husband beat
-
భర్త దాడిలో భార్య మృతి
కళ్యాణదుర్గం : మండల పరిధిలోని తూర్పు కోడిపల్లి గ్రామంలో భర్త దాడిలో భార్య మృతి చెందిన సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. రూరల్ ఎస్ఐ నబీరసూల్ తెలిపిన వివరాల మేరకు .. తూర్పు కోడిపల్లికి చెందిన నారాయణస్వామి 2002లో భాగ్యమ్మను పెళ్ళి చేసుకున్నాడు. వీరికి శ్రావణి అనే కుమార్తె ఉంది. 2004లో భాగ్యమ్మకు గుండె ఆపరేషన్ జరిగింది. ఆమె అనారోగ్యం పాలుకావడంతో నారాయణస్వామి శెట్టూరు మండలం లింగదీర్లపల్లి గ్రామానికి చెందిన అనుసూయమ్మను రెండో పెళ్లి చేసుకున్నాడు. నారాయణస్వామి పేరుతో 7 ఎకరాల పొలం ఉండగా అందులో రెండన్నర ఎకరాలు, గొర్రెలు అమ్మగా వచ్చిన డబ్బును చిన్న భార్య పేరుతో వేశారు. పెద్ద భార్య ఈ విషయంపై తరచూ గొడవ పడుతుండేది. బుధవారం తన కుమార్తెను కళ్యాణదుర్గంలోని ప్రైవేట్ పాఠశాలలో చేర్పించేందుకు భాగ్యమ్మ వచ్చింది. తిరిగి రాత్రికి ఇంటికి వెళ్ళింది. ఈ సమయంలో భర్త ఇంత సమయం వరకు ఎక్కడికి వెళ్ళొచ్చావు అంటూ సూటిపోటి మాటలన్నాడు. భర్త నారాయణస్వామి భార్యపై దాడి చేయడంతో ఆమె అస్వస్థతకు గురైంది. కళ్యాణదుర్గం ఆర్డీటీ ఆస్పత్రికి తీసుకెళ్లగా, వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ భాగ్యమ్మ చనిపోయింది. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. -
భార్య, ఆమె ప్రియుడ్ని చితకబాదేశాడు..
ఓ యువకుడు తన భార్యను చూడకూడని స్థితిలో చూశాడు. అంతే ఆవేశం కట్టలు తెంచుకుంది. భార్యను, ఆమె ప్రియుడ్ని పట్టుకుని ఇంట్లోనే వరండాలో రెండు స్తంభాలకు వేర్వేరుగా తాడుతో కట్టేశాడు. అతను కట్టె, తాడు తీసుకుని ఇద్దరిని చితకబాదాడు. పిల్లలు, చుట్టుపక్కల వాళ్లు చూస్తుండగానే అతను ఆవేశంతో పలుమార్లు కొట్టాడు. దెబ్బల నుంచి తప్పించుకునేందుకు స్తంభం చుట్టు తిరిగినా అతను వెంటబడి కొట్టాడు. ఈ సంఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందన్న వివరాలు కచ్చితంగా తెలియవు. అయితే బిహార్ రాష్ట్రంలో జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఆమె చీర కట్టుకుని భారత సంప్రదాయ దుస్తుల్లో ఉండగా, ఆమె ప్రియుడు ఫ్యాంట్, టీ షర్ట్ ధరించి ఉన్నాడు. ఈ దృశ్యాలను ఎవరు వీడియో తీశారో తెలియదు కానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. ఇదో చర్చనీయాంశంగా మారింది. కొంతమంది బాధిత భర్తకు మద్దతు తెలపగా, మరికొందరు గృహహింస కింద అతణ్ని శిక్షించాలని డిమాండ్ చేశారు. కుటుంబం పరువు కోసమే భర్త.. తన భార్య, ఆమె ప్రియుడ్ని కొట్టాడని, దీన్ని గృహహింసగా పరిగణించరాదని కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా అతని హింసాత్మక చర్యలను ఎలా సమర్థిస్తారంటూ మరికొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు.