వారం ముందే హైదరాబాద్‌లో మకాం
ఉగ్రవాది తబ్రేజ్‌ను తీసుకొచ్చి దర్యాప్తు జరిపిన ఎన్‌ఐఏ!
విద్యార్థుల ముసుగులో బహదూర్‌పురాలో ఉగ్రవాదుల అడ్డా
ఆశ్రయం పొందిన ఇంట్లో అధికారుల తనిఖీలు
ప్రెషర్ కుక్కర్ హ్యాండిల్స్, బాంబు తయారీ పదార్థాలు స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: రాజధానిలో జంట పేలుళ్లకు పాల్పడిన ఉగ్రవాదులు.. ఆ పేలుళ్లకు వారం రోజుల ముందే హైదరాబాద్‌కు వచ్చి మకాం వేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దర్యాప్తులో తేలింది. ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులు యాసిన్ భత్కల్, అసదుల్లా అక్తర్ అలియాస్ తబ్రేజ్, వకాస్ అలియాస్ అహ్మద్, తహసీన్ అక్తర్ అలియాస్ హసన్ ఆశ్రయం పొందిన బహదూర్‌పురాలోని ఇంటిని దర్యాప్తు అధికారులు గుర్తించారు. గత నెల 28న భారత్- నేపాల్ సరిహద్దుల్లో యాసిన్ భత్కల్‌తో పాటు అరెస్టైన తబ్రేజ్‌ను ఎన్‌ఐఏ అధికారులు మూడురోజుల కింద హైదరాబాద్‌కు తీసుకువచ్చి దర్యాప్తు జరిపారు. అయితే, భద్రతా కారణాల రీత్యా తబ్రేజ్‌ను ఇక్కడికి తీసుకువచ్చిన విషయాన్ని గోప్యంగా ఉంచారు. వారం ముందుగా నగరానికి వచ్చామని, వకాస్‌తో కలసి పేలుళ్లు జరిగిన మరుసటి రోజు మంగళూరుకు వెళ్లామని తబ్రేజ్ అధికారులకు వివరించినట్లు సమాచారం. తబ్రేజ్ వెల్లడించిన సమాచారం ప్రకారమే నెహ్రూ జూపార్కుకు సమీపంలో ఉగ్రవాదులు ఆశ్రయం పొందిన ఇంట్లో ఎన్‌ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
ప్రెషర్ కుక్కర్ హ్యాండిల్స్, కొంతపాడై ఉన్న ట్రాలీ బ్యాగ్, బాంబుల తయారీకి ఉపయోగించే కొన్ని పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతేగాకుండా ఆ ఇంట్లో చిన్నచిన్న వస్తువులను, వెంట్రుకలను దర్యాప్తు అధికారులు సేకరించారు. అయితే, యాసిన్ భత్కల్, తబ్రేజ్ సహా ఈ ఉగ్రవాదులు తాము విద్యార్థులు, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారిగా చెప్పుకొని బహదూర్‌పురాలో ఆశ్రయం పొందినట్లు ఎన్‌ఐఏ అధికారులు అనుమానిస్తున్నారు. అసలు ఉగ్రవాదులకు ఇంటిని అద్దెకు ఇప్పించింది ఎవరు? బాంబుల తయారీకి అవసరమైన పరికరాలను సమకూర్చుకోవడంలో సహకరించిన స్లీపర్ సెల్స్ ఎవరు? అనేదిశగా ఆరా తీస్తున్నారు. అయితే, ఎన్‌ఐఏ అధికారులు మూడు రోజుల విచారణ అనంతరం తబ్రేజ్‌ను శనివారం ఉదయమే ఢిల్లీకి తరలించినట్లు తెలుస్తోంది. కాగా.. దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్లు, లుంబినీపార్కు, గోకుల్‌ఛాట్ పేలుళ్ల కేసులో యాసిన్ భత్కల్, తబ్రేజ్‌ను విచారించేందుకు ఎన్‌ఐఏతో పాటు రాష్ర్ట కౌంటర్ ఇంటలిజెన్స్ సెల్ అధికారులు పీటీ వారెంట్ పొందేందుకు కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం.