నగరంపై మళ్లీ ‘హుజీ’ పడగ!
నసీర్ అరెస్టుతో తిరిగి తెరపైకి సంస్థ కదలికలు
అణువణువూ గాలిస్తున్న పోలీసులు
సిటీబ్యూరో: ఉగ్రవాద సంస్థ హుజీతో సంబంధమున్న మహమ్మద్ నసీర్తో పాటు మరో ఐదుగురి అరెస్టుతో సిటీలో కలకలం రేగింది. ఈ ఘటనతో హుజీ కదలికలు మరోసారి బయటపడ్డాయి. పంద్రాగస్టు వేడుకలకు ముందే వీరు పట్టుబడటంతో...ఇంకా ఎవరైనా ఉన్నారా అని తెలుసుకునేందుకు తనిఖీలు ముమ్మరం చేశారు. నగరంపై హుజీ ప్రభావాన్ని పరిశీలిస్తే గతంలో జరిగిన చాలా ఘటనలు కళ్ల ముందు మెదులుతాయి. 1992లో జరిగిన ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ కృష్ణప్రసాద్, అతని గన్‌మన్ హత్యతో రాష్ర్టంలో ఉగ్రవాదుల హింస ప్రారంభమైంది. 2013 ఫిబ్రవరి 21న జరిగిన దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల వరకు ఇది కొనసాగింది. హైదరాబాద్‌లో జరిగిన రాక్షస క్రీడల్లో అత్యధికం హుజీవే. 2004 అక్టోబర్ 12న బేగంపేట గ్రీన్‌ల్యాండ్స్‌కు సమీపంలో ఉన్న హైదరాబాద్ కమిషనర్ టాస్క్‌ఫోర్స్ కార్యాలయంపై మానవబాంబు దాడికి పాల్పడింది కూడా హుజీనే. ఈ కేసుతో సహా వివిధ కేసుల్లో వాంటెడ్‌గా ఉండి 2007లో పాకిస్తాన్‌లోని కరాచీలో హతమైన కరుడుగట్టిన ఉగ్రవాది సాహెద్ అలియాస్ బిల్లాల్ నగరంలోని ముషారంబాగ్కు చెందినవాడు కావడం గమనార్హం. 2006 అక్టోబర్‌లో ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని ఒడియన్ థియేటర్లో గ్రానైట్ దాడికి పాల్పడి 2011లో పోలీసులకు చిక్కిన జియా ఉల్ హక్ హుజీ సంస్థ వాడే. బెంగళూరు, హైదరాబాద్‌లలో రాజకీయ నేతలతో పాటు ప్రముఖుల హత్యకు కుట్రను బెంగళూరు పోలీసులు 2013లో ఛేదించారు. దీని వెనుక కూడా హుజీనే ఉన్నట్టు తేలింది.
ఈ కేసుతో సంబంధం ఉన్న పాతబస్తీకి చెందిన ఒబెత్ ఉర్ రెహమన్ కూడా హుజీకి చెందిన వాడే. 2007 ఆగస్టు 25నజరిగిన గోకుల్‌చాట్, లుంబినీపార్క్ పేలుళ్లు, 2013 ఫిబ్రవరి 21న జరిగిన దిల్సుఖ్నగర్ జంట పేలుళ్లలో పాల్గొన్నది ఇండియన్ ముజాహిద్దీన్(ఐఎం)కు చెందిన వారు. అయితే హుజీకి, ఐఎంకి సంబంధాలున్నాయనే విషయం పలు సందర్భాల్లో వెల్లడైంది. దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో నిందితుడైన వఖాస్‌ను హుజీకి చెందిన మహమ్మద్ నసీర్ భారత సరిహద్దులు దాటించి బంగ్లాదేశ్‌కు వెళ్లేందుకు సహకరించడం కూడా వారి సంస్థల మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని చెప్పకనే చెప్తోంది.
పాస్‌పోర్టులపై దృష్టి...
ఇప్పటికే చంచల్‌గూడకు చెందిన మహమ్మద్ మసూద్ అలీ ఖాన్ సహకారంతో మహమ్మద్ నసీర్ ఓటరు గుర్తింపు కార్డులు, ఆధార్ కార్డులు పొందడమే కాకుండా 15 మందికి భారత పాస్‌పోర్టులు ఇప్పించి విదేశాలకు పంపించడంపైనా పోలీసులు దృష్టి కేంద్రీకరించారు. ఇతను హుజీ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేందుకు పంపాడా? లేదా డబ్బులు సంపాదించేందుకు వాళ్లకు ఉద్యోగాలు ఇప్పిస్తానని పంపించాడా?...ఇలా అన్ని కోణాల్లో విచారణ సాగిస్తున్నారు. పాస్‌పోర్టు వెరిఫికేషన్‌కు వెళ్లిన కానిస్టేబుళ్లను విచారించి, విధుల్లో అలసత్వం వహించినందుకు వారిపైనా చర్యలు తీసుకొనే అవకాశం ఉందని ఓ పోలీసు అధికారి తెలిపారు.