Human Bomb
-
ఫ్రాన్స్: ఇరాన్ కాన్సులేట్‌లో మానవ బాంబు కలకలం
ప్యారిస్: ఫ్రాన్స్ రాజధాని నగరం ప్యారిస్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయంలో శుక్రవారం(ఏప్రిల్19) మానవ బాంబు కలకలం రేగింది. ఉదయం రాయబార కార్యాలయంలోకి ప్రవేశించిన ఓ వ్యక్తి తనను తాను పేల్చుకుంటానని బెదిరించాడు. అయితే అతడిని కార్యాలయం బయటికి తీసుకువచ్చిన పోలీసులు తొలుత తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో అతడి వద్ద ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని వెల్లడైంది. అనంతరం అతడిని అరెస్టు చేశారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు ఇరాన్ రాయబార కార్యాలయాన్ని పూర్తిగా చుట్టుముట్టారు. కాగా, ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధ వాతావారణం నెలకొన్న విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. ఇరాన్లో భారీ పేలుళ్లు -
ఖతర్నాక్ ఖలీమ్! మానవ బాంబు డాలిన్‌ను సిటీకి తీసుకొచ్చింది ఇతడే..
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో గత ఏడాది దసరా ఉత్సవాల నేపథ్యంలో హ్యాండ్ గ్రెనేడ్లతో విధ్వంసాలకు కుట్ర పన్నిన కేసులో హైదరాబాద్ సిట్ పోలీసులు గురువారం అరెస్టు చేసిన మహ్మద్ అబ్దుల్ ఖలీమ్ సామాన్యుడు కాదని అధికారులు చెబుతున్నారు. లష్కరేతోయిబా (ఎల్ఈటీ) ఉగ్రవాదులు అబ్దుల్ జాహెద్, మహ్మద్ సమీయుద్దీన్, మాజ్ హసన్ ఫారూఖ్‌లకు సంబంధించిన కేసులోనే సిట్ ఇతడినీ కటకటాల్లోకి పంపింది. తదుపరి విచారణ నిమిత్తం ఖలీమ్‌ను తమ కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులు నిర్ణయించారు. బిలాల్ ద్వారానే ఉగ్రబాట... ఎల్బీనగర్ సమీపంలోని ఎన్టీఆర్ నగర్‌కు చెందిన ఖలీమ్ అక్కడే వెల్డింగ్ దుకాణం నిర్వహిస్తుంటాడు. ముసరాంబాగ్ ప్రాంతానికి చెందిన, పాకిస్థాన్‌లోని కరాచీలో ఎన్కౌంటర్ అయిన ఎల్ఈటీ ఉగ్రవాది షాహెద్ అలియాస్ బిలాల్ ద్వారా ఉగ్రవాద బాట పట్టాడు. 2004లో నగరం నుంచి పారిపోయి సౌదీ అరేబియాలో తలదాచుకున్న బిలాల్ ఆదేశాల మేరకు 2005లో అతడి సోదరుడు జాహెద్‌తో కలిసి పని చేయడానికి అంగీకరించాడు. అప్పట్లో ఈ లష్కరేతోయిబా ఉగ్రవాదులు గ్రీన్‌ల్యాండ్స్‌లో ఉండే హైదరాబాద్ పోలీసు కమిషనర్, టాస్‌్కఫోర్స్ కార్యాలయాన్ని టార్గెట్ చేశారు. వరుసగా ఉగ్రవాదులను అరెస్టు చేస్తుండటంతో పోలీసులను నైతికంగా దెబ్బతీయడానికే దీన్ని ఎంచుకున్నారు. ఈ కుట్ర మొత్తం సౌదీ నుంచి బిలాల్ అమలుపరిచాడు. అప్పటి నుంచి జాహెద్‌తో కలిసే.. దసరా రోజు కావడంతో పెను ముప్పు తప్పగా ఓ హోంగార్డు మాత్రం అమరుడయ్యాడు. ఈ కేసులో అదే ఏడాది అక్టోబర్ 18న అరెస్టైన ఖలీమ్ 2017 వరకు జాహెద్‌తో కలిసి జైల్లోనే ఉన్నాడు. టాస్క్‌ఫోర్స్ కార్యాలయంపై మానవబాంబు దాడి కేసు వీగిపోవడంతో విడుదలయ్యాడు. అప్పటి నుంచి జాహెద్‌తో సన్నిహితంగానే ఉంటున్నాడు. ‘దసరా విధ్వంసాల’ కోసం పాకిస్థాన్‌లో ఉన్న ఫర్హాతుల్లా ఘోరీ జాహెద్‌కు మొత్తం రూ.40 లక్షల వరకు పంపాడు. ఈ మొత్తం వివిధ హవాలా ఆపరేటర్లతో పాటు ఖలీమ్ ద్వారానూ ఇతడికి అందింది. రూ.10 లక్షలు అందించిన ఖలీమ్ నగరంలో రెక్కీ చేయడానికి సహకరించాడు. దసరా ఉత్సవాలు జరిగే మైదానాలే వీరి టార్గెట్‌లో ఉన్నాయి. ఖలీమ్‌ను సిట్ పోలీసులు టాస్‌్కఫోర్స్ అధికారుల సాయంతో గురువారం చంద్రాయణగుట్టలోని అతడి అత్తగారింటి వద్ద అరెస్టు చేశారు. ఆ సమయంలో అతడి బంధువులు, కుటుంబీకులు పోలీసులకు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించిన అధికారులు తదుపరి విచారణ నిమిత్తం తమ కస్టడీకి కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు ఇప్పటికే ఎన్ఐఏకు బదిలీ కావడంతో ఖలీమ్ విచారణ తర్వాత పూర్తి స్థాయిలో ఆ విభాగానికి అప్పగించనున్నారు. ఆ ఆపరేషన్‌లోనూ కీలకపాత్ర.. శ్రీలంకకు చెందిన ఎల్టీటీఈకి, కాశ్మీర్‌లోని ఉగ్రవాద సంస్థలకు మాత్రమే పరిమితమైన మానవ బాంబు విధానాన్ని టాస్క్‌ఫోర్స్ కార్యాలయంపై వాడాలని ఈ ఉగ్రవాదులు నిర్ణయించుకున్నారు. బంగ్లాదేశ్‌లోని ఢాకాకు చెందిన మౌథసిమ్ బిల్హా అలియాస్ డాలిన్‌ను మానవ బాంబుగా మార్చారు. ఇతడిని తీసుకురావడానికి అప్పట్లో ఖలీమ్ సరిహద్దులు దాటి అక్రమంగా బంగ్లాదేశ్ వెళ్లడంతో పాటు కొన్నాళ్లు ఉగ్రవాద శిక్షణ తీసుకున్నాడు. డాలిన్‌ను తీసుకుని నగరానికి చేరుకుని ఎన్టీఆర్ నగర్‌లోని తన ఇంట్లోనే అతడికి ఆశ్రయం ఇవ్వడం, టాస్క్‌ఫోర్స్ ఆఫీస్ వద్ద రెక్కీ చేయించడంలో కీలక పాత్ర పోషించాడు. నాటి బాంబు కూడా ఖలీమ్ ఇంట్లోనే తయారైంది. తనను తాను పేల్చుకోవడానికి సిద్ధమైన డాలిన్‌ను 2005 అక్టోబర్ 12 (దసరా రోజు) టాస్క్‌ఫోర్స్ కార్యాలయం వద్దకు తీసుకువెళ్లి వదిలాడు. చదవండి: అపరిచితులు ఆహారం పెట్టినా ముట్టవు.. చిటికెలో జాడ పట్టేయగలవు.. -
మనకు తెలియని యోధురాలు.. ఆమె ఎవరు?
చరిత్ర కూడా చాలా చమత్కారమైనది. అది కొందరిని ముందుకు తెస్తుంది. కొందరిపై మసక తెర వేస్తుంది. ఝాన్సీ లక్ష్మీబాయి తెలిసినట్టుగా వేలు నాచ్చియార్ తెలియదు. ఒకరు ఉత్తర భారతదేశం అయితే ఒకరు దక్షిణ భారతదేశం. ఇద్దరూ బ్రిటిష్ వారిపై పోరాడారు. తమిళనాడుకు చెందిన రాణి వేలూ నాచ్చియార్ ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. ఆమె జయంతి సందర్భంగా ప్రధాని నివాళి అర్పించడంతో వేలూ నాచ్చియార్ ఎవరు అని కుతూహలం ఏర్పడింది. ఆమె ఎవరు? జనవరి 3 ‘రాణి వేలూ నాచ్చియార్’ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ ఆమెను తలుచుకున్నారు. ‘నారీ శక్తికి ఆమె సంకేతం’ అని ట్విటర్ ద్వారా శ్లాఘించారు. సోషల్ మీడియాలో ఆ వెంటనే రాణి వేలూ నాచ్చియార్ వర్ణ చిత్రాలు ఫ్లో అయ్యాయి. అచ్చు ఝాన్సీ లక్ష్మీ బాయిలా గుర్రం మీద కూచుని చేతిలో కత్తి పట్టుకుని ఉన్న వేలూ నాచ్చియార్ గురించి దేశానికి తెలిసింది ఎంత అనే సందేహం వచ్చింది నెటిజన్లకు. ఝాన్సీ లక్ష్మీ బాయి కంటే యాభై అరవై ఏళ్లకు పూర్వమే బ్రిటిష్ వారిపై పోరాడి విజయం సాధించిన తొలి రాణి అయినప్పటికీ ఆమె ఘన చరిత్ర బయటకు రాకుండా బ్రిటిష్ వాళ్లు జాగ్రత్త పడ్డారన్నది ఒక కథనం. దానికి కారణం ఆమె చేతిలో వారు ఓడిపోవడమే. చరిత్రలో తొలి మానవ బాంబును ప్రయోగించిన ఘనత కూడా వేలూ నాచ్చియార్దే కావడం విశేషం. శివగంగ రాణి నేటి రామనాథపురంలో 18 వ శతాబ్దంలో నెలకొన్న రామనాథ రాజ్యపు యువరాణి వేలూ నాచ్చియార్. 1730 జనవరి 3న జన్మించింది. ఆమె ఒక్కగానొక్క కూతురు కావడంతో తల్లిదండ్రులు ఆమెకు అన్ని విద్యలు నేర్పించారు. తమిళం మాతృభాష అయినప్పటికీ నాచ్చియార్ ఇంగ్లిష్, ఫ్రెంచ్, ఉర్దూ భాషల్లో ప్రావీణ్యం సంపాదించింది. ఆమెకు 16 ఏళ్లు వచ్చాక 1746లో– గతంలో రామనాథ రాజ్యం నుంచి విడిపోయి మరొక రాజ్యంగా ఏర్పడిన శివగంగ రాజ్యానికి కోడలుగా వెళ్లింది. శివగంగ రాజ్య యువరాజు వడుగనాథ దేవర్ ఆమెకు భర్త అయ్యాడు. వాళ్లకు వెళ్లాచ్చి అనే కూతురు పుట్టింది. ఆ విధంగా రామనాథ రాజ్యం, శివగంగ రాజ్యం హాయిగా తమ ప్రాభవాన్ని కొనసాగిస్తూ ఉండగా బ్రిటిష్‌వారు ఊడిపడ్డారు. బ్రిటిష్ దాడి అప్పటికే దేశం లోపలి రాజ్యాల నడుమ ఉన్న లుకలుకలను ఉపయోగించుకుని తమ పెత్తనాన్ని స్థిరపరుచుకుంటూ వస్తున్న బ్రిటిష్ వారు దక్షిణాదిలో తమ విస్తరణ కోసం ఆర్కాట్ నవాబుతో చేయి కలిపారు. అప్పటికి ఆర్కాట్ నవాబు మధురై నాయక రాజ్యాన్ని ఆక్రమించుకుని ఉన్నాడు. అతనికి రామనాథ రాజ్యం, శివగంగ రాజ్యం కప్పం కట్టడానికి అంగీకరించలేదు. దాంతో బ్రిటిష్ వారు అతనిని రెచ్చగొట్టి ఆ రాజ్యాలను హస్తగతం చేసుకోవాలనుకున్నారు. అది 1772వ సంవత్సరం. శివగంగ ఆలయానికి దర్శనానికి నిరాయుధునిగా వెళ్లిన వడుగనాథ దేవర్పైన బ్రిటిష్ వారు హటాత్తుగా దాడి చేసి చంపేశారు. అంతేకాదు ఆలయాన్ని లూటీ చేసి 50 వేల బంగారు నాణేలు తీసుకెళ్లారు. ఆలయంలో భర్తను చంపారన్న వార్త విని వేలూ నాచ్చియార్ హతాశురాలైంది. వెంటనే ఒక మంత్రి సహాయం రాగా కుమార్తెను తీసుకుని విరూపాక్షికి వెళ్లిపోయింది. అయితే బ్రిటిష్ వారు ఆమె నమ్మినబంటు ఉడయాళ్ను పట్టుకుని ఆమె ఆచూకి కోసం నిలదీశారు. అతను చెప్పకపోయేసరికి చంపేశారు. ఈ వార్త విన్నాక వేలూ నాచ్చియార్ ఆగ్రహంతో ఊగిపోయింది. ‘బ్రిటిష్‌వారిని ఓడించి నా రాజ్యాన్ని తిరిగి గెలుచుకుంటాను’ అని శపథం చేసింది. 8 ఏళ్ల అజ్ఞాత వాసం వేలూ నాచ్చియర్ 8 ఏళ్లు అజ్ఞాతవాసం చేసింది. ఆమె నమ్మినబంట్లు మెల్లమెల్లగా ఆమెను చేరుకున్నారు. బ్రిటిష్ వారిని ఓడించాలన్న తలంపుతో ఆమె మాస్టర్ ప్లాన్ వేసి మహిళా దళాన్ని తయారు చేసింది. దానికి తన నమ్మినబంటైన ఉడయాళ్ పేరు పెట్టింది. ‘కుయిలీ’ అనే మహిళ దానికి నాయకురాలు. శివగంగ రాణి ఇలా బ్రిటిష్ వారిపై ప్రతీకారం కోసం ప్రయత్నిస్తున్నదని విన్న మైసూర్ నవాబు హైదర్ అలీ ఆమెకు మద్దతు ఇవ్వడానికి వచ్చాడు. ఆమె తన సైన్యం నిర్మించుకోవడానికి పూర్తి ఆర్థిక సహాయం అందించాడు. వేలూ నాచ్చియార్ తన పదాతి దళం, అశ్వదళం, మహిళా దళంతో పూర్తిగా దాడికి సిద్ధమైంది. అయితే ఆమె దగ్గర ఉన్న మందుగుండు సామాగ్రి చాలా తక్కువ. బ్రిటిష్ వారి దగ్గర ఉన్నది చాలా ఎక్కువ. దానికి విరుగుడు? మానవబాంబు. ప్రతిదాడి అది 1780. విజయదశమి రోజు. ఆ రోజున కోట గోడలు తెరిచి సామాన్యజనాన్ని ఆహ్వానిస్తారు శివగంగ రాజ్యంలో. వేలూ నాచియార్ తయారు చేసిన మహిళా దళం సభ్యులు ఆయుధాలను చీర కొంగుల్లో దాచుకుని సామాన్య మహిళలుగా కోటలోకి ప్రవేశించారు. అదను చూసి నాయకురాలు కుయిలీ ఆదేశం అందుకుని బ్రిటిష్ వారిపై ఊచకోత సాగించారు. బ్రిటిష్‌వారు ఆయుధగారంలోకి వెళ్లి ఆయుధాలు తీసే లోపు ఒక మానవబాంబు ఒళ్లంతా నెయ్యి పూసుకుని ఆయుధగారంలోకి వెళ్లి మంట పెట్టుకుంది. అంతే. ఆయుధగారం పేలి ఆయుధాలు వృధా అయిపోయాయి. మరోవైపు వేలూ నాచ్చియార్ తన దళంలో ఊడిపడి బ్రిటిష్ వారిని చీల్చి చెండాడి తన రాజ్యం తిరిగి దక్కించుకుంది. అవమానకరమైన ఈ ఓటమిని బ్రిటిష్ వారు చరిత్ర పుటల్లోకి ఎక్కకుండా జాగ్రత్త పడ్డారు. అప్పటికి ఆమెకు 50 ఏళ్లు. ఆ తర్వాత మరో 16 ఏళ్లు జీవించి హృద్రోగంతో 1796లో కన్నుమూసింది వేలూ నాచ్చియార్. ఆమెను తమిళనాడులో ‘వీరనారి’ అని పిలుచుకుంటారు. -
భార్య మీద కోపంతో మానవ బాంబుగా మారి కౌగిలించుకున్నాడు..
ఐజ్వాల్: సాధారణంగా భార్య మీద కోపం వస్తే విడాకులు ఇవ్వడం చూశాం గానీ ఓ వ్యక్తి ఏకంగా మానవ బాంబుగా మారి తన భార్యని హతమార్చాడు. ఈ ఘటనలో మిజోరాంలోని లుంగ్లేయి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు ప్రకారం.. లుంగ్లేయి జిల్లాకు చెందిన రోహ్ మింగ్‌లైనా(62), ట్లాంగ్థియాన్‌ఘ్లిమి(61) దంపతులు. ట్లాంగ్థియాన్‌ఘ్లిమి ఆ ప్రాంతలోనే కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ ఉండేది. ఈ జంట ఒక సంవత్సరం క్రితం మనస్పర్థలు రావడంతో అప్పటి నుంచి విడిగా ఉంటున్నారని సమాచారం. అయితే మంగళవారం మధ్యాహ్నం భార్య వద్దకు వచ్చిన అతను ప్రేమ వలకబోస్తూ మాట్లాడాడు. తను జ్వరంతో బాధపడుతున్నట్లు నటిస్తూ, మైకం వచ్చినట్లు అకస్మాత్తుగా తన భార్యను కౌగిలించుకున్నాడు, ఆ తర్వాత పెద్ద పేలుడు సంభవించింది. దీంతో వారిద్దరిని వెంటనే లుంగ్లీ జిల్లా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే, పేలుడులో మృతురాలి కుమార్తె కొంచెం దూరంగా ఉండడంతో ఆమె గాయపడలేదు. ఈ ఘటనపై లంగ్లీ జిల్లా పోలీసు ఉన్నతాధికారి మాట్లాడుతూ.. పేలుడులో జెలటిన్ ఉపయోగించినట్లు అనుమానిస్తున్నట్లు తెలిపారు. చదవండి: ఐఐటీ విద్యార్థి టెక్నాలజీ ఉపయోగించి.. 50 మంది విద్యార్థులు, టీచర్లను.. -
సాక్షులకు ఏదీ భరోసా!
సాక్షి,సిటీబ్యూరో: గతేడాది టాస్క్‌ఫోర్స్ కార్యాలయంపై మానవబాంబు దాడి కేసు... సోమవారం మక్కా మసీదులో పేలుడు కేసు... ఈ రెండూ వీగిపోవడానికి సాక్షులు ఎదురు తిరగడం కూడా ఓ ప్రధాన కారణం. నిందితులను దోషులుగా నిరూపించడంలో కీలకపాత్ర పోషించే సాక్షులకు భరోసా కల్పించడంలో పోలీసులు, ఇతర దర్యాప్తు సంస్థలు విఫలం అవుతున్నాయి. నేరాల నియంత్రణ (ప్రివెన్షన్), నిందితులను పట్టుకోవడం (డిటెక్షన్), నిందితులను కోర్టులో దోషులుగా నిరూపించడం (కన్వెక్షన్)... ఈ మూడు పోలీసింగ్‌లో ప్రధాన అంశాలు. అయితే మొదటి రెండింటిలో పోలీసుల వైఫల్యం మాత్రమే ప్రధాన కారణం కాగా, మూడో అంశానికి సాక్షులు ప్రభావితం కావడం కూడా దోహదం చేస్తోంది. పోలీసులు ఎంత శ్రమించినా, ఆధారాలు సేకరించినా అనేక కేసుల్లో సాక్షులు ఎదురు తిరగడంతోనే శిక్షల శాతం గణనీయంగా తగ్గిపోతోంది. ఫలితంగా నమోదైన కేసుల్లో 30 శాతం కూడా కోర్టుల్లో నిరూపితం కావడం లేదు. ఈ పరిస్థితిలో మార్పులు తీసుకురావాలని కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ 2013లో భావించింది. అయితే ఇప్పటి వరకు ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. ‘ప్రత్యేక’ కేసుల్లో మాత్రమేఅదనపు చర్యలు... ప్రతి కేసునూ పోలీసులు ఒకే దృష్టిలో చూడాల్సి ఉంది. దర్యాప్తు, ఆధారాల సేకరణతో పాటు సాక్షుల విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ ఇవ్వడం, భద్రతపై భరోసా కల్పించడం, న్యాయస్థానానికి ధైర్యంగా హాజరై సాక్ష్యం చెప్పేలా చేయడంపై దృష్టి పెట్టాల్సి ఉంది. అయితే ప్రస్తుతం పోలీసు విభాగంలో సిబ్బంది కొరత నేపథ్యంలో అధికారులపై పని భారం ఎక్కువగా ఉంటోంది. ఏడాదికి గరిష్టంగా 60 కేసులను మాత్రమే పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయగలిగే దర్యాప్తు అధికారులు కనిష్టంగా 200 కేసులను పర్యవేక్షించాల్సి వస్తోంది. ఈ కారణంగా వీటిలో సాక్షులు ఎవరన్నది గుర్తుపెట్టుకోవడం, తరచూ వారిని సంప్రదించడం సాధ్యం కావట్లేదు. కేవలం కొన్ని ప్రత్యేకతలు, ప్రాధాన్యం కలిగి ఉన్న వాటిలో మాత్రమే పోలీసు అధికారులు సాక్షుల కోణం పైనా ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఈ పరిస్థితులు మారాలంటే సాక్షుల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు ఉండాలన్న వాదన ఏళ్లుగా ఉన్నా పట్టించుకునేవారు కరువయ్యారు. ‘నిద్రలేపిన’ జెస్సికా కేసు... సాక్షుల రక్షణకు చట్టం తీసుకురావాలని కేంద్రానికి ఆలోచన కలగడానికి ప్రధాన కారణం జెస్సికాలాల్ కేసే. ప్రముఖ మోడల్స్‌లో ఒకరైన జెస్సికా 1999 ఏప్రిల్ 29న ఢిల్లీలో దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసు అప్పట్లో దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. అనేక మంది వీఐపీలతో ముడిపడిన దీని విచారణే కేంద్రం కళ్లు తెరిపించింది. కేసును దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులపై నేరం నిరూపించడం కోసం 101 మంది సాక్షులను ఎంపిక చేశారు. వీరిని న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా... ఏకంగా 32 మంది ఎదురు తిరిగారు. దీనికి ప్రధాన కారణం నిందితుల తరఫున కొందరు రంగంలోకి దిగి సాక్షులను భయపెట్టడం ద్వారా ప్రభావితం చేసినట్లు గుర్తించారు. దీంతో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించిన కేంద్ర హోం శాఖ కోర్టు విచారణలో ఉన్న కేసుల్లో సాక్షులుగా ఉన్న వారికి రక్షణ కల్పించాలని నిర్ణయించింది. దీని కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని ప్రతిపాదించింది. అటకెక్కిన అంతర్జాతీయ అధ్యయనం.. సాక్షి రక్షణ సంస్కరణలకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించిన కేంద్రం అందుకు అంతర్జాతీయంగా అధ్యయనం చేపట్టాలని నిర్ణయించింది. ఆయా దేశాల్లో అమలులో ఉన్న పద్దతులు, చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించి, వీటన్నింటిలోంచి ఉత్తమ పద్దతులను క్రోడీకరించి, మన దేశంలో ఉన్న పరిస్థితులు, ఇతర అంశాలను పరిగణలోని తీసుకుంటూ ప్రత్యేక చట్టం రూపొందించాలని భావించింది. అయితే ఆ తర్వాత ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో కేంద్రంలో అధికారం చేతులు మారడంతో ప్రతిపాదనల స్థాయిలోనే ఈ చట్టం అటకెక్కింది. ఇది అమలులోకి వస్తే ప్రతి కేసులోనూ సాక్షుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉండేది. ఫలితంగా శిక్షల శాతం పెరిగి నేరాలు సైతం తగ్గుముఖం పడతాయని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే కేంద్రం ఈ విషయాన్ని మర్చిపోవడం, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఫలితంగా సాక్షులకు భరోసా లేక అనేక కేసులు వీగిపోతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఈ విషయంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. -
‘దిల్సుఖ్నగర్’ ఉగ్రవాదులకు ఢిల్లీలో ‘విముక్తి’
తెహసీన్, వఖాస్‌లపై అక్కడి కుట్ర కేసు నమోదు ఆధారాలు లేవంటూ డిశ్చార్జ్ చేసిన న్యాయస్థానం మిగిలిన నిందితుల్లో సయ్యద్ మగ్బూల్ సైతం మానవబాంబు దాడులకు కుట్రపై 2012లో కేసు సిటీబ్యూరో: హైదరాబాద్‌లోని మూడు ప్రాంతాలతో సహా దేశ వ్యాప్తంగా మానవ బాంబులతో దాడులకు కుట్ర పన్నిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాదులు తెహసీన్ అక్తర్ అలియాస్ మోను, జకీ ఉర్ రెహ్మాన్ అలియాస్ వఖాస్‌లకు ఢిల్లీ కోర్టు విముక్తి కల్పించింది. వీరిద్దరూ 2013లో దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన జంట పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్నారు. ఢిల్లీ కుట్ర కేసులో హైదరాబాద్‌లో పట్టుబడిన సయ్యద్ మక్బూల్ సైతం ఉండటం గమనార్హం. ఐఎం కో-ఫౌండర్స్ రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్ 2012లోనూ సిటీలో మారణహోమం సృష్టించడానికి కుట్రపన్నారని, ఏకంగా మానవ బాంబులతో మూడు జనసమ్మర్ధ ప్రాంతాల్లో విరుచుకుపడాలని పథకం వేశారని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు గుర్తించారు. పాతబస్తీలోని షాహిన్‌నగర్‌లో నివసించిన సయ్యద్ మక్బూల్ ఈ కుట్రలో ప్రధాన భాగస్వామిగా ఉన్నాడని తేల్చారు. దీపావళి టపాసులుల్లో ఉండే మందు, డీజిల్, యూరియాలతో అత్యాధునికమైన ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్ (ఐఈడీ)లు తయారు చేయడానికి పథకం సిద్ధం చేసుకున్నట్లు తేల్చారు. 2012 అక్టోబర్ 26న నమోదు చేసిన కేసులో వీరి టార్గెట్‌లో హైదరాబాద్‌తో పాటు బీహార్‌లోని బుద్ధగయ ప్రాంతం కూడా ఉన్నాయని స్పెషల్ సెల్ పేర్కొంది. మక్బూల్ మరో ఉగ్రవాదైన ఇమ్రాన్ ఖాన్‌తో కలిసి 2012లో హైదరాబాద్ వచ్చి, ద్విచక్ర వాహనంపై జనసమర్థ ప్రాంతాలైన దిల్సుఖ్నగర్, బేగంబజార్, అబిడ్స్ ప్రాంతాల్లో రెక్కీలు నిర్వహించినట్లు అభియోగాలు మోపారు. ఈ కేసులో మక్బూల్, ఇమ్రాన్ సహా మరికొందరు అప్పుడే అరెస్టు కాగా... మిగిలిన వారిలో పరారీలో ఉన్న నిందితులైన తెహసీన్ అక్తర్, వఖాస్‌లు 2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్ నగర్లో జంట పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ పేలుళ్లకు అవసరమైన బాంబుల తయారు చేసిన, 107 బస్టాప్‌లో విధ్వంసానికి కారణమైన వఖాస్‌ను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు 2014 మార్చి 22న పట్టుకున్నారు. దిల్సుఖ్నగర్ పేలుళ్లకు అవసరమైన సైకిళ్లను మలక్‌పేట్, జుమ్మేరాత్ బజార్‌ల్లో కొనుగోలు చేసిన... ఏ-1 మిర్చ్ సెంటర్ వద్ద పేలిన సైకిల్ బాంబును అక్కడ పెట్టిన తెహసీన్ సైతం అదే నెల 25న పశ్చిమ బెంగాల్‌లోని కాఖర్‌ర్బిత ప్రాంతంలో పోలీసులకు చిక్కాడు. దీంతో ఢిల్లీలో నమోదైన మానవ బాంబుల కుట్ర.. హైదరాబాద్‌లోని దిల్సుఖ్నగర్ పేలుళ్లు సహా అనేక కేసుల్లో వీరిని అరెస్టు చేశారు. ప్రస్తుతం చర్లపల్లి కేంద్ర కారాగారంలో యాసీన్ భత్కల్‌తో పాటు తెహసీన్, వఖాస్... తీహర్ జైల్లో ఉన్న మక్బూల్, ఇమ్రాన్ తదితరులపై ఢిల్లీ స్పెషల్ సెల్ గత వారంలో అభియోగాలు మోపుతూ అక్కడి కోర్టులో మెమో దాఖలు చేసింది. అయితే తెహసీన్, వఖాస్‌లపై సరైన ఆధారాలు లేవంటూ న్యాయస్థానం శుక్రవారం వీరిద్దరినీ డిశ్చార్జ్ చేసింది. మిగిలిన వారిపై ఈ నెల 28 నుంచి విచారణ చేపట్టనుంది. -
నేనో మానవబాంబుని : తబ్రేజ్
సాక్షి, హైదరాబాద్: ‘‘నేనో మానవబాంబుని. పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ నాకు ఆ కోణంలోనే శిక్షణ ఇచ్చింది. గత ఏడాదే ఆ ఆపరేషన్ చేయాల్సింది. కానీ, వాయిదా పడింది...’’.. నిషేధిత సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాది, యాసిన్ భత్కల్ కుడి భుజం తబ్రేజ్ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులకు వెల్లడించిన కీలకాంశమిది. ఐఎం సంస్థ తమ తొలి మానవబాంబు ఆపరేషన్‌ను తన ద్వారా చేపట్టాలని భావించిందని తబ్రేజ్ బయటపెట్టాడు. అయితే, పుణేలోని యరవాడ జైలులో ఖతీల్ సిద్ధిఖీ హత్యతో ఆ ఆపరేషన్ ఆగిపోయిందని చెప్పినట్లు తెలిసింది. ఉత్తరప్రదేశ్‌లోని ఆజమ్‌గఢ్‌కు చెందిన అసదుల్లా అక్తర్‌కు తబ్రేజ్, హడ్డీ, షకీర్, డానియల్, యూనుస్, మామున్-ఉర్-రషీద్ అనే మారుపేర్లున్నాయి. తబ్రేజ్ లక్నోలోని ఇంటగ్రల్ యూనివర్సిటీ నుంచి బీఫార్మసీ పూర్తి చేశాడు. 2008లో ఉద్యోగ ఇంటర్వ్యూ కోసమంటూ ఢిల్లీకి వెళ్లిన తబ్రేజ్ తిరిగి రాలేదని అతడి కుటుంబ సభ్యులు చెబుతుంటారు. ఢిల్లీలో ఉండగానే ఆజమ్గఢ్కే చెందిన మరో ఉగ్రవాది అతిఫ్ అమీన్‌తో తబ్రేజ్‌కు పరిచయమైంది. అతడి ద్వారా ఉగ్రవాదం వైపు వెళ్లి, భత్కల్ బ్రదర్స్‌కు సన్నిహితుడయ్యాడు. రియాజ్ ఆదేశాల మేరకు 2010లో పాకిస్థాన్‌కు వెళ్లి ఉగ్రవాద శిక్షణ పొందాడు. తొలి మానవబాంబు దాడికి కుట్ర.. ఇండియన్ ముజాహిదీన్ సంస్థ ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా బాంబు పేలుళ్లకు పాల్పడ్డా.. మానవబాంబు దాడులు మాత్రం చేయలేదు. కానీ, ఈ సారి మానవబాంబులతో దాడులు చేయాలని నిర్ణయించిన భత్కల్ సోదరులు తొలి టార్గెట్‌గా బీహార్‌లోని బుద్ధగయను ఎంచుకున్నారు. దాని కోసం మగ్బూల్, ఇమ్రాన్ ఖాన్, అసద్ ఖాన్, లంగ్డా ఇర్ఫాన్ ముస్తాఫా, సయ్యద్ ఫెరోజ్లను రంగంలోకి దింపారు. కానీ, ఈ దాడికి ప్రధానమైన మానవబాంబు ‘హడ్డీ’ కోసం వారు ఎదురుచూస్తుండగానే.. పుణెలోని యరవాడ జైల్లో ఉగ్రవాది ఖతీల్ సిద్ధిఖీ హత్య జరిగింది. దాంతో భత్కల్ సోదరులు పుణేలో బాంబు పేలుళ్లు జరిపేందుకు సిద్ధమయ్యారు. కానీ, ‘మానవబాంబు’ సిద్ధం కాకపోవడంతో వరుస పేలుళ్లకు పాల్పడ్డారు. ఆ తరువాత మానవబాంబు దాడి కుట్ర వాయిదా పడింది. అనంతరం హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో జంట పేలుళ్లకు పాల్పడ్డారు. ప్రస్తుతం దిల్సుఖ్నగర్ పేలుళ్ల కేసును హైదరాబాద్ ఎన్ఐఏ యూనిట్, హైదరాబాద్ కుట్ర కేసును ఢిల్లీ ఎన్ఐఏ యూనిట్ దర్యాప్తు చేస్తున్నాయి.