హెల్మెట్ వాయిస్ కమాండ్స్‌తో ఇక బైకులు!
న్యూఢిల్లీ, సాక్షి: కొత్త హైబ్రిడ్ ఆధారిత పవర్‌ట్రెయిన్‌ను ఆటో దిగ్గజం కావసాకి తాజాగా ప్రదర్శించింది. తద్వారా భవిష్యత్‌లో హైబ్రిడ్ టెక్నాలజీతో కావసాకి మోటార్ సైకిళ్లను రూపొందించే సన్నాహాల్లో ఉన్నట్లు వెల్లడించింది. నిజానికి బైకులలో హైబ్రిడ్ టెక్నాలజీ అభివృద్ధి తొలి దశలో ఉన్నట్లు ఆటో రంగ నిపుణులు పేర్కొంటున్నారు. కాగా.. పూర్తిస్థాయి కంబ్యూషన్ ఇంజిన్, పూర్తి ఎలక్ట్రిక్ ఇంజిన్ లేదా ఈ రెండింటి కలయికలో బైకులను తయారు చేసే యోచనలో ఉన్నట్లు కావసాకి చెబుతోంది. జాతీయ రహదారులకు కంబ్యూషన్, సిటీలలో ఎలక్ట్రిక్, రేస్ ట్రాకులు తదితర అవసరాలకు ఈ రెండింటి కలయికతోకూడిన మోటార్ సైకిళ్ల తయారీపై దృష్టిపెట్టినట్లు తెలియజేసింది. చదవండి: (కొత్త ఏడాదిలో ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 )
ఫోటోటైప్ మోటార్
పూర్తి ఎలక్ట్రిక్ పవర్‌తో నడిచే ప్రోటోటైప్ మోటార్‌ను కావాసాకి తాజాగా ప్రదర్శించింది. కంబ్యూషన్ ఇంజిన్‌గానూ స్విచ్ఓవర్ చేసుకునేందుకు వీలు కలిగిఉన్న ఈ ప్రొటోటైప్ ద్వారా యూరోపియన్ మార్కెట్లకు అనువైన బైకులను రూపొందించాలని భావిస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలియజేశారు. 2030కల్లా యూకేసహా యూరోప్‌లోని పలు నగరాలు కఠినతర యాంటీకంబ్యూషన్ చట్టాలను తీసుకువచ్చే ప్రణాళికల్లో ఉన్నాయి. దీంతో హైబ్రిడ్ టెక్నాలజీ ద్వారా బైకులను రూపొందించగలిగితే భారీ మార్కెట్‌కు అవకాశముంటుందని ఆటో రంగ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందుకు వీలుగా గిగాసెల్ నికెల్-మెటల్ హైబ్రిడ్(ఎన్ఐఎంహెచ్) టెక్నాలజీని కావసాకి అభివృద్ధి చేస్తోంది. దీనిని హైబ్రిడ్ మోటార్‌సైకిల్‌లో వినియోగంపై పరిశీలనలు చేయనున్నట్లు తెలుస్తోంది.
హెల్మెట్ ద్వారా
హెల్మెట్ ఆధారిత వాయిస్ కమాండ్స్ విధానాన్ని సైతం కావసాకి రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ద్వారా హెల్మెట్ వాయిస్ యాక్టివేటెడ్ సిస్టమ్‌కు రూపకల్పన చేస్తున్నట్లు సంబంధితవర్గాలు పేర్కొన్నాయి. తద్వారా రైడర్లు చూపు తిప్పుకోకుండానే ఇంధనం, వాతావరణం, మీడియా లేదా మార్గనిర్దేశన తదితర సౌకర్యాలను అందించే సన్నాహాల్లో ఉన్నట్లు కంపెనీ ఇటీవల తెలియజేసింది.