రాణి వేలూ నాచ్చియార్
చరిత్ర కూడా చాలా చమత్కారమైనది. అది కొందరిని ముందుకు తెస్తుంది. కొందరిపై మసక తెర వేస్తుంది. ఝాన్సీ లక్ష్మీబాయి తెలిసినట్టుగా వేలు నాచ్చియార్ తెలియదు. ఒకరు ఉత్తర భారతదేశం అయితే ఒకరు దక్షిణ భారతదేశం. ఇద్దరూ బ్రిటిష్ వారిపై పోరాడారు. తమిళనాడుకు చెందిన రాణి వేలూ నాచ్చియార్ ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. ఆమె జయంతి సందర్భంగా ప్రధాని నివాళి అర్పించడంతో వేలూ నాచ్చియార్ ఎవరు అని కుతూహలం ఏర్పడింది.
ఆమె ఎవరు?
జనవరి 3 ‘రాణి వేలూ నాచ్చియార్’ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ ఆమెను తలుచుకున్నారు. ‘నారీ శక్తికి ఆమె సంకేతం’ అని ట్విటర్ ద్వారా శ్లాఘించారు. సోషల్ మీడియాలో ఆ వెంటనే రాణి వేలూ నాచ్చియార్ వర్ణ చిత్రాలు ఫ్లో అయ్యాయి. అచ్చు ఝాన్సీ లక్ష్మీ బాయిలా గుర్రం మీద కూచుని చేతిలో కత్తి పట్టుకుని ఉన్న వేలూ నాచ్చియార్ గురించి దేశానికి తెలిసింది ఎంత అనే సందేహం వచ్చింది నెటిజన్‌లకు. ఝాన్సీ లక్ష్మీ బాయి కంటే యాభై అరవై ఏళ్లకు పూర్వమే బ్రిటిష్ వారిపై పోరాడి విజయం సాధించిన తొలి రాణి అయినప్పటికీ ఆమె ఘన చరిత్ర బయటకు రాకుండా బ్రిటిష్ వాళ్లు జాగ్రత్త పడ్డారన్నది ఒక కథనం. దానికి కారణం ఆమె చేతిలో వారు ఓడిపోవడమే. చరిత్రలో తొలి మానవ బాంబును ప్రయోగించిన ఘనత కూడా వేలూ నాచ్చియార్‌దే కావడం విశేషం.
శివగంగ రాణి
నేటి రామనాథపురంలో 18 వ శతాబ్దంలో నెలకొన్న రామనాథ రాజ్యపు యువరాణి వేలూ నాచ్చియార్. 1730 జనవరి 3న జన్మించింది. ఆమె ఒక్కగానొక్క కూతురు కావడంతో తల్లిదండ్రులు ఆమెకు అన్ని విద్యలు నేర్పించారు. తమిళం మాతృభాష అయినప్పటికీ నాచ్చియార్ ఇంగ్లిష్, ఫ్రెంచ్, ఉర్దూ భాషల్లో ప్రావీణ్యం సంపాదించింది. ఆమెకు 16 ఏళ్లు వచ్చాక 1746లో– గతంలో రామనాథ రాజ్యం నుంచి విడిపోయి మరొక రాజ్యంగా ఏర్పడిన శివగంగ రాజ్యానికి కోడలుగా వెళ్లింది. శివగంగ రాజ్య యువరాజు వడుగనాథ దేవర్ ఆమెకు భర్త అయ్యాడు. వాళ్లకు వెళ్లాచ్చి అనే కూతురు పుట్టింది. ఆ విధంగా రామనాథ రాజ్యం, శివగంగ రాజ్యం హాయిగా తమ ప్రాభవాన్ని కొనసాగిస్తూ ఉండగా బ్రిటిష్‌వారు ఊడిపడ్డారు.
బ్రిటిష్ దాడి
అప్పటికే దేశం లోపలి రాజ్యాల నడుమ ఉన్న లుకలుకలను ఉపయోగించుకుని తమ పెత్తనాన్ని స్థిరపరుచుకుంటూ వస్తున్న బ్రిటిష్ వారు దక్షిణాదిలో తమ విస్తరణ కోసం ఆర్కాట్ నవాబుతో చేయి కలిపారు. అప్పటికి ఆర్కాట్ నవాబు మధురై నాయక రాజ్యాన్ని ఆక్రమించుకుని ఉన్నాడు. అతనికి రామనాథ రాజ్యం, శివగంగ రాజ్యం కప్పం కట్టడానికి అంగీకరించలేదు. దాంతో బ్రిటిష్ వారు అతనిని రెచ్చగొట్టి ఆ రాజ్యాలను హస్తగతం చేసుకోవాలనుకున్నారు.
అది 1772వ సంవత్సరం. శివగంగ ఆలయానికి దర్శనానికి నిరాయుధునిగా వెళ్లిన వడుగనాథ దేవర్‌పైన బ్రిటిష్ వారు హటాత్తుగా దాడి చేసి చంపేశారు.
అంతేకాదు ఆలయాన్ని లూటీ చేసి 50 వేల బంగారు నాణేలు తీసుకెళ్లారు. ఆలయంలో భర్తను చంపారన్న వార్త విని వేలూ నాచ్చియార్ హతాశురాలైంది. వెంటనే ఒక మంత్రి సహాయం రాగా కుమార్తెను తీసుకుని విరూపాక్షికి వెళ్లిపోయింది. అయితే బ్రిటిష్ వారు ఆమె నమ్మినబంటు ఉడయాళ్‌ను పట్టుకుని ఆమె ఆచూకి కోసం నిలదీశారు. అతను చెప్పకపోయేసరికి చంపేశారు. ఈ వార్త విన్నాక వేలూ నాచ్చియార్ ఆగ్రహంతో ఊగిపోయింది. ‘బ్రిటిష్‌వారిని ఓడించి నా రాజ్యాన్ని తిరిగి గెలుచుకుంటాను’ అని శపథం చేసింది.
8 ఏళ్ల అజ్ఞాత వాసం
వేలూ నాచ్చియర్ 8 ఏళ్లు అజ్ఞాతవాసం చేసింది. ఆమె నమ్మినబంట్లు మెల్లమెల్లగా ఆమెను చేరుకున్నారు. బ్రిటిష్ వారిని ఓడించాలన్న తలంపుతో ఆమె మాస్టర్ ప్లాన్ వేసి మహిళా దళాన్ని తయారు చేసింది. దానికి తన నమ్మినబంటైన ఉడయాళ్ పేరు పెట్టింది. ‘కుయిలీ’ అనే మహిళ దానికి నాయకురాలు. శివగంగ రాణి ఇలా బ్రిటిష్ వారిపై ప్రతీకారం కోసం ప్రయత్నిస్తున్నదని విన్న మైసూర్ నవాబు హైదర్ అలీ ఆమెకు మద్దతు ఇవ్వడానికి వచ్చాడు. ఆమె తన సైన్యం నిర్మించుకోవడానికి పూర్తి ఆర్థిక సహాయం అందించాడు. వేలూ నాచ్చియార్ తన పదాతి దళం, అశ్వదళం, మహిళా దళంతో పూర్తిగా దాడికి సిద్ధమైంది. అయితే ఆమె దగ్గర ఉన్న మందుగుండు సామాగ్రి చాలా తక్కువ. బ్రిటిష్ వారి దగ్గర ఉన్నది చాలా ఎక్కువ. దానికి విరుగుడు? మానవబాంబు.
ప్రతిదాడి
అది 1780. విజయదశమి రోజు. ఆ రోజున కోట గోడలు తెరిచి సామాన్యజనాన్ని ఆహ్వానిస్తారు శివగంగ రాజ్యంలో. వేలూ నాచియార్ తయారు చేసిన మహిళా దళం సభ్యులు ఆయుధాలను చీర కొంగుల్లో దాచుకుని సామాన్య మహిళలుగా కోటలోకి ప్రవేశించారు. అదను చూసి నాయకురాలు కుయిలీ ఆదేశం అందుకుని బ్రిటిష్ వారిపై ఊచకోత సాగించారు. బ్రిటిష్‌వారు ఆయుధగారంలోకి వెళ్లి ఆయుధాలు తీసే లోపు ఒక మానవబాంబు ఒళ్లంతా నెయ్యి పూసుకుని ఆయుధగారంలోకి వెళ్లి మంట పెట్టుకుంది.
అంతే. ఆయుధగారం పేలి ఆయుధాలు వృధా అయిపోయాయి. మరోవైపు వేలూ నాచ్చియార్ తన దళంలో ఊడిపడి బ్రిటిష్ వారిని చీల్చి చెండాడి తన రాజ్యం తిరిగి దక్కించుకుంది. అవమానకరమైన ఈ ఓటమిని బ్రిటిష్ వారు చరిత్ర పుటల్లోకి ఎక్కకుండా జాగ్రత్త పడ్డారు. అప్పటికి ఆమెకు 50 ఏళ్లు. ఆ తర్వాత మరో 16 ఏళ్లు జీవించి హృద్రోగంతో 1796లో కన్నుమూసింది వేలూ నాచ్చియార్. ఆమెను తమిళనాడులో ‘వీరనారి’ అని పిలుచుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment