ప్రాప్‌టైగర్‌లో హౌసింగ్‌డాట్‌కామ్ విలీనం
55 మిలియన్ డాలర్ల సమీకరణలో కొత్త సంస్థ
న్యూఢిల్లీ: ఆన్లైన్ రియల్ ఎస్టేట్ సర్వీసుల రంగంలో మరో కన్సాలిడేషన్ డీల్‌కు తెరతీస్తూ ప్రాప్‌టైగర్‌డాట్‌కామ్, హౌసింగ్‌డాట్‌కామ్ సంస్థలు విలీనం కానున్నాయి. తద్వారా దేశీయంగా అతి పెద్ద ఆన్లైన్ రియల్టీ సేవల సంస్థ ఆవిర్భవించనుంది. ఇది వ్యాపార కార్యకలాపాల విస్తరణ కోసం 55 మిలియన్ డాలర్లు సమీకరించనుంది. ప్రాప్టైగర్డాట్కామ్కు న్యూస్ కార్ప్ సంస్థ, హౌసింగ్‌డాట్‌కామ్‌కు సాఫ్ట్‌బ్యాంక్ దన్ను ఉన్న సంగతి తెలిసిందే.
డీల్ ప్రకారం విలీనానంతరం సంయుక్త సంస్థలో ఆస్ట్రేలియాకి చెందిన ఆర్‌ఈఏ గ్రూప్ 50 మిలియన్ డాలర్లు, సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ కార్పొరేషన్ 5 మి. డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నాయి. ప్రాప్‌టైగర్ సహవ్యవస్థాపకుడు ధృవ్ అగర్వాలా ..కొత్త సంస్థకు సీఈవోగా వ్యవహరిస్తారు. మరోవైపు హౌసింగ్‌డాట్‌కామ్ ప్రస్తుత సీఈవో జేసన్ కొఠారి పక్కకు వైదొలగనున్నారు. విలీన కంపెనీ బోర్డులో ఆర్‌ఈఏ, సాఫ్ట్‌బ్యాంక్ ప్రతినిధులకు చోటు దక్కనుంది.
కార్యకలాపాల విస్తరణకు నిధులు..
భారత ఇంటర్నెట్ రంగంలో ఇతరత్రా వ్యాపార అవకాశాలపై ఆయన దృష్టి పెట్టనున్నట్లు ఇరు కంపెనీలు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి. రెండు సంస్థల షేర్హోల్డర్లు.. కొత్త కంపెనీలో వాటాదారులుగా ఉంటారని అగర్వాలా పేర్కొన్నారు. తాజాగా సమీకరిస్తున్న 55 మి.డాలర్ల నిధులను.. కొత్త ఉత్పత్తులు, టెక్నాలజీ, బ్రాండింగ్‌లపై వెచ్చించనున్నట్లు చెప్పారు.
రెండు సంస్థల కథ..
2011లో ప్రారంభమైన ప్రాప్‌టైగర్ 1.5 బిలియన్ డాలర్ల విలువ చేసే లావాదేవీలు పూర్తి చేసింది. 2015లో మకాన్‌డాట్‌కామ్‌ను కొనుగోలు చేసింది. మరోవైపు ఆన్లైన్లో గృహాల క్రయ, విక్రయ లావాదేవీలకు తోడ్పాటునిచ్చే హౌసింగ్‌డాట్‌కామ్ వెబ్‌సైట్‌కు ప్రతి నెలా దాదాపు 40 లక్షల విజిట్స్ ఉంటున్నాయని అంచనా. బాధ్యతారాహిత్య కారణాలపై 2015 జులైలో సహవ్యవస్థాపకుడు రాహుల్ యాదవ్‌ను సీఈవోగా తొలగించిన హౌసింగ్‌డాట్‌కామ్ బోర్డు.. నవంబర్‌లో ఆ హోదాలో జేసన్ కొఠారీని నియమించింది.