సం‘క్షేమ’మెక్కడ | HOSTELS CLOSED ISSUE | Sakshi
Sakshi News home page

సం‘క్షేమ’మెక్కడ

Published Mon, Jul 25 2016 11:57 PM | Last Updated on Fri, Nov 9 2018 4:45 PM

సం‘క్షేమ’మెక్కడ - Sakshi

సం‘క్షేమ’మెక్కడ

  • జిల్లాలో గత ఏడాది 24, 
  • ఈ ఏడాది 11 సాంఘిక సంక్షేమ,
  • 15 బీసీ సంక్షేమ వసతి గృహాల ఎత్తివేత 
  • వచ్చే ఏడాది మరెన్నో?
  • ఇచ్చిన హామీని విస్మరించిన పాలకులు
  • విద్యార్థులపై దూరా‘భారం’
  •  
    రెక్కాడితే గానీ డొక్కనిండని కుటుంబాలు
    ఇంటిల్లిపాదీ పని చేస్తే గానీ పొయ్యిలో కట్టె వెలగని దుస్థితి
     
    తమ బతుకు బండబారింది..
    పిల్లల చెంతకు అక్షరాన్ని చేర్చాలని...సర్కారు బడి చెంతకు చేరిస్తే 
    వసతి గృహం ఒడిలోకి పంపిస్తేపొమ్మన లేక పొగపెట్టిన చందంగా
    గూడును తీసేసి...చదువులమ్మ గుడికి దూరం చేస్తారా...
     
    మీ కొడుకుని, కోడల్ని బాగా చదివించాననిచెబుతున్న బాబూ...
    వారినే ఆదర్శంగా తీసుకోండని గొప్పలకు పోతున్న చంద్రన్నా...
    చదువుకుంటామని మేమంటుంటే అందని చందమామలుగా ఎందుకు చేస్తున్నావ్‌...
     
    కొత్తపేట :
    సంక్షేమ వసతి గృహాలకు రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్ల నుంచి ఏడాదికి కొన్నిచొప్పున వరుసగా మంగళం పాడుతూ వస్తోంది. ముఖ్యంగా దళిత, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు అందుబాటులో రెసిడెన్షియల్‌ పాఠశాలలు ఏర్పాటు చేస్తాం...దళిత విద్యార్థుల ఉద్ధరణే ప్రభుత్వ లక్ష్యమంటూ ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా జీఓలు జారీ చేసి అందుబాటులో ఉన్నవసతి గృహాలను ఎత్తివేస్తోంది. రేషనలైజేషన్‌ విధానంలో అనేక పాఠశాలలను సమీప పాఠశాలల్లో విలీనం చేస్తున్న మాదిరిగా గ్రామీణ ప్రాంతాల్లోని వసతి గృహాలను ఎత్తివేసి ఈ చర్యలకు పాల్పడుతుండడంతో పేద విద్యార్థులకు శాపంగా మారుతోంది. 50 మందిలోపు విద్యార్థులు మాత్రమే ఉన్నారనే సాకుతో ఈ పనికి ఉపక్రమిస్తోంది. జిల్లాలో 116 సాంఘిక సంక్షేమ వసతి గృహాలుండగా గత ఏడాది 24, ఈ ఏడాది 11 వసతి గృహాలు మూతపడ్డాయి. గత ఏడాది బీసీ హాస్టళ్ల జోలికి వెళ్ళని ప్రభుత్వం ఈ ఏడాది వాటిపైనా కన్నేసింది. జిల్లాలో 62 బీసీ వసతి గృహాలు కొనసాగుతుండగా 15 ఇప్పటికే మూసేశారు. మెుత్తంగా ఈ ఏడాది సుమారు 1,100 మంది విద్యార్థులు సంక్షేమ సౌకర్యాలకు దూరమయ్యారు.
     
    కార్యరూపం దాల్చని మంత్రి ప్రకటనలు...
    రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి రావెల కిశోర్‌బాబు చేసిన ప్రకటనలకు ప్రస్తుతం అమలు జరుగుతున్న విధానాలకు ఎక్కడా పొంతన లేదని విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఇటీవల ప్రారంభించిన సంక్షేమ వసతి గృహం, రెసిడెన్షియల్‌ స్కూల్‌ గత ప్రభుత్వంలో చేపట్టినవే తప్ప ఈ ప్రభుత్వంలో కొత్తగా ఒక్కటి కూడా నిర్మించలేదు సరికదా ఉన్నవి ఎత్తేస్తున్నారు. దీనిపై విద్యార్థిలోకం నిరసనలు వ్యక్తం చేస్తున్నా దున్నపోతుపై వర్షం పడ్డ చందంగా కనీస స్పందన పాలకుల నుంచి రావడం లేదని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.
     
    పెరగని మెనూ చార్జీలు
    నిత్యావసర సరుకుల ధరలు పెరిగినా హాస్టల్‌ విద్యార్థుల మెనూ చార్జీలు మాత్రం పెంచలేదు. 3 నుంచి 7వ తరగతి వరకూ విద్యార్థులకు రూ.750, 8,9,10వ తరగతుల విద్యార్థులకు రూ.850 కేటాయిస్తున్నారు. ఇది 2013లో పెంచిన చార్జీలు. అప్పటికీ ఇప్పటికీ నిత్యావసర సరుకుల ధరలు రెట్టింపైనా అవే కొనసాగిస్తున్నారు. విద్యార్థులకు చెల్లించే కాస్మొటిక్‌ చార్జీలు కూడా 9 ఏళ్ళ నుంచి 62 రూపాయలే విదుల్చుతున్నారు. 
     
    తప్పదు వెళ్లాల్సిందే: డీడీ
    నిర్దేశించిన వసతి గృహాల్లో తప్పనిసరిగా చేరాల్సిందేనని సాంఘిక సంక్షేమ శాఖ డీడీ ఎం.ఎస్‌. శోభారాణి స్పష్టం చేశారు. ఆమెను వివరణ కోరగా జిల్లాలో 11 సాంఘిక సంక్షేమ హాస్టల్స్‌ నుంచి 441 మందిని జిల్లాలో 9 రెసిడెన్షియల్‌ స్కూల్స్, 8 హాస్టల్స్‌లో చేరుస్తున్నామన్నారు. 80 శాతం మంది వెళ్లారు. మిగిలిన వారిని పంపించే పనిలో ఉన్నాం.  
    కోత ఇలా...
    • జిల్లాలో ఉన్న సాంఘిక సంక్షేమ వసతి గృహాలు116
    • ఇందులో గతేడాది 24, ఈ ఏడాది 11 వసతి గృహాలు మూతపడ్డాయి.
    • గత ఏడాది బీసీ హాస్టళ్ల జోలికి వెళ్ళని ప్రభుత్వం ఈ ఏడాది వాటిపైనా కన్నేసింది.
    • జిల్లాలో 62 బీసీ వసతి గృహాలు కొనసాగుతుండగా 15 ఇప్పటికే మూసేశారు.
    • మెుత్తంగా ఈ ఏడాది సుమారు 1,100 మంది విద్యార్థులు సంక్షేమ సౌకర్యాలకు దూరమయ్యారు.
     
    వసతి గృహాలు పునఃప్రారంభించాలి..
    రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నుంచి ఉద్ధేశపూర్వకంగానే ఎస్‌సీ,బీసీ సంక్షేమ వసతి గృహాలను ఎత్తేస్తోంది.పేద వర్గాల వారు ఆర్థిక స్థోమత లేక తమ పిల్లలను హాస్టళ్లలో చేర్చి చదివిస్తున్నారు. ఇప్పుడు ఎత్తేస్తే ఆ విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లాలంటే ఇబ్బందికరం. ఈ ప్రభుత్వ విధానం సంక్షేమ శాఖ లక్ష్యాన్ని నిర్వీర్యం చేయడమేనా? ఇప్పటికైనా నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలి.
    – మట్టపర్తి సూర్యచంద్రరావు, జిల్లా బీసీ సంక్షేమ సంఘం ప్రధాన  కార్యదర్శి, కొత్తపేట
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement