స్థానిక సంస్థలకు నిధులు పెంచండి
14వ ఆర్థిక సంఘానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతారెడ్డి వినతి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: కేంద్ర ప్రభుత్వం నుంచి స్థానిక సంస్థలకు వచ్చే నిధుల మొత్తాన్ని మరింత పెంచాల్సిన ఆవశ్యకత ఉందని జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతారెడ్డి 14వ ఆర్థిక సంఘానికి సూచించారు. శుక్రవారం హైదరాబాద్లోని హోటల్ గ్రాండ్ కాకతీయలో 14వ ఆర్థిక సంఘం సభ్యులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చెర్పర్సన్ సంఘ సభ్యులను కలిసి ఆర్థిక సంఘ నిధుల వినియోగాన్ని వివరించారు.
13వ ఆర్థిక సంఘం ద్వారా జిల్లాకు వచ్చిన నిధులు ఏ మూలకూ చాలలేదని, దీంతో అభివృద్ధి ఆశించినంతగా లేదన్నారు. రాజధాని చుట్టూ జిల్లా విస్తరించి ఉన్నప్పటికీ.. ఇప్పటికీ అనుసంధాన రోడ్లు లేని పల్లెలున్నాయన్నారు. అదేవిధంగా పాఠశాలలో తాగునీరు, పారిశుద్ధ్యానికి సంబంధించి పలు కార్యక్రమాలు చేపట్టాల్సి ఉందన్నారు. 14వ ఆర్థిక సంఘం ద్వారా నిధుల మొత్తాన్ని రెట్టింపు చేయాలని ఆమె కోరగా.. సంఘ సభ్యులు పరిశీలిస్తామన్నారు.