యంత్రపరికరాల రంగంపై ప్రత్యేక దృష్టి
♦ 2025 నాటికి అదనంగా 2.1 కోట్ల ఉద్యోగాల కల్పన లక్ష్యం
♦ తయారీలో వాటా 20 శాతానికి పెంచుకోవడానికి ప్రాధాన్యం
న్యూఢిల్లీ: భారీ యంత్రపరికరాల తయారీ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యలు పరిష్కరించే దిశగా కేంద్రం తొలిసారిగా ప్రత్యేక విధానాన్ని ఆవిష్కరించింది. దీని ద్వారా 2025 నాటికి అదనంగా 2.1 కోట్ల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా నిర్దేశించుకుంది. అలాగే మొత్తం తయారీ కార్యక లాపాల్లో యంత్ర పరికరాల విభాగం వాటాను ప్రస్తుతమున్న 12 శాతం నుంచి 2025 నాటికల్లా 20 శాతానికి పెంచుకోవాలని నిర్దేశించుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ గత వారం దీనికి ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అనంత్ గీతే తెలిపారు. ప్రస్తుతం రూ. 2.3 లక్షల కోట్లుగా ఉన్న యంత్రపరికరాల తయారీని 2025 నాటికల్లా రూ. 7.5 లక్షల కోట్లకు పెంచుకునేలా జాతీయ యంత్రపరికరాల విధానాన్ని రూపొందించినట్లు మేకిన్ ఇండియా వారోత్సవంలో పాల్గొన్న సందర్భంగా సోమవారం ఆయన వివరించారు.
విద్యుత్ రంగంలోకి 1 లక్ష కోట్ల డాలర్లు ..
విద్యుత్ రంగానికి సంబంధించి గత కొన్నాళ్లుగా ప్రభుత్వం పలు సంస్కరణలు ప్రవేశపెట్టిన దరిమిలా 2030 నాటికల్లా ఈ రంగంలోకి కనీసం 1 లక్ష కోట్ల డాలర్ల పెట్టుబడులు రాగలవని అంచనా వేస్తున్నట్లు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియుష్ గోయల్ చెప్పారు. డిస్కంలకు తోడ్పాటునిచ్చే ‘ఉదయ్’ స్కీము, టారిఫ్ విధానాలు, మరోవైపు, ప్రభుత్వ రంగ రిఫైనరీలు స్పాట్ క్రూడ్ కొనుగోళ్లకు సంబంధించి .. టెండర్ల ప్రక్రియ ప్రస్తావన లేకుండా కొత్తగా ముడిచమురు దిగుమతి విధానాన్ని రూపొందించనున్నట్లు చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.
మహారాష్ట్రలో రూ. 6 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు..
మేకిన్ ఇండియా వీక్లో భాగంగా సోమవారం నిర్వహించిన సెమినార్లో దాదాపు రూ. 6.11 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు సంబంధించి సుమారు 2,560 అవగాహన ఒప్పందాలు (ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తెలిపారు. వీటితో దాదాపు 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించగలవన్నారు.