ఒంటె మూపురంలో ఏముంటుంది?
జంతుప్రపంచం
అరేబియన్ ఒంటెలకు ఒకటే మూపురం ఉంటుంది కానీ ఆసియా ఒంటెలకు రెండు మూపురాలు ఉంటాయి! ఒంటె తన మూపురంలో నీటిని దాచుకుంటుందని చాలామంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఇవి మూపురంలో కొవ్వును దాచుకుంటాయి ఒంటెలు. శరీరంలోని కొవ్వు అంతా మూపురంలోకి చేరి అక్కడ నిల్వ ఉంటుంది. దానివల్ల ఒంట్లో వేడి తగ్గుతుంది. అందుకే ఎడారుల్లాంటి వేడి ప్రదేశాల్లో తిరిగినా, మంచి నీరు లేకపోయినా ఇవి ఏ ఇబ్బందీ లేకుండా జీవిస్తాయి!
* నీళ్లు లేకపోయినా ఇవి చాలా రోజులు ఉండగలవు. అయితే నీళ్లు దొరికాయంటే మాత్రం ఒక్కసారి నలభై గ్యాలన్లు ఆపకుండా తాగేస్తాయి!
* ఒంటెల కనుగుడ్లకు, కను రెప్పలకు మధ్య ఒక సన్నని పొరలాంటిది ఉంటుంది. ఎడారుల్లో తిరిగినప్పుడు ఇసుక కళ్లలో పడకుండా ఈ పొరే కాపాడుతుంటుంది! వీటి నోటి లోపలి భాగాలు ఎంత దృఢంగా ఉంటాయంటే... ముళ్ల చెట్లను, కాయలను తిన్నాసరే, చిన్న గాయం కూడా అవ్వదు!
* ఇసుక, దుమ్ము రేగినప్పుడు తమ నాసికారంధ్రాలను మూసుకోగలిగే శక్తి ఒంటెలకు ఉంది!
* ఆవుపాలలో కంటే ఒంటె పాలలో కొవ్వు, చక్కెర శాతం తక్కువగా ఉంటాయి. అయితే ఇవి తాగడం మంచిది కాదు. ఎందుకంటే ఇవి చాలా చిక్కగా ఉండటం వల్ల కడుపులో తిప్పడం, వాంతులు అవ్వడం జరగవచ్చు!
* వీటికి చెమట అంత త్వరగా పట్టదు. పట్టాలంటే ఉష్ణోగ్రత నలభయ్యొక్క డిగ్రీలు దాటాల్సిందే!
* ఇవి నీళ్లు లేని ప్రదేశాల్లో జీవిస్తాయి. అయినా వీటికి ఈత ఎలా వస్తుందో తెలియదు కానీ... అద్భుతంగా ఈదగలవు!