నేనో మానవబాంబుని : తబ్రేజ్
సాక్షి, హైదరాబాద్: ‘‘నేనో మానవబాంబుని. పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ నాకు ఆ కోణంలోనే శిక్షణ ఇచ్చింది. గత ఏడాదే ఆ ఆపరేషన్ చేయాల్సింది. కానీ, వాయిదా పడింది...’’.. నిషేధిత సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాది, యాసిన్ భత్కల్ కుడి భుజం తబ్రేజ్ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులకు వెల్లడించిన కీలకాంశమిది. ఐఎం సంస్థ తమ తొలి మానవబాంబు ఆపరేషన్‌ను తన ద్వారా చేపట్టాలని భావించిందని తబ్రేజ్ బయటపెట్టాడు.
అయితే, పుణేలోని యరవాడ జైలులో ఖతీల్ సిద్ధిఖీ హత్యతో ఆ ఆపరేషన్ ఆగిపోయిందని చెప్పినట్లు తెలిసింది. ఉత్తరప్రదేశ్‌లోని ఆజమ్‌గఢ్‌కు చెందిన అసదుల్లా అక్తర్‌కు తబ్రేజ్, హడ్డీ, షకీర్, డానియల్, యూనుస్, మామున్-ఉర్-రషీద్ అనే మారుపేర్లున్నాయి. తబ్రేజ్ లక్నోలోని ఇంటగ్రల్ యూనివర్సిటీ నుంచి బీఫార్మసీ పూర్తి చేశాడు. 2008లో ఉద్యోగ ఇంటర్వ్యూ కోసమంటూ ఢిల్లీకి వెళ్లిన తబ్రేజ్ తిరిగి రాలేదని అతడి కుటుంబ సభ్యులు చెబుతుంటారు. ఢిల్లీలో ఉండగానే ఆజమ్‌గఢ్‌కే చెందిన మరో ఉగ్రవాది అతిఫ్ అమీన్‌తో తబ్రేజ్‌కు పరిచయమైంది. అతడి ద్వారా ఉగ్రవాదం వైపు వెళ్లి, భత్కల్ బ్రదర్స్‌కు సన్నిహితుడయ్యాడు. రియాజ్ ఆదేశాల మేరకు 2010లో పాకిస్థాన్‌కు వెళ్లి ఉగ్రవాద శిక్షణ పొందాడు.
తొలి మానవబాంబు దాడికి కుట్ర..
ఇండియన్ ముజాహిదీన్ సంస్థ ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా బాంబు పేలుళ్లకు పాల్పడ్డా.. మానవబాంబు దాడులు మాత్రం చేయలేదు. కానీ, ఈ సారి మానవబాంబులతో దాడులు చేయాలని నిర్ణయించిన భత్కల్ సోదరులు తొలి టార్గెట్‌గా బీహార్‌లోని బుద్ధగయను ఎంచుకున్నారు. దాని కోసం మగ్బూల్, ఇమ్రాన్ ఖాన్, అసద్ ఖాన్, లంగ్డా ఇర్ఫాన్ ముస్తాఫా, సయ్యద్ ఫెరోజ్‌లను రంగంలోకి దింపారు. కానీ, ఈ దాడికి ప్రధానమైన మానవబాంబు ‘హడ్డీ’ కోసం వారు ఎదురుచూస్తుండగానే.. పుణెలోని యరవాడ జైల్లో ఉగ్రవాది ఖతీల్ సిద్ధిఖీ హత్య జరిగింది. దాంతో భత్కల్ సోదరులు పుణేలో బాంబు పేలుళ్లు జరిపేందుకు సిద్ధమయ్యారు. కానీ, ‘మానవబాంబు’ సిద్ధం కాకపోవడంతో వరుస పేలుళ్లకు పాల్పడ్డారు. ఆ తరువాత మానవబాంబు దాడి కుట్ర వాయిదా పడింది. అనంతరం హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో జంట పేలుళ్లకు పాల్పడ్డారు. ప్రస్తుతం దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల కేసును హైదరాబాద్ ఎన్‌ఐఏ యూనిట్, హైదరాబాద్ కుట్ర కేసును ఢిల్లీ ఎన్‌ఐఏ యూనిట్ దర్యాప్తు చేస్తున్నాయి.