Hrudayam
-
వీధి బాలల కథ
నాలుగు కథల సమాహారంతో రవి సి. వర్మ దర్శకత్వంలో వేమూరి రామకోటేశ్వరరావు నిర్మిస్తున్న ‘హృదయం’ చిత్రం హైదరాబాద్‌లో ఆరంభమైంది. ముహూర్తపు దృశ్యానికి దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి కెమెరా స్విచాన్ చేయగా, హీరో శ్రీకాంత్ క్లాప్ ఇచ్చారు. అనంతరం నిర్మాత మాట్లాడుతూ - ‘‘వీధి బాలలకు సంబంధించిన కథతో ఈ చిత్రం తీస్తున్నాం. ప్రేమ, సస్పెన్స్ ఉన్న చిత్రం. యువతకు మంచి సందేశం ఇవ్వాలనే ఆశయంతో తెరకెక్కిస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బాలాజీ, కెమెరా: ప్రవీణ్ వనమాలి. -
ఏడాది కాపురం పూర్తయ్యింది
హృదయం: మొన్నటి జూలై 11 తో జోడీ రోస్, లె పాంట్ డు డయబుల్ వివాహ బంధానికి ఏడాది పూర్తి అయ్యింది! ఈ సందర్భంగా జోడీ లెపాంట్ డు మీద గంతులేస్తూ తన ఆనందాన్ని పంచుకొంది. చాలా మంది తమ బంధాన్ని అవమానిస్తూ మాట్లాడారని, తనను పిచ్చిదాన్ని చూసినట్టుగా చూశారని, అయితే ఏడాదిగా లెపాంట్ డుతో బంధాన్ని కొనసాగించి తన ప్రేమను నిరూపించుకొన్నానని, తమ వివాహ బంధం ఇలాగే నిండునూరేళ్లు కొనసాగుతుందని జోడీ చెప్పుకొచ్చింది! అయితే లెపాంట్ డు మాత్రం మారు మాట్లాడలేదు. ఎందుకంటే అది ఒక రాతి కట్టడం, కాంక్రీట్ స్ట్రక్చర్! ప్రకృతిరమణీయ ప్రదేశాలపై ఎంతోమంది మనసు పారేసుకొంటారు. సహజసిద్ధంగా ఏర్పడిన నిర్మాణాలను, కట్టడాలను ప్రేమిస్తారు. అయితే జోడీ రోస్కు మాత్రం ఈ ప్రేమ ముదిరింది. ఏకంగా ఒక బ్రిడ్జిని పెళ్లి చేసుకొంది! ఆ బ్రిడ్జినే తన భర్తగా భావిస్తోంది! చట్టబద్ధంగా ఆ పెళ్లి చెల్లకపోయినా... జోడీ మాత్రం తమ జోడీని ఎవరూ విడదీయలేరని అంటోంది. జోడీ రోస్ ఒక ఆస్ట్రేలియన్. పాపులర్ పాప్ సింగర్. పాప్ ఆల్బమ్స్‌ను రూపొందించడంలో భాగంగా ప్రపంచంలోని అనేక ప్రాంతాలను సంద ర్శించిందామె. అనేక వంతెనల మీద నిలబడి పాడుతూ ఆల్బమ్స్‌ను రూపొందించింది. అలాంటి ఆమెకు ఫ్రాన్స్‌లోని లెపాంట్ డు డయబుల్ బ్రిడ్జ్ చాలా నచ్చేసింది! ఎంతగానంటే పెళ్లి చేసుకోవాలనేంతగా! ఇంకేముంది... తన నిర్ణయాన్ని సన్నిహితులందరికీ చెప్పేసింది. వాళ్లందరినీ తన పెళ్లికి ఆహ్వానించింది. అంతా ఆశ్చర్యపోయారు. ఒక వంతెననుపెళ్లి చేసుకోవడం ఏమిటి? అంటూ నోరెళ్లబెట్టారు. అయితే అప్పటికే జోడీ ఆ బ్రిడ్జితో నిండా ప్రేమలో మునిగిపోయిన తీరును చూసి ఎవరూ వాళ్ల పెళ్లికి అడ్డుగా మారలేదు. అయితే ఫ్రాన్స్‌లో ఇలాంటి పెళ్లిళ్లు చెల్లవు. మనుషులు ఇలా కట్టడాలను పెళ్లి చేసుకొంటే తాము గుర్తించమని స్థానిక మేయర్ స్పష్టం చేశాడు. అయితే అంత కోరికగా ఉంది కాబట్టి... పెళ్లి చేసుకొంటే చేసుకోవచ్చని అనుమతినిస్తూ మేయర్ స్వయంగా ఆ పెళ్లికి హాజరై వధూవరులను ఆశీర్వదించి వచ్చారు. ఆ విధంగా ఏడాది కిందట జోడీ ముచ్చట తీరింది. ‘‘నేను ప్రపంచంలో ఎన్నో బ్రిడ్జిలను చూశాను. కానీ లె పాంట్ డు డయబుల్లో సొగసు ఎక్కడా కనపడలేదు. ఇది నా మీద తనప్రేమను ప్రకటిస్తున్నట్టుగా అనిపించింది. ఈ వంతెన మీద నిలబడి నేను అద్భుతమైన సంగీతాన్ని కంపోజ్ చేయగలిగాను. క్రమంగా దీని మీద ప్రేమ ఎక్కువైంది. అందుకే పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాను...’’అంటూ జోడీ తన ప్రేమ గురించి, పెళ్లి నిర్ణయం గురించి వివరిస్తుంది. అయితే ఇంతవరకూ బాగానే ఉన్నా... జోడీతో పెళ్లి కి లె పాంట్కు ఇష్టం ఉందా? లేదా? అనే ది కనుక్కోవాల్సిందని కొంతమంది చమత్కరిస్తున్నారు. ప్రేమ సరిగమలు భూగోళం వేగంగా పరిభ్రమిస్తూ ఉంటుంది. అలా తిరుగుతున్నప్పుడు మనుషులు ఎగిరిపోయి పడకుండా పట్టి ఉంచే బంధమే ప్రేమ. అలాంటి పవిత్రమైన ప్రేమకు ఉన్నశక్తులు అన్నీ ఇన్నీకావు! - ప్రేమ గురించి, ప్రియమైన వాళ్ల గురించి ఎక్కువగా ఊహించుకొనే వాళ్లలో సృజనాత్మక శక్తి , ఏకాగ్రతలు పెరుగుతూ ఉంటాయట! - ప్రియమైన వాళ్ల చేయి పట్టుకొని నడుస్తూ ఉంటే మనసులోని ఎంత బాైధె నా ఇట్టే తరిగిపోతుందట. - కళ్లలోకి సూటిగా చూస్తూ ఐ కాంటాక్ట్ మెయింటెయిన్ చేస్తుంటే అపరిచితుల మధ్యనైనా సరే ప్రేమ పొంగుకొస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. - ఉదయాన్నే ప్రియురాలిని కిస్ చేస్తూ ఆమెతో సరదాగా గడిపే మగాళ్లు మిగతా వాళ్లకన్నా ఐదేళ్లపాటు ఎక్కువగా బతుకుతారని అంటోంది ఫ్రెంచ్ శాస్త్రవేత్తల అధ్యయనం. - తొందరగా ప్రేమలోపడేది మగవాళ్లే. అలాగే ఆ ప్రేమ విఫలం అయితే ఎక్కువగా బాధపడేది కూడా వాళ్లే! -
హృదయం: ఏ ప్రేమా ఇలా మొదలై ఉండదు!
అబ్బాయికి అమ్మాయిని చూడగానే ప్రేమ పుడుతుందంటారు. కానీ అమ్మాయికి అలా పుట్టడం అరుదు. ఒకవేళ పుట్టినా ఆమె బయటపడదు. అతని కళ్లతో ఆమె కళ్లు కలవాలంటే... అతని అడుగులతో ఆమె అడుగులు సాగాలంటే... అతని జీవితమే ఆమె జీవితం కావాలంటే... అతనిపై నమ్మకం కుదరాలి. అతనిలో ఆమెకు ఏదో ప్రత్యేకత కనిపించాలి. కేరళకు చెందిన బిజు నారాయణన్... ఒక గ్రీటింగ్ కార్డుతో శ్రీలతలో ఆ నమ్మకం కలిగించాడు. తన ప్రత్యేకత ఏంటో చూపించాడు. ఇంతకీ ఏం రాసుందా గ్రీటింగ్ కార్డులో? అన్నీ ప్రింటెడ్ అక్షరాలు, ప్రింటెడ్ మాటలే... కానీ కింద మాత్రం ‘టు మై వైఫ్... యువర్స్ బిజు’ అని ఉంది! కోచిలోని మహరాజా కళాశాలలో విద్యార్థులు బిజు, శ్రీలత. డిగ్రీకి ముందు నుంచే ఇద్దరికీ పరిచయం. బిజు గాయకుడు. అప్పటికే కాలేజీలో పాటలు పాడి ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. అతను శ్రీలతను చూడగానే ప్రేమలో పడిపోయాడు. కొన్ని రోజుల తర్వాత, ఆమెకు గ్రీటింగ్ కార్డుఇచ్చాడు. అందులో ‘టు మై వైఫ్’ అని చూశాక, లతకు నోట మాట రాలేదు. తనలో కలిగిన సంభ్రమాశ్చర్యాల్ని బయటపెట్టలేదు. ఏం మాట్లాడకుండా వెళ్లిపోయింది. లోలోన మాత్రం వీడేంట్రా బాబూ... నన్నప్పుడే భార్య అంటున్నాడు అనుకుంది. ఆ ఒక్క మాటతో ఆమెకు భవిష్యత్తు చూపించాడు బిజు. తనకు తెలీకుండానే బిజు ప్రేమలో పడిపోయింది శ్రీలత. మనసులోనే అతని ప్రేమకు అంగీకారం తెలిపింది. కానీ పైకి ‘ఓకే’ చెప్పడానికి ఆమెకు ఇంకో లిట్మస్ టెస్ట్ అవసరమైంది. ఒకరోజు తన ఫ్రెండ్ ఆషాకు తన ప్లాన్ చెప్పి పంపించింది. సైన్స్ గ్రూపులో అందమైన, సింగర్ కూడా అయిన ఓ అమ్మాయి గురించి అతని దగ్గర ప్రస్తావించింది ఆషా. ‘‘ఆ అమ్మాయి నీకు మంచి మ్యాచ్ అనుకుంటా’’ అందామె. దీనికి బిజు సమాధానం... ‘‘నాకు అమ్మాయిలతో రొమాన్స్ చేసే ఉద్దేశం లేదు. నేను పెళ్లి చేసుకునే అమ్మాయిని ఇప్పటికే ఫిక్స్ చేసుకున్నా’’ అన్నాడు. ఈ విషయం తెలిశాక, శ్రీలత తన జీవితం బిజుతోనే అని ఫిక్సయిపోయింది. డిగ్రీ ఫైనల్ ఇయర్లో మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు బిజు. శ్రీలత సరే అంది కానీ, ‘‘మనం ఎలా బతుకుతాం. ఇల్లెలా గడుస్తుంది’’ అని అడిగింది. అప్పటికి ఇద్దరి వయసు 20 ఏళ్లు. తర్వాత శ్రీలత తిరువనంతపురంలో లా కోర్సులో చేరింది. బిజు సింగర్‌గా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఆమె లా పూర్తయింది. అతను ఓ మెట్టు ఎదిగాడు. కానీ ఇద్దరి మధ్యా దూరం. దగ్గరగా ఉండాలని ఇద్దరూ మహారాజా కళాశాలలోనే ఎంఏ చేరారు. ఈ కోర్సూ పూర్తయింది. మరోవైపు బిజూ సంగీత కచేరీలు చేసే స్థాయికి ఎదిగాడు. సరిగ్గా తమ తొలి పరిచయమైన పదేళ్లకు 1998లో బిజు, శ్రీలత పెళ్లి చేసుకున్నారు. ప్రేమ పదేళ్ల తర్వాత పెళ్లిగా మారడమంటే సుదీర్ఘమైన విషయమే కదా! ఇప్పుడు బిజు, శ్రీలతలకు ఇద్దరు పిల్లలు. 13 ఏళ్ల సిద్ధార్ధ్, 8 ఏళ్ల సూర్యనారాయణ్. బిజు తరచు మ్యూజిక్ కన్సర్ట్ల కోసం బయట తిరుగుతుంటాడు. శ్రీలత పిల్లల్ని, కుటుంబ బాధ్యతల్ని చూసుకుంటోంది. కులాలు వేరని, తాహతులు వేరని ఒకప్పుడు అభ్యంతరం చెప్పిన పెద్దలు, ఇప్పుడు వారితో కలిసిపోయారు. వారి అనుబంధాన్ని చూసి మురిసిపోతున్నారు. ‘‘బిజులా ప్రేమించే వ్యక్తి ఎవరూ ఉండరు. ఐతే అతని ప్రేమ మాటల్లో ఉండదు. చేతల్లో మాత్రమే చూపిస్తాడు. అతను తరచు వేరే ప్రాంతాలకు వెళ్తుంటాడు. ఎప్పుడొస్తాడా అని మేమంతా ఎదురుచూస్తుంటాం. ప్రతిసారీ బోలెడన్ని బహుమతులతో ఇంటికొస్తాడు. ఐతే తనిచ్చిన తొలి బహుమతే (గ్రీటింగ్ కార్డు) చాలా ప్రత్యేకమైంది. తనపై నేనా రోజు ఏ నమ్మకమైతే పెట్టుకున్నానో... అది నిజమని నిరూపించాడు’’ అంటూ ఉద్వేగంగా చెప్తారు శ్రీలత. మరో ప్రేమ కథ 2011 మే 22. అమెరికాలోని జాప్లిన్. టోర్నెడో గురించి టీవీల్లో హెచ్చరికలు జారీ అవుతున్నాయి. అప్పుడే ఇంటికి వచ్చాడు 31 ఏళ్ల డాన్. భార్య బెథానీ అప్పటికే వణికిపోతోంది. అసలే తమ ఇంటికి బేస్మెంట్ కూడా లేదు. టోర్నెడో తాకిందంటే, ఇల్లు నామరూపాల్లేకుండా పోతుంది. ఏదో ఒకటి చేయాలి అనుకుంటుండగానే, టోర్నెడో బీభత్సం మొదలైపోయింది. ఇంట్లోకి నీళ్లొచ్చేశాయి. ఇల్లు కూలిపోవడం మొదలైంది. డాన్ చకచకా పిల్లోస్ తీసుకున్నాడు. బెథానీని తీసుకుని బాత్రూమ్లోకి పరుగెత్తాడు. ఆమెను బాత్ టబ్‌లో పడుకోమన్నాడు. తనమీద పిల్లోస్ పెట్టాడు. మీద రక్షణగా తాను పడుకుని టబ్‌ను గట్టిగా పట్టుకున్నాడు. టోర్నెడో శాంతించాక - ఇల్లు లేదు... డాన్ లేడు. మిగిలింది బెథానీ మాత్రమే. భార్య ప్రాణం కాపాడటం కోసం తన ప్రాణం వదిలేశాడు డాన్. -
హృదయం: ఆమె... అతడు... ప్రేమ
మాధవి కొంతకాలం హిమాలయాల్లో గడిపారు. యోగాశ్రమాల్లో తన ప్రశ్నలకు సమాధానాలు వెదుక్కున్నారు. దేశమంతా తిరిగారు. పంట పొలాల్లో రైతులతో కలిసి పనిచేశారు. చివరకు ఎదుటి మనిషికి సహాయం చేయడంలోనే జీవితానికి అసలైన అర్థం అని అవగతం చేసుకున్నారు. ప్రేమ! హృదయాల్ని రగిలించేదే కాదు, వెలిగించేది కూడా. ఒకమ్మాయి ఒకబ్బాయిని ప్రేమించడానికి ఏం కావాలి. రంగు, ఒడ్డు, పొడవు, డబ్బు,... ఇది మామూలు అమ్మాయిల మరీ మామూలు ఆలోచన. దేహం అణువణువునా చలం సాహిత్యం ఇంకిపోయిన మాధవి లాంటి అమ్మాయికి మాత్రం నచ్చేవాడు, వచ్చేవాడు కొంచెం డిఫరెంట్‌గా ఉండాలి. మాటల్లో ఆవేశం, మనసులో ఆశయం కనపడాలి. ఓ వేసవి సాయంత్రం దారి పక్కన విరబూసిన మల్లెల్ని చూసి నేలమీది నక్షత్రాలు అనగలిగే చలంలా రొమాంటిక్‌గా ఉండాలి. బాహ్య సౌందర్యాని కన్నా అంతస్సౌందర్యాన్ని ఆరాధించాలి. మనిషిని నిండుగా ప్రేమించగలగాలి. తన మాటల్తో కళ్ల ముందు కొత్త ప్రపంచాల్ని ఆవిష్కరించాలి. ఆ అన్వేషణలో మాధవికి వంశీ పరిచయం అయ్యాడు. మాధవి మెడికల్ స్టూడెంట్, వంశీ ఇంజనీరింగ్ స్టూడెంట్. కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఒకరికొకరు పరిచయం. మొదట వంశీ గురించి రెండు విషయాలు మాధవిని ఆకర్షించాయి. వంశీ వాళ్లింట్లో కింది కులం వాళ్లకు వేరుగా ఒక గ్లాస్ ఉండేది. వాళ్లు అందులోనే నీళ్లు తాగాలి. వంశీ కూడా అదే గ్లాసులో నీళ్లు తాగి ఇంట్లో తిరుగుబాటు జెండా ఎగురవేశాడు. ఇంట్లో తల్లిదండ్రులు ఎప్పుడైనా గొడవ పడితే ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లి, కొండమీద ఒక్కడే కూర్చుని ఆలోచించేవాడు. ఈ రెండూ మాధవిని వంశీ వైపు ఆకర్షించాయి. మొదటిసారి కలిసినప్పుడు కళ్లలో కళ్లు పెట్టి చూస్తూ, ఏవేవో లోకాలు ఆవిష్కరిస్తున్నప్పుడు మాధవి హృదయంలో ప్రేమ భావాలు ఉప్పొంగాయి. తన మనసు కోరుకుంటున్న వ్యక్తి ఇతనే కావచ్చనిపించింది. వంశీకి మాధవితో మాట్లాడుతున్నప్పుడు అలిసిన హృదయానికి సాంత్వన కలిగేది. ఆమె సమక్షంలో తను ఎప్పటికప్పుడు కొత్తగా ఊపిరి పోసుకునేవాడు. ప్రేమ దోబూచులాటలో రుతువులు మారుతున్నాయి. అంతకంతకూ హృదయాలు దగ్గరవుతున్నాయి. కానీ మాధవి మనసులో ఏదో మూల కొంత ఆందోళన. కులం ఒకటి కాదు, వయస్సులో తన కన్నా మూడేళ్లు పెద్ద. ఈ రెండు విషయాలు తనతో చెపితే చిన్న నవ్వు నవ్వాడు. ప్రేమాన్విత: గోసేవలో, గృహసీమలో మాధవి ప్రేమ... హృదయాల్ని వెలిగించేదే కాదు. వైశాల్యాన్ని విస్తరించేది కూడా. మాధవి తన సర్కిల్లో వేరు వేరు సామాజిక స్థాయివాళ్లు పెళ్లి చేసుకుంటే ఎదురైన ప్రమాదాలను గమనించి, కొంత భయపడింది. తనవల్ల వంశీకేమైనా సమస్యలు వస్తాయేమోనని భయపడింది. తన కుటుంబం నుంచి మాధవికి ఏ సమస్యా ఎదురుకాకుండా జాగ్రత్తపడ్డాడు వంశీ. మాధవి ఒకరోజు వంశీని కలిసి పెళ్లి చేసుకుంటే మనకోసం, మన పిల్లలకోసం జీవితాంతం నిలబడగలవా అని అడిగింది. ఒక్క క్షణమైనా ఆలోచించకుండా సరేనన్నాడు. ఆ క్షణమే వారిద్దరూ మానసికంగా ఒక్కటైపోయారు. మధ్యలో ఎడబాట్లు, తడబాట్లు ఎన్ని ఉన్నా ధైర్యంగా నిలబడి పరిస్థితులను ఎదిరించి గెలిచారు. పెళ్లయ్యాక, తాము ప్రేమలోనే కాదు, జీవితంలోనూ గెలిచి చూపించాలన్న తపనతో ఇద్దరూ అమెరికా వెళ్లారు. వంశీ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా, మాధవి డాక్టర్‌గా కెరీర్ ప్రారంభించారు. పెళ్లయ్యాక చాలా కాలం పాటు పిల్లలు కలుగలేదు. మాధవి మానసికంగా కుంగిపోయిన ఆ సమయంలో, వంశీ అన్నీ తానై నిలబడ్డాడు. కొడుకు పుట్టాక, తమ పిల్లాడు అమెరికన్ సంస్కృతిలో పెరిగితే వాడికి సరైన భవిష్యత్ ఇవ్వగలమో లేదోనన్న ఆలోచన వాళ్లను కుదిపేసింది. టీనేజ్ వరకు సరైన విలువలను పాదుకొల్పే వాతావరణంలో ఉంచాలని కొడుకును హైదరాబాద్‌లో సత్యసాయి స్కూల్లో చదివిస్తున్నారు. మరోవైపు ఇద్దరిలో ఈ జీవితానికి మరేదో పరమార్ధం ఉందన్న భావన కలిగింది. ఇద్దరూ కలిసి అమెరికాలో, ఇండియాలో ఎంతో మంది ఆధ్యాత్మికవేత్తలను, ఆలోచనాపరులను కలిశారు. తమ ఆలోచనలను ఆచరణలో పెట్టేందుకు మధ్యమధ్యలో హైదరాబాద్‌కు వస్తూ భావసారూప్యం ఉన్న వ్యక్తులను కలుస్తూ ఇక్కడ సామాజిక సేవలో భాగమయ్యేందుకు బాటలు వేసుకుంటున్నారు. ప్రతీ ఆలోచనలోను, ఆశయంలోనే ఒక్కటై ముందుకు సాగడంలోనే వీళ్లు తమ ప్రేమను సజీవంగా నిలుపుకుంటున్నారు. మాధవి మాటల్లో చెప్పాలంటే చిన్నప్పటినుంచీ ఆమె తన జీవితంలో కోల్పోయిందంతా అతని రాకతో భర్తీ అయింది. నేలను తాకిన గాజుగోళంలా హృదయాలు ముక్కలవుతున్న కాలాల్లో, జీవితకాలం అంతే గాఢంగా, యవ్వనమంత తాజాగా ప్రేమను నిలుపుకోవాలంటే, అది భౌతిక ఆకర్షణల పరిమితిని దాటాలి. విశ్వజనీన ప్రేమగా విస్తరించాలి. - కె.క్రాంతికుమార్‌రెడ్డి