Human Resources Minister
-
Digital Library: అరచేతిలో పుస్తక భాండాగారం
సాక్షి, కమ్మర్పల్లి(నిజామాబాద్): కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఏడాది నుంచి గ్రంథాలయాలు మూతపడి ఉన్నాయి. ఒకవేళ తెరిచినా పాఠకులు రాలేని పరిస్థితి నెలకొంది. తెరుచుకున్న సమయంలో పాఠకులు రావడానికి ఆసక్తి చూపడం లేదు. పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న అభ్యర్థులు తమకు కావలసిన పుస్తకాలను చదవలేక పోతున్నారు. సెల్‌ఫోన్, ఇంటర్నెట్లో మునిగిపోతున్న విద్యార్థులు, యువకులు, ఉద్యోగాన్వేషణలో ఉన్న అభ్యర్థులకు కేంద్రం అరచేతిలోనే విజ్ఞానాన్ని అందించే ‘డిజిటల్ లైబ్రరీ’ని అందుబాటులోకి తెచ్చింది. నిరుద్యోగులు, యువకులు సద్వినియోగం చేసుకునేలా పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలను డిజిటలైజేషన్ చేసి ‘నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా’ ద్వారా అందుబాటులోకి తెచ్చింది. దీంతో అరచేతిలో డిజిటల్ లైబ్రరీ రూపుదిద్దుకుంది. ఇందులో 4 కోట్లకు పైగా పుస్తకాలు పాఠకులకు ఉపయోగపడి, అవసరమయ్యే విజ్ఞానాన్ని పంచనున్నాయి. ఖరగ్‌పూర్ ఐఐటీ సంస్థ ఆధ్వర్యంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ అనుమతితో ఖరగ్‌పూర్ ఐఐటీ సంస్థ ఆధ్వర్యంలో ఇంటర్నెట్లో నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా పేరుతో డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేసింది. ఇందులో విషయ నిపుణుల వీడియోలను పొందుపరిచారు. పాఠశాల, కళాశాల, ఇంజనీరింగ్, వైద్య, న్యాయ విద్య, సాహిత్యం, సంస్కృతం ఇలా అన్ని రకాల స్టడీ మెటీరియల్‌ను ఇంగ్లీష్, హిందీతో పాటు, ఇతర భాషల్లో ఆన్లైన్లో నిక్షిప్తం చేశారు. పోటీ పరీక్షలకు కావలసిన అన్ని అంశాలను పొందుపరిచారు. పాఠశాల పుస్తకాలు(సీబీఎస్ఈ సిలబస్), లిట్రేచర్, మెడిసిన్, లా మేనేజ్మెంట్, ఇంజనీరింగ్ పుస్తకాలు, మత గ్రంథాలు వివిధ భాషల్లో అందుబాటులోకి తెచ్చారు. ఈ పుస్తకాలన్ని పీడీఎఫ్ ఫార్మాట్లో ఉండగా, సైట్ ఒపెన్ చేసి చదువుకోవచ్చు లేదా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వినియోగం ఇలా... స్మార్ట్ ఫోన్, ల్యాప్‌ట్యాప్ లేదా డెస్క్‌టాప్ కంప్యూటర్ల ద్వారా డిజిటల్ లైబ్రరీని వినియోగించుకునేలా తీర్చిదిద్దారు. ఇంటర్నెట్ గూగుల్‌లో ‘నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా’ టైప్ చేస్తే డిజిటల్ లైబ్రరీ తెరుచుకుంటుంది. ఈమెయిల్ ఐడీ ద్వారా లాగిన్ అయి రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత మనకు కావలసిన అంశాలను ఎంచుకొని చదువుకోవచ్చు లేదా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ లైబ్రరీలో వీడియోల ద్వారా సైతం విజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు. గూగుల్ ప్లేస్టోర్‌లో నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా అని టైప్ చేసి డిజిటల్ లైబ్రరీ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. వినియోగదారులు సబ్స్క్రిప్షన్ పెట్టుకుంటే కొత్త పుస్తకాలు అందుబాటులోకి వస్తే ఈ మెయిల్ ద్వారా మెసేజ్ వస్తుంది. ఉమ్మడి జిల్లాలో గ్రంథాలయాల పరిస్థితి... ఉమ్మడి జిల్లాలో 44 గ్రంథాలయాలు ఉండగా, 85 వేల మంది సభ్యత్వం కలిగి ఉన్నారు. సుమారు 6 లక్షల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. కరోనాకు ముందు ఇవి పాఠకులతో కళకళలాడేవి. కరోనాతో గ్రంథాలయాలు వెలవెలబోయాయి. ఈ నేపథ్యంలో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులు, యువకులకు కేంద్రం అందుబాటులోకి తెచ్చిన డిజిటల్ లైబ్రరీ ఎంతగానో ఉపయోగపడుతుంది. చదవండి: ఫోన్ పోతే ఇలా తేలికగా కనిపెట్టొచ్చని తెలుసా? -
‘వచ్చే ఎన్నికల్లో అధికారం మాదే’
డెహ్రాడూన్: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ పేర్కొన్నారు. 2019 ఎన్నికల తరువాత కూడా తమ పార్టీ బలంగా ఉంటుందన్నారు. డెహ్రాడూన్‌లో ఓ కార్యక్రమంలో జవదేకర్ మాట్లాడారు. ఉపఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ ఉప ఎన్నికల ఫలితాలు స్థానిక పరిస్థితులపై ఆధారపడి ఉంటాయని వాటి ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై ఏమాత్రం పడదన్నారు. ఉప ఎన్నికల్లో ఓడినంతమాత్రాన మోదీ ప్రభావం తగ్గినట్లు కాదన్నారు. ఇటీవల జరిగిన ఏ ఉప ఎన్నికల ప్రచారంలో కూడా మోదీ పాల్గొన్నలేదని గుర్తుచేశారు. గత ఎన్నికలతో పోల్చుకుంటే 2019లో మెరుగైన ఫలితాలు సాధిస్తామని, బెంగాల్, ఒడిషా, కేరళ రాష్ట్రాల్లో కూడా గెలుస్తామని పేర్కొన్నారు. నాలుగేళ్లలో తమ ప్రభుత్వం అవినీతి రహిత పాలన అందిస్తోందిని, ఏ మంత్రిపై కూడా అవినీతి ఆరోపణలు రాలేదని ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో సంక్షేమ పథకాలకు ప్రభుత్వం వందశాతం నిధులు విడుదల చేస్తోందని తెలిపారు. -
ఐదు వేల కోట్లతో పాఠశాలల్లో మౌలిక వసతులు
ఐదు వేల కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులను అభివృద్ది చేస్తున్నామని రాష్ట్ర మానవ వనరుల శాఖామంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో ఎంపిక చేసిన 600 మంది ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు వారం రోజులపాటు వ్యాయామ విద్యపై జరుగనున్న శిక్షణా తరగతులను మంగళవారం ఏఎన్‌యూలో మంత్రి ప్రారంభించారు. కార్యక్రమం అనంతరం విలేకర్ల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఫిజికల్ లిటరసీతోపాటు స్పోర్ట్స్ లిటరసీ ఆవశ్యకతను కూడా గుర్తించాలన్నారు. వ్యాయామ విద్య, క్రీడల ప్రాధాన్యతను పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంతర్జాతీయ, జాతీయ స్థాయి క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మార్కుల్లో వెయిటేజీ ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో క్రీడారంగాన్ని అభివృద్ది చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని విశాఖపట్నంలో వెయ్యి ఎకరాల్లో స్పోర్ట్ సిటీని ఏర్పాటు చేయనున్నామన్నారు. సింహాచలంలో 99 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్ కాంప్లెక్స్, లంబసింగిలో స్పోర్ట్స్ స్కూల్, అరకులో ఆర్చరీ అకాడమీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ల అప్‌గ్రేడేషన్ ఫైల్‌కు ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చిందని త్వరలో దీనిపై సానుకూల ఉత్తర్వులు వెలువడతాయన్నారు. అవసరమైన పాఠశాలల్లో ఔట్సోర్సింగ్ తదితర మార్గాల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లను నియమిస్తామన్నారు. డీఎస్సీ 2014 అభ్యర్థులకు జూన్ ఒకటో తేదీ కల్లా నియామక ఉత్తర్వులు అందజేస్తామన్నారు. వారికి 15 రోజులపాటు శిక్షణ ఇస్తామని అనంతరం ప్రతిజ్ఞ కూడా చేయించనున్నామన్నారు. ఏఎన్‌యూ వీసీ నుంచి నివేదిక: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పదోన్నతులు, నియామకాల్లో అవకతవకలు జరిగాయనే అంశాలపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని వీసీ ఆచార్య ఎ రాజేంద్రప్రసాద్‌ను కోరామన్నారు. వీసీ వ్యక్తిగత పనుల వల్ల విశాఖపట్నంలో ఉన్నారని ఆయన రాగానే నివేదిక ఇస్తారని దాని ఆధారంగా చర్యలు చేపడతామన్నారు. -
లేని కాలేజీలో.. లా చదివారట!
కేంద్రమంత్రి ముండేపై కాంగ్రెస్ విసుర్లు. న్యూఢిల్లీ: ఎన్డీఏ ప్రభుత్వంలోని మంత్రుల విద్యార్హతలపైనే కాంగ్రెస్ ప్రధానంగా దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. నిన్నటివరకు మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ కనీసం డిగ్రీ కూడా చేయలేదంటూ విమర్శలు గుప్పించిన కాంగ్రెస్.. తాజాగా గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గోపీనాథ్ ముండే విద్యార్హతలను ప్రశ్నించింది. 1978లో ప్రారంభమైన కళాశాల నుంచి 1976లోనే ముండే డిగ్రీ పూర్తి చేశాడంటూ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి షకీల్ అహ్మద్ శనివారం ట్విటర్లో ఎద్దేవా చేశారు. ముండే డిగ్రీ పూర్తి చేసిన నాటికి అసలా కాలేజే ప్రారంభం కాలేదన్నారు. పుణేలోని న్యూ లా కాలేజ్‌లో 1976లో బీజేఎల్ డిగ్రీ పూర్తి చేసినట్లు 2014 ఎన్నికల అఫిడవిట్లో గోపీనాథ్ ముండే పేర్కొన్నారని, అయితే, ఆ కాలేజ్ 1978లో ప్రారంభమైనట్లు ఆ కళాశాల వెబ్సైట్లో ఉందని అహ్మద్ వివరించారు. ముండేను సంప్రదించి, వివరణ కోరేందుకు మీడియా ప్రయత్నించగా.. స్పందన రాలేదు. కాగా, ఇరానీ ప్రవేశానికి సంబంధించిన పత్రాలను లీక్ చేశారన్న ఆరోపణలపై ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ఐదుగురు బోధనేతర ఉద్యోగులను శుక్రవారం యాజమాన్యం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. వారిని మళ్లీ విధుల్లోకి తీసుకోవాల్సిందిగా స్మృతి ఇరానీ యూనివర్సిటీ అధికారులకు విజ్ఞప్తి చేశారు.