ముందుజాగ్రత్తలతో తప్పిన పెనుముప్పు
పై-లీన్ తుఫాను తీరం దాటినప్పుడు గాలి వేగం దాదాపు గంటకు 220-240 కిలోమీటర్లు ఉంది. తుఫాను కూడా గంటకు 220 కిలోమీటర్ల వేగంతో తీరాన్ని తాకింది. ఇంత తీవ్రత ఉన్న తుఫాను సంభవిస్తే జనం అల్లాడిపోవాలి. నిజానికి 1999లో కూడా ఇంతే తీవ్రతతో తుఫాను సంభవించి ఒడిశా రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది అప్పటి విలయానికి దాదాపు 12 వేల మంది మరణించారు. దాంతో అప్పటి ముఖ్యమంత్రి గిరిధర్ గొమాంగో నేతృత్వంలోని ప్రభుత్వం రాజీనామా కూడా చేయాల్సి వచ్చింది.
అయితే.. ఈసారి కూడా అంతే తీవ్రతతో తుఫాను తీరాన్ని దాటినా, ప్రాణనష్టం అత్యంత తక్కువగా ఉండటం గమనార్హం. ముందస్తుగానే వాతావరణ శాఖ హెచ్చరించడం, దానికితోడు రాష్ట్ర అధికార యంత్రాంగంతో పాటు ఎన్డీఎంఏ, ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, వైమానిక దళాలు.. ఇలా అందరూ అప్రమత్తం కావడంతో ప్రాణనష్టం ఎక్కువ సంభవించకుండా అరికట్టగలిగారు. తుఫాను ప్రభావంతో కేవలం ఆరుగురు మాత్రమే ప్రాణాలు కోల్పోయారు. ముందుగానే జాగ్రత్త వహించి ఒడిశా నుంచి దాదాపు 8 లక్షల మందిని, ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం ద్వారా భారీ ప్రాణనష్టం సంభవించకుండా నివారించగలిగినట్లు ఎన్డీఆర్ఎఫ్ చీఫ్ కృష్ణచౌదరి తెలిపారు.