tabrez
-
‘జార్ఖండ్ మూక దాడి’ వ్యక్తి మృతి
సెరైకేలా–ఖర్సావన్(జార్ఖండ్): మోటార్ సైకిల్ దొంగతనం చేశాడన్న అనుమానంతో జార్ఖండ్‌లో జనసమూహం చేతిలో తీవ్రంగా దెబ్బలు తిన్న యువకుడు మృతి చెందాడు. తీవ్రగాయాల పాలైన తబ్రేజ్ అన్సారీ (24) నాలుగు రోజుల తర్వాత మృతి చెందాడని పోలీసులు తెలిపారు. జంషెడ్‌పూర్‌లోని టాటా మెయిన్ ఆస్పత్రిలో ఈనెల 22న తబ్రేజ్ మృతి చెందినట్లు ధ్రువీకరించారని, అతని మృతిపై దర్యాప్తుకు ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని వెల్లడించారు. ‘ఈ ఘటనపై సిట్‌ను ఏర్పాటు చేశాం’అని ఎస్పీ కార్తీక్ పేర్కొన్నారు. తబ్రేజ్‌ను జై శ్రీరామ్ అని మతపరమైన నినాదాన్ని ఇవ్వమనడంపైనా కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు పప్పు మండల్ అనే వ్యక్తిని అరెస్టు చేశామని, దీనిపై విచారణ జరుపుతున్నామన్నారు. అలాగే ఈ ఘటనకు సంబంధించి తబ్రేజ్ భార్య షాయిస్తా పర్వీన్ పలువురి పేర్లతో ఫిర్యాదు ఇచ్చారని తెలిపారు. గత మంగళవారం జంషెడ్పూర్ నుంచి ఇక్కడి గ్రామానికి తన ఇద్దరు స్నేహితులతో కలిసి వస్తున్న తబ్రేజ్ అన్సారీ అనే ముస్లిం యువకుడిని సెరైకేలా–ఖర్సావన్ జిల్లా ధట్కిడీ గ్రామస్తులు మోటార్ సైకిల్ దొంగతనం చేశారంటూ అడ్డుకున్నారు. ఈ ఘటనలో మిగతా ఇద్దరు తప్పించుకోగా, తబ్రేజ్ గ్రామస్తులకు పట్టుబడ్డాడు. అనంతరం తబ్రేజ్‌ను స్తంభానికి కట్టేసి కర్రలతో ఆ రాత్రంతా కొట్టారు. అలాగే జై శ్రీరామ్, జై హనుమాన్ అంటూ నినాదాలివ్వాలని బలవంతం చేశారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన అతన్ని బుధవారం గ్రామస్తులు పోలీసులకు అప్పగించారు. దీంతో పోలీసులు తబ్రేజ్‌పై దొంగతనం అభియోగాలపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అయింది. -
నేనో మానవబాంబుని : తబ్రేజ్
సాక్షి, హైదరాబాద్: ‘‘నేనో మానవబాంబుని. పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ నాకు ఆ కోణంలోనే శిక్షణ ఇచ్చింది. గత ఏడాదే ఆ ఆపరేషన్ చేయాల్సింది. కానీ, వాయిదా పడింది...’’.. నిషేధిత సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాది, యాసిన్ భత్కల్ కుడి భుజం తబ్రేజ్ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులకు వెల్లడించిన కీలకాంశమిది. ఐఎం సంస్థ తమ తొలి మానవబాంబు ఆపరేషన్‌ను తన ద్వారా చేపట్టాలని భావించిందని తబ్రేజ్ బయటపెట్టాడు. అయితే, పుణేలోని యరవాడ జైలులో ఖతీల్ సిద్ధిఖీ హత్యతో ఆ ఆపరేషన్ ఆగిపోయిందని చెప్పినట్లు తెలిసింది. ఉత్తరప్రదేశ్‌లోని ఆజమ్‌గఢ్‌కు చెందిన అసదుల్లా అక్తర్‌కు తబ్రేజ్, హడ్డీ, షకీర్, డానియల్, యూనుస్, మామున్-ఉర్-రషీద్ అనే మారుపేర్లున్నాయి. తబ్రేజ్ లక్నోలోని ఇంటగ్రల్ యూనివర్సిటీ నుంచి బీఫార్మసీ పూర్తి చేశాడు. 2008లో ఉద్యోగ ఇంటర్వ్యూ కోసమంటూ ఢిల్లీకి వెళ్లిన తబ్రేజ్ తిరిగి రాలేదని అతడి కుటుంబ సభ్యులు చెబుతుంటారు. ఢిల్లీలో ఉండగానే ఆజమ్గఢ్కే చెందిన మరో ఉగ్రవాది అతిఫ్ అమీన్‌తో తబ్రేజ్‌కు పరిచయమైంది. అతడి ద్వారా ఉగ్రవాదం వైపు వెళ్లి, భత్కల్ బ్రదర్స్‌కు సన్నిహితుడయ్యాడు. రియాజ్ ఆదేశాల మేరకు 2010లో పాకిస్థాన్‌కు వెళ్లి ఉగ్రవాద శిక్షణ పొందాడు. తొలి మానవబాంబు దాడికి కుట్ర.. ఇండియన్ ముజాహిదీన్ సంస్థ ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా బాంబు పేలుళ్లకు పాల్పడ్డా.. మానవబాంబు దాడులు మాత్రం చేయలేదు. కానీ, ఈ సారి మానవబాంబులతో దాడులు చేయాలని నిర్ణయించిన భత్కల్ సోదరులు తొలి టార్గెట్‌గా బీహార్‌లోని బుద్ధగయను ఎంచుకున్నారు. దాని కోసం మగ్బూల్, ఇమ్రాన్ ఖాన్, అసద్ ఖాన్, లంగ్డా ఇర్ఫాన్ ముస్తాఫా, సయ్యద్ ఫెరోజ్లను రంగంలోకి దింపారు. కానీ, ఈ దాడికి ప్రధానమైన మానవబాంబు ‘హడ్డీ’ కోసం వారు ఎదురుచూస్తుండగానే.. పుణెలోని యరవాడ జైల్లో ఉగ్రవాది ఖతీల్ సిద్ధిఖీ హత్య జరిగింది. దాంతో భత్కల్ సోదరులు పుణేలో బాంబు పేలుళ్లు జరిపేందుకు సిద్ధమయ్యారు. కానీ, ‘మానవబాంబు’ సిద్ధం కాకపోవడంతో వరుస పేలుళ్లకు పాల్పడ్డారు. ఆ తరువాత మానవబాంబు దాడి కుట్ర వాయిదా పడింది. అనంతరం హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో జంట పేలుళ్లకు పాల్పడ్డారు. ప్రస్తుతం దిల్సుఖ్నగర్ పేలుళ్ల కేసును హైదరాబాద్ ఎన్ఐఏ యూనిట్, హైదరాబాద్ కుట్ర కేసును ఢిల్లీ ఎన్ఐఏ యూనిట్ దర్యాప్తు చేస్తున్నాయి. -
త్వరలో హైదరాబాద్‌కు తబ్రేజ్
దిల్సుఖ్నగర్ కేసులో తీసుకురానున్న ఎన్ఐఏ సాక్షి, హైదరాబాద్: దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసులో ప్రిజనర్ ట్రాన్సిట్ వారంట్‌పై ఉగ్రవాది తబ్రేజ్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు హైదరాబాద్‌కు తీసుకురానున్నారు. పేలుళ్లలో నేరుగా పాల్గొన్న తబ్రేజ్‌ను ఇక్కడకు తీసుకు వచ్చేందుకు ఢిల్లీ కోర్టు నుంచి ఎన్ఐఏ అధికారులు అనుమతి పొందారు. ఈనెల 19 లోపు హైదరాబాద్‌కు తీసుకువచ్చి, స్థానిక కోర్టులో హాజరుపరచనున్నారు. కేసులో తబ్రేజ్‌ను ఎన్ఐఏ అధికారులు కస్టడీకి కోరే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర పన్నిన కేసులో ఎన్ఐఏ ఇప్పటికే తబ్రేజ్‌ను కస్టడీలోకి తీసుకుని విచారించింది. భత్కల్, తబ్రేజ్‌ల అరెస్టుతో తప్పిన భారీ ముప్పు: మంగళూరులో 90 ఐఈడీలు స్వాధీనం దేశంలోని ప్రధాన నగరాల్లో విధ్వంసాలకు ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థ పన్నిన కుట్ర దిల్సుఖ్నగర్ పేలుళ్ల నిందితులు యాసిన్ భత్కల్, తబ్రేజ్‌ల అరెస్టుతో త్రుటిలో తప్పింది. ఈ పేలుళ్లకు ముందు, తర్వాత తబ్రేజ్తోపాటు ఉగ్రవాదులు ఆశ్రయం పొందిన రహస్య ప్రాంతంలో పెద్దసంఖ్యలో బాంబులను పోలీసులు ఇటీవల కనుగొన్నారు. కర్ణాటక రాష్ట్రం మంగళూరులోని జఫర్ హైట్స్ భవంతి మూడో అంతస్తులో ఎన్ఐఏ అధికారులు దాడులు చేసి పేలుళ్ల కోసం సిద్ధం చేసిన 90 అధునాతన పేలుడు పరికరాలను(ఐఈడీ) స్వాధీనం చేసుకున్నారు. గత నెల 28న భారత్-నేపాల్ సరిహద్దులో యాసిన్, తబ్రేజ్‌లను అరెస్టు చేయడం తెలిసిందే. తబ్రేజ్ వెల్లడించిన సమాచారం ఆధారంగా మంగళూరులోని రహస్య డెన్‌ను ఈ నెల 7న గుర్తించారు. తబ్రేజ్‌ను తీసుకెళ్లి డెన్‌లోని ఐఈడీలను స్వాధీనం చేసుకున్నారు. -
వారం ముందే హైదరాబాద్‌లో మకాం
ఉగ్రవాది తబ్రేజ్‌ను తీసుకొచ్చి దర్యాప్తు జరిపిన ఎన్ఐఏ! విద్యార్థుల ముసుగులో బహదూర్‌పురాలో ఉగ్రవాదుల అడ్డా ఆశ్రయం పొందిన ఇంట్లో అధికారుల తనిఖీలు ప్రెషర్ కుక్కర్ హ్యాండిల్స్, బాంబు తయారీ పదార్థాలు స్వాధీనం సాక్షి, హైదరాబాద్: రాజధానిలో జంట పేలుళ్లకు పాల్పడిన ఉగ్రవాదులు.. ఆ పేలుళ్లకు వారం రోజుల ముందే హైదరాబాద్‌కు వచ్చి మకాం వేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దర్యాప్తులో తేలింది. ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులు యాసిన్ భత్కల్, అసదుల్లా అక్తర్ అలియాస్ తబ్రేజ్, వకాస్ అలియాస్ అహ్మద్, తహసీన్ అక్తర్ అలియాస్ హసన్ ఆశ్రయం పొందిన బహదూర్‌పురాలోని ఇంటిని దర్యాప్తు అధికారులు గుర్తించారు. గత నెల 28న భారత్- నేపాల్ సరిహద్దుల్లో యాసిన్ భత్కల్‌తో పాటు అరెస్టైన తబ్రేజ్‌ను ఎన్ఐఏ అధికారులు మూడురోజుల కింద హైదరాబాద్‌కు తీసుకువచ్చి దర్యాప్తు జరిపారు. అయితే, భద్రతా కారణాల రీత్యా తబ్రేజ్‌ను ఇక్కడికి తీసుకువచ్చిన విషయాన్ని గోప్యంగా ఉంచారు. వారం ముందుగా నగరానికి వచ్చామని, వకాస్‌తో కలసి పేలుళ్లు జరిగిన మరుసటి రోజు మంగళూరుకు వెళ్లామని తబ్రేజ్ అధికారులకు వివరించినట్లు సమాచారం. తబ్రేజ్ వెల్లడించిన సమాచారం ప్రకారమే నెహ్రూ జూపార్కుకు సమీపంలో ఉగ్రవాదులు ఆశ్రయం పొందిన ఇంట్లో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రెషర్ కుక్కర్ హ్యాండిల్స్, కొంతపాడై ఉన్న ట్రాలీ బ్యాగ్, బాంబుల తయారీకి ఉపయోగించే కొన్ని పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతేగాకుండా ఆ ఇంట్లో చిన్నచిన్న వస్తువులను, వెంట్రుకలను దర్యాప్తు అధికారులు సేకరించారు. అయితే, యాసిన్ భత్కల్, తబ్రేజ్ సహా ఈ ఉగ్రవాదులు తాము విద్యార్థులు, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారిగా చెప్పుకొని బహదూర్‌పురాలో ఆశ్రయం పొందినట్లు ఎన్ఐఏ అధికారులు అనుమానిస్తున్నారు. అసలు ఉగ్రవాదులకు ఇంటిని అద్దెకు ఇప్పించింది ఎవరు? బాంబుల తయారీకి అవసరమైన పరికరాలను సమకూర్చుకోవడంలో సహకరించిన స్లీపర్ సెల్స్ ఎవరు? అనేదిశగా ఆరా తీస్తున్నారు. అయితే, ఎన్ఐఏ అధికారులు మూడు రోజుల విచారణ అనంతరం తబ్రేజ్‌ను శనివారం ఉదయమే ఢిల్లీకి తరలించినట్లు తెలుస్తోంది. కాగా.. దిల్సుఖ్నగర్ జంట పేలుళ్లు, లుంబినీపార్కు, గోకుల్‌ఛాట్ పేలుళ్ల కేసులో యాసిన్ భత్కల్, తబ్రేజ్‌ను విచారించేందుకు ఎన్ఐఏతో పాటు రాష్ర్ట కౌంటర్ ఇంటలిజెన్స్ సెల్ అధికారులు పీటీ వారెంట్ పొందేందుకు కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం.