అది అతిథి పాత్ర మాత్రమే..
ముంబై: ‘ద హండ్రెడ్ ఫూట్ జర్నీ’లో తనది కేవలం అతిథి పాత్ర మాత్రమేనని నటి జుహీ చావ్లా పేర్కొంది. సినిమాలో ఓం పురి, హెలెన్ మిర్రెన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారని, తాను కేవలం రెండు సన్నివేశాల్లో మాత్రమే కనిపిస్తానని చెబుతోంది. ఈ సినిమాతో జుహీ హాలీవుడ్ తెరంగేట్రం చేయనుందని వస్తున్న వార్తలను ఆమె ఖండించింది. సినిమా మొత్తంలో తాను కేవలం రెండుమూడు నిమిషాలు మాత్రమే కనిపిస్తానని, అదీ ప్రారంభ సన్నివేశంలో మాత్రమేనని స్పష్టం చేసింది.
హాలీవుడ్ చిత్రంలో ఈ చిన్న పాత్రలో నటించడం ఏమంత గొప్ప విషయంగా తాను భావించడంలేదని చెప్పింది. అయితే కనిపించేది కొద్దిసేపయినా తన పాత్రను దర్శకుడు మలిచిన తీరు అద్భుతంగా అనిపించిందని చెప్పింది. ఈ సినిమాలో నటిస్తున్నట్లు ముందు తనకు కూడా తెలియదని, అకస్మాత్తుగా అవకాశం వచ్చిందని, అంతే వేగంగా తాను నిర్ణయం తీసుకొని అంగీకరించేశానని, నటించేశానని చెప్పింది. కమల్ హాసన్, ఓం పురి వంటివారి స్థాయికి సరిపడిన పాత్రలు సినిమాల్లో ఉండడంలేదన్న విషయాన్ని జుహీ అంగీకరించింది. ఇప్పట్లో నసీరుద్దీన్ షా, అనుపమ్ ఖేర్ నటించిన ‘ఎ వెడ్నస్ డే’ సినిమా తనకు చాలా బాగా నచ్చిందని, అందులో నటీనటుల స్థాయికి సరిపడే పాత్రలు దొరికాయనిపించిందని చెప్పింది.
అయితే అటువంటి పాత్రలు ఎప్పుడూ లభిస్తాయని ఆశించడం అత్యాశే అవుతుందని అభిప్రాయపడింది. ప్రేక్షకులకు ఎంతసేపూ డ్యాన్సులు, పాటలు, శృంగార సన్నివేశాలు, ఫైట్లు, ప్రేమ కథలే కావాలని, దీంతో మంచి కథలున్న చిత్రాలు తెరకెక్కడం లేదని, అయితే హాలీవుడ్లో మాత్రం ఇందుకు భిన్నమైన వాతావరణం ఉంటుందని చెప్పింది. ద హండ్రెడ్ ఫూట్ జర్నీలో ఓం పురి పాత్ర అద్భుతమని, ఈ సినిమాతో ఓం పురికి హాలీవుడ్లో మరిన్ని అవకాశాలు రావడం ఖాయమని జోస్యం చెప్పింది.