human rights abuses
-
కంటి వైద్యుడి నుంచి కర్కశ నియంత దాకా..
బీరూట్: రెండు పుష్కరాల క్రితం అన్యమనస్కంగా అధ్యక్ష పీఠంపై కూర్చున్న అసద్ తదనంతరకాలంలో నిరంకుశ నేతగా ఎదిగిన వైనం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. డమాస్కస్ మెడికల్ కాలేజీలో చదివిన అసద్ తర్వాత ఆప్తమాలజీ చదివేందుకు బ్రిటన్ వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. అసద్ తొలినాళ్లలో లండన్‌లో నేత్ర వైద్యునిగా సేవలందించేవారు. 1971 సంవత్సరం నుంచి సిరియాను తన ఉక్కుపిడికిలి కింద పాలిస్తున్న తన తండ్రి హఫీజ్ మరణంతో 2000 సంవత్సరంలో అసద్ స్వదేశం తిరిగొచ్చాడు. సానుభూతిపరుల మద్దతుతో అయిష్టంగానే అధ్యక్ష పీఠంపై కూర్చున్నారు. అప్పటికి ఆయన వయసు కేవలం 34 సంవత్సరాలు. అధ్యక్ష పదవికి కనీస అర్హత వయసు అయిన 40 ఏళ్లుకూడా నిండకపోవడంతో ఈయన కోసం పార్లమెంట్లో చట్టసవరణ చేశారు. నిజానికి హఫీజ్ తన పెద్ద కుమారుడు బస్సెల్ను తన వారసునిగా చూడాలనుకున్నారు. అయితే 1994లో కారు ప్రమాదంలో బస్సెల్ మరణించడంతో అసద్ అసలైన వారసుడయ్యారు. 2011దాకా అసద్ పాలనపై పెద్దగా విమర్శలు రాలేదు. కానీ అరబ్ విప్లవం మొదలయ్యాక 2011 మార్చిలో అసద్ పాలనను వ్యతిరేకిస్తూ ప్రజలు డమాస్కస్, డేరా నగరాల్లో వీధుల్లోకి వచ్చి ఉద్యమాలు చేశారు. వీటిని అసద్ సర్కార్ ఉక్కుపాదంతో అణచివేసింది. ఆనాటి నుంచి అసద్ నిరంకుశ పాలనకు తెరలేపారు. మానవహక్కుల ఉల్లంఘన, అక్రమ అరెస్ట్‌లు, జనంపైకి రసాయన ఆయుధాల ప్రయోగం, కుర్దులను అణగతొక్కడం, ప్రభుత్వ ఆధ్వర్యంలో కిడ్నాప్‌లు, హత్యలు వంటి అరాచకాలు ఆనాటి నుంచి నిత్యకృత్యమయ్యాయి. ఆ తర్వాతి ఏడాది అలెప్పో సిటీలో ఘర్షణలు పెరిగాయి. తిరుగుబాటుదారులు నగరాన్ని ఆక్రమించుకోగా నాలుగేళ్లు కష్టపడి సైన్యం తిరిగి స్వాధీనంచేసుకుంది. ఆ తర్వాత తూర్పు ఘాతాలో ప్రభుత్వం జరిపిన రసాయన ఆయుధ దాడిలో ఏకంగా వందలాది మంది అమాయక పౌరులు చనిపోయారు. దీంతో ఐసిస్ ఉగ్రసంస్థ విజృంభించి రఖాను స్వాధీనం చేసుకుంది. 2019దాకా ఐసిస్ పట్టుకొనసాగింది. అయితే 2015 సెప్టెంబర్‌లో రష్యా రాకతో అసద్ బలం పుంజుకున్నారు. అయితే 2017 ఏప్రిల్‌లో అసద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమెరికా సేనలు పరోక్షంగా రంగ ప్రవేశం చేశాయి. 14 ఏళ్ల అంతర్యుద్ధానికి ముగింపు పలుకుతూ గత నెల 27న ఇడ్లిబ్ సిటీ ఆక్రమణతో మొదలైన తిరుగుబాటుదారుల జైత్రయాత్ర రాజధాని డమాస్కస్దాకా కొనసాగడంతో 59 ఏళ్ల అసద్ పలాయనం చిత్తగించక తప్పలేదు. అసద్ పాలనలో దాదాపు ఐదు లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అంతర్యుద్ధం కారణంగా 11 లక్షల మంది సిరియాను వదిలి విదేశాలకు శరణార్థులుగా వలసవెళ్లారు. అసద్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. -
మైనార్టీల అణచివేత.. చైనాపై అమెరికా ఆగ్రహం
న్యూయార్క్: జిన్జియాంగ్లో ఉయిగర్ ముస్లింలు, ఇతర మైనార్టీల అణచివేతపై చర్యలు తీసుకోవాలని చైనాకు అమెరికా పిలుపునిచ్చింది. ఉయిగర్ ముస్లింలపై వివక్ష, అణచివేతను అంతం చేయాలని పేర్కొంది. జిన్జింయంగ్లో మానవ హక్కులపై ఐక్యరాజ్యసమితి నివేదిక విడుదలై రెండేళ్లు గడిచిన సందర్భంగా అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఉయిగర్ ముస్లింల విషయంలో ఇప్పటివరకు చైనా తీసుకుంటున్న చర్యలపై అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు.జిన్జియాంగ్లో చాలా దారుణంగా మానవ హక్కుల ఉల్లంఘటన జరుగుతోందని ఐక్యరాజ్య సమితి 2022లో నివేదిక విడుదల చేసింది. రెండేళ్ల గడిచిన సందర్భంగా మాథ్యూ విల్లర్ ఎక్స్ వేదికగా స్పందించారు.Two years since the UN High Commissioner for Human Rights released an assessment on human rights violations in Xinjiang, the U.S. continues to urge the PRC to take immediate action and end the ongoing repression of Muslim Uyghurs and other ethnic and religious minority groups.— Matthew Miller (@StateDeptSpox) August 30, 2024 ‘‘చైనాలోని జిన్జియాంగ్లో మానవ హక్కుల ఉల్లంఘనలపై ఐక్యరాజ్యసమితి హైకమిషనర్ నివేదిక విడుదల చేసి రెండేళ్లు పూర్తి అయింది. ఇప్పటికైనా పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా తక్షణ చర్యలు తీసుకోవాలి. ఉయిగర్ ముస్లింలు, ఇతర మైనార్టీల అణచివేతను అంతం చేయాలని కోరుతున్నాం’’ అని అన్నారు. అణచివేతకు గురువుతున్న వారిని విడుదల చేయాలని ఐక్యరాజ్య సమితి పిఫార్సులను చైనా అమలు చేయకపోవటంపై అమెరికా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుందని తెలిపారు. జిన్జియాంగ్లో ప్రధానంగా ముస్లిం ఉయిగర్లు ఇతర మైనారిటీలపై కొనసాగుతున్న అణచివేతపై అమెరికా తీవ్రంగా ఆందోళన చెందుతోందని అన్నారు. ఉయిగర్ ముస్లింలపై కొనసాగుతున్న అంతర్జాతీయ నేరాలు, మానవ హక్కులకు ఉల్లంఘనలు ముగింపు పలికేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని చైనాను మరోసారి కోరుతున్నామని మిల్లర్ అన్నారు. -
యూఎస్ మానవహక్కుల నివేదిక.. తీవ్రంగా ఖండించిన భారత్
దేశంలో మానవ హక్కుల పరిస్థితులపై అమెరికా ఇచ్చిన నివేదికను బారత్ తీవ్రంగా ఖండించింది. యూఎస్ డాక్యుమెంట్ తీవ్ర పక్షపాతంతో కూడుకొని ఉందని, భారత్‌పై సరైన అవగాహన లేకపోవాడాన్ని ప్రతిబింబిస్తోందని పేర్కొంది. గతేడాది మణిపూర్‌లో హింస చెలరేగిన తర్వాత రాష్ట్రంలో గణనీయమైన మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగాయని యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ఇటీవల ఓ నివేదిక పేర్కొంది.దీనిపై విదేశాంత మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ స్పందిస్తూ.. ఈ నివేదిక తీవ్ర పక్షపాతంలో కూడుకున్నట్లు తెలిపారు. భారత్‌పై అమెరికాకు సరైన అవగాహన లేదనే విషయం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. దీనికి తాము(భారత్) ఎలాంటి విలువ ఇవ్వడం లేదని, మీరు కూడా(మీడియా) పట్టించుకోవద్దని తెలిపారు.కాగా ‘2023 కంట్రీ రిపోర్ట్స్ ఆన్ హ్యూమన్ రైట్స్ ప్రాక్టిసెస్: ఇండియా’ పేరుతో విడుదల చేసిన ఈ డాక్యుమెంట్లో మణిపూర్‌లో మైతీ, కుకీ వర్గాల మధ్య చెలరేగిన జాతి వివాదం మానవ హక్కులు ఉల్లంఘనకు దారి తీసినట్లు ఆరోపించింది. ఈ ఘటనను ప్రధాని నరేంద్రమోదీ సిగ్గుచేటని అభివర్ణించి, చర్యలు తీసుకోవాలని కోరినట్లు కూడా నివేదిక పేర్కొంది. ఇదే కాకుండా జమ్మూ కాశ్మీర్లో పలువురు జర్నలిస్టులు, మానవహక్కుల నేతలను విచారించారనే పలు రిపోర్టులు తమ వద్ద ఉన్నాయని పేర్కొంది. గతేడాది ఫిబ్రవరిలో ముంబై, ఢిల్లీలోని బీబీసీ కార్యాలయలపై దర్యాప్తు సంస్థల దాడి, మోదీపై డాక్యుమెంటరీ, మోదీ ఇంటి పేరును కించపరిచిన కేసులో రాహుల్ గాంధీకి శిక్ష పడటం, ఆయన లోక్‌సభ అనర్హతకు గురికావడం, మళ్లీ సుప్రీం కోర్టు స్టేతో ఎంపీ పదివి తిరిగి పొందడం, కెనడాలో ఖలీస్తానీ ఉగ్రవాది హత్య వంటి అంశాలను కూడా ప్రస్తావించింది.చదవండి: మస్క్ పేరుతో మోసం.. రూ.41 లక్షలు పాయే.. -
మంత్రి శ్రీనివాస్‌గౌడ్, అతని సోదరుడు వేధిస్తున్నారు..
సాక్షి, నాంపల్లి(మహబూబ్‌నగర్): రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్, అతని సోదరుడు శ్రీకాంత్ గౌడ్ల నుంచి తమకు ప్రాణహాని ఉందని మహబూబ్‌నగర్‌కు చెందిన విశ్వనాథరావు, పుష్పలత దంపతులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. 2018 ఎన్నికల సమయంలో ఓ కేసు విషయంలో సాక్షిగా ఉన్న తమను కక్ష కట్టి మంత్రి, అతని సోదరుడు మాపై అక్రమ కేసులు పెట్టి తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. స్థానిక రూరల్ ఇన్స్పెక్టర్ మహేశ్వర్‌తో అర్థరాత్రి ఇంటిపై దాడులు చేయిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న తమ ఇద్దరి ఉద్యోగాలను కూడా మంత్రి తీసి వేయించి తమ కుటుంబాన్ని రోడ్డుపాలు చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. -
శాంతికి సిద్ధం.. కశ్మీర్ కీలకం!
ఇస్లామాబాద్: భారత్‌తో సత్సంబంధాలు నెలకొల్పేందుకు తన నేతృత్వంలో ఏర్పడబోయే ప్రభుత్వం సిద్ధంగా ఉందని పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. కీలమైన కశ్మీర్ వివాదం సహా అన్ని అంశాలపై ఇరుదేశాల నేతలు పరిష్కారం కుదుర్చుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. బుధవారం జరిగిన పాకిస్తాన్ ఎన్నికల్లో పీటీఐ అతిపెద్ద పార్టీగా నిలిచిన నేపథ్యంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. భారత్–పాక్‌లు ఒకరిపై ఒకరు నెపం నెట్టుకోవడానికి ముగింపు పలికి ఉపఖండంలో సుస్థిరతకు ప్రయత్నం చేయాలన్నారు. 2016లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ముంబైలో దాడులకు పాల్పడిన తర్వాత ఇరుదేశాల మధ్య ఇంతవరకు ద్వైపాక్షిక చర్చలు జరగలేదు. అనంతరం కుల్‌భూషణ్ జాధవ్ అనే మాజీ నేవీ అధికారిని భారత నిఘా అధికారి అని ఆరోపిస్తూ.. ఆయనకు పాక్ కోర్టు మరణశిక్ష విధించడంతో పరిస్థితులు జఠిలంగా మారాయి. కశ్మీర్ అంశంపై.. ‘ఇరుదేశాల మధ్య సత్సంబంధాల కోసం భారత్ ఒక అడుగు ముందుకేస్తే మేం రెండడుగులు వేస్తాం. కానీ ఎవరో ఒకరు ఈ దిశగా చొరవతీసుకోవాలి’ అని ఇమ్రాన్ అన్నారు. రెండు దేశాల మధ్య కశ్మీర్ ఒక్కటే కీలకమైన అంశం. చర్చల ద్వారా ఈ సమస్యకు పరిష్కారం కోసం ఇరుదేశాలు సిద్ధం కావాలి. 30 ఏళ్లుగా భారత ఆర్మీ ద్వారా కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. ఈ సమస్యకు ముగింపు పలకాలి. ఇరుదేశాల ప్రభుత్వాలు చర్చలు జరపాలి. ఈ సమస్యపై అటూ ఇటూ తిరిగి మళ్లీ మొదటకే వస్తున్నాం’ అని ఇమ్రాన్ వ్యాఖ్యానించారు. వాణిజ్య సంబంధాలపై ‘ఒకవేళ భారత నాయకత్వం కోరుకుంటే.. ఆ దేశంతో సంబంధాలు బలోపేతం కావాలని నేను మనసారా కోరుకుంటున్నాను. బెలూచిస్తాన్‌లో జరుగుతున్న దానికి భారత్‌దే బాధ్యతని.. అలాగే కశ్మీర్లో జరుగుతున్న ఘటనలకు పాకిస్తాన్ బాధ్యతంటూ ఒకరినొకరు తప్పుబట్టుకోవడం సరికాదు. ఇలాంటి ఆరోపణలతో మనం వృద్ధి చెందలేం. ఇవి ఉపఖండానికి చేటుచేస్తాయి. భారత్–పాకిస్తాన్ సత్సంబంధాలు, సరైన వాణిజ్య బంధాల ద్వారా ఈ ప్రాంతానికి చాలా మేలు జరుగుతుంది. రెండు దేశాలు ఆర్థికంగా సమృద్ధి చెందుతాయి’ అని ఇమ్రాన్ ఖాన్ అభిప్రాయ పడ్డారు. భారత మీడియాపై.. తనపై భారత మీడియా పేర్కొంటున్న కథనాలపై ఇమ్రాన్ ఖాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘కొంతకాలంగా భారత మీడియా నన్ను బాలీవుడ్ సినిమాల్లో విలన్ మాదిరిగా చిత్రీకరిస్తోంది. ఆ వార్తలను చూస్తుంటే చాలా బాధేస్తోంది. భారత్‌తో సత్సంబంధాలు కోరుకునే ఓ పాకిస్తానీని నేను. ఇమ్రాన్ ఖాన్ అధికారంలోకి వస్తే భారత్‌కు చెడు జరుగుతుందనే ప్రచారం చేస్తున్నారు. ఇది సరికాదు. ఓ క్రికెటర్‌గా భారత్ అంతా చుట్టేశాను. భారత్, భారత ప్రజల గురించి నాకు బాగా తెలుసు. మనం కలిస్తే ఆగ్నేయాసియాలో పేదరికాన్ని పారద్రోలవచ్చు. ఇరుదేశాల మధ్య అతిపెద్ద సమస్య కశ్మీర్. ఈ అంశంపై రెండు దేశాలు చర్చలు ప్రారంభించాలి’ అని అన్నారు. చైనా, అరేబియా దేశాలతో దోస్తీ అమెరికాతో సత్సంబంధాలతో పాక్‌కు మేలు జరుగుతుంది. అమెరికాకు పాక్‌తో బంధాలు కాపాడుకోవడం అవసరం. ఇది పరస్పర ప్రయోజనాల అంశం. ఇరాన్, సౌదీ అరేబియాలతోనూ మా దోస్తీ కొనసాగుతుంది. చైనాతో మా బంధాలను బలోపేతం చేసుకుంటాం. చైనా–పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్‌లో పెట్టుబడులు పెట్టి వారు మాకో అవకాశాన్ని కల్పించారు. అవినీతిపై యుద్ధం, ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకురావడంలో చైనా నుంచి మేం చాలా నేర్చుకుంటాం. ఉగ్రవాదంపై పోరు కారణంగా అఫ్గనిస్తాన్ నష్టపోయింది. ఆ దేశంలో శాంతి నెలకొనటమంటే పాక్‌లో శాంతి నెలకొన్నట్లే’ అని అన్నారు. అప్పుడలా.. ఇప్పుడిలా! న్యూఢిల్లీ: ఆర్మీ అండదండలతో ప్రస్తుత పాక్ ఎన్నికల్లో దూసుకుపోతున్న ఇమ్రాన్ ఒకప్పుడు ప్రభుత్వ వ్యవహారాల్లో ఆర్మీ జోక్యాన్ని నిరసించేవారు. కొద్దికాలానికే సైన్యంపై తన అభిప్రాయాన్ని ఆయన మార్చుకోవడంతో తాజాగా పాక్ ప్రధాని పీఠం అధిరోహించేందుకు మార్గం సుగమమైంది. 2012లో స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో మీడియాతో ఖాన్ మాట్లాడుతూ.. ‘పాక్‌లో ఆర్మీ రోజులు పోయాయి. త్వరలోనే అక్కడ నిజమైన ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడటాన్ని మీరు చూస్తారు’ అని వ్యాఖ్యానించారు. ఈ ఇంటర్వ్యూ అనంతరం 2013లో జరిగిన ఎన్నికల్లో పీటీఐ 35 సీట్లతో చతికిలపడింది. కానీ 2018లో జరిగిన ఎన్నికల్లో పీటీఐ పాక్‌లోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. కేవలం ఎన్నికల ఫలితాలే కాదు.. ఈ ఐదేళ్లలో ఆర్మీ పట్ల ఇమ్రాన్ అభిప్రాయం, వ్యవహారశైలి మారాయి. ఇటీవల ‘న్యూయార్క్ టైమ్స్’ ఇంటర్వ్యూలో. ‘అది పాక్ ఆర్మీయే తప్ప శత్రు దేశపు సైన్యం కాదు. నేను ఆర్మీని కలుపుకునిపోతాను’ అని అన్నారు. భారత్‌పైనా ఇమ్రాన్ అభిప్రాయాలు మారాయి. గతంలో భారత్‌తో సత్సంబంధాలు కోరుకుంటున్నట్లు చెప్పిన ఆయన.. తాజా ఎన్నికల ప్రచారంలో భారత్ షరీఫ్‌తో కలసి పాక్ సైన్యాన్ని బలహీనపర్చేందుకు కుట్రచేస్తోందన్నారు. కశ్మీర్లో భారత సైన్యం మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని విమర్శించారు. మదీనాలా పాక్ పేదలు, వెనుకబడిన వర్గాల సంక్షేమానికి కృషిచేస్తూ పాక్‌ను మదీనా తరహాలో అభివృద్ధి చేస్తానని ఇమ్రాన్ అన్నారు. ‘మహ్మద్ ప్రవక్త స్ఫూర్తితో పాకిస్తాన్‌ను మదీనాగా మారుస్తా. మానవత్వం పరిమళించే దేశంగా మారుస్తా. నేను చేపట్టే సంక్షేమపథకాలు ధనికుల కోసం కాదు. పేద ప్రజలకోసమే. ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు భిన్న వ్యూహాలతో ముందుకెళ్తాం. విలాసవంతమైన పాకిస్తాన్ ప్రధాని నివాసంలో నేనుండను. దాన్ని విద్యాకేంద్రంగా మారుస్తా’ అని అన్నారు. -
కశ్మీర్లో స్వతంత్ర విచారణకు మద్దతు
ఐక్యరాజ్యసమితి: కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనలపై స్వతంత్ర అంతర్జాతీయ విచారణకు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరెస్ మద్దతు పలికారు. ఈ విషయంలో మానవ హక్కుల హైకమిషనర్ నిర్ణయాలు ఐరాస గొంతును ప్రతిబింబిస్తాయని ఆయన పేర్కొన్నారు. స్వతంత్ర విచారణ జరపాలని ఐరాస మానవ హక్కుల విభాగం హైకమిషనర్ ప్రతిపాదించి ఓ నివేదిక రూపొందించారు. అయితే స్వతంత్ర విచారణ చేయాలన్న ప్రతిపాదనను భారత్ ఖండించింది. కాగా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, కశ్మీర్‌లలో సాయుధులు, ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న హింస వల్ల పిల్లలపై ప్రతికూల ప్రభావం పడుతోందని ఆ నివేదికలో పేర్కొన్నారు. అంతర్జాతీయ శాంతిభద్రతకు విఘాతం కలిగించే స్థాయి లేని అంశాలను కూడా ఆ నివేదికలో పేర్కొన్నారని భారత్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. -
జైళ్ల వ్యవస్థ బాగుపడుతుందా?
సంస్కరణాలయాలు కావలసిన కారాగారాలు పశువుల కొట్టాలుగా మారుతున్నాయి. ఖైదీలకూ హక్కులుంటాయని, వారూ మనుషులేనని మన ప్రభుత్వాలు మరిచినట్టున్నాయి. అందుకే అవి కిక్కిరిసిపోతున్నా, అక్కడ కనీస సౌకర్యాలు కూడా లభించక వేలాదిమంది ఇబ్బందులు పడుతున్నా వారికి పట్టడం లేదు. దేశంలో అత్యధిక జైళ్లలో పరిమితికి మించి ఖైదీలున్నారని, కొన్నిచోట్ల ఇది 150 శాతం మించిపోతున్నదని తాజాగా సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇది మానవ హక్కుల ఉల్లంఘన గనుక అన్ని రాష్ట్రాల హైకోర్టులూ దీన్ని తీవ్రంగా తీసుకుని తగిన చర్యలు చేపట్టాలని కోరింది. నిజానికి కారాగారాల స్థితిగతులెలా ఉన్నాయో ఎప్పటికప్పుడు చూసుకుంటూ వాటిని సరిచేయాల్సిన బాధ్యత పాలకులదే. కానీ యధాప్రకారం వారు పట్టనట్టు ఉంటున్నారు. జైళ్లకు సంబంధించి ప్రతి రాష్ట్రంలోనూ ప్రత్యేక వ్యవస్థలున్నాయి. లక్షల రూపా యల్లో జీతాలు తీసుకునే ఉన్నతాధికార గణం ఉంది. అయినా కారాగారాలు మాత్రం నరకాలకు నకళ్లుగానే ఉంటున్నాయి. జైళ్లలో ఉన్నవారంతా నేరస్తులు కాదు. అందులో శిక్ష పడినవారితో పాటు విచారణ ఖైదీలు కూడా ఉంటారు. నిజానికి వీరి సంఖ్యే అత్యధికం. ఆవేశంలో ఘర్షణలకు దిగి కేసుల్లో ముద్దా యిలుగా మారినవారు, అకారణంగా కేసుల్లో ఇరుక్కున్నవారు, కేసు చిన్నదే అయినా బెయిల్‌కు వీలున్నా పూచీకత్తులిచ్చేవారు దొరక్క, స్థోమత లేక మగ్గుతున్నవారు...ఇలా వేర్వేరు తరగతుల వారు అక్కడుంటారు. మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉన్న ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో ఆదివాసులు వందలమంది తమ నేరం కూడా ఏమిటో తెలియకుండా ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్నారు. 2016 చివరినాటికి దేశంలోని జైళ్లలో 4,33,000మంది ఖైదీలున్నారని గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో 2,93,000మంది...అంటే మూడింట రెండొంతుల మంది విచారణలో ఉన్నవారే. విచారణలో ఉన్న ఖైదీల్లో 25 శాతంమంది ఏడాదికన్నా ఎక్కువ కాలం నుంచి జైళ్లలో ఉంటున్నవారు. 17 రాష్ట్రాల్లో వందశాతానికి మించి, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ జైళ్లలో 150 శాతం మించి ఖైదీలుంటున్నారు. మధ్యమధ్యలో న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటూనే ఉన్నా, సాక్షాత్తూ సుప్రీంకోర్టే తప్పుబట్టినా ఈ పరిస్థితుల్లో కాస్తయినా మార్పు రావడం లేదు. పరిమితికి మించి ఖైదీలుండటం వల్ల జైళ్లలో అనేక సమస్యలొస్తున్నాయి. ముఖ్యంగా ఖైదీల ఆరోగ్యం, పరిశుభ్రత అటకెక్కుతున్నాయి. వారికి నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన ఆహారం అందడం లేదు. అందువల్ల చాలామంది ఖైదీలు జైళ్లకొచ్చాక రోగాలబారిన పడుతున్నారు. నిజానికి జైళ్ల మౌలిక ఉద్దేశం నేరస్తుల్లో మానసిక పరివర్తన తీసుకురావడం. కారాగారాల్లో ఇందుకు అవ సరమైన చర్యలన్నీ అమలు చేస్తే, వారికి ఆసక్తి ఉన్న రంగాల్లో మంచి శిక్షణ ఇప్పిస్తే శిక్షాకాలం పూర్తయి బయటికొచ్చినవారు సమాజంలో సాధారణ పౌరుల్లా బతకడానికి వీలుంటుందన్నది దీనివెనకున్న అవగాహన. కానీ జైలుకెళ్లినవారు అక్కడి కరడుగట్టిన నేరస్తులతో సావాసం చేసి మరింత రాటుదేలుతున్నారు. శిక్షపడిన నేరగాళ్లు అక్కడి అధికారులను లోబర్చుకుని, బెదిరించి జైళ్లను శాసిస్తున్నారు. అమాయక ఖైదీలు వారి దయాదాక్షిణ్యాలపై బతికే పరిస్థితి ఉంటోంది. కొందరు నేరగాళ్లు అక్కడుంటూ సెల్ఫోన్ల ద్వారా బయట ఉన్న తమ సామ్రాజ్యాలను నడిపి స్తున్నారు. బయటికొచ్చాక అంతు చూస్తామంటూ బెదిరిస్తున్నారు. పరిమితికి మించి ఖైదీలుం డటం వల్ల జైళ్ల పర్యవేక్షణ కూడా కష్టమవుతోంది. ఎక్కడే సమస్యలొస్తున్నాయో ఎప్పటికప్పుడు తెలుసుకుని దిద్దుబాటు చర్యలు చేపట్టవలసిన అధికారులు ఏం చేయాలో తోచక చూసీ చూడనట్టు ఊరుకుంటున్నారు. డబ్బు, పలుకుబడి ఉన్న ఖైదీలను మాత్రం ఎలాంటి లోటూ లేకుండా చూసు కుంటున్నారు. జైళ్ల అధికారులు, వార్డర్ల తీరుతెన్నులెలా ఉంటున్నాయో పట్టించుకోకపోవడం, వారికి అవసరమైన పునశ్చరణ తరగతులపై దృష్టి పెట్టకపోవడం వల్ల జైళ్ల వ్యవస్థ బండబారి పోతోంది. రెండేళ్లక్రితం జైళ్ల స్థితిగతులపై వచ్చిన ఫిర్యాదును విచారిస్తున్న సందర్భంగా జైళ్లలో మనుషుల్ని జంతువుల కన్నా హీనంగా చూస్తున్నారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అప్పటికీ, ఇప్పటికీ పరిస్థితులు కాస్తయినా మారలేదు. నేరం రుజువై శిక్ష పడినవారికి హక్కులన్నీ హరించుకుపోవు. తాత్కాలికంగా కొన్ని నిలిచి పోతాయి. కానీ ఖైదీల పట్ల అమానుషంగా వ్యవహరించడం అలవాటుగా మారింది. అక్కడ ఏం జరిగినా పట్టించుకునేవారు లేకపోవడమే ఇందుకు కారణం. చాలా అరుదుగా తప్ప జైళ్లలో జరుగు తున్నదేమిటో బయటి ప్రపంచానికి వెల్లడికాదు. దేశంలో 1,300 పైగా జైళ్లున్నాయి. ఖైదీల సంఖ్య అపరిమితంగా పెరుగుతున్నా, వీరి పర్యవేక్షణకు అవసరమైన సిబ్బంది ఉండటం లేదు. రిటైరై వెళ్తున్నవారి స్థానంలో కొత్తవారి నియామకాలు జరగటం లేదు. లెక్క ప్రకారం దేశవ్యాప్తంగా జైళ్లకు 77,230మంది సిబ్బంది ఉండాల్సిరాగా, గత డిసెంబర్‌నాటికి అందులో 30శాతానికిపైగా పోస్టులు ఖాళీ అయ్యాయి. విచారణలో ఉన్న ఖైదీల కేసుల్ని పరిశీలించి, అందులో బెయిల్‌కు అర్హులైనవారిని గుర్తించి విడుదలకు చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితి కొంతైనా మారుతుంది. నిజానికి విచారణ ఖైదీల కోసం జిల్లా స్థాయిల్లో సమీక్షా సంఘాలున్నాయి. ఈ సంఘాల్లో జిల్లా న్యాయమూర్తి, కలె క్టర్, ఎస్పీ తదితరులుంటారు. విషాదమేమంటే ఈ సంఘాలిచ్చిన సూచనలు సైతం బేఖాతరవు తున్నాయి. ఇకపై ఇలా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోబోతున్నామని కేంద్రం సుప్రీం కోర్టుకు తాజాగా హామీ ఇచ్చింది. అందుకవసరమైన ప్రామాణిక వ్యవహార సరళి(ఎస్ఓపీ)ని వచ్చే నెల 30కల్లా ఖరారు చేస్తామని చెప్పింది. మంచిదే. జైళ్లు సకల రుగ్మతలకూ నిలయాలుగా, నిస్స హాయుల పాలిట నరకాలుగా ఉండటం మొత్తం దేశానికే అప్రదిష్ట. ఈసారైనా ఇచ్చిన మాట నిలు పుకుని ఈ పరిస్థితిని మార్చే బాధ్యత కేంద్రానిదే. -
నైతిక విలువలతో హక్కుల ఉల్లంఘన అదుపు
జస్టిస్ కేజీ శంకర్ ఏఎన్‌యూ: నైతిక విలువలను పాటించడం ద్వారా మానవ హక్కుల ఉల్లంఘనను అరికట్టవచ్చని చెన్నైకి చెందిన డెబ్ట్స్ రికవరీ అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్పర్సన్ జస్టిస్ కేజీ శంకర్ అన్నారు. యూనివర్సిటీ పీజీ డిపార్ట్స్‌మెంట్ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ ఆధ్వర్యంలో ‘హ్యూమన్ రైట్స్ అండ్ వాల్యూస్ ఇన్ ఎడ్యుకేషన్ ’ అంశంపై రెండు రోజులపాటు జరగనున్న జాతీయ సదస్సు సోమవారం యూనివర్సిటీలో ప్రారంభమయ్యింది. జస్టిస్ శంకర్ మాట్లాడుతూ వ్యక్తికి సమస్య వస్తే న్యాయస్థానాలను ఆశ్రయించాలా, మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించాలా అనే దానిపై చాలామందికి అవగాహన లేదన్నారు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సభ్యుడు కాకుమాను పెదపేరిరెడ్డి మాట్లాడుతూ కేవలం చట్టాల ద్వారానే కాకుండా మానవీయ కోణంలో కూడా వ్యక్తుల సమస్యలను పరిష్కరించవచ్చన్నారు. వీసీ కె.వియ్యన్నారావు మాట్లాడుతూ ప్రాథమిక హక్కులైన విద్య, ఆహారం, వైద్య హక్కులు అందరికీ సమానంగా ఉండాలన్నారు. ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు నైతిక విలువలపై పాఠ్యాంశాలను ప్రవేశ పెట్టాలన్నారు. కార్యక్రమానికి యూనివర్సిటీ ఆర్ట్స్, కామర్స్, లా కళాశాల ప్రిన్సిపాల్ వి.చంద్రశేఖరరావు అధ్యక్షత వహించారు. లా డీన్ వైపీ రామసుబ్బయ్య, విభాగాధిపతి ఎల్.జయశ్రీ ప్రసంగించారు. ఏపీ లా యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్ ఎ.సుబ్రహ్మణ్యం, పలువురు న్యాయశాస్త్ర నిపుణులు, అధ్యాపకులు, పరిశోధకులు పాల్గొన్నారు.