ప్రపంచంలోనే తొలి మెటావర్స్ 5జీ స్మార్ట్ ఫోన్, విడుదల ఎప్పుడంటే!
మనిషి తనకున్న కొద్ది పాటి జీవితాన్ని సుసంపన్నం చేసుకునేందుకు కొత్త మార్గాల్ని అన్వేషిస్తున్నాడు. అందుకే తాను అనుకున్న ఊహా ప్రపంచంలో విహరించేందుకు మెటావర్స్ పేరుతో రెండో ప్రపంచాన్ని నిర్మించుకుంటున్నాడు. ఇప్పుడీ మెటావర్స్ టెక్నాలజీ పేరుతో యూజర్లకు మరింత చేరువయ్యేందుకు ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ప్రపంచంలోనే తొలి మెటావర్స్ ఫోన్‌ను విడుదల చేయనుంది. ఆ ఫోన్ విశేషాలేంటో తెలుసుకుందాం.
2008లో తైవాన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజం హెచ్‌టీసీ సంస్థ ప్రపంచంలోనే తొలిసారి ఆండ్రాయిడ్ ఫోన్‌ను పరిచయం చేసింది. ఆ ఫోన్ సేల్స్ విభాగంలో యాపిల్, శాంసంగ్‌లకు గట్టి పోటి ఇచ్చింది. కానీ టెక్నాలజీ అప్డేట్ చేయడంలో అలసత్వం, మార్కెటింగ్ వ్యూహాలు, తక్కువ బడ్జెట్‌తో ఎక్కువ ఫోన్లు సేల్ చేయాలన్న చైనా కంపెనీల మార్కెట్ సూత్రం ముందుకు హెచ్‌టీసీ నిలవలేకపోయింది. చైనా స్మార్ట్ ఫోన్ సంస్థలైన షావోమీ, వివో, ఒప్పోతో పాటు శాంసంగ్, యాపిల్ కంపెనీల ఆధిపత్యంతో స్మార్ట్ ఫోన్ మార్కెట్‌కు గుడ్‌బై చెప్పింది.
కొత్త స్ట్రాటజీ
స్మార్ట్ ఫోన్ మార్కెట్‌పై పాగే వేసేందుకు సరికొత్త వ్యూహంతో ముందుకు వస్తోంది. ఇతర దిగ్గజ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీల కంటే విభిన్నంగా ఫోన్లలో మెటావర్స్ టెక్నాలజీని పరిచయం చేస్తున్నట్లు మొబైల్ వరల్డ్ కాంగ్రెస్-2022 వేదికగా ప్రకటించింది. 5జీ ప్రీమియం సెగ్మెంట్లో స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేస్తున్నట్లు హెచ్‌టీసీ ఆసియా పసిఫిక్ జనరల్ మేనేజర్ చార్లెస్ హుయాంగ్ తెలిపారు. ఏప్రిల్ 28న విడుదల కానున్న ఈ ఫోన్లో అగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్),వర్చువల్ రియాలిటీ(వీఆర్) టెక్నాలజీలు అందుబాటులో ఉండనున్నాయి.
మెటావర్స్ ఫోన్ ఫీచర్లు
ఫోన్లో ఏఆర్, వీఆర్ టెక్నాలజీ ఇంటిగ్రీట్ చేస్తూ 'వైవర్స్' పేరుతో మెటావర్స్‌ను పరిచయం చేయనుంది. 6 అంగుళాలు, 3500ఏఎంహెచ్ బ్యాటరీ, 12 ఎంపీ ప్లస్ 16ఎంపీ రేర్ కెమెరా, 8ఎంపీ ప్లస్ 8ఎంపీ సెల్ఫీ కెమెరా, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 వంటి ఫీచర్లు ఉండగా.. ఈ మెటావర్స్ ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు యూజర్లు ఆసక్తి చూపిస్తున్నారని హెచ్‌టీసీ ప్రతినిధులు చెబుతున్నారు. కాగా, మరికొద్ది రోజుల్లో విడుదల కానున్న హెచ్‌టీసీ మెటావర్స్ ఫోన్ స్మార్ట్ ఫోన్ యూజర్లను అట్రాక్ట్ చేస్తుందా? లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సి ఉంది.