భర్త బారినుంచి కాపాడాలని ఫిర్యాదు
హొసూరు: పెళ్లి చేసుకొని మోసగించి, తన పేరు మీద ఉన్న ఆస్తిని తాకట్టు పెట్టి రూ.లక్ష, నగలు కాజేసి, మరో అమ్మాయిని పెళ్లి చేసుకొన్న తన భర్త నుంచి కాపాడి డబ్బు, నగలు ఇప్పించి న్యాయం చేయాలని ఓ మహిళ హొసూరు మహిళా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంఘటన శనివారం చోటు చేసుకొంది. ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. హొసూరు యూనియన్ ప్యారండపల్లి సమీపంలోని గాంధీనగర్లో నివసిస్తున్న క్రిష్ణప్ప కొడుకు మంజునాథ్ 2012లో రేణుకను పెళ్లి చేసుకొన్నాడు. ఈ పెళ్లికి ముందే మరో ఇద్దరు అమ్మాయిలతో పెళ్లిళ్లు చేసుకున్నాడు.
విషయం తెలియక రేణుక మళ్లీ పెళ్లి చేసుకుంది. ఆమెకు ఆడపిల్ల పుట్టి ఐదు నిమిషాలకే మరణించింది. వ్యాపారం కోసం ఆర్థికంగా సాయం చేయమని డిమాండ్ చేయడంతో తల్లిదండ్రులు ఇచ్చిన ఎకరం నేల తాకట్టు పెట్టి లక్షరూపాయలు వడ్డీకి తీసిచ్చింది. బంగారు నగలు కూడా ఇచ్చానని, గత కొద్ది రోజుల నుంచి వదలి వెళ్లిపోయాడని, మొబైల్కు ఫోన్ చేస్తే మరోఅమ్మాయి మాట్లాడుతోందని రేణుక వివరించింది. తన భర్తతో నీకేం పని అని ఆ మహిళ బెదరిస్తోందని ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.