ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు
మాంగ్ కాక్: హాంకాంగ్‌లో జరుగుతున్న ట్వంటీ-20 బ్లిట్జ్ టోర్నీలో పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ మిస్బా ఉల్ హక్ వీరవిహారం చేశాడు. తాను ఎదుర్కొన్న ఆరు వరుస బంతుల్లో ఆరు సిక్స్‌లు బాదాడు. ఈ మ్యాచ్‌లో మిస్బా ఉల్ హక్ కెప్టెన్సీ వహించిన హాంకాంగ్ కింగ్ ఐలాంట్ (హెచ్‌కేఐ) యునైటెడ్ జట్టు ప్రత్యర్థి హాంగ్ హోమ్ జాగ్వార్స్ పై 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. గురువారం నాడు ఈ టోర్నీలో భాగంగా జరిగిన మూడో మ్యాచ్‌లో హెచ్‌కేఐ యునైటెడ్ కెప్టెన్ మిస్బా.. హాంగ్ హోమ్ జాగ్వార్స్ బౌలర్ వేసిన 19వ ఓవర్లో చివరి రెండు బంతులను సిక్సర్లుగా మలిచాడు. మరో బౌలర్ క్యాడీ వేసిన 20వ ఓవర్లో తాను ఎదుర్కొన్న తొలి నాలుగు బంతులను సిక్సర్లు బాదాడు. దీంతో వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్ల ఫీట్‌ను నమోదు చేశాడు. అసలే స్డేడియంలో గ్యాలరీ చిన్నది కావడంతో తొలి రెండు బంతులను మిస్బా స్డేడియం అవతలికి పంపించాడు. అదే ఓవర్లో ఆఖరి బంతిని మిస్బా ఫోర్ కొట్టాడు.
ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదిన మిస్బా కేవలం 37 బంతుల్లోనే 82 పరుగులు చేయగా ఇందులో నాలుగు పోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. మిస్బా జట్టు హెచ్‌కేఐ యునైటెడ్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసింది. 217 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హాంగ్ హమ్ జాగ్వార్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 183 పరుగులకే పరిమితమైంది. దీంతో మిస్బా సేన 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ జట్టులో జోనాథన్ ఫూ ఒక్కడే హాఫ్ సెంచరీ (47 బంతుల్లో 77: 4 ఫోర్లు, 6 సిక్సర్లు)తో రాణించడంతో ఓటమి తప్పలేదు.