హృదయం: ఆమె... అతడు... ప్రేమ
మాధవి కొంతకాలం హిమాలయాల్లో గడిపారు. యోగాశ్రమాల్లో తన ప్రశ్నలకు సమాధానాలు వెదుక్కున్నారు. దేశమంతా తిరిగారు. పంట పొలాల్లో రైతులతో కలిసి పనిచేశారు. చివరకు ఎదుటి మనిషికి సహాయం చేయడంలోనే జీవితానికి అసలైన అర్థం అని అవగతం చేసుకున్నారు.
ప్రేమ! హృదయాల్ని రగిలించేదే కాదు, వెలిగించేది కూడా. ఒకమ్మాయి ఒకబ్బాయిని ప్రేమించడానికి ఏం కావాలి. రంగు, ఒడ్డు, పొడవు, డబ్బు,... ఇది మామూలు అమ్మాయిల మరీ మామూలు ఆలోచన. దేహం అణువణువునా చలం సాహిత్యం ఇంకిపోయిన మాధవి లాంటి అమ్మాయికి మాత్రం నచ్చేవాడు, వచ్చేవాడు కొంచెం డిఫరెంట్‌గా ఉండాలి. మాటల్లో ఆవేశం, మనసులో ఆశయం కనపడాలి. ఓ వేసవి సాయంత్రం దారి పక్కన విరబూసిన మల్లెల్ని చూసి నేలమీది నక్షత్రాలు అనగలిగే చలంలా రొమాంటిక్‌గా ఉండాలి. బాహ్య సౌందర్యాని కన్నా అంతస్సౌందర్యాన్ని ఆరాధించాలి. మనిషిని నిండుగా ప్రేమించగలగాలి. తన మాటల్తో కళ్ల ముందు కొత్త ప్రపంచాల్ని ఆవిష్కరించాలి.
ఆ అన్వేషణలో మాధవికి వంశీ పరిచయం అయ్యాడు. మాధవి మెడికల్ స్టూడెంట్, వంశీ ఇంజనీరింగ్ స్టూడెంట్. కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఒకరికొకరు పరిచయం. మొదట వంశీ గురించి రెండు విషయాలు మాధవిని ఆకర్షించాయి. వంశీ వాళ్లింట్లో కింది కులం వాళ్లకు వేరుగా ఒక గ్లాస్ ఉండేది. వాళ్లు అందులోనే నీళ్లు తాగాలి. వంశీ కూడా అదే గ్లాసులో నీళ్లు తాగి ఇంట్లో తిరుగుబాటు జెండా ఎగురవేశాడు. ఇంట్లో తల్లిదండ్రులు ఎప్పుడైనా గొడవ పడితే ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లి, కొండమీద ఒక్కడే కూర్చుని ఆలోచించేవాడు. ఈ రెండూ మాధవిని వంశీ వైపు ఆకర్షించాయి. మొదటిసారి కలిసినప్పుడు కళ్లలో కళ్లు పెట్టి చూస్తూ, ఏవేవో లోకాలు ఆవిష్కరిస్తున్నప్పుడు మాధవి హృదయంలో ప్రేమ భావాలు ఉప్పొంగాయి. తన మనసు కోరుకుంటున్న వ్యక్తి ఇతనే కావచ్చనిపించింది. వంశీకి మాధవితో మాట్లాడుతున్నప్పుడు అలిసిన హృదయానికి సాంత్వన కలిగేది. ఆమె సమక్షంలో తను ఎప్పటికప్పుడు కొత్తగా ఊపిరి పోసుకునేవాడు. ప్రేమ దోబూచులాటలో రుతువులు మారుతున్నాయి. అంతకంతకూ హృదయాలు దగ్గరవుతున్నాయి. కానీ మాధవి మనసులో ఏదో మూల కొంత ఆందోళన. కులం ఒకటి కాదు, వయస్సులో తన కన్నా మూడేళ్లు పెద్ద. ఈ రెండు విషయాలు తనతో చెపితే చిన్న నవ్వు నవ్వాడు.
ప్రేమాన్విత: గోసేవలో, గృహసీమలో మాధవి
ప్రేమ... హృదయాల్ని వెలిగించేదే కాదు. వైశాల్యాన్ని విస్తరించేది కూడా.
మాధవి తన సర్కిల్‌లో వేరు వేరు సామాజిక స్థాయివాళ్లు పెళ్లి చేసుకుంటే ఎదురైన ప్రమాదాలను గమనించి, కొంత భయపడింది. తనవల్ల వంశీకేమైనా సమస్యలు వస్తాయేమోనని భయపడింది. తన కుటుంబం నుంచి మాధవికి ఏ సమస్యా ఎదురుకాకుండా జాగ్రత్తపడ్డాడు వంశీ. మాధవి ఒకరోజు వంశీని కలిసి పెళ్లి చేసుకుంటే మనకోసం, మన పిల్లలకోసం జీవితాంతం నిలబడగలవా అని అడిగింది. ఒక్క క్షణమైనా ఆలోచించకుండా సరేనన్నాడు. ఆ క్షణమే వారిద్దరూ మానసికంగా ఒక్కటైపోయారు. మధ్యలో ఎడబాట్లు, తడబాట్లు ఎన్ని ఉన్నా ధైర్యంగా నిలబడి పరిస్థితులను ఎదిరించి గెలిచారు.
పెళ్లయ్యాక, తాము ప్రేమలోనే కాదు, జీవితంలోనూ గెలిచి చూపించాలన్న తపనతో ఇద్దరూ అమెరికా వెళ్లారు. వంశీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా, మాధవి డాక్టర్‌గా కెరీర్ ప్రారంభించారు. పెళ్లయ్యాక చాలా కాలం పాటు పిల్లలు కలుగలేదు. మాధవి మానసికంగా కుంగిపోయిన ఆ సమయంలో, వంశీ అన్నీ తానై నిలబడ్డాడు. కొడుకు పుట్టాక, తమ పిల్లాడు అమెరికన్ సంస్కృతిలో పెరిగితే వాడికి సరైన భవిష్యత్ ఇవ్వగలమో లేదోనన్న ఆలోచన వాళ్లను కుదిపేసింది. టీనేజ్ వరకు సరైన విలువలను పాదుకొల్పే వాతావరణంలో ఉంచాలని కొడుకును హైదరాబాద్‌లో సత్యసాయి స్కూల్‌లో చదివిస్తున్నారు.
మరోవైపు ఇద్దరిలో ఈ జీవితానికి మరేదో పరమార్ధం ఉందన్న భావన కలిగింది. ఇద్దరూ కలిసి అమెరికాలో, ఇండియాలో ఎంతో మంది ఆధ్యాత్మికవేత్తలను, ఆలోచనాపరులను కలిశారు. తమ ఆలోచనలను ఆచరణలో పెట్టేందుకు మధ్యమధ్యలో హైదరాబాద్‌కు వస్తూ భావసారూప్యం ఉన్న వ్యక్తులను కలుస్తూ ఇక్కడ సామాజిక సేవలో భాగమయ్యేందుకు బాటలు వేసుకుంటున్నారు. ప్రతీ ఆలోచనలోను, ఆశయంలోనే ఒక్కటై ముందుకు సాగడంలోనే వీళ్లు తమ ప్రేమను సజీవంగా నిలుపుకుంటున్నారు. మాధవి మాటల్లో చెప్పాలంటే చిన్నప్పటినుంచీ ఆమె తన జీవితంలో కోల్పోయిందంతా అతని రాకతో భర్తీ అయింది. నేలను తాకిన గాజుగోళంలా హృదయాలు ముక్కలవుతున్న కాలాల్లో, జీవితకాలం అంతే గాఢంగా, యవ్వనమంత తాజాగా ప్రేమను నిలుపుకోవాలంటే, అది భౌతిక ఆకర్షణల పరిమితిని దాటాలి. విశ్వజనీన ప్రేమగా విస్తరించాలి.
- కె.క్రాంతికుమార్‌రెడ్డి