మానవతకు ప్రతిరూపం | Sister Nivedita Jayanti on 28th Oct | Sakshi
Sakshi News home page

Sister Nivedita: మానవతకు ప్రతిరూపం

Published Mon, Oct 28 2024 11:39 AM | Last Updated on Mon, Oct 28 2024 12:05 PM

Sister Nivedita Jayanti on 28th Oct

మహిళలకు సరైన విద్యావకాశాలు కల్పించి విద్యావంతులను చేసినపుడే దేశం అభివృద్ధి చెందుతుందని ఉద్ఘాటించిన సిస్టర్‌ నివేదిత మహిళా విద్యాభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. వివేకా నందుడి బోధనలకు ప్రభావితమై హిందూ (ధర్మం) మతాన్ని స్వీకరించిన మొదటి విదేశీ మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. ఐర్లాండులో ఆమె 1867 అక్టోబర్‌ 28న జన్మించారు. ఆమె అసలు పేరు మార్గరెట్‌ ఎలిజబెత్‌ నోబెల్‌. 

1895లో భారత మహిళా ఔన్నత్యంపై స్వామి వివేకానంద లండన్‌లో చేసిన ప్రసంగాలు మార్గ రెట్‌ జీవితాన్ని మార్చాయి. భారతీయ స్త్రీ గొప్పదనం గురించి విన్న ఆమె... వివేకానందను కలిసి 1898 జనవరి 28న భారత్‌ వచ్చింది. ఆమెకు వివేకానంద ‘నివేదిత’ అని నామకరణం చేశారు. నివే దిత అంటే భగవంతునికి సమర్పణ చేయబడినది అని అర్థం. వివేకానంద బోధన గురించి, తనపై వాటి ప్రభావం గురించి తాను రాసిన ‘ద మాస్టర్‌ యాజ్‌ ఐ సా హిమ్‌’ పుస్తకంలో వివరించారు. ఇతరుల పట్ల దయతో మెలిగే ఆమె మంచి అభిరుచి గ‌ల కళాకారిణి. సంగీతంలోనూ, చిత్రకళలోనూ ఆమెకు ప్రవేశం ఉండేది.

ఉపాధ్యాయురాలిగా పనిచేసిన అనుభవం ఉన్న నివేదిత భారత్‌లోనూ విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ముఖ్యంగా బాలికల విద్య కోసం ఆమె 1898 నవంబరులో కలకత్తాలోని బాగ్‌ బజారులో పాఠశాలను ప్రారంభించారు. కనీస విద్య లేని బాలికలకు విద్యను అందించడం లక్ష్యంగా ఆమె పనిచేశారు. 1899 మార్చిలో కలకత్తా వాసులకు ప్లేగువ్యాధి సోకినప్పుడు తన శిష్యులతో కలిసి వైద్యసేవలు అందించారు. 

భారత మహిళల ఔన్నత్యం గురించీ, ఆచార వ్యవహారాల గురించీ న్యూయార్క్, షికాగో వంటి నగరాల్లో ప్రసంగించారు. భారత స్వాతంత్య్ర పోరాటంలోనూ చురుకైన పాత్ర పోషించారు. 1906లో బెంగాల్‌కు వరదలు వచ్చినప్పుడు బాధిత ప్రజలకు ఆమె చేసిన సేవ, అందించిన మానసిక ధైర్యం ఎంతో విలువైనవి. 1911 అక్టోబర్‌ 13న డార్జిలింగ్‌లో మరణించిన సిస్టర్‌ నివేదిత తలపెట్టిన పనులను విస్తరించడమే మనం ఆమెకు ఇవ్వగల నివాళి.

– సాకి ‘ 99511 72002
(నేడు సిస్టర్‌ నివేదిత జయంతి) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement