ఇంకిన కళ్లతో ఎడారి వంక
ఉప్పు సముద్రం ఆవల ఉన్న సౌదీ దేశం.. చాలామందికి భూతల స్వర్గం.రూకల కోసం ఉరుకెత్తీ పరుగులెత్తేవారికి ఉసురూ, ఊపిరీ నిలిపే ఓ ఆశల స్వర్గం.రియాళ్లు రూపాయల రూపుతొడిగితే...దీనార్లతో దీనత్వం, దిక్కులేనితనం పోతుందనే ఆశ! ఆ ఎడార్ల ఎండమావులే ఒయాసిస్సుల్లా భ్రమింపజేస్తుంటే... వీచికలనుకొని ఆ మరీచికల మరుభూములకు పరుగెత్తి మరణించిన వారిలో చౌక రమేశ్ కూడా ఒకరు. భర్త భౌతికకాయం, ‘మైల’ సాకుతో సమాజం.. ఆమెకు మైళ్ల దూరంలో ఉన్నాయి... ఉంచుతున్నాయి. దురదృష్టాన్నీ, దురదవస్థలనూ కళ్లలో ఒత్తులుగా వేసుకొని, భర్త శవం కోసం రెండునెలలుగా నిరీక్షిస్తూనే ఉంది లావణ్య.
హలో.. బాగున్నవా?ఆ.. బాగున్న... నువ్వు, పిల్లలు, అమ్మ .. మంచిగనే ఉన్నరు కదా? అంత బాగే కదా!ఆ.. అందరం మంచిగనే ఉన్నం..సరే... మరి.. మల్లా చేస్తా... బయటకు పోతున్నా... అని చెప్పి ఫోన్ కట్ చేశాడు చౌక రమేశ్. సౌదీలో ఉంటాడు. డ్రైవర్‌గా ఉద్యోగం చేస్తూ. అతను ఫోన్లో మాట్లాడింది భార్యతో. ఆమె పేరు లావణ్య. నిజామాబాద్ జిల్లా, నందిపేట్ మండలం, మారంపల్లి గ్రామంలో ఉంటుంది. ఇద్దరు పిల్లలు.. శివాని.. పదకొండేళ్లు. పావని.. ఎనిమిదేళ్లు. పెళ్లికి ముందు నుంచే గల్ఫ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు చౌక రమేశ్.
ముందు దుబాయ్‌లో ఉండేవాడు. నాలుగేళ్ల కిందట సౌదీకి వెళ్లాడు. నిజానికి రెండేళ్ల కిందటే.. తనకు ఉద్యోగం ఇచ్చిన సేఠ్ ఇక తను రమేశ్‌ను హైర్ చేయలేనని.. ఇండియా వెళ్లిపొమ్మనీ చెప్పేశాడు.అర్థంతరంగా ఆ మాట వినేసరికి రమేశ్ ఖంగు తిన్నాడు. అప్పటికప్పుడు ఇండియాకు వచ్చేసే పరిస్థితి కాదు అతనిది. సౌదీలో ఉద్యోగాన్ని నమ్ముకొని సొంత ఊళ్లో చిన్న జాగా కొనుక్కొని.. అంతే చిన్నగా రేకుల ఇల్లు ఒకటి కట్టుకున్నాడు.. అన్నతో కలిసి. దానికి బోలెడు అప్పు అయింది. ఇద్దరు ఆడపిల్లలు. వాళ్లను చదివించాలి.
భార్య బీడీలు చుడుతూ ఇల్లు గడవడానికి సాయం చేస్తుంటే.. తను ఇల్లు, పిల్లల చదువు, వాళ్ల భవిష్యత్ కోసం ప్లాన్ చేస్తున్నాడు. అప్పటికప్పుడు ఇండియా వెళ్లిపోయి అక్కడ తనేం చేయగలడు? పిల్లల భవిష్యత్ పక్కన పెట్టినా... ఇంటి కోసం చేసిన అప్పయితే తీరాలి కదా? గుండె గుభేల్ మన్నది రమేశ్‌కి. అతని పరిస్థితి తెలిసిన సౌదీలోనే ఉండే రమేశ్ వాళ్ల ఊరు వ్యక్తి, స్నేహితుడు.. తనకు తెలిసిన చోట ఉద్యోగం ఇప్పించాడు డ్రైవర్‌గానే. అందులో చేరి దాదాపు రెండేళ్లయింది. ఇదీ రమేశ్ నేపథ్యం క్లుప్తంగా!
ఫోన్ విషయంలోకి వస్తే..
మళ్లీ ఫోన్ చేస్తానని భార్యతో చెప్పిన రమేశ్ తర్వాత రెండు రోజులైనా చేయలేదు. పనిలో బిజీగా ఉన్నడేమో అనుకొని రెండు రోజులు వేచిచూసింది. అతని క్షేమసమాచారాలు కాంక్షిస్తూ.. తన ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తున్నట్టు మెస్సేజెస్ చేసింది. అయినా అతణ్ణించి రిప్లయ్ రాలేదు. ఆమె మనసు కీడు శంకించింది. తమ ఊరి నుంచి సౌదీకి వెళ్లిన వాళ్లందరి ఫోన్ నంబర్లు సేకరించి మరిదికి ఇచ్చింది ఫోన్ చేసి వాకబు చేయమని. చేస్తే తెలిసింది.. రమేశ్‌కి యాక్సిడెంట్ అయి ఆసుపత్రిలో ఉన్నాడని.
ఏం జరిగింది?
భార్యతో మాట్లాడిన రోజు రాత్రి... రూమ్‌లో ఉన్న రమేశ్‌కి ఓ ఫోన్ వచ్చింది. మాట్లాడి వెంటనే బయటికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆ రూమ్‌లో ఉన్న స్నేహితులకు ఫోన్ వచ్చింది.. రమేశ్‌కి యాక్సిడెంట్ అయింది.. అని. ఆ విషయమే చెప్పారు లావణ్య వాళ్లకు. ఆ రోజు రాత్రి సేఠే పనిమీద పిలిచాడు అని కొందరు... లేదు ఎవరో ఫ్రెండ్‌ని ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్ చేసి వస్తుంటే యాక్సిడెంట్ అయి ఆసుపత్రి పాలయ్యాడని కొందరు చెప్పారు. రమేశ్‌కి ఉద్యోగం ఇచ్చిన సేఠ్‌ని అడిగితే... నాకు తెలియదు.. నేను పిలవలేదు అని చెప్పాడట.
ఈ తర్జనభర్జనలు ఎందుకంటే...
యాక్సిడెంట్ అయి తీవ్రంగా గాయపడ్డ రమేశ్ కొన్నాళ్లు పాటు ఆసుపత్రిలో ఉన్నాడు. మాట్లాడలేని స్థితిలో. లావణ్య వాళ్ల బాధ చూడలేక రమేశ్ స్నేహితులు.. ఆసుపత్రి వాళ్లని రిక్వెస్ట్ చేసి వీడియో కాల్ మాట్లాడించారు. లావణ్య అడిగిన ఏ ప్రశ్నకు సమాధానం చెప్పే స్థితిలో లేడు రమేశ్. వినడం.. చూడ్డం తప్ప నోరు విప్పలేని ఆరోగ్య దుస్థితి ఆయనది. చివరకు ఆమె.. ‘నేను, పిల్లలు అందరం బాగున్నాం.. నువ్వేం ఫికర్వెట్టుకోకు... తొందరగనే మంచిగయితవ్..’ అన్న మాటకు కన్నీటితో స్పందించాడు అంతే. అదే లావణ్య తన భర్తను చూసుకున్న చివరిచూపు.. మాట్లాడిన చివర మాట కూడా.
తర్వాత కోమాలోకి వెళ్లిపోయాడు. దాదాపు రెండు నెలల కింద ఈ లోకంలోంచే వెళ్లిపోయాడు. భర్త చనిపోయిన ఇరవై రోజులకు లావణ్యకు తెలిసింది.గత రెండు నెలలుగా రమేశ్ భౌతిక కాయాన్ని ఇండియాకు తీసుకురావడానికి పోరాడుతోంది లావణ్య కుటుంబం. ఆ రోజు రాత్రి సేఠ్ పనిమీదే గనక రమేశ్ బయటకు వెళ్లి ఉంటే... ఆ బాధ్యత ఆ సేఠే తీసుకుని రమేశ్ భౌతిక కాయాన్ని ఆయన పూచీకత్తు మీదకు ఇండియాకు వచ్చేది. సేఠ్ నాకు సంబంధం లేదు అంటున్నాడు. రమేశ్ తన సొంత పనిమీద గనుక బయటకు వెళితే... పూచీకత్తు తీసుకునే వాళ్లు కావాలి. గల్ప్‌లోని మిగిలిన దేశాల చట్టాలు వేరు... ప్రత్యేకించి సౌదీ చట్టాలు వేరు.
పైకం చెల్లించాల్సి ఉంటే.. అది మొత్తం చెల్లిస్తే కాని శవాన్ని స్వదేశానికి పంపదు ఆ దేశం. మనిషి చనిపోయాడు కదా అని కనికరమేమీ చూపించదు. చట్టం చట్టమే. మనిషి ప్రాణాలతో ఉన్నా, లేకపోయినా.. కఠినంగానే వ్యవహరిస్తుంది సౌదీ అరేబియా అంటారు.. గల్ఫ్ మైగ్రెంట్స్ హక్కులు, వాళ్ల గురించి న్యాయపోరాటం చేస్తున్న న్యాయవాది అబ్దుల్ ఖాదర్. కాబట్టి.. రమేశ్ యాక్సిడెంట్ అయిన తీరు, అంటే అతను సొంత పనిమీద వెళ్లాడా? ఉద్యోగధర్మంలో వెళ్లాడా అన్నది తేలాలి. అలాగే అతను అక్కడ ఏమైనా డబ్బు బాకీ పడ్డాడా అన్నది కూడా తేలాలి.
పోరాటం..!
గల్ఫ్‌లోని ఏ దేశం నుంచైనా మన కార్మికుల భౌతిక కాయాలు జన్మభూమికి రావడం.. పెద్ద ప్రహసనమే. కొన్ని నెలలు.. కొంతమంది విషయంలో అయితే యేడాది పైనే పట్టిన సందర్భాలూ ఉన్నాయి. ఇప్పుడు లావణ్య కూడా తన భర్త భౌతిక కాయం కోసం ఇంచుమించు పోరాటమే చేస్తోంది అడ్వకేట్ అబ్దుల్ ఖాదర్ సహాయంతో. సౌదీలోని భారతీయ రాయబార కార్యాలయానికి అర్జీ పెట్టుకున్నారు. మే 23, గురువారం నాడు హైదరాబాద్‌లోని మానవ హక్కుల కమిషన్లోనూ వినతిపత్రం సమర్పించుకున్నారు. త్వరగా వచ్చేట్టు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చాయి రెండు కార్యాలయాలు కూడా.
మరింత విషాదం
మంచిచెడులు ఫోన్లోనే పంచుకుంటూ ఏళ్లుగా కుటుంబానికి దూరంగా ఉన్నాడు లావణ్య భర్త రమేశ్... వలస కార్మికులు అందరిలాగే. కనీసం కడసారి మాటకు.. చూపుకీ నోచుకోలేక పోయామే అనే వేదనను అనుభవిస్తోంది లావణ్య, ఆమె అత్తింటి కుటుంబం. ఇది ఒక బాధ అయితే... శవం వచ్చి దహన సంస్కారాలు జరిగే వరకు ఆ కుటుంబానికున్న ‘మైల’ కంటిన్యూ కావడం మరో విషాదం. కళ్ల ముందు భౌతిక కాయం లేదు. సముద్రాల ఆవల ఉంది. చనిపోయిన విషయం తెలిసి.. ఏడ్చి ఏడ్చి కంటి నీకు ఉప్పుచారికలైపోయాయి. సాధారణంగా అయితే పదిరోజుల్లో అంతా అయిపోయి.. నెల రోజుల్లో సామాన్య జీవితంలో పడాల్సిందే. లావణ్య వాళ్ల విషయంలో అది లేదు. రమేశ్ భౌతిక కాయం వచ్చేవరకు ఆ కుటుంబానికున్న మైలను ఊరివాళ్లు, బంధువులు నిర్ధారించడంతో.. వాళ్లు ఇంట్లోంచి బయటకురాలేని పరిస్థితి.
లావణ్య బీడీలు చుడితే కాని కుటుంబం గడవదు. మైలలో ఆమె ఆ పని చేసే వీలు లేదు. రెండు నెలలు పనిచేయకుండా ఉంటే పిల్లలకు తిండి ఎట్లా? బంధువులు, చుట్టుపక్కల వాళ్లు ఎన్ని రోజులని సాయం చేస్తారు? ఇంట్లో సరుకులు నిండుకుంటే కిరాణా షాప్‌కి కూడా వెళ్లలేని దుస్థితి. అంటుకోకూడదు.. ముట్టుకోకూడదు. ఊళ్లో ఏ శుభకార్యం జరిగినా ఈ కుటుంబం దూరమే. మనిషి పోయిన బాధతో ఎలాగూ వెళ్లలేరు... నిత్యావసరాలకూ నలుగురితో కలవలేని పరిస్థితి. లావణ్యతోపాటు ఆమె అత్తింటి కుటుంబానికంతటికీ ఇదే బాధ. పెళ్లిళ్లు, పేరంటాలు, గ్రామదేవతల పూజలు వంటి శుభకార్యాలకే కాదు.. ఊళ్లో ఎవరికైనా.. ఏదైనా సమస్య వచ్చినా.. వీళ్లు వెళ్లి పలకరించడానికి లేదు.. వాళ్లతో కలిసి బాధను పంచుకోవడానికి లేదు.
లావణ్యకు ఇద్దరూ చిన్న పిల్లలే అని ఈ మధ్యే వాళ్లు షాప్‌కి వెళ్లినా.. పిల్లలతో కలిసి ఆడుకున్నా.. ఊళ్లో వాళ్లు అనుమతిస్తున్నారు. బంధువులు, తెలిసిన వాళ్లు వచ్చి సహాయం చేస్తున్నారట. కాని ఉత్తర తెలంగాణలోని చాలా ఊళ్లల్లో ఇలాంటి నియమాలను స్ట్రిక్ట్‌గా అమలు చేస్తున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అయినా.. రమేశ్ మృతదేహాన్ని త్వరగా ఇండియాకు వచ్చే ఏర్పాటు చేయాలని లావణ్యతోపాటు గ్రామస్తులు కోరుతున్నారు.ఉప్పు ఊట దాహాన్ని తీర్చదు అని తెలిసినా... ప్రతి యేడు వందల్లో ఆ తీరానికి వెళ్తుంటారు ఆశల మూటతో! కొందరికే గల్ఫ్ జీవితాన్నిస్తుంది.. చాలామందికి ఉప్పుచారికలనే పంచుతుంది.. కన్నీటితోనైనా నోటిని తడుపుకునే వీలు లేకుండా!
– సరస్వతి రమ
నా భర్తను తెప్పించండి
రెండు నెలల నుంచి కంటి మీద కునుకులేదు. నా భర్త శవం (దుఃఖాన్ని దిగమింగుకుంటూ) వచ్చి.. అంతిమ సంస్కారాలు జరిగితే కాని మామూలు జీవితంలోకి రాలేను. పోయిన మనిషి ఎలాగూ పోయాడు. ఉన్న పిల్లలను సాకే బాధ్యత నాదే కదా. నేను పనిచేస్తేనే పిల్లలకు అన్నం. ఇంటి మీదున్న అప్పూ తీర్చుకోవాలి. ఆయనతోనే నా ఆశలు, కలలు అన్నీ పోయాయి. కళ్లముందు కష్టమే కనపడుతోంది. ఈదాలి.. పిల్లల కోసమన్నా.నాకా శక్తి రావాలంటే నా భర్త శవం త్వరగా నా ఇంటికి రావాలి. బతికున్న మనిషి కోసం పడిగాపులు కాస్తాం. మాలాంటి వాళ్లు.. (ఏడుపుతో మాట రాలేదు).. ఈ కష్టం ఎవరికీ రావద్దు. కలోగంజో కలిసే తాగాలి. కలిసే బతకాలి. ప్రభుత్వం దయుంచి మా బాధ విని.. మా సమస్యను పరిష్కరించాలి. నా పిల్లలకు ఓ దారి చూపించాలని చేతులు జోడించి కోరుకుంటున్నా.. ’’
– లావణ్య, చౌక రమేష్ భార్య