GHMC: మేయర్ సహా మంత్రులకు జీహెచ్ఎంసీ జరిమానా
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 21వ తేదీ నుంచి ట్విట్టర్ ద్వారా ఫ్లెక్సీలు, హోర్డింగులు, ఇతర నిబంధనల అతిక్రమణలపై ఫిర్యాదుల స్వీకరణను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగంలోని సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్(సీఈసీ) ఫిర్యాదుల స్వీకరణను పునరుద్ధరించింది. టీఆర్ఎస్ ప్లీనరీ నేపథ్యంలో టీఆర్ఎస్ నేతల ఫ్లెక్సీలతో నగరాన్ని నింపేందుకు, వారికి పెనాల్టీలు వేయకుండా ఉండేందుకేనని ప్రజల నుంచి ముఖ్యంగా నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. సర్వర్ అప్డేషన్ కోసమని సీఈసీ పేర్కొన్నా ప్రజలు విశ్వసించలేదు. ప్రతిపక్ష రాజకీయపార్టీలు ఆందోళనలు సైతం నిర్వహించాయి.
► తాజాగా ట్విట్టర్ ఖాతా తెరిచి ఇన్ని రోజుల్లో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి ఈ చలానాలతో పెనాల్టీలు విధించారు. ఈ పెనాల్టీల విధింపులో మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం ఉన్నారు. పెనాల్టీల విధింపు ఇంకా కొనసాగుతోంది. తాజా సమాచారం మేరకు జారీ అయినా పెనాల్టీల్లో ఆయా నాయకులకు పడ్డ మొత్తం పెనాల్టీలు దాదాపుగా దిగువ విధంగా ఉన్నాయి. (వాట్సాప్ చెకింగ్ వీడియో వైరల్: క్లారిటీ ఇచ్చిన సీపీ అంజనీ కుమార్)
► ఒక్కొక్కరికి పదుల సంఖ్యలో ఫ్లెక్సీల ఏర్పాటుకు ఈ పెనాల్టీలు విధించారు. అందరికంటే ఎక్కువగా ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు రూ.3 లక్షలకు పైగా, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు రూ.1.60 లక్షలకు పైగా పెనాల్టీలు పడ్డాయి. టీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ పేరిట రూ.2.20 లక్షలు, మంత్రి చామకూర మల్లారెడ్డికి రూ.10 వేలు, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావుకు రూ.10 వేలు, కాలేరు వెంకటేశ్‌కు రూ.25 వేలు, మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి రూ.60వేలు పెనాల్టీలు పడ్డాయి. కార్పొరేటర్ రాగం సుజాత రూ.2 లక్షలు. ఇవి ఇంకా పెరిగే అవకాశం ఉంది. (చదవండి: రిటైరైనవారు ప్రభుత్వ సలహాదారులా?)