Freedom Run: ‘డీజే టిల్లు’ పేరు వీళ్ల స్టైలే వేరు.. సోకేమో హీరోల తీరు కొట్టేది తీను మారు! | Freedom Run Hyderabad Police Politicians Dance DJ Tillu Song Get Trolled | Sakshi
Sakshi News home page

ఫ్రీడమ్‌ రన్‌లో ‘డీజే టిల్లు’ ఆటలు.. వైరల్‌గా మారిన హైదరాబాద్‌ పోలీసుల తీరు

Published Fri, Aug 12 2022 11:24 AM | Last Updated on Fri, Aug 12 2022 11:44 AM

Freedom Run Hyderabad Police Politicians Dance DJ Tillu Song Get Trolled - Sakshi

సాక్షి, సిటీబ్యూరో:డీజే టిల్లు పేరు వీని స్టైలే వేరు సోకేమో హీరో తీరు కొట్టేది తీను మారు. డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు బేసు జర పెంచి కొట్టు బాక్సులు పలిగేటట్టు’ బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (ఐసీసీసీ) ప్రాంగణంలో గురువారం ఉదయం ఈ పాట మారు మోగింది. ఏదైనా దావత్‌లోనే, వ్యక్తిగత పార్టీలోనో డీజే టిల్లు సినిమాలోని ఈ పాట బ్యాక్‌డ్రాప్‌లో వినిపిస్తే తప్పులేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌ సిటీ పోలీసులు నిర్వహించిన అధికారిక ఫ్రీడమ్‌ రన్‌లో వినిపించడం విమర్శలకు తావిచ్చింది. ఈ తీన్మార్‌ పాట కారణంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారుల సాక్షిగా విద్యార్థులు పాల్గొన్న ఫ్రీడన్‌ రన్‌ అపహాస్యమైంది.  

అన్నింటిలోనూ జాగ్రత్తలు తీసుకున్నా... 
వజ్రోత్సవాల్లో భాగంగా ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి నగర పోలీసులు నడుం బిగించారు. ప్రతి ఇంటికీ జాతీయ జెండాలు చేరేలా చేయడంతో పాటు చిన్నారులతో కలిసి గాంధీ చిత్రాన్ని చూస్తూ వారిలో స్ఫూర్తి నింపేందుకు ఉన్నతాధికారులే రంగంలోకి దిగారు. సిటీ పోలీసులు గురువారం తెల్లవారుజామున ఐసీసీసీ వద్ద ‘స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ఫ్రీడమ్‌ రన్‌’ నిర్వహించారు.

ఇందులో నగరంలోని వివిధ పాఠశాలలకు చెందిన 4 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరికి పంపిణీ చేసిన టీ–షర్టుల విషయంలోనూ పోలీసు విభాగం జాగ్రత్తలు తీసుకుంది. దీనిపై నగర పోలీసు లోగో, జాతీయ పతాకంతో పాటు వజ్రోత్సవాల లోగో కూడా ఉండేలా డిజైన్‌ చేశారు. వీటిపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్న లక్ష్యంగా ఇలా తయారు చేయించారు.  

వారించే లోపే చేయి దాటిపోయింది... 
ఫ్రీడమ్‌ రన్‌ నిర్వహణ బాధ్యతల్ని దీపక్‌ అనే ఈవెంట్‌ మేనేజర్‌కు అప్పగించారు. ఇతగాడు రన్‌లో పాల్గొనే వారిని ఉత్సాహపరచడానికంటూ జుంబా ట్రైనర్‌ రఫీఖ్‌ను రంగంలోకి దింపాడు. ఈయన అంత మంది విద్యార్థులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, రాజకీయ ప్రముఖులతో పాటు ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులను చూసిన రఫీఖ్‌ విచక్షణ కోల్పోయాడు.

తాను ఏ తరహా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నానన్నది మర్చిపోయి రన్‌ ప్రారంభానికి ముందు వామ్‌ అప్‌ అంటూ డీజే టిల్లు పాట పెట్టాడు. ఆ మ్యూజిక్‌కు తగ్గట్టు అధికారులతో పాటు నాయకులనూ∙స్టెప్పులు వేయాలని ప్రేరేపించాడు. విద్యార్థుల ముందు జరుగుతున్న ఈ తతంగాన్ని గమనించిన ఉన్నతాధికారులు వారించే ప్రయత్నం చేసే లోపే రాజకీయ నాయకులు జోష్‌లో ముగినిపోయారు. దీంతో చేసేది లేక అధికారులూ వారితో జట్టు కట్టాల్సి వచ్చింది. ఈ వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌ కావడంతో పాటు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాయి.  
(చదవండి: ప్రగతిభవన్‌ ఎదుట తెలంగాణ ఉద్యమకారుడు ఆత్మహత్యాయత్నం)

తమను తాము తక్కువ చేసుకోవడం కాదా? 
ఇలాంటి కార్యక్రమాల నిర్వహణ సమయంలో పోలీసు అధికారులు తమను తాము తక్కువ చేసుకుంటున్నారు. నగరంలో ఏదైనా కీలక ఘట్టం, వాణిజ్య సముదాయాలు/సంస్థల ప్రారంభోత్సవాలు తదితర కార్యక్రమాలకు వాటి యజమానులు పోలీసులను ముఖ్య అతిథులుగా ఆహ్వానిస్తుంటారు. వీళ్లే తమ బ్రాండ్‌ అంబాసిడర్లు అని వాళ్లు భావిస్తుంటారు.

అయితే పోలీసులు మాత్రం వాళ్లు నిర్వహించే కార్యక్రమాలకు సినీ రంగానికి చెందిన లేదా ప్రాచుర్యం ఉన్న ఇతర రంగాలకు చెందిన వారిని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గడిచిన కొన్నేళ్లుగా ఈ ధోరణి మరీ పెరిగిపోయింది. పోలీసుల కార్యక్రమాలను ఉన్నతాధికారులే స్పెషల్‌ అట్రాక్షన్‌ అవ్వాల్సి ఉండగా ఎదుటి వారి కోసం వెంపర్లాడుతూ, తమ కార్యక్రమాలను కలర్‌ఫుల్‌ చేయడానికి సినీ తారల అపాయింట్‌మెంట్స్‌ కోసం తమను తాము తక్కువ చేసుకుంటున్నది స్పష్టమవుతోంది. తొలినాళ్లల్లో ట్రాఫిక్‌ అవగాహన కార్యక్రమాలతో మొదలైన ఈ ధోరణి ఇప్పుడు ప్రతి అంశానికీ విస్తరించింది.  

అధికారిక బ్యాండ్‌ ఎందుకు వాడరు? 
పోలీసు విభాగానికి సొంతంగా ఓ బ్యాండ్‌ ఉంటుంది. సుశిక్షితులైన ఈ సిబ్బంది సేవలను పాసింగ్‌ ఔట్‌ పెరేడ్స్‌తో పాటు గణతంత్య్ర, స్వాతంత్య్ర వేడుకల సమయంలోనూ వినియోగించుకుంటూ ఉంటారు. గతంలో కొందరు ఔత్సాహికులు వారి ఇళ్లల్లో జరిగిన వివాహాలకు వీరిని బుక్‌ చేసుకున్న సందర్భాలూ ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం వరకు ప్రత్యేక సందర్భాల్లో ఈ బ్యాండ్‌ దేశభక్తిని పెంపొందించే పాటల్ని ఆలాపిస్తూ కార్యక్రమాలు నిర్వహించేది.

దేశభక్తిని ప్రదర్శించాల్సిన ఫ్రీడమ్‌ రన్‌ వంటి వేదికల వద్దే కాదు... పోలీసు అధికారిక కార్యక్రమాల్లో వీరి సేవలను వాడుకుంటే సముచితంగా ఉండేది. ఈ విషయం మర్చిపోతున్న అధికారులు ఈవెంట్‌ మేనేజన్లు, డీజే నిర్వాహకులు తదితరుల వెంట పడుతుండటంతోనే ఇలాంటి అపశృతులు చోటు చేసుకుంటున్నాయి. 
(చదవండి: వాట్సాప్‌లో న్యూడ్‌ కాల్‌.. బ్లాక్‌మెయిల్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement