ఆ ఒక్క సినిమా వల్ల నేను హీరోయిన్ కాలేకపోయా: నటి
సల్మాన్ ఖాన్, మాధురి దీక్షిత్ జంటగా నటించిన హిట్ చిత్రాల్లో హమ్ ఆప్కే హై కోన్ ఒకటి. 1994లో రిలీజైన ఈ సినిమాలో మాధురి చెల్లెలు పాత్ర బాగా క్లిక్ అయింది. ఈ పాత్రను రేణుక శహానే పోషించింది. అయితే ఆ క్యారెక్టర్లో నటించడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోమని చెప్పాడట నిర్మాత. తాజాగా ఈ విషయాన్ని రేణుక ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది.
'హమ్ ఆప్కే హై కోన్ నిర్మాత రాజ్‌కుమార్ ఈ మూవీ విజయవంతం అవుతుందని ముంచే అంచనా వేశాడు. కానీ హీరోయిన్ చెల్లెలుగా నటించడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోమని హెచ్చరించాడు. ఒక్కసారి హీరోయిన్‌కు చెల్లెలుగా నటించావంటే ఎప్పటికీ కథానాయికను కాలేనని, కేవలం సెకండ్ లీడ్‌గా లేదంటే సైడ్ రోల్స్ ఇస్తారని నొక్కి చెప్పాడు. ఆయన మాటలు నన్ను ఆశ్చర్యానికి గురి చేశాయి. ముందైతే ఈ మూవీ పూర్తి చేద్దామనుకున్నాను. ఆ సినిమా హిట్టయ్యాక నాకు ఆఫర్లైతే వచ్చాయి కానీ హీరోయిన్గా మాత్రం కాదు. సైడ్ క్యారెక్టర్స్ ఇచ్చారు. దానివల్ల నాకు పెద్దగా పేరు ప్రఖ్యాతలేమీ రాలేదు' అని చెప్పుకొచ్చింది. రేణుక మాసూమ్, తుమ్ జియో హజారూన్ సాల్, ఏక్ అలగ్ మౌసమ్ వంటి చిత్రాల్లో నటించింది. తర్వాతి కాలంలో నటుడు అశుతోశ్ రానాను పెళ్లి చేసుకుంది.
చదవండి: ఫిలిం చాంబర్లో మతిస్థిమితం లేని వ్యక్తి.. బాలయ్యకు వేలు చూపిస్తూ