్డాయి. గత ఏడాది బీసీ హాస్టళ్ల జోలికి వెళ్ళని ప్రభుత్వం ఈ ఏడాది వాటిపైనా కన్నేసింది. జిల్లాలో 62 బీసీ వసతి గృహాలు కొనసాగుతుండగా 15 ఇప్పటికే మూసేశారు. మెుత్తంగా ఈ ఏడాది సుమారు 1,100 మంది విద్యార్థులు సంక్షేమ సౌకర్యాలకు దూరమయ్యారు. కార్యరూపం దాల్చని మంత్రి ప్రకటనలు... రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి రావెల కిశోర్‌బాబు చేసిన ప్రకటనలకు ప్రస్తుతం అమలు జరుగుతున్న విధానాలకు ఎక్కడా పొంతన లేదని విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఇటీవల ప్రారంభించిన సంక్షేమ వసతి గృహం, రెసిడెన్షియల్ స్కూల్ గత ప్రభుత్వంలో చేపట్టినవే తప్ప ఈ ప్రభుత్వంలో కొత్తగా ఒక్కటి కూడా నిర్మించలేదు సరికదా ఉన్నవి ఎత్తేస్తున్నారు. దీనిపై విద్యార్థిలోకం నిరసనలు వ్యక్తం చేస్తున్నా దున్నపోతుపై వర్షం పడ్డ చందంగా కనీస స్పందన పాలకుల నుంచి రావడం లేదని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. పెరగని మెనూ చార్జీలు నిత్యావసర సరుకుల ధరలు పెరిగినా హాస్టల్ విద్యార్థుల మెనూ చార్జీలు మాత్రం పెంచలేదు. 3 నుంచి 7వ తరగతి వరకూ విద్యార్థులకు రూ.750, 8,9,10వ తరగతుల విద్యార్థులకు రూ.850 కేటాయిస్తున్నారు. ఇది 2013లో పెంచిన చార్జీలు. అప్పటికీ ఇప్పటికీ నిత్యావసర సరుకుల ధరలు రెట్టింపైనా అవే కొనసాగిస్తున్నారు. విద్యార్థులకు చెల్లించే కాస్మొటిక్ చార్జీలు కూడా 9 ఏళ్ళ నుంచి 62 రూపాయలే విదుల్చుతున్నారు. తప్పదు వెళ్లాల్సిందే: డీడీ నిర్దేశించిన వసతి గృహాల్లో తప్పనిసరిగా చేరాల్సిందేనని సాంఘిక సంక్షేమ శాఖ డీడీ ఎం.ఎస్. శోభారాణి స్పష్టం చేశారు. ఆమెను వివరణ కోరగా జిల్లాలో 11 సాంఘిక సంక్షేమ హాస్టల్స్ నుంచి 441 మందిని జిల్లాలో 9 రెసిడెన్షియల్ స్కూల్స్, 8 హాస్టల్స్‌లో చేరుస్తున్నామన్నారు. 80 శాతం మంది వెళ్లారు. మిగిలిన వారిని పంపించే పనిలో ఉన్నాం. కోత ఇలా... జిల్లాలో ఉన్న సాంఘిక సంక్షేమ వసతి గృహాలు116 ఇందులో గతేడాది 24, ఈ ఏడాది 11 వసతి గృహాలు మూతపడ్డాయి. గత ఏడాది బీసీ హాస్టళ్ల జోలికి వెళ్ళని ప్రభుత్వం ఈ ఏడాది వాటిపైనా కన్నేసింది. జిల్లాలో 62 బీసీ వసతి గృహాలు కొనసాగుతుండగా 15 ఇప్పటికే మూసేశారు. మెుత్తంగా ఈ ఏడాది సుమారు 1,100 మంది విద్యార్థులు సంక్షేమ సౌకర్యాలకు దూరమయ్యారు. వసతి గృహాలు పునఃప్రారంభించాలి.. రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నుంచి ఉద్ధేశపూర్వకంగానే ఎస్సీ,బీసీ సంక్షేమ వసతి గృహాలను ఎత్తేస్తోంది.పేద వర్గాల వారు ఆర్థిక స్థోమత లేక తమ పిల్లలను హాస్టళ్లలో చేర్చి చదివిస్తున్నారు. ఇప్పుడు ఎత్తేస్తే ఆ విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లాలంటే ఇబ్బందికరం. ఈ ప్రభుత్వ విధానం సంక్షేమ శాఖ లక్ష్యాన్ని నిర్వీర్యం చేయడమేనా? ఇప్పటికైనా నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలి. – మట్టపర్తి సూర్యచంద్రరావు, జిల్లా బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి, కొత్తపేట