దేశంలో మానవ హక్కుల పరిస్థితులపై అమెరికా ఇచ్చిన నివేదికను బారత్ తీవ్రంగా ఖండించింది. యూఎస్ డాక్యుమెంట్ తీవ్ర పక్షపాతంతో కూడుకొని ఉందని, భారత్‌పై సరైన అవగాహన లేకపోవాడాన్ని ప్రతిబింబిస్తోందని పేర్కొంది. గతేడాది మణిపూర్‌లో హింస చెలరేగిన తర్వాత రాష్ట్రంలో గణనీయమైన మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగాయని యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ఇటీవల ఓ నివేదిక పేర్కొంది.
దీనిపై విదేశాంత మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ స్పందిస్తూ.. ఈ నివేదిక తీవ్ర పక్షపాతంలో కూడుకున్నట్లు తెలిపారు. భారత్‌పై అమెరికాకు సరైన అవగాహన లేదనే విషయం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. దీనికి తాము(భారత్) ఎలాంటి విలువ ఇవ్వడం లేదని, మీరు కూడా(మీడియా) పట్టించుకోవద్దని తెలిపారు.
కాగా ‘2023 కంట్రీ రిపోర్ట్స్ ఆన్ హ్యూమన్ రైట్స్ ప్రాక్టిసెస్: ఇండియా’ పేరుతో విడుదల చేసిన ఈ డాక్యుమెంట్‌లో మణిపూర్‌లో మైతీ, కుకీ వర్గాల మధ్య చెలరేగిన జాతి వివాదం మానవ హక్కులు ఉల్లంఘనకు దారి తీసినట్లు ఆరోపించింది. ఈ ఘటనను ప్రధాని నరేంద్రమోదీ సిగ్గుచేటని అభివర్ణించి, చర్యలు తీసుకోవాలని కోరినట్లు కూడా నివేదిక పేర్కొంది.
ఇదే కాకుండా జమ్మూ కాశ్మీర్‌లో పలువురు జర్నలిస్టులు, మానవహక్కుల నేతలను విచారించారనే పలు రిపోర్టులు తమ వద్ద ఉన్నాయని పేర్కొంది. గతేడాది ఫిబ్రవరిలో ముంబై, ఢిల్లీలోని బీబీసీ కార్యాలయలపై దర్యాప్తు సంస్థల దాడి, మోదీపై డాక్యుమెంటరీ, మోదీ ఇంటి పేరును కించపరిచిన కేసులో రాహుల్ గాంధీకి శిక్ష పడటం, ఆయన లోక్‌సభ అనర్హతకు గురికావడం, మళ్లీ సుప్రీం కోర్టు స్టేతో ఎంపీ పదివి తిరిగి పొందడం, కెనడాలో ఖలీస్తానీ ఉగ్రవాది హత్య వంటి అంశాలను కూడా ప్రస్తావించింది.
చదవండి: మస్క్ పేరుతో మోసం.. రూ.41 లక్షలు పాయే..
Comments
Please login to add a commentAdd a comment