Hundred acres
-
సుబ్బు @ 102
సాక్షి రాయచోటి: ఆయనది విలక్షణ శైలి..ఒకవైపు ఊరిలో జనం కోసం పాటుపడుతూ..మరోవైపు పలు సేవలతో అందరికీ దగ్గరయ్యాడు. భారతం చదివించినా..హరికథ చెప్పించినా..ఊరి రైతుకు శనక్కాయలు ఇచ్చినా ప్రతి వ్యవహారంలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు. రైతు నాయకుడిగా..ప్రజల మనిషిగా గుర్తింపు వచ్చిందని ఎమ్మెల్యే స్థానానికి పోటీలో నిలిచాడు. చుట్టుపక్కల పల్లెల్లో ఎక్కడ ఎవరినీ అడిగినా టక్కున ఆయన గురించి చెబుతారు. చిన్ననాటి నుంచి ఈనాటి వరకు చిన్న ఖాయలా కూడా లేకుండా దిట్టంగా తిరుగుతున్న ఆయన పేరు ఎర్రదొడ్డి సుబ్బారెడ్డి. ఆయన వయస్సు ప్రస్తుతం 102 ఏళ్లు. వంద ఎకరాల పొలంలో వ్యవసాయం చేస్తూ సాటి రైతులు బాగుండాలని అప్పట్లో ఆయన సంకల్పించారు. అంతేకాదు...30 పశువులు, నాలుగు జతల ఎద్దులు, ఐదుగురుపాలేర్లతోపాటు ప్రతిరోజు 30–40 మందికి పని కల్పించారు. వయస్సు మీదపడినా నేటికీ తన పనులు తానే చేసుకుంటూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆహారపు అలవాట్లు, మద్యం, బీడి, సిగరెట్లకు దూరంగా ఉండడం సుబ్బారెడ్డి ఆరోగ్య రహస్యంగా చెప్పవచ్చు. సుబ్బారెడ్డిని ఒక్కపేరుతో కాదు..అనేక రకాల పేర్లతో ప్రజలు పిలిచేవారు. అలాంటి సుబ్బారెడ్డిని ‘సాక్షి’పలుకరించగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఎమ్మెల్యేకు పోటీ చేసి.. బోరింగ్ సుబ్బారెడ్డిగా మారి.. సంబేపల్లె మండలం పొన్నేళ్లవాండ్లపల్లె (ఎగువపల్లె) గ్రామానికి చెందిన ఎర్రదొడ్డి సుబ్బారెడ్డికి 102 ఏళ్ల వయస్సు. ఈయనను మండలంలోని ప్రజలు అనేక రకాలపేర్లతో పిలుస్తారు. కారణం లేకపోలేదు. వంద ఎకరాల పొలం ఉండడంతో అందరూ వందెకరాల సుబ్బారెడ్డిగా పిలిచేవారు. పలు పల్లెల్లో కనీసమంటే పది సార్లకుపైగా భారతం చదివించినందుకుగాను భారతం సుబ్బారెడ్డిగా పిలుస్తారు. హరికథలు చెప్పించిన చరిత్ర కూడా ఈయనకు ఉంది. తిరుపతికి వెళ్లి హరిదాసును తీసుకు రావడం, కొన్నిమార్లు ప్రొద్దుటూరుకు చెందిన హరిదాసును తీసుకొచ్చి కథలు చెప్పించడంతో హరికథ సుబ్బారెడ్డిగా మారిపోయారు. ఈయన పొలంలో వ్యవసాయం చేస్తూనే చుట్టుపక్కల పల్లెలకు సంబంధించిన భూములు కూడా కళకళలాడాలన్న సంకల్పంతో సీజన్లో వెయ్యి బస్తాల వరకు వేరుశనగ కాయలు తెచ్చి అందరికీ పంచేవాడు. పంట పండిన తర్వాత తిరిగి ఇచ్చేవారు కొందరైతే, పంటపండలేదని ఇవ్వనివారు లేకపోలేదు. అయితే అందరూ బాగుండాలని సంకల్పించిన ఆయనను శనిక్కాయల సుబ్బారెడ్డిగా కూడా పిలుచుకునే వారు. 100 ఎకరాల పొలంలో 40–50 ఎకరాలు మామడికాయలు పండించేవాడు. లారీల్లో లోడు తీసుకెళుతున్న నేపథ్యంలో ఆయనను మామిడికాయల సుబ్బారెడ్డిగా గ్రామస్తులు పిలుచుకునేవారు. ఇలా చెబుతూ పోతే కొన్నేళ్ల కిందట వరుసగా కుటుంబీకులకు కొత్త ఇళ్లు కట్టించడంతో కొత్తమిద్దె సుబ్బారెడ్డి అనేవారు. అయితే 30 ఏళ్ల కిందట ఈయన రాయచోటి ఎమ్మెల్యే స్థానానికి రేసులో నిలిచారు. పోటీలో దిగి రైతు నాయకుడిగా నామినేషన్ వేశారు. దీంతో ఎన్నికల సంఘం బోరింగ్ గుర్తును కేటాయించడంతో అప్పటి నుంచి అందరి దృష్టిలో బోరింగ్ సుబ్బారెడ్డిగా మారిపోయారు. సంబేపల్లె సబ్‌స్టేషన్ కోసం ఆమరణ దీక్ష సంబేపల్లె మండలానికి చెందిన సుబ్బారెడ్డి ఒకానొక సమయంలో స్వాతంత్య్ర ఉద్యమ సమరంలోనూ అందరితో కలిసి ఆందోళనల్లో పాల్గొన్నారు. తర్వాతి కాలంలో రైతులకు సంబంధించిన అనేక ఉద్యమాల్లో పాలుపంచుకున్నారు. 1994 ప్రాంతంలో సంబేపల్లెలో విద్యుత్ సబ్‌స్టేషన్ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.మూడు రోజుల అనంతరం పోలీసులు వచ్చి దీక్ష విరమింపజేశారు. రైతు నాయకుడిగా ఉండడంతో సమస్యలపై పలుమార్లు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిని కలిసి చర్చించేవారు. ఇప్పటికీ వైఎస్సార్ కుటుంబమంటే ఎనలేని అభిమానాన్ని చూపుతారు. ఆరోగ్య రహస్యం:వ్యసనం లేని జీవితం చిన్ననాటి నుంచి నేటి వరకు సుబ్బారెడ్డి వ్యసనాలకు దూరంగా జీవిస్తున్నారు. ప్రస్తుతం కూడా తనపని తానే చేసుకోగలుగుతున్నాడంటే ఆయన జీవన విధానం ఎలా ఉంటుందో అర్థమవుతుంది. సిగరెట్, బీడి, మద్యం లాంటి వ్యవసనాలకు దూరంగా ఉంటున్నారు. అంతేకాకుండా బలవర్దక ఆహారం తీసుకునే వారు. రైతు సంఘం నాయకుడిగా ఉంటూ ఎక్కడెక్కడో తిరిగి ఒక్కొసారి అర్దరాత్రి ఇంటికి వచ్చినా ఆహారంలోకి కచ్చితంగా శనక్కాయ విత్తనాలు, బెల్లం కలిపి తీసుకునేవాడు. వారంలో ఒకటి,రెండుసార్లు తలకూర తీసుకోవడం పరిపాటిగా ఉండేది. బెల్లం పాయసం, పూర్ణం కూడా ఎక్కువగా తీసుకునేవాడు. అప్పట్లో రాగి సంగటిని చికెన్, మటన్ చేసిన సందర్భంలో తీసుకునేవారు. మిగతా కాలంలో సాధారణ ఆహారం తీసుకునేవారు. అయితే ప్రతినిత్యం అటు పొలాల వద్దకు, ఇటు మండలకేంద్రం సంబేపల్లెకు నడకమార్గంలోనే వెళుతుండేవాడు. వయస్సు 102 సంవత్సరాలకు చేరుకున్నా సుబ్బారెడ్డికి బీపీ, షుగర్ అనేవి తెలియవు. కంటిచూపు బాగుంది....దినపత్రికను చదవడంతోపాటు పేపరుపై పెన్నుతో రాయడం వరకు నేటికీ పనితనం కనిపిస్తుంది. ఈయన ఇప్పటికే మనవళ్లతోపాటు మునివళ్లు కూడా కలిగి ఉన్నారు. కట్టెసాయంతో ముందుకెళతారు. ఇంటిలో కూడా తన పనులు తానుచేసుకుంటూ ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. -
ఇంత బరితెగింపా?!
- గెడ్డలు, పంట కాలువలు ఏదీ వదలని రియల్టర్లు - వెంకన్నపాలెంలో రూ.2 కోట్ల విలువైన స్వామిగెడ్డ ఆక్రమణ - గెడ్డను కుదించి, లేఔట్‌కు రోడ్డు, కల్వర్లు వేస్తున్న వైనం - పట్టించుకోని అధికారులు.. ఆందోళనలో రైతులు చోడవరం: రియల్టర్ల దందాకు అడ్డూఆపూలేకుండా పోతోంది. వందల ఎకరాలకు సాగునీరందించే పంట కాలువలను, కొండగెడ్డలను సైతం ఆక్రమించుకొని లేఔట్లు, రోడ్లు వేసేస్తున్నారు. సాగునీటి వనరులను పరిరక్షించాల్సిన ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు మామూళ్ల మత్తులో తేలడంతో రియలస్టేట్ వ్యాపారుల ఆక్రమణలకు రైతులు బలైపోతున్నారు. వెంకన్నపాలెంలో నాలిచెరువుకు నీరందించే స్వామి కొండగెడ్డ పూర్తిగా ఆక్రమణకు గురైంది. సర్వేనెంబరు 432లో 40 అడుగులు వెడల్పు ఉండాల్సిన స్వామి గెడ్డ ఇప్పుడు 5నుంచి 10 అడుగులు మాత్రమే ఉంది. ఈ చెరువు కింద సుమారు 200 ఎకరాల సాగుభూమి ఉంది. ఇప్పుడిప్పుడే వర్షాలు కురుస్తున్నా ఎగువన ఉన్న స్వామి గెడ్డ నుంచి చెరువులోకి నీరు పూర్తిగా రావడం లేదు. దీనితో ఈ ఖరీఫ్, వచ్చే రబీకి చెరువు ఆకయట్టు భూములను సాగునీరు అందని పరిస్థితి నెలకొంది. రూ.2 కోట్ల విలువైన కొండగెడ్డ ఆక్రమణ ఈ గెడ్డకు ఆనుకొని పక్కనే వేసిన లేఔట్లో రియల్ వ్యాపారులు ఈ గెడ్డ భూమిని ఆక్రమించుకున్నారు. సుమారు రూ.2 కోట్లు విలువచేసే 2 ఎకరాలకు పైబడి గెడ్డను ఆగ్రమించుకొని లే ఔట్‌కు వేళ్లేందుకు 20 అడుగుల రోడ్డు వేస్తున్నారు. గెడ్డలో నీరు పోయేందుకు కేవలం 4 అడుగుల వెడల్పులో కాాలువను వదిలి అటూఇటూ పెద్ద కల్వర్టును కట్టేశారు. దీనిపై రోడ్డు వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదంతా మెయిన్‌రోడ్డు పక్కనే జరుగుతున్నా ఏ అధికారి పట్టించుకోకవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రోడ్డుపై వృథాగా గెడ్డ నీరు : సోమ, మంగళవారాల్లో ఈ ప్రాంతంలో భారీ వర్షం కురవడంతో ఎగువ కొండపై నుంచి గెడ్డలోకి భారీగా నీరు ప్రవహించింది. అయితే గెడ్డ ఆక్రమణకు గురికావడంతో ఎగువనీరు అనకాపల్లి-చోడవరం మెయిన్ రోడ్డును ముంచెత్తి ప్రవహించింది. కొండనీరంతా రోడ్డుపై వృధాగా పోవడంతో చెరువులో నీటి మట్టం పెరగలేదు. నాట్లకు కూడా ఇబ్బంది నాలి చెరువుకు నీరందక మా పొలాలకు సాగునీటి ఇబ్బందులు తలెత్తాయి. కొండగెడ్డ ఆక్రమణకు గురవడంతో కొండనీరు చెరువులోకి రావడం లేదు. చెరువు కింద నాకు 80 సెంట్లు భూమి ఉంది. నీరులేక ఈ ఏడాది నాట్లుకు కూడా ఇబ్బంది పడ్డాం. -మొల్లి సత్తిబాబు, ఆయుకట్టు రైతు, వెంకన్నపాలెం. గతంలో ఈ పరిస్థితి లేదు నా సొంత భూమితో పాటు ఎకరాన్నర కౌలుకు చేస్తున్నాను. వరి, చెరకు వేశాను. నాలి చెరువులో గతంలో ఎప్పుడూ నీరుండేది. ఇప్పుడు స్వామి గెడ్డ ఆక్రమణకు గురవ్వడం, రియల్ఎస్టేట్ వారు రోడ్డు వేయడంతో గెడ్డ కుదించుకుపోయింది. ఎగువ నీరు చెరువులోకి రావడం లేదు. -పిల్లల దేముళ్లు, రైతు, వెంకన్నపాలెం. గెడ్డనీరు చెరువులోకి రాలేదు లేఔటుదారులు గెడ్డను ఆక్రమించి రోడ్డు వేస్తున్నారు, గెడ్డ మధ్యలో తూము కూడా క ట్టేశారు. గెడ్డ నీరు పూర్తిగా చెరువులోకి రాకుండా పొంగిపోయి రోడ్డుపై వృధాగా పోతోంది. గెడ్డ ఆక్రమణలు తొలగించి పూడికలు తీయాలి. -మురుకుటి పైడిరాజు, ఆయకట్టు రైతు, వెంకన్నపాలెం