k. kranthi kumar reddy
-
వంటనూనెల మంట తీరేదెలా?
ప్రస్తుతం దేశంలో నూనెగింజల ఉత్పత్తికి సాగుచేస్తున్న 27.86 మిలియన్ హెక్టార్లలో కేవలం 7.5 శాతం భూమిని ఆయిల్‌పామ్ సాగుకు మళ్లించగలిగితే చాలు... వంటనూనెల సాగులో భారత్ స్వావలంబన సాధించగలుగుతుంది. అంతేకాదు రూ.50,000 కోట్ల దాకా విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుంది. వాణిజ్య సరళీకరణ ప్రభావం గత రెండు దశాబ్దాల్లో వంట నూనెలకు సంబంధించి భారత్‌కు ఘోరమైన అనుభవాలను మిగిల్చింది. ప్రపంచ బ్యాంకు ఒత్తిళ్ల పుణ్యమా అని భారత్ వంటనూనెల దిగుమతులు గణనీయంగా పెరిగాయి. 1992-93లో 0.1 మిలియన్ టన్నుల వంట నూనెలు మాత్రమే దిగుమతి చేసుకుంటే 2012-13 నాటికి ఆ పరిమాణం కాస్తా 10 మిలియన్ టన్నుల స్థాయికి పెరిగింది. మరోవిధంగా చెప్పాలంటే 2012-13లో మనం రూ. 50,000 కోట్ల విలువైన వంటనూనెలను దిగుమతి చేసుకున్నాం. ఇదే ఆర్థిక సంవత్సరంలో భారత్ తనకు అవసరమైన వంటనూనెల్లో 57 శాతం మేరకు వంటనూనెలను దిగుమతి చేసుకుంది. మన దేశం ముఖ్యంగా ఇండోనేసియా, మలేసియాల నుంచి వీటిని దిగుమతి చేసుకోవడం ద్వారా తన అవసరాలను తీర్చుకుంటోంది. 2012-13లో భారత వాణిజ్యలోటు రికార్డుస్థాయిలో 190.91 బిలియన్ డాలర్లకు చేరుకుంది. మొత్తం వ్యవసాయ దిగుమతుల్లో వంటనూనెల దిగుమతుల వాటా 1991-92లో కేవలం 6 శాతం మాత్రమే ఉండగా, ప్రస్తుతం అది 55 శాతానికి చేరుకుంది. ప్రత్యామ్నాయ వ్యూహాలు అవసరం మన దేశంలో 18 మిలియన్ టన్నుల వంటనూనె వినియోగం జరుగుతోంది. ఇందులో 45 శాతం పామ్ఆయిలే. ఇండియాలో వంటనూనెల వార్షిక తలసరి వినియోగం 1950లో మూడు కిలోలు ఉండగా 2010-11 నాటికి 14.2 కిలోలకు పెరిగింది. 2020 నాటికి ఇది గణనీయంగా పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే పెరుగుతున్న డిమాండ్‌ను అందుకోడానికి దిగుమతులపైనే అధారపడడం సంకుచిత ధోరణే అవుతుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏటా 20 మిలియన్ టన్నులదాకా ఉన్న పామ్ ఆయిల్ డిమాండ్ 2020 నాటికి రెట్టింపు అవుతుందని భావిస్తున్నారు. ఒకవేళ చమురు ఎగుమతి దేశాలు దీనిలో గణనీయ వాటాను బయోఫ్యూయల్‌కు మళ్లిస్తే పరిస్థితి ఇంకా దిగజారుతుందని అంచనా వేస్తున్నారు. చమురు గింజల ఉత్పత్తికి ప్రత్యామ్నాయ వ్యూహాలను రూపొందించుకోవడం ద్వారా రానున్న సంక్షోభాన్ని చక్కదిద్దవచ్చు. ఆయిల్ పామ్ సాగును విస్తరించడం చమురు రంగంలో సహజసిద్ధంగా పటుతరమైన మార్గమవుతుంది. వాస్తవానికి విస్తారంగా ఆయిల్‌పామ్ తోటలను పెంచుకోగలిగితే వంటనూనెల్లో మన దేశం స్వావలంబన సాధించగలుగుతుంది. ఇతర నూనె గింజలతో పోల్చితే ఆయిల్‌పామ్ నుంచి వచ్చే ఆయిల్ శాతం చాలా ఎక్కువ. ఉదాహరణకు ఆవగింజల నుంచి వచ్చే నూనె కన్నా ఆరు రెట్లు అధికంగానూ, వేరుశనగ(పల్లీ) గింజలకన్నా ఐదు రెట్లు అధికంగా ఆయిల్‌పామ్ నుంచి ఆయిల్‌ను రాబట్టవచ్చు. ప్రపంచవ్యాప్తంగా వంటనూనెల ఉత్పత్తిలోనూ, వినియోగంలోనూ 33 శాతం వాటాతో పామ్ ఆయిల్ అగ్రస్థానంలో ఉంది. మందకొడిగా సాగు మన దేశంలో ఆయిల్ పామ్ సాగును ప్రవేశపెట్టి పాతికేళ్లయినా ప్రస్తుతానికి క్రూడ్ పామాయిల్ ఉత్పత్తి 1,25,000 టన్నులకే పరిమితమయ్యింది. ఆయిల్ పామ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్గానీ, ఆయిల్‌పామ్ సాగువిస్తరణ కార్యక్రమం చెప్పుకోదగినస్థాయిలో ముందుకు సాగలేదు. దేశంలోని 15.80 మిలియన్ హెక్టార్లలో అనేక రకాల మిశ్రమ చమురు గింజల ద్వారా 4 మిలియన్ టన్నుల చమురును ఉత్పత్తి చేస్తున్నారు. అయితే అదే పరిమాణంలో పామ్‌ఆయిల్‌ను ఒక మిలియన్ హెక్టార్ విస్తీర్ణం నుంచే ఉత్పత్తి చేయవచ్చు. ప్రస్తుతం దేశంలో 1.7 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఆయిల్‌పామ్‌ను సాగు చేస్తున్నారు. దీన్ని ఒక మిలియన్ హెక్టార్లలో సాగుచేసే అవకాశం ఉందని నిపుణులు గుర్తించారు. ఆయిల్‌పామ్ సాగులో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది. ఒకవేళ అదనంగా 8 లక్షల హెక్టార్లను సాగులోకి తీసుకురాగలిగితే ప్రస్తుత ధరవరల ప్రకారం దిగుమతుల భారం రూ. 45,000 కోట్ల దాకా ఆదా అవుతుంది. ఆయిల్ పామ్ జీవితం సుమారుగా 25 ఏళ్లు అనుకుంటే...ప్రస్తుతం అమల్లో ఉన్న ధరల ప్రకారం రూ. తొమ్మిది లక్షల కోట్ల దాకా మొత్తానికి విదేశీ మారకద్రవ్యాన్ని ఆదాచేయొచ్చు. సరియైన ధరను ఖరారు చేయడం ద్వారా ఆయిల్‌పామ్ ద్వారా ఎంతో ప్రయోజనం పొందవచ్చు. ప్రస్తుతం నూనెగింజల ఉత్పత్తికి సాగుచేస్తున్న 27.86 మిలియన్ హెక్టార్లలో కేవలం 7.5 శాతం భూమిని ఆయిల్‌పామ్ సాగుకు మళ్లించగలిగితే చాలు... వంటనూనెల సాగులో భారత్ స్వావలంబన సాధించగలుగుతుంది. అంతేకాదు రూ.50,000 కోట్ల దాకా విదేశీ మారకద్రవ్యం ఆదా చేయగలుగుతుంది. రైతులకు దక్కని గిట్టుబాటు రేటు ఆయిల్‌పామ్ మద్దతు ధరపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయం రైతులను గణనీయంగా ప్రభావితం చేస్తుంది. పర్యావరణకు సంబంధించిన భద్రత, రైతుల జీవనోపాధికి సంబంధించిన కోణంలో కూడా ఇది ఎంతో ముఖ్యమైనది. అయితే ఆయిల్‌పామ్ రంగంలో కొన్ని అసంబద్ధమైన పోకడలు ఉన్నాయి. ఆయిల్‌పామ్ సాగు ప్రాంతాలను కొన్ని జోన్లుగా విభజించి, రైతులు తమ ఉత్పత్తిని తమకు సంబంధించిన జోన్లో కేటాయించిన ప్రాసెసర్‌కే విధిగా అమ్మాల్సిన పరిస్థితి ఉంది. ఈ పాత పద్ధతిని రద్దు చేయాలి. తనకు హెచ్చు రేటు వచ్చే చోటు తన ఉత్పత్తిని అమ్ముకునే స్వేచ్ఛ రైతుకు ఇవ్వాలి. ఆయిల్‌పామ్ సాగు చేసే రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి. ప్రస్తుతం చెల్లిస్తున్న రేటు పరిశ్రమకు అనుకూలంగా, రైతులకు నష్టదాయకంగా ఉందని చెప్పకతప్పదు. ఇది సంప్రదాయ సాగు కాదు. అంతే కాదు, కేంద్ర ప్రభుత్వం ఒత్తిడిమేరకు చిన్నరైతులు ఎంతో వ్యయప్రయాసలకోర్చి దీన్ని వేస్తున్నారు. డబ్ల్యూటీవో ఒప్పందం తర్వాత అమల్లోకి వచ్చిన వంటనూనెల విధానం వల్ల దేశీయంగా ఆయిల్‌పామ్ ఉత్పత్తిలో నిలకడ లేకుండా పోయింది. అంతేకాకుండా అంతర్జాతీయ ధరల వత్తిళ్ల ప్రభావంతో ఆయిల్‌పామ్ రైతులు తీవ్ర నష్టాలకు లోనయ్యారు. మార్కెట్ రేటుకూ, తాము పెట్టిన పెట్టుబడులకూ చాలా వ్యత్యాసం ఉండడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. దీనితో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లోని రైతులు ఆయిల్‌పామ్ పంటను తీసేశారని పత్రికలలో వార్తలు కూడా వచ్చాయి. జాతీయ బోర్డు కావాలి ఆయిల్‌పామ్ సాగు అభివృద్ధికి ప్రభుత్వం వైపు నుంచి చేయాల్సింది ఎంతో ఉంది. కొబ్బరి అభివృద్ధి బోర్డు మాదిరిగానే జాతీయస్థాయిలో ఆయిల్‌పామ్ అభివృద్ధి బోర్డును నెలకొల్పాలి. పామాయిల్ పౌష్టికాహారంగా కూడా ఉపయోగపడుతుంది. దీనికి ‘అమోఘమైన ఆయిల్’గా పేరుంది. మరోవైపు దీన్ని బయోఫ్యూయల్‌గా కూడా ఉపయోగిస్తున్నారు. విదేశాలలో ఆయిల్‌పామ్‌ను బడా కంపెనీలు పెద్దస్థాయిలో ఉత్పత్తి చేస్తున్నాయి. కాని ఇండియాలో మాత్రం ఇది ఇంకా చిన్న కమతాల్లోనే సాగవుతోంది. ముఖ్యంగా భారత్‌లాంటి వర్ధమాన దేశాల్లో దారిద్య్ర నిర్మూలనకు ఆయిల్‌పామ్ సాగు ఒక శక్తిమంతమైన సాధనంగా ఉపకరిస్తుందనడంలో సందేహం లేదు. - (వ్యాసకర్త విధాన విశ్లేషకులు) డాక్టర్ కె.క్రాంతి కుమార్ రెడ్డి -
హృదయం: ఆమె... అతడు... ప్రేమ
మాధవి కొంతకాలం హిమాలయాల్లో గడిపారు. యోగాశ్రమాల్లో తన ప్రశ్నలకు సమాధానాలు వెదుక్కున్నారు. దేశమంతా తిరిగారు. పంట పొలాల్లో రైతులతో కలిసి పనిచేశారు. చివరకు ఎదుటి మనిషికి సహాయం చేయడంలోనే జీవితానికి అసలైన అర్థం అని అవగతం చేసుకున్నారు. ప్రేమ! హృదయాల్ని రగిలించేదే కాదు, వెలిగించేది కూడా. ఒకమ్మాయి ఒకబ్బాయిని ప్రేమించడానికి ఏం కావాలి. రంగు, ఒడ్డు, పొడవు, డబ్బు,... ఇది మామూలు అమ్మాయిల మరీ మామూలు ఆలోచన. దేహం అణువణువునా చలం సాహిత్యం ఇంకిపోయిన మాధవి లాంటి అమ్మాయికి మాత్రం నచ్చేవాడు, వచ్చేవాడు కొంచెం డిఫరెంట్‌గా ఉండాలి. మాటల్లో ఆవేశం, మనసులో ఆశయం కనపడాలి. ఓ వేసవి సాయంత్రం దారి పక్కన విరబూసిన మల్లెల్ని చూసి నేలమీది నక్షత్రాలు అనగలిగే చలంలా రొమాంటిక్‌గా ఉండాలి. బాహ్య సౌందర్యాని కన్నా అంతస్సౌందర్యాన్ని ఆరాధించాలి. మనిషిని నిండుగా ప్రేమించగలగాలి. తన మాటల్తో కళ్ల ముందు కొత్త ప్రపంచాల్ని ఆవిష్కరించాలి. ఆ అన్వేషణలో మాధవికి వంశీ పరిచయం అయ్యాడు. మాధవి మెడికల్ స్టూడెంట్, వంశీ ఇంజనీరింగ్ స్టూడెంట్. కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఒకరికొకరు పరిచయం. మొదట వంశీ గురించి రెండు విషయాలు మాధవిని ఆకర్షించాయి. వంశీ వాళ్లింట్లో కింది కులం వాళ్లకు వేరుగా ఒక గ్లాస్ ఉండేది. వాళ్లు అందులోనే నీళ్లు తాగాలి. వంశీ కూడా అదే గ్లాసులో నీళ్లు తాగి ఇంట్లో తిరుగుబాటు జెండా ఎగురవేశాడు. ఇంట్లో తల్లిదండ్రులు ఎప్పుడైనా గొడవ పడితే ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లి, కొండమీద ఒక్కడే కూర్చుని ఆలోచించేవాడు. ఈ రెండూ మాధవిని వంశీ వైపు ఆకర్షించాయి. మొదటిసారి కలిసినప్పుడు కళ్లలో కళ్లు పెట్టి చూస్తూ, ఏవేవో లోకాలు ఆవిష్కరిస్తున్నప్పుడు మాధవి హృదయంలో ప్రేమ భావాలు ఉప్పొంగాయి. తన మనసు కోరుకుంటున్న వ్యక్తి ఇతనే కావచ్చనిపించింది. వంశీకి మాధవితో మాట్లాడుతున్నప్పుడు అలిసిన హృదయానికి సాంత్వన కలిగేది. ఆమె సమక్షంలో తను ఎప్పటికప్పుడు కొత్తగా ఊపిరి పోసుకునేవాడు. ప్రేమ దోబూచులాటలో రుతువులు మారుతున్నాయి. అంతకంతకూ హృదయాలు దగ్గరవుతున్నాయి. కానీ మాధవి మనసులో ఏదో మూల కొంత ఆందోళన. కులం ఒకటి కాదు, వయస్సులో తన కన్నా మూడేళ్లు పెద్ద. ఈ రెండు విషయాలు తనతో చెపితే చిన్న నవ్వు నవ్వాడు. ప్రేమాన్విత: గోసేవలో, గృహసీమలో మాధవి ప్రేమ... హృదయాల్ని వెలిగించేదే కాదు. వైశాల్యాన్ని విస్తరించేది కూడా. మాధవి తన సర్కిల్లో వేరు వేరు సామాజిక స్థాయివాళ్లు పెళ్లి చేసుకుంటే ఎదురైన ప్రమాదాలను గమనించి, కొంత భయపడింది. తనవల్ల వంశీకేమైనా సమస్యలు వస్తాయేమోనని భయపడింది. తన కుటుంబం నుంచి మాధవికి ఏ సమస్యా ఎదురుకాకుండా జాగ్రత్తపడ్డాడు వంశీ. మాధవి ఒకరోజు వంశీని కలిసి పెళ్లి చేసుకుంటే మనకోసం, మన పిల్లలకోసం జీవితాంతం నిలబడగలవా అని అడిగింది. ఒక్క క్షణమైనా ఆలోచించకుండా సరేనన్నాడు. ఆ క్షణమే వారిద్దరూ మానసికంగా ఒక్కటైపోయారు. మధ్యలో ఎడబాట్లు, తడబాట్లు ఎన్ని ఉన్నా ధైర్యంగా నిలబడి పరిస్థితులను ఎదిరించి గెలిచారు. పెళ్లయ్యాక, తాము ప్రేమలోనే కాదు, జీవితంలోనూ గెలిచి చూపించాలన్న తపనతో ఇద్దరూ అమెరికా వెళ్లారు. వంశీ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా, మాధవి డాక్టర్‌గా కెరీర్ ప్రారంభించారు. పెళ్లయ్యాక చాలా కాలం పాటు పిల్లలు కలుగలేదు. మాధవి మానసికంగా కుంగిపోయిన ఆ సమయంలో, వంశీ అన్నీ తానై నిలబడ్డాడు. కొడుకు పుట్టాక, తమ పిల్లాడు అమెరికన్ సంస్కృతిలో పెరిగితే వాడికి సరైన భవిష్యత్ ఇవ్వగలమో లేదోనన్న ఆలోచన వాళ్లను కుదిపేసింది. టీనేజ్ వరకు సరైన విలువలను పాదుకొల్పే వాతావరణంలో ఉంచాలని కొడుకును హైదరాబాద్‌లో సత్యసాయి స్కూల్లో చదివిస్తున్నారు. మరోవైపు ఇద్దరిలో ఈ జీవితానికి మరేదో పరమార్ధం ఉందన్న భావన కలిగింది. ఇద్దరూ కలిసి అమెరికాలో, ఇండియాలో ఎంతో మంది ఆధ్యాత్మికవేత్తలను, ఆలోచనాపరులను కలిశారు. తమ ఆలోచనలను ఆచరణలో పెట్టేందుకు మధ్యమధ్యలో హైదరాబాద్‌కు వస్తూ భావసారూప్యం ఉన్న వ్యక్తులను కలుస్తూ ఇక్కడ సామాజిక సేవలో భాగమయ్యేందుకు బాటలు వేసుకుంటున్నారు. ప్రతీ ఆలోచనలోను, ఆశయంలోనే ఒక్కటై ముందుకు సాగడంలోనే వీళ్లు తమ ప్రేమను సజీవంగా నిలుపుకుంటున్నారు. మాధవి మాటల్లో చెప్పాలంటే చిన్నప్పటినుంచీ ఆమె తన జీవితంలో కోల్పోయిందంతా అతని రాకతో భర్తీ అయింది. నేలను తాకిన గాజుగోళంలా హృదయాలు ముక్కలవుతున్న కాలాల్లో, జీవితకాలం అంతే గాఢంగా, యవ్వనమంత తాజాగా ప్రేమను నిలుపుకోవాలంటే, అది భౌతిక ఆకర్షణల పరిమితిని దాటాలి. విశ్వజనీన ప్రేమగా విస్తరించాలి. - కె.క్రాంతికుమార్‌రెడ్డి