Hyderabad Police Towers
-
Freedom Run: ‘డీజే టిల్లు’ పేరు వీళ్ల స్టైలే వేరు.. సోకేమో హీరోల తీరు కొట్టేది తీను మారు!
సాక్షి, సిటీబ్యూరో: ‘డీజే టిల్లు పేరు వీని స్టైలే వేరు సోకేమో హీరో తీరు కొట్టేది తీను మారు. డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు బేసు జర పెంచి కొట్టు బాక్సులు పలిగేటట్టు’ బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ) ప్రాంగణంలో గురువారం ఉదయం ఈ పాట మారు మోగింది. ఏదైనా దావత్లోనే, వ్యక్తిగత పార్టీలోనో డీజే టిల్లు సినిమాలోని ఈ పాట బ్యాక్‌డ్రాప్‌లో వినిపిస్తే తప్పులేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ సిటీ పోలీసులు నిర్వహించిన అధికారిక ఫ్రీడమ్ రన్లో వినిపించడం విమర్శలకు తావిచ్చింది. ఈ తీన్మార్ పాట కారణంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సాక్షిగా విద్యార్థులు పాల్గొన్న ఫ్రీడన్ రన్ అపహాస్యమైంది. అన్నింటిలోనూ జాగ్రత్తలు తీసుకున్నా... వజ్రోత్సవాల్లో భాగంగా ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి నగర పోలీసులు నడుం బిగించారు. ప్రతి ఇంటికీ జాతీయ జెండాలు చేరేలా చేయడంతో పాటు చిన్నారులతో కలిసి గాంధీ చిత్రాన్ని చూస్తూ వారిలో స్ఫూర్తి నింపేందుకు ఉన్నతాధికారులే రంగంలోకి దిగారు. సిటీ పోలీసులు గురువారం తెల్లవారుజామున ఐసీసీసీ వద్ద ‘స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ఫ్రీడమ్ రన్’ నిర్వహించారు. ఇందులో నగరంలోని వివిధ పాఠశాలలకు చెందిన 4 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరికి పంపిణీ చేసిన టీ–షర్టుల విషయంలోనూ పోలీసు విభాగం జాగ్రత్తలు తీసుకుంది. దీనిపై నగర పోలీసు లోగో, జాతీయ పతాకంతో పాటు వజ్రోత్సవాల లోగో కూడా ఉండేలా డిజైన్ చేశారు. వీటిపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్న లక్ష్యంగా ఇలా తయారు చేయించారు. వారించే లోపే చేయి దాటిపోయింది... ఫ్రీడమ్ రన్ నిర్వహణ బాధ్యతల్ని దీపక్ అనే ఈవెంట్ మేనేజర్‌కు అప్పగించారు. ఇతగాడు రన్లో పాల్గొనే వారిని ఉత్సాహపరచడానికంటూ జుంబా ట్రైనర్ రఫీఖ్ను రంగంలోకి దింపాడు. ఈయన అంత మంది విద్యార్థులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, రాజకీయ ప్రముఖులతో పాటు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను చూసిన రఫీఖ్ విచక్షణ కోల్పోయాడు. తాను ఏ తరహా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నానన్నది మర్చిపోయి రన్ ప్రారంభానికి ముందు వామ్ అప్ అంటూ డీజే టిల్లు పాట పెట్టాడు. ఆ మ్యూజిక్కు తగ్గట్టు అధికారులతో పాటు నాయకులనూ∙స్టెప్పులు వేయాలని ప్రేరేపించాడు. విద్యార్థుల ముందు జరుగుతున్న ఈ తతంగాన్ని గమనించిన ఉన్నతాధికారులు వారించే ప్రయత్నం చేసే లోపే రాజకీయ నాయకులు జోష్‌లో ముగినిపోయారు. దీంతో చేసేది లేక అధికారులూ వారితో జట్టు కట్టాల్సి వచ్చింది. ఈ వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో పాటు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాయి. (చదవండి: ప్రగతిభవన్ ఎదుట తెలంగాణ ఉద్యమకారుడు ఆత్మహత్యాయత్నం) తమను తాము తక్కువ చేసుకోవడం కాదా? ఇలాంటి కార్యక్రమాల నిర్వహణ సమయంలో పోలీసు అధికారులు తమను తాము తక్కువ చేసుకుంటున్నారు. నగరంలో ఏదైనా కీలక ఘట్టం, వాణిజ్య సముదాయాలు/సంస్థల ప్రారంభోత్సవాలు తదితర కార్యక్రమాలకు వాటి యజమానులు పోలీసులను ముఖ్య అతిథులుగా ఆహ్వానిస్తుంటారు. వీళ్లే తమ బ్రాండ్ అంబాసిడర్లు అని వాళ్లు భావిస్తుంటారు. అయితే పోలీసులు మాత్రం వాళ్లు నిర్వహించే కార్యక్రమాలకు సినీ రంగానికి చెందిన లేదా ప్రాచుర్యం ఉన్న ఇతర రంగాలకు చెందిన వారిని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గడిచిన కొన్నేళ్లుగా ఈ ధోరణి మరీ పెరిగిపోయింది. పోలీసుల కార్యక్రమాలను ఉన్నతాధికారులే స్పెషల్ అట్రాక్షన్ అవ్వాల్సి ఉండగా ఎదుటి వారి కోసం వెంపర్లాడుతూ, తమ కార్యక్రమాలను కలర్‌ఫుల్ చేయడానికి సినీ తారల అపాయింట్మెంట్స్ కోసం తమను తాము తక్కువ చేసుకుంటున్నది స్పష్టమవుతోంది. తొలినాళ్లల్లో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాలతో మొదలైన ఈ ధోరణి ఇప్పుడు ప్రతి అంశానికీ విస్తరించింది. అధికారిక బ్యాండ్ ఎందుకు వాడరు? పోలీసు విభాగానికి సొంతంగా ఓ బ్యాండ్ ఉంటుంది. సుశిక్షితులైన ఈ సిబ్బంది సేవలను పాసింగ్ ఔట్ పెరేడ్స్తో పాటు గణతంత్య్ర, స్వాతంత్య్ర వేడుకల సమయంలోనూ వినియోగించుకుంటూ ఉంటారు. గతంలో కొందరు ఔత్సాహికులు వారి ఇళ్లల్లో జరిగిన వివాహాలకు వీరిని బుక్ చేసుకున్న సందర్భాలూ ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం వరకు ప్రత్యేక సందర్భాల్లో ఈ బ్యాండ్ దేశభక్తిని పెంపొందించే పాటల్ని ఆలాపిస్తూ కార్యక్రమాలు నిర్వహించేది. దేశభక్తిని ప్రదర్శించాల్సిన ఫ్రీడమ్ రన్ వంటి వేదికల వద్దే కాదు... పోలీసు అధికారిక కార్యక్రమాల్లో వీరి సేవలను వాడుకుంటే సముచితంగా ఉండేది. ఈ విషయం మర్చిపోతున్న అధికారులు ఈవెంట్ మేనేజన్లు, డీజే నిర్వాహకులు తదితరుల వెంట పడుతుండటంతోనే ఇలాంటి అపశృతులు చోటు చేసుకుంటున్నాయి. (చదవండి: వాట్సాప్‌లో న్యూడ్ కాల్.. బ్లాక్మెయిల్) -
సీసీసీ ఆలోచన ఆయనదే: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: మానవ సమాజం ఉన్నంతకాలం.. పోలీసింగ్ వ్యవస్థ నిరంతరం కొనసాగుతుందని, ఆ వ్యవస్థ ఎంత బలంగా, శ్రేష్టంగా ఉంటే.. సమాజానికి అంత రక్షణ, భద్రత ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు. హైదరాబాద్‌లో ఇంతటి కమాండింగ్ వ్యవస్థ వస్తుందని ఎవరూ ఊహించి ఉండరని, కానీ, చిత్తశుద్ధి, సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమని నిరూపించామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ భవన నిర్మాణానికి ముఖ్య ప్రేరణ, కర్త, రూపకర్త, ప్రధాన వ్యక్తి డీజీపీ మహేందర్‌రెడ్డినే అని సీఎం కేసీఆర్ తెలిపారు. మొత్తం క్రెడిట్ ఆయనకే దక్కాలని, అలాగే ఈ భవనం నిర్మాణానికి సహకరించిన సంబంధిత శాఖ మంత్రి, విభాగాలు, కంపెనీలు కూడా ఇందులో భాగం అయినందుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి సీసీసీ నిర్వహణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉన్నప్పటికీ.. యావత్ పరిపాలనకు ఉపయోగకరంగా ఉంటుందని, నార్మల్ రోజుల్లో ఒకలా.. విపత్తుల రోజుల్లో మరోలా ఉంటుందని ఆ సమయంలో మహేందర్‌రెడ్డి చెప్పారని గుర్తు చేసుకున్నారు. గొప్పపనితనం ప్రదర్శించేందుకు గొప్ప వేదిక ఏర్పాటును సాకారం చేసుకున్నందుకు తెలంగాణ పోలీస్ శాఖకు హృదకపూర్వక అభినందనలు తెలిపారు. రెండేళ్ల క్రితమే ఈ భవనం పూర్తి కావాలని, కరోనా వల్ల కొద్దిగా ఆలస్య మైందని సీఎం కేసీఆర్ వివరించారు. సమాజం కోసం పాటుపడుతున్న పోలీసులకు సెల్యూట్ చెప్పిన సీఎం కేసీఆర్.. సంస్కారవంతమైన పోలీసింగ్ వ్యవస్థ అంతటా రావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. డ్రగ్స్‌ను అరికట్టేందుకు సమర్థవంతంగా పని చేయాలని, ఆ మహమ్మారిని తరిమి కొట్టాలని పోలీస్ శాఖకు పిలుపు ఇచ్చారు. ప్రభుత్వ సహకారం పోలీసులకు ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారాయన. విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడ మహిళా భద్రత అంశాన్ని.. తమ వెంట వచ్చిన ఓ మహిళా ఐఏఎస్ అధికారిణితో స్వయంగా పరీక్షించి ధృవీకరించిన ఘటనను సైతం సీఎం కేసీఆర్ ప్రస్తావించారు. ఫ్రెండ్లీ పోలీస్‌గా తెలంగాణ పోలీసింగ్ వ్యవస్థ దేశానికి కలికితురాయి నిలవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. -
పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
Telangana Police Integrated Command and Control Centre: హైదరాబాద్ నగర సిగలో మరో కలికితురాయి వచ్చి చేరింది. ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇప్పటికే తన ఛాంబర్లో సీపీ సీవీ ఆనంద్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ప్రారంభోత్సవం సందర్భంగా కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను(సీసీసీ) సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. మరోవైపు సీసీసీ వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం అయిదు గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. 18వ ఫ్లోర్లో సీపీ ఆఫీస్ అత్యాధునిక సాంకేతికతను జోడిస్తూ, ఒకేచోటా నుంచి నగరమంతా వీక్షించేలా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను నిర్మించారు. దేశంలోని అన్ని శాఖలను ఇంటిగ్రేట్ చేస్తూ.. రూ. 600 కోట్లతో 18 అంతస్తుల్లో దీన్ని నిర్మించారు. 7 ఎకరాలు, 6.42 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం జరిగింది. భవనం ఎత్తు 83.5 మీటర్లు. టవర్ ఏ లోని 18వ ఫ్లోర్లో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఉంది. 14, 15వ ఫ్లోర్లో మ్యూజియం, గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఏడో అంతస్తులో ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా కీలక విభాగాల అధిపతులకు ఛాంబర్లు ఉంటాయి. టవర్ బి మొత్తాన్ని టెక్నాలజీ వింగ్‌కు కేటాయించారు. సంబంధిత వార్త:ఒకే చోట నుంచి రాష్ట్రమంతా వీక్షణ.. పోలీస్ ట్విన్ టవర్స్ ప్రత్యేకలివే.. ఒకే గొడుకు కిందికి అన్ని విభాగాలు సాంకేతిక పరిజ్ఞానం వాడుకునే దిశగా 5 టవర్లు(ఏబీసీడీఈ) ఏర్పాటు చేశారు. బిల్డింగ్ చుట్టూ 35 శాతం గ్రీనరీ, 600 వాహనాలు పార్కింగ్ చేసుకునేలా ఏర్పాటు చేశారు. ఫ్లోర్ ఫ్లోర్‌కు సోలార్ ప్లాంటు ఉంది. రాష్ట్రంలోని సీసీ కెమెరాలు సీసీసీకి అనుసంధానం చేశారు. నగర వ్యాప్తంగా సీ కెమెరాల్లో రికార్డు అవుతున్న దృశ్యాలను భారీ వీడియో వాల్ సహాయంతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. నగర కమిషనరేట్ పరిధిలోని శాంతిభద్రతలు, సీసీఎస్, టాస్క్‌ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్.. ఇలా అన్ని విభాగాలనూ ఒకే గొడుకు కిందికి తీసుకువస్తున్నారు. వీటిలో ఏ విభాగానికి సంబంధించిన పని కోసమైనా ప్రజలు వివిధ చోట్లకు తిరగాల్సిన అవసరం లేకుండా సింగిల్ విండో విధానం అమలుకానుంది.