Housing and Urban Development Corporation
-
టీఎస్ రెరాలో 3,630; ఏపీ రెరాలో 2,049
సాక్షి, సిటీబ్యూరో: రియల్ ఎస్టేట్ రెగ్యులర్ అండ్ డెవలప్మెంట్ చట్టం (రెరా) అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఈ ఏడాది నవంబర్ 20 వరకు ఆంధ్రప్రదేశ్ రెరాలో 2,049 ప్రాజెక్ట్‌లు, 149 మంది ఏజెంట్లు నమోదయ్యారు. ఇప్పటివరకు 158 ఫిర్యాదులను ఏపీ రెరా పరిష్కరించింది. అలాగే తెలంగాణ రెరాలో 3,630 ప్రాజెక్ట్‌లు, 1,891 ఏజెంట్లు రిజిస్టర్ కాగా.. ఒక్క ఫిర్యాదు కూడా పరిష్కరించలేదు. దేశంలో రెరా అమల్లోకి వచ్చిన నాలుగున్నర ఏళ్లలో 71,307 ప్రాజెక్ట్‌లు, దేశవ్యాప్తంగా 56,177 మంది ఏజెంట్లు నమోదయ్యారని గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నివేదికను విడుదల చేసింది. మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక రెరాలో అత్యధికంగా ప్రాజెక్ట్‌లు రిజిస్టరయ్యాయి. 2019 నుంచి ఈ ఏడాది నవంబర్ వరకు మహారాష్ట్రలో 31,664, గుజరాత్లో 9,272, కర్ణాటక రెరాలో 4,497 ప్రాజెక్ట్‌లు నమోదయ్యాయి. గత రెండేళ్లలో ఆయా రాష్ట్రాల రెరాలో ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్లలో 49 శాతం, ఫిర్యాదుల పరిష్కారంలో 128 శాతం వృద్ధి నమోదయింది. ఇప్పటివరకు అన్ని రాష్ట్రాల రెరా అథారిటీలు 78,903 ఫిర్యాదులను పరిష్కరించాయి. రెరాకు వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించడంలో ఉత్తరప్రదేశ్, హరియాణా ప్రభుత్వాలు ముందంజలో ఉన్నాయి. యూపీలో 30,990 కేసులు, హర్యానాలో 16,864 కేసులు పరిష్కారమయ్యాయి. ఇదీ రెరా పరిస్థితి.. నాగాలాండ్ మినహా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు రెరా నిబంధనలను నోటిఫై చేశాయి. 30 రాష్ట్రాలు, యూటీలు రెరా అథారిటీని ఏర్పాటు చేశాయి. ఇందులో 25 రెగ్యులర్ అథారిటీ కాగా, 5 మధ్యంతర అథారిటీలున్నాయి. జమ్మూ అండ్ కశ్మీర్, లడక్, మేఘాలయ, సిక్కిం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు రెరా నిబంధనలను నోటిఫై చేశాయి కానీ అథారిటీలను ఏర్పాటు చేయలేదు. కాగా 28 రాష్ట్రాలు, యూటీలు రియల్ ఎస్టేట్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేశాయి. అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కశ్మీర్, లడక్, మేఘాలయ, మిజోరాం, సిక్కిం, పశ్చిమ బెంగాల్‌లు ట్రిబ్యునల్ ఏర్పాటు ప్రక్రియలో ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్ మినహా అన్ని రాష్ట్రాలు రెరా వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. నిర్మాణంలోని ప్రాజెక్ట్‌లూ రెరాలోకి.. సుప్రీంకోర్టు రియల్ ఎస్టేట్ రెగ్యులర్ అండ్ డెవలప్మెంట్ చట్టం–2016 పరిధిని విస్తృతం చేసింది. అన్ని రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లు రెరా పరిధిలోకి వచ్చే వరకూ కంప్లీషన్ సర్టిఫికెట్ పొందలేరని వ్యాఖ్యానించింది. అంటే నిర్మాణం లో ఉన్న ప్రాజెక్ట్‌లను రెరా పరిధిలోకి చేర్చకుండా రెరా నిబంధనలను బలహీనపరిచిన రాష్ట్ర ప్రభుత్వాలు అలాంటి ప్రాజెక్ట్‌లను రెరా పరిధిలోకి తీసుకురావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రెరా జరిమానా విధించిన డెవలపర్లు అప్పీల్‌కు వెళ్లినా సరే.. జరిమానా మొత్తం లో 25 శాతం రెరా వద్ద డిపాజిట్ చేయాలి. నిలిచిపోయిన ప్రాజెక్ట్‌లు పూర్తవుతాయి.. సుప్రీం ఆదేశాల మేరకు నిర్మాణంలోని ప్రాజెక్ట్ లు రెరా పరిధిలోకి వస్తే వచ్చే రెండేళ్లలో గృహ నిర్మాణ ప్రాజెక్ట్‌లు మరింత వేగంగా పూర్తవుతా యని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్ పూరీ తెలిపారు. ఇప్పటికే చాలా మంది డెవలపర్లు రెరా పరిధిలోకి రాని నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడంపై దృష్టిసారించారన్నారు. దీంతో కొన్నేళ్లుగా నిర్మాణం జరుగుతున్న, మధ్యలో నిలిచిపోయిన గృహాల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశముందని తెలిపారు. ఈ ఏడాది జూలై నాటికి దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 2014, అంతకంటే ముందు ప్రారంభమై ఇప్ప టికీ పూర్తి కాకుండా 6.29 లక్షల గృహాలున్నాయి. -
దేశవ్యాప్తంగా ఉత్తమ సిటీగా విశాఖ
సాక్షి, విశాఖపట్నం: సుందర నగరి, సిటీ ఆఫ్ డెస్టినీగా పేరొందిన మహా విశాఖ మెట్రో నగరాల సరసన నిలిచింది. దేశవ్యాప్తంగా ఉత్తమ నివాస యోగ్య నగరాల జాబితాలో 15వ స్థానం సాధించింది. రాష్ట్రం నుంచి ఈ క్యాటగిరీలో టాప్ 20లో నిలిచిన ఏకైక నగరంగా మెరిసింది. ఓవరాల్ ర్యాంకింగ్స్‌లో దేశవ్యాప్తంగా 111 నగరాలతో పోటీ పడిన విశాఖ 15వ స్థానం సాధించగా విజయవాడ 41వ స్థానంలో నిలిచింది. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ ‘ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్–2020’ పేరుతో గురువారం ఈ ర్యాంకులు విడుదల చేసింది. ఇందులో ఉత్తమ నివాసయోగ్యమైన నగరాల్లో విశాఖపట్నం 15వ స్థానం దక్కించుకుంది. సంస్థాగత, సామాజిక, ఆర్థిక, భౌతిక పరిస్థితులను కొలమానంగా తీసుకొని ఈ ర్యాంకుల్ని ప్రకటించారు. ఇందులో 15 కేటగిరీల్లో 78 సూచీలను విభజించి సర్వే నిర్వహించారు. ఇనిస్టిట్యూషనల్, భౌతిక పరిస్థితుల పరంగానూ విశాఖ నగరం మంచి ర్యాంకు సాధించింది. పది లక్షలకుపైగా జనాభా ఉన్న నగరాల జాబితాలో మొత్తం 100 పాయింట్లకు గాను 57.28 పాయింట్లు సాధించింది. 2018లో విడుదల చేసిన ర్యాంకుల్లో విశాఖ 17వ స్థానంలో నిలవగా ఈసారి రెండు ర్యాంకుల్ని మెరుగుపరచుకుంది. మున్సిపల్ పెర్ఫార్మెన్స్లో 9వ ర్యాంకు... ఇక 10 లక్షలకుపైగా జనాభా కేటగిరీలో మున్సిపల్ పెర్ఫార్మెన్స్ విభాగంలో 52.77 పాయింట్లుతో విశాఖ నగరం 9వ ర్యాంకు సాధించింది. ఈ ర్యాంకుల్ని 2020 ఆగస్టులో ప్రకటించాల్సి ఉండగా కోవిడ్ కారణంగా వాయిదా వేస్తూ వచ్చారు. 2020 నుంచి విశాఖ నగరం వివిధ రంగాల్లో దూసుకుపోతోంది. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో 2018–19లో 23వ స్థానంలో నిలిచిన విశాఖ నగరం 2019–20లో 14 ర్యాంకుల్ని మెరుగు పరచుకొని 9వ ర్యాంకులోకి దూసుకెళ్లింది. 2019లో స్మార్ట్ సిటీ నగరాల జాబితాలో 9వ ర్యాంకులో ఉండగా.. 2020లో టాప్–7లో నిలిచింది. తాజాగా నివాస యోగ్య నగరాల జాబితాలోనూ విశాఖ నగరం ర్యాంకుని మెరుగు పరచుకుంది. వివిధ విభాగాల్లో విశాఖ దూసుకెళ్లిన విధానాన్ని ఓసారి పరిశీలిస్తే... ఈజ్ ఆఫ్ లివింగ్... – ఓవరాల్ ర్యాంకు – 15 – సస్టైన్‌బులిటీ విభాగంలో 65.18 మార్కులతో 2వ స్థానం – ఎకనమిక్ ఎబిలిటీలో 19.42 మార్కులతో 18వ స్థానం – ప్రజావగాహన(సిటిజన్ పర్సిప్షన్)లో 77.20 మార్కులతో 23వ స్థానం – జీవన ప్రమాణాల విభాగంలో 51.93 మార్కులతో 25వ స్థానం మున్సిపల్ పెర్ఫార్మెన్స్.... ఓవరాల్ ర్యాంకు– 09 – ప్లానింగ్ విభాగంలో 71.81 మార్కులతో 1వ స్థానం – సేవలందించే విభాగంలో 63.35 మార్కులతో 8వ స్థానం – ఆర్థిక స్థితిగతుల విభాగంలో 59.87 మార్కులతో 11వ స్థానం – టెక్నాలజీ వినియోగంలో 34.64 మార్కులతో 12వ స్థానం – గ్రీవెన్స్ విభాగంలో 29.13 మార్కులతో 49వ స్థానం తిరుపతి కీర్తి కిరీటంలో మరో కలికితురాయి – మున్సిపల్ పర్ఫామెన్స్లో 2వ ర్యాంకు తిరుపతి తుడా: ఆథ్యాత్మిక నగరం తిరుపతికి మరో గౌరవం దక్కింది. మున్సిపల్ పర్ఫామెన్స్ ఇండెక్స్ (పురపాలిక పనితీరు సూచీ) ర్యాంకుల్లో పది లక్షల లోపు జనాభా కలిగిన నగరాల కేటగిరీలో జాతీయ స్థాయిలో తిరుపతి రెండో ర్యాంకు సాధించింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ విడుదల చేసిన ఈ ర్యాంకుల్లో న్యూఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఇదే కేటగిరీలో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఆథ్యాత్మిక నగరానికి దక్కిన ఈ గుర్తింపు పట్ల తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పీఎస్ గిరీష సంతోషం వ్యక్తం చేశారు. -
హుడ్కో రుణ మంజూరు రూ.30,774 కోట్లు
న్యూఢిల్లీ: హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హుడ్కో) 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.30,774 కోట్ల రుణాల్ని మంజూరు చేసింది. రుణ పంపిణీలు రూ.8,250 కోట్లని హుడ్కో ఒక ప్రకటనలో పేర్కొంది. రూ.782 కోట్ల నికర లాభం ఆర్జించామని తెలిపింది. కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుంచి మొత్తంగా 17,000 హౌసింగ్, ఇన్ఫ్రా ప్రాజెక్టులకు ఆర్థిక తోడ్పాటునందించామని పేర్కొంది. తాము ఎంఓహెచ్యూపీఏతో కుదుర్చుకున్న ఒప్పందం కారణంగా గత ఆర్థిక సంవ త్సరానికి గానూ వరుసగా ఐదోసారి ఎక్సలెంట్ రేటింగ్‌ను పొందే అవకాశముందని తెలిపింది. తొలిసారి స్టాండ్ అలోన్ బేసిస్ ప్రాతిపదికన మూడు దిగ్గజ రేటింగ్ ఏజెన్సీల నుంచి ఏఏఏ రేటింగ్‌ను పొందామని తెలిపింది. -
పెట్టుబడికి జేమ్స్'బాండ్'
ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ రూ.1,750 కోట్లు సమీకరించాలనుకుంది. పన్ను లేకుండా ఉండే బాండ్ల ఇష్యూ మొదలెట్టింది. రెండ్రోజుల్లోనే ఇష్యూ ముగిసింది. డిసెంబర్ 3న మొదలైన ఈ ఇష్యూకు 16 వరకు గడువుంది. కానీ రెండ్రోజుల్లోనే 3.3 రెట్లు ఓవర్ సబ్స్క్రయిబ్ కావడంతో ఇష్యూ ముగిసినట్లు సంస్థ ప్రకటించింది. పన్ను రహిత బాండ్లకు జనంలో ఎంత ఆదరణ ఉందో చెప్పటానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఎన్టీపీసీ ఇష్యూకు లభించిన ఆదరణ చూసి... ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ (ఐఐఎఫ్‌సీఎల్) కూడా బాండ్లు జారీ చేయడానికి ముందుకొచ్చింది. గతం కన్నా ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తోంది కూడా. ఒకవైపు పన్ను రహిత బాండ్లు, మరోవైపు ఎన్‌సీడీలతో వివిధ కంపెనీలు దీర్ఘకాలానికి అధిక వడ్డీని ఆఫర్ చేస్తుండటంతో వీటిని తట్టుకోవడానికి బ్యాంకులు సైతం వడ్డీరేట్లు పెంచుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో రెండు ట్యాక్స్ ఫ్రీ బాండ్స్, రెండు ఎన్సీడీల ఇష్యూలున్నాయి. అసలు ఈ బాండ్లేంటి? ఎన్సీడీలేంటి? వాటిలో పెట్టుబడి సురక్షితమేనా? లాభం ఉంటుందా? ఇదే ఈ వారం ప్రాఫిట్ కథనం...ట్యాక్స్ ఫ్రీ బాండ్స్... పోస్టల్ సేవింగ్స్ సర్టిఫికెట్ల మాదిరిగా ఈ ట్యాక్స్ ఫ్రీ బాండ్లలో ఇన్వెస్ట్ చేసే మొత్తాన్ని ఆదాయపు పన్నులో మినహాయింపుగా చూపించలేం. కానీ ఈ బాండ్లపై వచ్చే వడ్డీకి మాత్రం పన్ను కట్టక్కర్లేదు. అధిక ట్యాక్స్ శ్లాబ్‌లో ఉన్న వారికి ఇవి మంచివే. ఉదాహరణకు బ్యాంకులు 10 ఏళ్ల కాలపరిమితి గల డిపాజిట్‌పై 9 శాతం వడ్డీ ఇస్తున్నాయి. కానీ 30 శాతం ట్యాక్స్ శ్లాబ్‌లో ఉన్నవారికి ఈ వడ్డీపై పన్ను ఉంటుంది కనక నికరంగా 6 శాతం వడ్డీయే గిట్టుబాటు అవుతుంది. అదే ఈ ట్యాక్స్ ఫ్రీ బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మొత్తం వడ్డీ చేతికొస్తుంది. అంతేకాక ఈ ట్యాక్స్ ఫ్రీ బాండ్లను ప్రభుత్వరంగ సంస్థలే జారీ చేస్తాయి కనక రిస్క్ ఉండదు. ఇవి దీర్ఘకాలిక బాండ్లే కానీ... స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టయి ఉంటాయి కనక ఎప్పుడు కావాలంటే అప్పుడు విక్రయించుకోవచ్చు. హడ్కో... హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హడ్కో) ట్యాక్స్ ఫ్రీ బాండ్స్ ద్వారా రూ.2,439 కోట్లు సమీకరించనుంది. 10, 15, 20 ఏళ్ల కాలపరిమితిలో లభించే ఈ బాండ్స్‌పై వరుసగా 8.76, 8.83, 9.01 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. రూ.1,000 ముఖ విలువ కలిగిన బాండ్లను కనీసం ఐదు కొనాల్సి ఉంటుంది. అంటే కనీస పెట్టుబడి రూ.5 వేలు. డిసెంబర్ 2న ప్రారంభమైన ఈ ఇష్యూ జనవరి 10 వరకు ఉంటుంది. కానీ లక్ష్యాన్ని చేరుకుంటే గడువు కంటే ముందే ముగించొచ్చు. ఈ ఇష్యూకి కేర్ ‘ఏఏప్లస్’ రేటింగ్ ఇచ్చింది. ఐఐఎఫ్‌సీఎల్... ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ (ఐఐఎఫ్‌సీఎల్) రూ.3,000 కోట్లకు ట్యాక్స్ ఫ్రీ బాండ్స్‌ను జారీ చేస్తోంది. ఇష్యూ డిసెంబర్ 9న మొదలవుతుంది. అక్టోబర్-నవంబర్ నెలలో ఇచ్చిన వడ్డీరేటు కంటే ఎక్కువ రేటును ఇప్పుడు ఆఫర్ చేస్తుండటం విశేషం. గత ఇష్యూలో 20 ఏళ్ల కాలపరిమితిపై 8.75 శాతం వడ్డీని ఆఫర్ చేస్తే ఇప్పుడు 8.91 శాతం వడ్డీని ఇస్తోంది. 10, 15, 20 ఏళ్ల కాలపరిమితుల్లో లభిస్తున్న ఈ బాండ్స్‌పై వరుసగా 8.66, 8.73, 8.91 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. ఎన్సీడీ ఇష్యూ... డిబెంచర్లంటే రుణ పత్రాలు. వాటిలో షేర్లుగా మార్చుకునేందుకు అవకాశమిచ్చేవి కన్వర్టబుల్ డిబెంచర్లు. అలా వీల్లేనివి నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు (ఎన్సీడీలు). కార్పొరేట్ సంస్థలు వాటి వ్యాపార విస్తరణకు అవసరమయ్యే నిధుల కోసం ఎన్సీడీలు జారీ చేస్తుంటాయి. అంటే బ్యాంకుల దగ్గర అప్పు చేయకుండా జనం దగ్గర అప్పు చేయటమన్నమాట. నిర్ణీత కాలానికి వాటిపై వడ్డీ కూడా చెల్లిస్తాయి. బ్యాంకు డిపాజిట్లు, ట్యాక్స్ ఫ్రీ బాండ్లతో పోలిస్తే వీటిలో రిస్క్ ఎక్కువ. అందుకే వడ్డీ కూడా ఎక్కువే ఉంటుంది. వీటిల్లో ఇన్వెస్ట్ చేసే మొత్తంపై గానీ, వచ్చే వడ్డీపై గానీ ఎలాంటి పన్ను ప్రయోజనాలూ ఉండవు. కాస్త రిస్క్‌కు సిద్ధపడి బ్యాంకు డిపాజిట్ల కంటే ఎక్కువ వడ్డీ కావాలనుకునే వారికి ఇవి అనువైనవి. శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్... శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్ సంస్థ ఎన్సీడీ ఇష్యూ ద్వారా రూ.200 కోట్లు సమీకరిస్తోంది. నవంబర్ 25న ప్రారంభమై.. ఈనెల 24న ముగియనున్న ఈ ఇష్యూలో మూడు, నాలుగు, ఐదేళ్ళ కాలపరిమితిలో బాండ్లను జారీ చేస్తున్నారు. వీటిపై వరుసగా 11%, 11.25%, 11.5% వడ్డీని అందిస్తోంది. ఐదేళ్ల కాలపరిమితి గల బాండ్‌పై ఏటా వడ్డీ వెనక్కి తీసుకునే అవకాశం కూడా ఉంది. లేదంటే చివర్లోనే మొత్తం తీసుకోవచ్చు. ఇష్యూలో 40 శాతం ఎన్సీడీలను రూ.5 లక్షల లోపు ఇన్వెస్ట్ చేసే చిన్న ఇన్వెస్టర్లకే కేటాయిస్తారు. ఐఐహెచ్‌ఎఫ్‌ఎల్... ఇండియా ఇన్ఫోలైన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఐఐహెచ్‌ఎఫ్‌ఎల్) ఎన్సీడీ ఇష్యూ ద్వారా రూ.500 కోట్లు సమీకరిస్తోంది. ఇష్యూ ఈనెల 12న ఆరంభమై 30న ముగుస్తుంది. ప్రతి నెలా వడ్డీ వెనక్కిచ్చేలా ఐదేళ్ల కాలపరిమితికి జారీ చేస్తున్న ఈ బాండ్లపై... 11.52 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది.