రేపు ఏపీపీఎస్సీ హెచ్‌డబ్ల్యూఓ పరీక్ష
- హాజరుకానున్న 5,050 మంది అభ్యర్థులు - 9 కేంద్రాల్లో పరీక్ష నిర్వహణ
- పకడ్బందీగా ఏర్పాట్లు - అధికారులను ఆదేశించిన డీఆర్ఓ సి.మల్లీశ్వరిదేవి
అనంతపురం అర్బన్ : ‘ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఈనెల 11న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ (హెచ్‌డబ్ల్యూఓ) పోస్టుల భర్తీకి పరీక్షలు జరగనున్నాయి. తొమ్మిది కేంద్రాల్లో జరుగనున్న పరీక్షకు 5,050 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతుంది. పరీక్ష నిర్వహణ ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని డీఆర్ఓ సి.మల్లీశ్వరిదేవి అధికారులను ఆదేశించారు.
శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో ఆమె సమీక్షించారు. అనంతరం డీఆర్ఓ మాట్లాడుతూ పరీక్ష నిర్వహణకు 21 మంది అధికారులను నియమించినట్లు తెలిపారు. ఇందులో ముగ్గురు తహసీల్దార్లు, తొమ్మిది మంది ఎంపీడీఓలు, తొమ్మిది మంది చీఫ్ సూపర్వైజర్లు పర్యవేక్షిస్తారన్నారు. పరీక్ష కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. అభ్యర్థులు ఉదయం 9 గంటలకే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని, ఏపీపీఎస్సీ నిబంధనల ప్రకారం 9.45 గంటల తరువాత పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతించకూడదన్నారు. పరీక్ష కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ఫోన్లు, కాలిక్యులేటర్లు, ఐపాడ్లు, బ్లూటూత్ వంటివి అనుమతించకూడదని అధికారులను డీఆర్ఓ ఆదేశించారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో జిరాక్స్ సెంటర్లను మూసివేయించాలన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలన్నారు.
అభ్యర్థులకు సూచనలు :
+ అభ్యర్థులు హాల్ టికెట్‌తో పాటు వెరిఫికేషన్ కోసం ఏదేని ఒక ఒరిజినల్ సర్టిఫికెట్ (పాన్, ఆధార్, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్, ప్రభుత్వ ఉద్యోగి అయితే ఐడీ) తీసుకురావాల్సి ఉంటుంది.
+ హాల్ టికెట్లో అభ్యర్థి ఫొటో లేకపోయినా, ముద్రణ సరిగ్గా కాకపోయినా, ఫొటో చిన్నగా ఉన్నా, ఫొటోపై సంతకం లేకపోయినా..అభ్యర్థి తన పాస్‌పోర్ట్ ఫొటోలు మూడు, గెజిటెడ్ అధికారితో సంతకం చేయించి ఇన్విజిలేటర్‌కు అందజేయాలి. లేనిపక్షంలో పరీక్షకు అనుమతించరు.