సుబ్బు @ 102 | AP: 102 Year Old Man Name Called Subba Reddy Farming Hundred Acres Of Land | Sakshi
Sakshi News home page

సుబ్బు @ 102

Published Mon, Jun 20 2022 10:57 PM | Last Updated on Mon, Jun 20 2022 10:57 PM

AP: 102 Year Old Man Name Called Subba Reddy Farming Hundred Acres Of Land - Sakshi

కళ్లాద్దాలు లేకుండా సాక్షి దినపత్రిక చదువుతున్న సుబ్బారెడ్డి

సాక్షి రాయచోటి: ఆయనది విలక్షణ శైలి..ఒకవైపు ఊరిలో జనం కోసం పాటుపడుతూ..మరోవైపు పలు సేవలతో అందరికీ దగ్గరయ్యాడు. భారతం చదివించినా..హరికథ చెప్పించినా..ఊరి రైతుకు శనక్కాయలు ఇచ్చినా ప్రతి వ్యవహారంలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు. రైతు నాయకుడిగా..ప్రజల మనిషిగా గుర్తింపు వచ్చిందని ఎమ్మెల్యే స్థానానికి పోటీలో నిలిచాడు. చుట్టుపక్కల పల్లెల్లో ఎక్కడ ఎవరినీ అడిగినా టక్కున ఆయన గురించి చెబుతారు.

చిన్ననాటి నుంచి ఈనాటి వరకు చిన్న ఖాయలా కూడా లేకుండా దిట్టంగా తిరుగుతున్న ఆయన పేరు ఎర్రదొడ్డి సుబ్బారెడ్డి. ఆయన వయస్సు ప్రస్తుతం 102 ఏళ్లు. వంద ఎకరాల పొలంలో వ్యవసాయం చేస్తూ సాటి రైతులు బాగుండాలని అప్పట్లో ఆయన సంకల్పించారు. అంతేకాదు...30 పశువులు, నాలుగు జతల ఎద్దులు, ఐదుగురుపాలేర్లతోపాటు ప్రతిరోజు 30–40 మందికి పని కల్పించారు.

వయస్సు మీదపడినా నేటికీ తన పనులు తానే చేసుకుంటూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆహారపు అలవాట్లు, మద్యం, బీడి, సిగరెట్లకు దూరంగా ఉండడం సుబ్బారెడ్డి ఆరోగ్య రహస్యంగా చెప్పవచ్చు. సుబ్బారెడ్డిని ఒక్కపేరుతో కాదు..అనేక రకాల పేర్లతో ప్రజలు పిలిచేవారు. అలాంటి సుబ్బారెడ్డిని ‘సాక్షి’పలుకరించగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 

ఎమ్మెల్యేకు పోటీ చేసి.. బోరింగ్‌ సుబ్బారెడ్డిగా మారి.. 
సంబేపల్లె మండలం పొన్నేళ్లవాండ్లపల్లె (ఎగువపల్లె) గ్రామానికి చెందిన ఎర్రదొడ్డి సుబ్బారెడ్డికి 102 ఏళ్ల వయస్సు. ఈయనను మండలంలోని ప్రజలు అనేక రకాలపేర్లతో పిలుస్తారు. కారణం లేకపోలేదు. వంద ఎకరాల పొలం ఉండడంతో అందరూ వందెకరాల సుబ్బారెడ్డిగా పిలిచేవారు. పలు పల్లెల్లో కనీసమంటే పది సార్లకుపైగా భారతం చదివించినందుకుగాను భారతం సుబ్బారెడ్డిగా పిలుస్తారు.

హరికథలు చెప్పించిన చరిత్ర కూడా ఈయనకు ఉంది. తిరుపతికి వెళ్లి హరిదాసును తీసుకు రావడం, కొన్నిమార్లు ప్రొద్దుటూరుకు చెందిన హరిదాసును తీసుకొచ్చి కథలు చెప్పించడంతో హరికథ సుబ్బారెడ్డిగా మారిపోయారు. ఈయన పొలంలో వ్యవసాయం చేస్తూనే చుట్టుపక్కల పల్లెలకు సంబంధించిన భూములు కూడా కళకళలాడాలన్న సంకల్పంతో సీజన్‌లో వెయ్యి బస్తాల వరకు వేరుశనగ కాయలు తెచ్చి అందరికీ పంచేవాడు.

పంట పండిన తర్వాత తిరిగి ఇచ్చేవారు కొందరైతే, పంటపండలేదని ఇవ్వనివారు లేకపోలేదు. అయితే అందరూ బాగుండాలని సంకల్పించిన ఆయనను శనిక్కాయల సుబ్బారెడ్డిగా కూడా పిలుచుకునే వారు. 100 ఎకరాల పొలంలో 40–50 ఎకరాలు మామడికాయలు పండించేవాడు. లారీల్లో లోడు తీసుకెళుతున్న నేపథ్యంలో ఆయనను మామిడికాయల సుబ్బారెడ్డిగా గ్రామస్తులు పిలుచుకునేవారు.

ఇలా చెబుతూ పోతే కొన్నేళ్ల కిందట వరుసగా కుటుంబీకులకు కొత్త ఇళ్లు కట్టించడంతో కొత్తమిద్దె సుబ్బారెడ్డి అనేవారు. అయితే 30 ఏళ్ల కిందట ఈయన రాయచోటి ఎమ్మెల్యే స్థానానికి రేసులో నిలిచారు. పోటీలో దిగి రైతు నాయకుడిగా నామినేషన్‌ వేశారు. దీంతో ఎన్నికల సంఘం బోరింగ్‌ గుర్తును కేటాయించడంతో అప్పటి నుంచి అందరి దృష్టిలో బోరింగ్‌ సుబ్బారెడ్డిగా మారిపోయారు.  

సంబేపల్లె సబ్‌స్టేషన్‌ కోసం ఆమరణ దీక్ష 
సంబేపల్లె మండలానికి చెందిన సుబ్బారెడ్డి ఒకానొక సమయంలో స్వాతంత్య్ర ఉద్యమ సమరంలోనూ అందరితో కలిసి ఆందోళనల్లో పాల్గొన్నారు. తర్వాతి కాలంలో రైతులకు సంబంధించిన అనేక ఉద్యమాల్లో పాలుపంచుకున్నారు. 1994 ప్రాంతంలో సంబేపల్లెలో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.మూడు రోజుల అనంతరం పోలీసులు వచ్చి దీక్ష విరమింపజేశారు. రైతు నాయకుడిగా ఉండడంతో సమస్యలపై పలుమార్లు మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డిని కలిసి చర్చించేవారు. ఇప్పటికీ వైఎస్సార్‌ కుటుంబమంటే ఎనలేని అభిమానాన్ని చూపుతారు. 

ఆరోగ్య రహస్యం:వ్యసనం లేని జీవితం 
చిన్ననాటి నుంచి నేటి వరకు సుబ్బారెడ్డి వ్యసనాలకు దూరంగా జీవిస్తున్నారు. ప్రస్తుతం కూడా తనపని తానే చేసుకోగలుగుతున్నాడంటే ఆయన జీవన విధానం ఎలా ఉంటుందో అర్థమవుతుంది. సిగరెట్, బీడి, మద్యం లాంటి వ్యవసనాలకు దూరంగా ఉంటున్నారు. అంతేకాకుండా బలవర్దక ఆహారం తీసుకునే వారు. రైతు సంఘం నాయకుడిగా ఉంటూ ఎక్కడెక్కడో తిరిగి ఒక్కొసారి అర్దరాత్రి ఇంటికి వచ్చినా ఆహారంలోకి కచ్చితంగా శనక్కాయ విత్తనాలు, బెల్లం కలిపి తీసుకునేవాడు.

వారంలో ఒకటి,రెండుసార్లు తలకూర తీసుకోవడం పరిపాటిగా ఉండేది. బెల్లం పాయసం, పూర్ణం కూడా ఎక్కువగా తీసుకునేవాడు. అప్పట్లో రాగి సంగటిని చికెన్, మటన్‌ చేసిన సందర్భంలో తీసుకునేవారు. మిగతా కాలంలో సాధారణ ఆహారం తీసుకునేవారు. అయితే ప్రతినిత్యం అటు పొలాల వద్దకు, ఇటు మండలకేంద్రం సంబేపల్లెకు నడకమార్గంలోనే వెళుతుండేవాడు.

వయస్సు 102 సంవత్సరాలకు చేరుకున్నా సుబ్బారెడ్డికి బీపీ, షుగర్‌ అనేవి తెలియవు. కంటిచూపు బాగుంది....దినపత్రికను చదవడంతోపాటు పేపరుపై పెన్నుతో రాయడం వరకు నేటికీ పనితనం కనిపిస్తుంది. ఈయన ఇప్పటికే మనవళ్లతోపాటు మునివళ్లు కూడా కలిగి ఉన్నారు. కట్టెసాయంతో ముందుకెళతారు. ఇంటిలో కూడా తన పనులు తానుచేసుకుంటూ ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement